'మల్లేశం': సామాన్యుడి విజయాన్ని సహజంగా చూపించిన చిత్రం

  • 25 జూన్ 2019
మల్లేశం Image copyright FACEBOOK/MALLESHAMMOVIE

చీరలు ఎలా తయారవుతాయో మీకు తెలుసా? మగ్గం పనితనం గురించి తెలుసా? ఆసు పోయడమంటే తెలుసా? ఆసు పని వలన భుజం ఎముకలు అరిగిపోయి,చేతులు పడిపోయిన స్త్రీల దయనీయ స్థితి గురించి తెలుసా?

మ‌గ్గంపై చీరెలు, రకరకాల వస్త్రాలను నేయడానికి అవ‌స‌ర‌మైన నూలుపోగులను ఉండెలుగా చుట్టడాన్ని ఆసు పోయడం, ఆసు పోసిన కండెలను మగ్గానికి బిగించి,ఆ మగ్గం గుంతలో కాళ్ళు పెట్టి తొక్కుడు చెక్కల్ని లయబద్దంగా నొక్కుతూ కుడి చేత్తో కుచ్చును లాగుతూ ఇంకో చేత్తో పలకను ఆడిస్తూ ఈ వారకూ ఆ వరకూ పరుగులు తీసే కొమ్ము చప్పుళ్ళతో రంగురంగుల చీరలు తయారుచేస్తారు చేనేతకారులు.

ముఖ్యంగా, టై అండ్‌ డై విధానంలో నేసే పోచంపల్లి చీరల తయారీలో ఆసుపోయడం ప్రధాన ప్రక్రియ. పని విభజనలో భాగంగా తరతరాలో చేనేత కుటుంబాల్లో ఆసుపోసే పని మహిళలే చేస్తుంటారు. భుజాలు తరుక్కుపోయి చేతులు పడిపోయేంత బాధ, కష్టం ఉండే ఈ పనికి ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాలని, తన తల్లికి ఆ కష్టం లేకుండా చేయాలని తపించి ఎన్నో అడ్డంకులు అధిగమించి 'ఆసుయంత్రం' కనిపెట్టిన ఒక సామాన్యుడు చింతకింది మల్లేశం. తన ఆవిష్కరణకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న మల్లేశం జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా 'మల్లేశం'.

Image copyright FACEBOOK/CMALLESHAM
చిత్రం శీర్షిక 'మల్లేశం' చిత్రానికి స్ఫూర్తి చింతకింది మల్లేశం

సామాన్య చేనేత కుటుంబంలో పుట్టి, ఆరో తరగతితో చదువు ఆపేసిన మల్లేశం తనవారి కష్టాలను తీర్చడానికి 'ఆసుయంత్రం' కనిపెట్టే ప్రయత్నంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు... చివరకు ఎలా విజయం సాధించారన్నదే ఈ సినిమా ఇతివృత్తం.

ఒక సామాన్యుడి అసామాన్య విజయంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం అనగానే ఒక హైప్ ఏర్పడింది. దానికి తగినట్లే మల్లేశం ట్రైలర్లో కనువిందు చేసిన తెలంగాణ పలుకుబడులు, వాతావరణం వలన ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి మరింత పెరిగింది.

ఇప్పటి వరకు కమెడియన్‌లా నటించిన 'ప్రియదర్శి' మల్లేశం పాత్రలో ఎంత వరకు మెప్పించాడు?ఎలాంటి నటనానుభవం లేని 'అనన్య నాదెళ్ళ 'పద్మ'పాత్రలో ఎంతవరకు ఒదిగిపోయింది? తల్లిదండ్రులుగా ఝాన్సీ, ఆనంద చక్రపాణి ఎంత బాగా పాత్రల్లో జీవించారనే విషయాలు తెలుసుకోవాలంటే మల్లేశం కథలోకి వెళ్ళాల్సిందే.

మల్లేశం మేనమామ అప్పులబాధ తాళలేక కుటుంబసహితంగా ఆత్మహత్య చేసుకునే సంఘటనతో మొదలయిన మల్లేశం సినిమా, ఆపదలొచ్చినప్పుడు అన్ని దార్లు మూసుకుపోయినట్టనిపిస్తుంది. కానీ, ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే మన కోసం ఏదో ఒకదారి తెరిచే ఉంటుంది అని చెప్పే పాఠంతో ముగుస్తుంది.

కూతురి పెళ్ళి చేసి,పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన మల్లేశం తండ్రి బలవంతంగా కొడుకును ఆరవ తరగతిలోనే చదువు మాన్పించి మగ్గమెక్కిస్తాడు. ఆసుపోసి పోసి బొక్కలరిగిన తల్లి బాధను చిన్నతనం నుండి గమనించిన మల్లేశం'ఆసుయంత్రం'కనిపెట్టాలని నిర్ణయించుకుంటాడు.ఆ తరువాత ఆసుయంత్రం కనిపెట్టడానికి అతను ఏం చేసాడు? ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నాడు? కుటుంబ సభ్యుల సహాయసహకారలెంత? అనేది సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.

Image copyright SURESHPRODUCTIONS

ప్రియదర్శి మల్లేశం పాత్రలో జీవించాడనే చెప్పాలి. అనన్య నాదెళ్ళ నటనకు కొత్త అని నమ్మడం కష్టం. ఝాన్సీ తల్లిగా ఇంతబాగా నటించగలదా అని ప్రతి ఫ్రేమ్ లో ఆశ్చర్యపరిచిందంటే అతిశయోక్తి కాదు. బిడ్డల ఉన్నతి కోసం తాపత్రయపడే సాధారణ తండ్రిగా ఆనంద చక్రపాణి సహజంగా నటించారు. అన్వేష్,జగదీశ్, గంగవ్వ కామెడీ సినిమాహాల్లో నవ్వుల పువ్వులు పూయించింది .నటన పరంగా ఎవరికి వారు 'నువ్వా-నేనా'అని పోటీపడినటించినట్లుగా అనిపిస్తుంది.

బతుకమ్మ కొప్పునజెక్కిన బీరపువ్వులా,జమ్మి చెట్టు మీద వాలిన పాలపిట్టలా, కాపు పడతి కొప్పు నుండి జారిపడ్డ బంతిపువ్వు గంధోళిలా, అప్పుడే అలికి ముగ్గెసిన వన్నెమింటిలా, పోరగాడి జేబులో దాచుకున్న ఆస్మాన్ గోటిలా... దర్శకుడు రాజ్ మల్లేశం కథని మొదలు పెట్టిన విధానం అద్భుతంగా ఉంటుంది.

ఎక్కడా కృత్రిమత్వం చోటుచేసుకోకుండా ఉండేలా జాగ్రత్తపడిన వైనం,పెద్దింటి అశోక్ కుమార్ స్వచ్ఛమైన తెలంగాణ పలుకుబడులతో అల్లిన మాటలు, మార్క్ కె రాబిన్ సంగీతం, దృశ్య నేపథ్యాన్ని సృష్టించడంలో ఆర్టిస్ట్ లక్ష్మణ్ ఏలె ప్రొడక్షన్ డిజైనింగ్... అన్నీ కలిసి మల్లేశం జీవితాన్ని సహజంగా ఆవిష్కరించాయి. ఆ సహజత్వంలో ప్రేక్షకుడ్ని చేయిపట్టి లాక్కుపోతాయి.

అయితే రెండుగంటలు సాగే ఈ కథకు ప్రాణమైన 'ఆసుయంత్రం' కనిపెట్టడానికి కావాల్సిన మిషన్ సామాగ్రి గురించి, దాని పనితనం గురించి ప్రేక్షకుడికి ఒక్కసారి కూడా అర్థమయ్యేలా వివరించాలనిపించక పోవడం విచిత్రం. ఎంతసేపు 'ఆ కొయ్యకు చుట్టి,ఈ కొయ్యకు చుట్టి, నలభై మొలలు కొట్టి' అంటూ ఏదేదో అనడం కాకుండా ఆ యంత్రం ఎలా పనిచేస్తుందో ఓదో ఒక సన్నివేశంలో అర్థవంతంగా వివరిస్తే బాగుండేది.

వాస్తవిక జీవితంలా మొదలై, తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టిస్తూ మొదలైన ఈ సినిమాలో సెకండాఫ్‌లో నారేషన్ స్లో అయినట్లు అనిపిస్తుంది.క్లైమాక్స్ కూడా చప్పున ఆగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.

ఆ విషయాలను పక్కన పెడితే... వాస్తవిక జీవితంలోని భావోద్వేగాలను మెలోడ్రామా లేకుండా సహజంగా మనసుకు హత్తుకునేలా ఆవిష్కరించే చక్కటి ప్రయత్నమే 'మల్లేశం' అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)