ఝార్ఖండ్ మూక హత్య: 'మా అల్లుడి మరణంతో నా బిడ్డ జీవితం నాశనమైంది'

  • 27 జూన్ 2019
జంట Image copyright ANAND DUTTA
చిత్రం శీర్షిక షాయిస్తా, తబ్రేజ్

షాయిస్తా పర్వీన్ నాలుగు రోజుల తర్వాత భర్తతోపాటు ఆయన పనిచేసే పట్టణమైన పుణేకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఇంతలో ఈ ఘటన జరిగింది. వారికి ఏప్రిల్ 24న పెళ్లయ్యింది. ఇటీవలే రంజాన్ పండగ జరుపుకొన్నారు. జీవితంలో అంతా సాఫీగానే సాగిపోతుందనుకున్నారు. అంతలోనే షాయిస్తా జీవితం తలకిందులైపోయింది.

జూన్ 18న ఉదయం ఆమెకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసింది ఆమె భర్త తబ్రేజ్ అలియాస్ సోను. ఫోన్లో ఆయన గొంతు భయంతో వణుకుతోంది. "షాయిస్తా నన్ను కాపాడు. వీళ్లు నన్ను దారుణంగా కొడుతున్నారు. నన్ను రాత్రంతా కుళ్లబొడిచారు" అని ఆయన ఫోన్‌లో చెప్పారు.

తబ్రేజ్ ఝార్ఖండ్‌లోని సరాయ్‌కేలా జిల్లా కాడండిహా గ్రామానికి చెందినవాడు. రాజధాని రాంచీకి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ గ్రామం. జూన్ 17న ఒక మూక ఆయన్ను దొంగతనం ఆరోపణలపై తీవ్రంగా కొట్టింది.

మరుసటి రోజు అంటే జూన్ 18న పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ సమయంలో ఆయన పరిస్థితి క్షీణించింది. ఈ నెల 22న చనిపోయారు.

Image copyright ANAND Dutta
చిత్రం శీర్షిక తబ్రేజ్

ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు. వీరిలో- భీంసేన్ మండల్, ప్రేమ్‌చంద్ మహిల్, కమల్ మహతో, సోనమో ప్రధాన్, సత్యనారాయణ్ నాయక్, సోనరామ్ మహ్లి, చాము నాయక్, మదన్ నాయక్, మహేల్ మహ్లి, సుమంత్ మహతో ఉన్నారు.

ఖార్సన్వాలోని పోలీసు అధికారి చంద్రమోహన్ ఉరవ్‌, స్టేషన్ హౌస్ ఆఫీసర్ బిపిన్ బిహారీ సింగ్‌లను పై అధికారులు సస్పెండ్ చేశారు.

ఈ ఘటన ఖార్‌సావన్ జిల్లా ధాట్కిడిహ్ గ్రామం సమీపాన జరిగింది. ప్రస్తుతం అక్కడ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

తబ్రేజ్ నివసించే కాడండిహా గ్రామంలో సుమారు వెయ్యి ఇళ్లు ఉంటాయి. అందులో ఎనిమిది మాత్రమే హిందువులవి. మిగతావన్నీ ముస్లింలవే.

Image copyright ANAND DUTTA
చిత్రం శీర్షిక తబ్రేజ్ ఇల్లు

సమీపంలోనే కేంద్ర మంత్రి అర్జున్ ముండా గ్రామం

తబ్రేజ్ ఊరికి, ఘటన జరిగిన గ్రామానికి మధ్య దూరం నాలుగు కిలోమీటర్లే. కాడండిహా గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, స్థానిక ఎంపీ అర్జున్ ముండా స్వగ్రామం ఖేజుర్డా ఉంది.

జూన్ 23న బీజేపీ కార్యకర్తలను సన్మానించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అర్జున్ ముండా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కానీ ఆయన తబ్రేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాత్రం వెళ్లలేదు.

జూన్ 24 మధ్యాహ్నం తబ్రేజ్ ఇంటి వద్దకు స్థానిక జనం చేరుకున్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడకు వచ్చారు. వారు చేతికి నల్లబ్యాడ్జీలు ధరించారు.

"మీకెంత బాధగా ఉందో, మాకూ అంతే బాధగా ఉంది. ఈ కష్టకాలంలో మీకే సాయం కావాలన్నా మేం అందిస్తాం. ఈ ఘటనపై పార్టీ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది" అని కాంగ్రెస్ నాయకుల్లో ఒకరు తబ్రేజ్ కుటుంబ సభ్యులతో చెప్పారు.

రాజకీయ నాయకులు వెళ్లిపోయాక తబ్రేజ్ సమీప బంధువులు మసూర్ ఆలం(36), మసూద్ ఆలం(33)లతో బీబీసీ మాట్లాడింది.

Image copyright Anand DUTTA
చిత్రం శీర్షిక తల్లి సాబాజ్ బేగంతో షాయిస్తా

తబ్రేజ్ తండ్రి పన్నెండేళ్ల క్రితం, తల్లి 18 సంవత్సరాల కిందట చనిపోయారని మసూద్ ఆలం చెప్పారు. తబ్రేజ్‌కు ఒక సోదరి ఉన్నారని, ఆమెకు పెళ్లయ్యిందని తెలిపారు. మసూద్ కారు మెకానిక్.

రంజాన్ తర్వాత తబ్రేజ్ చాలా వరకు వాళ్ల అత్తగారింట్లోనే ఉన్నాడని, అప్పుడప్పుడు సొంతింటికి వచ్చినా కొన్ని గంటలపాటే ఉండేవాడని మసూద్ తెలిపారు. తబ్రేజ్ అత్తగారి ఊరు సీపంలోని బెహ్రాసాహి గ్రామం.

తబ్రేజ్ భార్య షాయిస్తా ప్రస్తావన తీసుకురాగా, ఉదయం నుంచి ఆమెకు సెలైన్ పెట్టారని మసూద్ చెప్పారు.

మసూద్ నన్ను షాయిస్తా వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెతోపాటు తల్లి సాబాజ్ బేగం(39), మరో బంధువు నేహా పర్వీన్(26) ఉన్నారు.

షాయిస్తా మూడు రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నారు. ఆమెకు రక్తపోటు పడిపోయింది. మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు.

తబ్రేజ్‌తో చివరి సంభాషణ గురించి అడిగితే, ఆమె సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. కానీ, వెంటనే ఏడ్చేసేలా కనిపించారు. కాసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత స్పందిస్తూ, "జూన్ 17న రాత్రి పది గంటలప్పుడు తబ్రేజ్ నాకు ఫోన్ చేశాడు. జంషెడ్‌పూర్ నుంచి తిరిగి వస్తున్నానని చెప్పాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం తిరిగి ఫోన్ చేశాడు. కొందరు గ్రామస్థులు తనను పట్టుకొని, కనికరం లేకుండా కొడుతున్నారని చెప్పాడు. ఆ కాల్ తర్వాత నేను నా బంధువులకు ఫోన్ చేశాను" అని షాయిస్తా వివరించారు. తర్వాత ఆమె మాట్లాడలేకపోయారు.

‘మాకు న్యాయం కావాలి‘

షాయిస్తా తండ్రి షేక్ సైఫుద్దీన్. ఆయనో దర్జీ. ఆయన మానసిక ఆరోగ్యం బాగోలేదు. షాయిస్తా తల్లి షాబాజ్ బేగం ఏడుస్తూనే నాతో మాట్లాడారు. "మా అల్లుడు మంచోడు. మరో ఊళ్లో నా కుమార్తె సంతోషంగా ఉంటుందని ఆశపడ్డా. ఇప్పుడు మా అల్లుడి మరణంతో నా కూతురు జీవితం నాశనమైంది. దీనికి కారణమైనవారిని ఊరికే వదిలిపెట్టం. ఏదో ఒకటి చేస్తాం" అని ఆమె చెప్పారు.

నేహా పర్వీన్ కల్పించుకుంటూ, "కుటుంబ విషయాలను ప్రస్తుతానికి పక్కనబెడతాం. ఇప్పుడు మాకు న్యాయం కావాలి" అని డిమాండ్ చేశారు.

Image copyright ANAND DUTTA

గ్రామంలో జాడ తెలియని ఇద్దరు యువకులు

తబ్రేజ్ సమీప బంధువుల్లో ఒకరైన మసూర్ ఆలం ఉపాధ్యాయుడు. ఆయన పిల్లలకు పాఠాలు చెబుతారు. "సోను ఏడేళ్లుగా పుణెలో పనిచేస్తున్నాడు. ఏడాదికి ఒకట్రెండు సార్లే ఇంటికి వచ్చేవాడు" అని ఆయన బీబీసీకి తెలిపారు.

తబ్రేజ్ స్వగ్రామానికి చెందిన ఇంకో బంధువు అక్బర్ జియా మాట్లాడుతూ- నాలుగు రోజుల తర్వాత పుణే వెళ్తానని, మళ్లీ వచ్చే సంవత్సరం రంజాన్ పండగకు వస్తానని తబ్రేజ్ చెప్పాడని తెలిపారు. తబ్రేజ్ ఊరికి తరచూ రానందున ఊళ్లో స్నేహితులు చాలా తక్కువని చెప్పారు.

తబ్రేజ్ ఘటన జరిగినప్పటి నుంచి గ్రామంలో మరో ఇద్దరు కుర్రాళ్లు నుమర్ అలీ(14), ఇర్ఫాన్ (15) కనిపించకుండా పోయారని గ్రామస్థులు చెప్పారు.

నుమర్ అలీ తండ్రి ఉమర్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేవారు. ఇర్ఫాన్ తండ్రి జూన్ 24 వరకు ఎదురుచూస్తూనే ఉన్నారు. తన కొడుకు ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లాడని ఆయన తెలిపారు. "నా కొడుకు ఇల్లు విడిచి పారిపోయాడో, చనిపోయాడో తెలియడం లేదు" అని చెప్పారు.

Image copyright ANAND DUTTA

ఇప్పుడు తబ్రేజ్‌ను స్థానికులు కొట్టిన గ్రామం ధతకీడీ విషయానికి వద్దాం.

'జై శ్రీరామ్' అనాలని తబ్రేజ్‌ను గ్రామస్థులు బలవంతపెడుతున్న ఒక వీడియో వైరల్ అయ్యింది.

నేను వెళ్లినరోజు ధతకీడీ రోడ్లపై పెద్దసంఖ్యలో మహిళలతోపాటు పోలీసు వాహనాలు కనిపించాయి. మగవారు దాదాపు ఎవ్వరూ కనిపించలేదు. ఊతకర్రల సాయంతో నడుస్తున్న ఒక వృద్ధుడిని పలకరిస్తే, "ఆ ఘటన జరిగింది ఊళ్లోని దిగువ ప్రాంతంలో, ఇది ఎగువ ప్రాంతం. అక్కడికి వెళ్లు" అని ఆయన చెప్పారు.

గ్రామంలోని పోలీసు క్యాంప్ ఇన్‌ఛార్జి అయిన సరాయ్‌కేలా ఎస్‌డీపీవో అవినాష్ కుమార్ మాట్లాడుతూ, "అన్ని అంశాలనూ విచారిస్తున్నాం. ఈ ఘటనతో ప్రమేయమున్న ప్రతి ఒక్కరినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఊళ్లో మగవారు ఎవ్వరూ లేరు. ఊళ్లో ఇళ్లలోకి వెళ్లి విచారించాల్సి వస్తే, మహిళా సిబ్బందిని తోడ్కొని వెళ్తున్నాం" అని వివరించారు.

ఇది మూక హత్య కేసు అని స్పష్టంగా తెలుస్తోందని ఆయన చెప్పారు. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆయన సారథి కూడా.

ఝార్ఖండ్ డీజీపీ కమల్ నారాయణ్ చౌబే రాంచీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తబ్రేజ్‌ది ప్రస్తుతం మూక హత్యలా కనిపించడం లేదన్నారు.

"ముగ్గురు కుర్రాళ్లు ముర్ము గ్రామంలో ఒక మోటార్ సైకిల్ ఆపారు. తర్వాత వాళ్లు ధతకీడీ గ్రామంలో ఒక ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి పెద్దకు మెలకువ వచ్చింది. గ్రామస్థులు తబ్రేజ్‌ను పట్టుకున్నారు. ఇద్దరు కుర్రాళ్లు తప్పించుకున్నారు" అని డీజీపీ చెప్పారు.

తీవ్రంగా కొట్టడం వల్లే తబ్రేజ్‌ చనిపోయారని, అయితే, ప్రస్తుతానికి ఇది మూక హత్యలా కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేసుకు సంబంధించిన అన్ని వీడియోలను పరిశీలనకు పంపించామని తెలిపారు.

Image copyright SARTAJ ALAM
చిత్రం శీర్షిక తబ్రేజ్ అన్సారీని కొడుతున్న వీడియో వైరల్ అయ్యింది

’ముందు వైద్యం అందించాలని కోరాం’

తాము జూన్ 18 ఉదయం సరాయ్‌కేలాలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పుడు తబ్రేజ్‌ లాకప్‌లో ఉన్నాడని సమీప బంధువు మసూర్ ఆలం బీబీసీతో చెప్పారు. "అప్పుడు అతని పరిస్థితి దారుణంగా ఉంది. అతనికి ముందు వైద్యం అందించాలని, ఆ తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ బిపిన్ బిహారీ సింగ్‌ను అడిగాను. కానీ, తబ్రేజ్‌ను అదే స్థితిలో జైలుకు పంపించారని మాకు తర్వాత తెలిసింది" అని ఆయన వెల్లడించారు.

జూన్ 19న తాము జైల్లో తబ్రేజ్‌ను కలిశామని, అతడి పరిస్థితి చాలా దారుణంగా ఉందని మసూర్ ఆలం చెప్పారు. ఇద్దరు పోలీసులు అతడిని బలవంతంగా తమ వద్దకు తీసుకొచ్చారని, అతడు మాట్లాడే పరిస్థితిలో కూడా లేడని తెలిపారు. "మేం మళ్లీ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ బిపిన్ బిహారీ సింగ్‌తో మాట్లాడాం. తబ్రేజ్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆయన్ను కోరాం. కానీ, ఆయన అంగీకరించలేదు. జైలు రెసిడెంట్ డాక్టర్ పీకే పాటిని కలుద్దామని ప్రయత్నించాం. కానీ కలవలేకపోయాం" అని వివరించారు.

తబ్రేజ్‌ పరిస్థితి క్షీణించిందని, అతడ్ని సిటీ ఆస్పత్రికి తీసుకొస్తున్నారని జూన్ 22న తమకు తెలిసిందని మసూద్ ఆలం చెప్పారు. "మేం ఉదయం ఏడున్నరకు ఆస్పత్రికి చేరుకున్నాం. అక్కడ తబ్రేజ్‌ మృతదేహం తెల్లటి వస్త్రంలో చుట్టి ఉంది" అని తెలిపారు.

Image copyright ANAND DUTTA

పోలీసుల నిర్లక్ష్యం లేదన్న డీజీపీ

తబ్రేజ్‌ నుంచి పోలీసులు ఒక మోటర్‌బైక్, పర్సు, మొబైల్ ఫోన్, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు కేసును విచారిస్తున్న ఎస్‌డీపీవో అవినాశ్ కుమార్ బీబీసీతో చెప్పారు.

కేసులో ఎక్కడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని డీజీపీ చెప్పారు.

పోలీసు అధికారులు చంద్రమోహన్ ఉరవ్‌, బిపిన్ బిహారీ సింగ్‌ మూక దాడి గురించి సీనియర్ అధికారులకు తెలియజేయలేదనే కారణం మీద సస్పెండ్ అయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

చైనాలో అదృశ్యమైన వీగర్ ముస్లిం ప్రొఫెసర్‌ ఏమయ్యారు?

ఏడేళ్ల వయసులో నాపై జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్ల వయసులో ఎందుకు బయటపెట్టానంటే...

రెడ్డి సుభానా: "మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి" అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు

IND Vs SA రెండో టెస్టు: ఇన్నింగ్స్ 137 పరుగులతో భారత్ విజయం

కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు

హాగిబిస్‌ పెనుతుపాను: అతలాకుతలమైన జపాన్, 18 మంది మృతి, నీట మునిగిన బుల్లెట్ రైళ్లు

నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి

నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్‌ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా