టీడీపీకి లేని అవినీతిని అంటించాలని చూస్తున్నారు: చంద్రబాబు - ప్రెస్ రివ్యూ

  • 24 జూన్ 2019
చంద్రబాబు నాయుడు Image copyright AndhraPradeshCM/facebook

టీడీపీకి లేని అవినీతిని అంటించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేసినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. విదేశాల్లో ఉన్న చంద్రబాబు ఆదివారం తన నివాసంలో సమావేశమైన పార్టీ నేతలతో ఫోన్ ద్వారా మాట్లాడారు.

'అవాస్తవ ఆరోపణలతో లేని అవినీతిని టీడీపీకి అంటించాలని చూస్తే.. అది వారికే చుట్టుకుంటుంది. తెలుగుదేశం ఎప్పుడూ ప్రజల పక్షమే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తామని' చంద్రబాబు అన్నారు.

'ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు పార్టీ నేతలు పాటుపడాలి. వైసీపీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలకు గురైన కార్యకర్తలకు అండగా ఉండాలి. బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు పార్టీ వారికి అన్ని వేళలా వెన్నుదన్నుగా ఉంటుందనే భరోసా కల్పించాలి' అని ఆయన పిలుపునిచ్చారు.

పోలవరం నిర్మాణ పనుల్లో, ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో, రాజధాని నగర నిర్మాణ పనుల్లో ఏదో అవినీతి జరిగిపోయినట్లుగా సీఎం జగన్‌, మంత్రులు మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు ఈ సందర్బంగా ఆక్షేపించారు. ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు కావాలనే ఈ ఆరోపణలన్నీ చేస్తున్నారని, వాటిలో వాస్తవాలు లేవన్నారు. ఇలాంటి ఆరోపణలు రాష్ట్రానికి మేలు చేకూర్చేవి కావని అన్నట్లు ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.

Image copyright facebook/YS Jagan Mohan Reddy

అపరిష్కృత సమస్యలపై తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అవుతున్నట్లు నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కీలకమైన జలవనరుల అంశాలను పరిష్కరించడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు.

జూన్ 28, 29 తేదీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యే అవకాశం ఉందని పత్రిక తెలిపింది.

జగన్మోహన్‌రెడ్డి పలు కార్యక్రమాల దృష్ట్యా ఈ నెల 26 నుంచి 29 వరకు హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు నేతలు సమావేశమై పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశమున్నట్లు తెలుస్తున్నది.

ముఖ్యంగా ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి.

ఈ క్రమంలో ఆదివారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నదని నమస్తే తెలంగాణ తన కథనంలో చెప్పింది.

చర్చలు, సంప్రదింపులతో అన్ని అపరిష్కృత అంశాలను పరిష్కరించుకోవాలని రెండు రాష్ర్టాల సీఎంలు కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే 28, 29 తేదీల్లో ఇద్దరు నేతల భేటీలో ప్రధానంగా జలవనరుల అంశాలు, విభజన అంశాలపై చర్చలు జరుగనున్నాయి.

అంతేకాకుండా రెండు రాష్ట్రాల నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతోకూడా ఇద్దరు సీఎంల భేటీ ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.

చాలాకాలంగా రెండు రాష్ట్రాల మధ్య పలువిభజన అంశాలు కొలిక్కి రాకుండా పెండింగులో ఉన్నాయి. వాటిపై చర్చించి త్వరితగతిన పరిష్కరించేందుకు ఇద్దరు సీఎంలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయని ఈ కథనం పేర్కొంది.

Image copyright Getty Images

కంపు కొడుతున్న బెడ్ రోల్స్

రైళ్లలో బెడ్ రోల్స్ దారుణంగా కంపు కొడుతున్నాయని, అవి అపరిశుభ్రంగా దుర్వాసన వస్తుండడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారని ఈనాడు ఒక కథనం ప్రచురించింది. రైల్వే శాఖ నిబంధనలు తుంగలో తొక్కిందని తిపింది.

'స్వచ్ఛ భారత్‌ - స్వచ్ఛ రైలు'.. రైల్వే మంత్రిత్వశాఖ నినాదమిది. అమల్లో మాత్రం ఆ శాఖ దారుణంగా విఫలమవుతోంది. దీనికి ఉదాహరణ ప్రయాణికులకు పంపిణీ చేస్తున్న బెడ్‌రోల్స్‌.

రైళ్లలో ఏసీ బోగీల్లో ఇస్తున్న దిండ్లు, దుప్పట్లు, రగ్గులు కంపు కొడుతున్నాయి. చాలా రైళ్లలో ఏమాత్రం ఆరోగ్యకరంగా లేనివాటిని, మురికిగా ఉన్నవాటిని ఇస్తున్నారని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఈనాడు పేర్కొంది.

కొన్నిసార్లు వీటిలో నల్లులు, పురుగులు కనిపిస్తున్నాయి. విశాఖ, తిరుపతి, చెన్నై, బెంగళూరు, సికింద్రాబాద్‌, కాచిగూడ మీదుగా తిరిగే చాలా రైళ్లలో ఈ పరిస్థితులున్నాయని కథనంలో చెప్పారు.

ముఖ్యంగా విశాఖ, విజయవాడ మీదుగా వెళ్తున్న రైళ్ల ప్రయాణికుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి.

ప్రయాణికులకు రెండు దుప్పట్లు, చిన్న తువాలు, దిండుకవరు కలిపి ఒక కవర్లో ఇస్తారు. దిండు, రగ్గు వేరుగా ఇస్తారు. ఇవన్నీ కలిపి బెడ్‌రోల్‌ అంటున్నారు.

ప్రయాణికుల నుంచి మళ్లీ వెనక్కి రావడం లేదనే కారణంతో చిన్న తువాలును సిబ్బంది ముందే తీసేసి పక్కన పడేస్తున్నారు.

మిగిలినవాటినైనా పలు రైళ్లలో కవర్లలో పెట్టి ఇవ్వట్లేదు. ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌, లింక్‌, సమతా, కోరమాండల్‌, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లాంటి పలు రైళ్లలో ప్రయాణికుల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయి.

ఈ బెడ్‌రోల్స్‌ను మరుగుదొడ్ల పక్కన, రైలుపెట్టెల ప్రవేశ ద్వారాల దగ్గర పడేస్తుండటంతో వచ్చిపోయేవారు వాటిని తొక్కుతున్నారని ఈనాడు చెప్పింది.

విజయవాడ, సికింద్రాబాద్‌ మీదుగా వెళ్లే రైళ్లలో, విశాఖ నుంచి భువనేశ్వర్‌, కోర్బా వైపు వెళ్లే రైళ్లలో, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లేవాటిలో ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నట్లు పేర్కొంది.

Image copyright facebook/YS Jagan Mohan Reddy

పేద తల్లులందరికీ అమ్మ ఒడి

పిల్లల్ని ఏ బడికి పంపినా ప్రతి పేద తల్లికీ అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసినట్లు సాక్షి కథనం ప్రచురించంది.

అమ్మ ఒడి పథకానికి సంబంధించి కొద్ది రోజులుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండడంతో వాటన్నింటికీ తెరదించుతూ సీఎం ఆఫీస్ ఆదివారం ఈ ప్రకటన చేసింది. 'అమ్మ ఒడి' విషయంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావులేదని అందులో పేర్కొనట్లు పత్రిక తెలిపింది.

ఈ పథకం అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టంగా, ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా వివరించారని తెలిపింది.

బడిబాట, అక్షరాభ్యాసం కార్యక్రమాల సందర్భంగా, ఎడ్యుకేషన్‌ రివ్యూ మీటింగ్‌లోనూ జగన్ దీనిపై స్పష్టత ఇచ్చారని ప్రకటనలో చెప్పినట్లు సాక్షి వివరించింది.

పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా అందరికీ అమ్మ ఒడి వర్తిస్తుందని వైఎస్‌ జగన్‌ తన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో చెప్పారని, అందుకే పేద పిల్లలు చదివేది ప్రభుత్వ స్కూలు అయినా, ప్రైవేట్‌ పాఠశాల అయినా వారికి అమ్మ ఒడి వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసినట్లు కథనంలో చెప్పారు.

పేదల పిల్లల్లో ప్రతి ఒక్కరూ బడికి వెళ్లి చదువుకోవాలన్న ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం విషయంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావు లేదు' అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎన్నికల హామీల మేరకు మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలతో సంవత్సరానికి రూ.15 వేలు అందిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మరో ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలో విధివిధానాలు ప్రకటిస్తామన్నారని సాక్షి కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోదావరిలో వ‌రుస పడవ ప్ర‌మాదాలు... ఎందుకిలా జ‌ర‌ుగుతోంది? ఎవరు బాధ్యులు?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

కశ్మీర్: పీఎస్ఏ చట్టం కింద ఫారూక్ అబ్దుల్లా నిర్బంధం... ఏమిటీ చట్టం? ఎంత కఠినం?

దక్షిణ కొరియా నాయకులు ఎందుకు గుండు కొట్టించుకుంటున్నారు?

ధోనీ మళ్లీ ఆడతాడా... భారత క్రికెట్‌కు అతడి అవసరం ఇంకా ఉందా?

ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'..

గుజరాత్ 2002 అల్లర్ల ముఖ చిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా.. వీళ్లు ఇప్పుడేం చేస్తున్నారు

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు