ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార నిందితుడిపై రాంపూర్ ఎస్పీ అజయ్‌పాల్ శర్మ కాల్పులు జరిపారా...

  • 25 జూన్ 2019
అజయ్ పాల్ శర్మ Image copyright FACEBOOK/IPSAJAYPALSHARMA
చిత్రం శీర్షిక రాంపూర్ ఎస్పీ అజయ్‌పాల్ శర్మ

ఎక్కడ అత్యాచారాలు జరిగినా సోషల్ మీడియాలో ఆగ్రహం వెల్లువెత్తుతుంది. నిందితులను కాల్చి చంపాలనే ఆవేశం కనిపిస్తుంది.

వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం జరిగినా, ఒంగోలులో బాలికపై గ్యాంగ్‌రేప్ జరిగినా నెటిజన్ల నుంచి ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం అయ్యాయి.

ఇప్పుడు యూపీ రాంపూర్‌లో ఆరేళ్ల పాపపై అత్యాచారం చేసినట్లు చెబుతున్న నిందితుడి పై కాల్పులు జరిపిన రాంపూర్ ఎస్పీ అజయ్‌పాల్ శర్మ గురించి కూడా సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

ఆయన అలా చేసినందుకు జనం అజయ్‌పాల్‌ను సింగంగా వర్ణిస్తుంటే, కొందరు మాత్రం ఈ చర్యలపై చాలా ప్రశ్నలు లేవదీస్తున్నారు.

దాదాపు నెలన్నర క్రితం ఒక ఆరేళ్ల పాపను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని దూరంగా పడేశారు. హత్యకు ముందు ఆ పాపపై అత్యాచారం జరిగిందేనే అనుమానాలు కూడా వచ్చాయి.

ఈ కేసులో నాజిల్ అనే వ్యక్తిని పోలీసులు ప్రధాన నిందితుడుగా గుర్తించారు. రెండ్రోజుల ముందు పోలీసులకు-అతడికి మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

ఆ సమయంలో రాంపూర్ ఎస్పీ అజయ్‌పాల్ శర్మ నాజిల్‌పై కాల్పులు జరిపారు. కాలికి బుల్లెట్ తగలడంతో పడిపోయిన నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి పంపించారు.

Image copyright Getty Images

ఆత్మరక్షణ కోసమే కాల్పులు

తర్వాత మీడియాతో మాట్లాడిన ఎస్పీ అజయ్‌పాల్ శర్మ కూడా అదే చెప్పారు. "సివిల్ లైన్స్ స్టేషన్ పోలీసులకు-నాజిల్‌కు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. అందులో అతడి కాలుకు బుల్లెట్ తగిలింది" అన్నారు.

కానీ, నాజిల్‌ను అజయ్‌పాల్ శర్మ కాల్చారంటూ, సోషల్ మీడియాలో ఆయన ఫొటోలతోపాటు చాలా కామెంట్స్ వైరల్ అయ్యాయి. అలా చేసినందుకు అజయ్‌పాల్ శర్మను చాలా మంది ప్రశంసించారు.

నాజిల్‌పై కాల్పులు జరిపింది అజయ్‌పాల్ శర్మేనా, వేరే ఎవరైనా అలా చేశారా తెలుసుకోడానికి మేం ఆయనను చాలాసార్లు సంప్రదించాం. కానీ, ఆయన అందుబాటులో లేరు.

"పోలీసులు బాధిత కుటుంబానికి న్యాయం అందించారు", "వారి మనసుకు కాస్త ప్రశాంతత లభించింది", "ఇలాంటి చర్యలతో దారుణమైన నేరాలు చేసేవారిలో భయం పుడుతుంది", "ఇలా చేస్తే నేరాలు తగ్గుతాయి" అంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టారు.

కొందరు ఆయనను ఏకంగా దేవుడితో పోలిస్తే, ఇంకొందరు 'సింగం' అని అభివర్ణించారు.

అయితే, కొంతమంది దీనిపై ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ డీజీపీగా పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఏకే జైన్ "ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు నిందితుడు కాల్పులు జరిపితే, పోలీసులు ఆత్మరక్షణ కోసం అతడిని కాలిస్తే, అందులో తప్పు లేదు. కానీ, అత్యాచారం, హత్య నిందితుడని అతడిపై కాల్పులు జరపడం చాలా తప్పు" అన్నారు.

బీబీసీతో మాట్లాడిన ఏకే జైన్ "నాజిల్‌ను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసులు ఈ కాల్పులు జరిపారు. అలాంటప్పుడు తమను కాపాడుకోడానికి పోలీసులు కాల్పులు జరపడం చట్టబద్ధమే. కానీ అంతకు ముందు ఎలాంటి నేర చరిత్ర లేని ఒక అత్యాచార నిందితుడిపై కాల్పులు జరపడం సరికాదు" అన్నారు.

"నిందితుడి సంగతి తర్వాత, ఒకవేళ అతడు దోషి అయినా, ఇలా కాల్పులు జరడానికి ఎలాంటి హక్కూ ఉండదు. ఎందుకంటే శిక్ష వేయడం కోర్టుల పని, పోలీసులది కాదు" అన్నారు.

Image copyright Getty Images

పబ్లిసిటీ స్టంట్

అటు పోలీసు శాఖలో ఉన్న ఒక అధికారి తన పేరు బయటపెట్టకూడదనే షరతుపై ఈ ఎన్‌కౌంటర్‌ను 'పబ్లిసిటీ స్టంట్‌'గా వర్ణించారు.

"ఒక నిందితుడిని ఒక స్టేషన్ పోలీసులు పట్టుకోడానికి వెళ్లినపుడు, అతడిపై ఎస్పీ కాల్పులు జరిపారు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఒక ఎన్‌కౌంటర్ జరగడం అంటే మామూలు విషయం కాదు. ఆ కేసు ఎస్పీ స్థాయి అధికారి వెళ్లాల్సినంత పెద్దది, జటిలమైనది కూడా కాదు" అన్నారు.

అయితే పోలీసుn ఈ చర్యలను సోషల్ మీడియాలోనే కాదు ఇంకా చాలా మంది ప్రశంసిస్తున్నారు. లక్నోలో అమర్ ఉజాలా సీనియర్ జర్నలిస్ట్, గత 15 ఏళ్లుగా క్రైమ్ రిపోర్టర్‌గా ఉన్న వివేక్ త్రిపాఠీ "ఎస్పీ అజయ్‌పాల్ శర్మ ఎలాంటి తప్పూ చేయలేదు. ఇలాంటి దారుణ నేరాలకు ఇంకా పెద్ద శిక్ష వేయాలని" అన్నారు.

"పోలీసులంటే నేరస్థుల్లో ఈ భయం ఉండాలి. లేదంటే నేరాలను ఆపడం సులభం కాదు. మేం క్రైం వార్తలు కవర్ చేస్తున్నప్పుడు నేరస్థుల గురించి బాగా అర్థం చేసుకున్నాం. చట్టం, పోలీసులు భయం లేకుంటే, వారిలో ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తుంది" అన్నారు.

యూపీ డీజీపీగా ఉండి రిటైరైన మరో పోలీస్ అధికారి సుబ్రత్ త్రిపాఠీ కూడా ఒక ఎన్‌కౌంటర్లో ఎవరికి బుల్లెట్ తగిలినా దానికి ఇంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు.

Image copyright AFP

లక్నో సీనియర్ జర్నలిస్ట్ శరత్ ప్రధాన్ ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చట్ట వ్యవస్థ దిగజారడం వల్లే జరుగుతున్నాయని అంటున్నారు.

"పోలీసులకు ఒక వ్యక్తిపై సందేహం వస్తే, దానికి ఆధారం ఏంటని అనుకోవడం లేదు. అతడిని పట్టుకోడానికి బదులు కాల్పులు జరిపి తమ వైఫల్యం కప్పిపుచ్చుకున్నారు. నిజానికి నెలన్నర నుంచి పాప కనిపించకపోయినా, వారి దగ్గర ఎలాంటి సమాచారం లభించలేదు. పాప శవం గురించి కూడా వేరేవాళ్లు సమాచారం ఇచ్చారు. ఇదే కాదు, రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు రోజూ జరుగుతున్నాయి.

ఎన్‌కౌంటర్ గురించి యూపీ పోలీసులపై ఇంతకు ముందు కూడ ప్రశ్నలు వెల్లువెత్తాయి. అయితే రిటైర్డ్ డీజీపీ ఏకే జైన్ మాత్రం ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎన్‌కౌంటర్ ఘటనలు చాలా తగ్గాయని చెప్పారు.

సామాన్యులు ఈ ఎన్‌కౌంటర్ల గురించి ప్రశ్నించడానికి, వాటిపై ఫిర్యాదు చేయడానికి ఇప్పుడు చాలా వేదికలున్నాయి. అందుకే బూటకపు ఎన్‌కౌంటర్లు తగ్గిపోడవడంతోపాటు నేరస్థులను నేరుగా కాల్చి చంపకుండా వారి కాళ్లపై కాల్పులు జరుపుతున్నారు. మొదట్లో ఎన్‌కౌంటర్ జరిగితే ఒక యుద్ధంలా ఉండేది. వాటిలో పోలీసులో, నేరస్థులో చనిపోయేవారు" అన్నారు.

ఎస్పీ అజయ్‌పాల్ శర్మ కొన్ని రోజుల క్రితమే రాంపూర్ వచ్చారు. అంతకు ముందు ఆయన ప్రయాగరాజ్ ‌ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేశారు. 'ఎన్‌కౌంటర్ మ్యాన్‌' పేరుతో పాపులర్ అయిన అజయ్‌పాల్ శర్మ దాదాపు రెండు వారాల క్రితమే, రాంపూర్‌ ఎస్ఎస్పీగా నియమితులయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు