ఝార్ఖండ్‌ మూక హత్య కేసు: ‘జైశ్రీరాం, జై హనుమాన్ అనమంటూ నా భర్తను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు’

  • 24 జూన్ 2019
తబ్రేజ్ అన్సారీని కొడుతున్న వీడియో Image copyright SARTAJ ALAM
చిత్రం శీర్షిక తబ్రేజ్ అన్సారీని కొడుతున్న వీడియో వైరల్ అయ్యింది

"అది జూన్ 17 రాత్రి.. నా భర్త జంషెడ్‌పూర్ నుంచి మా గ్రామానికి తిరిగి వస్తున్నారు. అప్పుడే ఘాత్‌కీడీ గ్రామంలో కొంతమంది ఆయన్ను చుట్టుముట్టారు. దొంగతనం ఆరోపణలతో ఆయన్ను రాత్రంతా కరెంటు స్తంభానికి కట్టేశారు. తీవ్రంగా కొట్టారు.

జై శ్రీరాం, జై హనుమాన్ అనాలన్నారు. అలా చెప్పనందుకు నా భర్తను దారుణంగా కొట్టారు. ఉదయం సరాయ్‌కేలా పోలీసులకు అప్పగించారు. ఆయన్ను కొట్టడం గురించి దర్యాప్తు చేయని పోలీసులు దొంగతనం ఆరోపణలతో నా భర్తనే జైలుకు పంపించారు. ఆయనకు లోతుగా గాయాలయ్యాయి. వాటివల్లే ఆయన చనిపోయారు".

మాటలు పూర్తికాగానే షాయిస్తా పర్వీన్ గట్టిగా ఏడ్చేశారు. కదమ్‌హీడా గ్రామంలోని తబ్రేజ్ అన్సారీతో ఆమె నిఖా జరిగి కొన్ని నెలలే అయ్యింది. ఆ గ్రామం ఝార్ఖండ్‌ సరాయ్‌కేలా జిల్లా ఖర్సావా ప్రాంతంలో భాగం.

"నేను దానిపై పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాను. వాళ్లు కేసు నమోదు చేసి, నాకు న్యాయం చేయాలి. తబ్రేజ్ వయసు 24 ఏళ్లే. ఆయన్ను హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు, జైలు అధికారుల నిర్లక్ష్యం ఉంది. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరగాలి" అని ఆమె బీబీసీకి చెప్పారు.

Image copyright SARTAJ ALAM
చిత్రం శీర్షిక తబ్రేజ్ ఇల్లు

"ఘాత్‌కీడీహ్ గ్రామ ప్రజలు దొంగతనం ఆరోపణలతో అన్సారీని పట్టుకున్నారని" సరాయ్‌కేలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అవినాష్ కుమార్ మీడియాతో చెప్పారు.

"గ్రామస్థులు తబ్రేజ్‌ను ఘాత్‌కీడీహ్‌లోని కమల్ మహతో ఇంటి మేడమీద నుంచి దూకడం చూశారు. అతడితోపాటు మరో ఇద్దరున్నారు, వారు పారిపోయారు" అని ఆయన చెప్పారు.

"తబ్రేజ్‌ను గ్రామస్థులు పట్టుకున్నారు. ఆ తర్వాత దొంగని చెప్పి అతడిని మాకు అప్పగించారు. అతడిపై దొంగతనం ఆరోపణలు నమోదయ్యాయి. మేం చికిత్స తర్వాత అతడిని కోర్టుకు తీసుకెళ్లాం. అక్కడ జ్యుడిషియల్ కస్టడీ కోసం సరాయ్‌కేలా జైలుకు పంపించారు. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఏదీ లేదు" అన్నారు.

తబ్రేజ్ చనిపోయిన తర్వాత అతడి శవాన్ని జైలు అధికారులు పోస్టుమార్టం కోసం సరాయ్‌కేలా ప్రధాన ఆస్పత్రికి తీసుకొచ్చినపుడు అక్కడ కలకలం రేగింది.

కాసేపు వాగ్వాదం జరిగిన తర్వాత ఆగ్రహంతో ఉన్నవారికి పోలీసులు నచ్చజెప్పారు. తర్వాత తబ్రేజ్ మృతదేహాన్ని జంషెడ్‌పూర్ పంపించారు.

Image copyright SARTAJ ALAM

తబ్రేజ్ లించింగ్ వీడియో

తబ్రేజ్ అన్సారీని కొడుతున్న రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో గ్రామస్థులు గుంపుగా అతడిని కరెంటు స్తంభానికి కట్టేసి కొడుతున్నారు.

పేరు అడిగిన తర్వాత అతడితో జై శ్రీరాం, జై హనుమాన్ అనాలని చెబుతున్నారు.

ఈ లించింగ్ వీడియోలో కొందరు మహిళలు కూడా కనిపిస్తున్నారు, అప్రమత్తమైన కొందరు ఈ వీడియోను సరాయ్‌కేలా ఖర్సావా ఎస్పీకి అందించారు.

మాబ్ లించింగ్ వార్తలతో ఝార్ఖండ్ ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. రాష్ట్రంలోని ప్రజాహక్కుల ఫ్రంట్ రిపోర్టు ప్రకారం ప్రస్తుతం బీజేపీ పాలనలో కనీసం 12 మంది మూకదాడుల వల్ల చనిపోయారని తెలుస్తోంది.

Image copyright SARTAJ ALAM

వీరిలో 10 మంది ముస్లింలు, ఇద్దరు గిరిజనులు ఉన్నారు. ఎక్కువ కేసుల్లో మతపరమైన వ్యతిరేకత ఉందనే వార్తలు వచ్చాయి. నిందితులకు బీజేపీ లేదా విశ్వహిందూ పరిషత్ దాని అనుబంధ సంస్థలతో సంబంధం ఉన్నట్లు బయటపడింది.

రాంగఢ్‌లో జరిగిన అలీముద్దీన్ అన్సారీ లించింగ్ కేసులో దోషులకు హైకోర్టులో బెయిల్ లభించడం, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి జయంత్ సిన్హా వారికి పూలమాలలు వేసి స్వాగతం పలకడంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

అయినప్పటికీ బీబీసీతో మాట్లాడిన ఆయన తాను లించింగ్ నిందితుల కేసు వాదించడానికి ఆర్థిక సాయం కూడా చేశానని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పోలవరం పనుల రివర్స్ టెండరింగ్.. ఇంతకీ రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటే ఏమిటి

అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం ఓ నాటకమా? దీనికి నాసా సమాధానమేంటి?

‘అమరావతి రుణాన్ని తిరస్కరించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానిదే.. ప్రపంచ బ్యాంకుది కాదు’

సాయంత్రం 6 లోగా బలపరీక్ష జరపండి.. డెడ్‌లైన్ పొడిగించిన గవర్నర్

జింబాబ్వేను సస్పెండ్ చేసిన ఐసీసీ.. క్రికెట్‌లో రాజకీయ జోక్యంతో జట్టుపై నిషేధం

ప్రెస్ రివ్యూ: ‘రోడ్డు మీద పడుకుంటా’.. ‘40 ఏళ్ల ఇండస్ట్రీ అంటే ఇదేనా’

కుల్‌భూషణ్ జాధవ్ మరణశిక్షను పాకిస్తాన్ ఎలా సమీక్షిస్తుంది

హత్యకేసులో జీవిత ఖైదు పడిన శరవణ భవన్ యజమాని గుండెపోటుతో మృతి