చంద్రబాబు నివసిస్తున్న ఇంటినీ కూల్చేసే అవకాశం.. వేరే ఇంటికి మారిపోవటం గౌరవప్రదం: మాజీ సీఎంకు పార్టీ నేతల సూచన - ప్రెస్‌రివ్యూ

  • 27 జూన్ 2019
Image copyright @TDP

కృష్ణా కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టిన నేపథ్యంలో ఆ పక్కనే తాను నివాసం ఉంటున్న భవనాన్ని కూడా కూల్చేసే పరిస్థితి వస్తే ఏం చేయాలనే అంశంపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారని ’సాక్షి’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం టీడీపీ నాయకులతో సమావేశమైన ఆయన ప్రజావేదిక కూల్చివేత, తదనంతర పరిణామాలపై చర్చించారు.

చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు కూడా అక్రమంగా నిర్మించిందేనని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో దాన్ని కూడా కూల్చివేసే అవకాశం ఉందని పలువురు నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది.

ఈ భవనానికి సంబంధించిన అనుమతుల వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజావేదికను కూల్చినంత సులభంగా దీని వద్దకు రాలేదని కొందరు నేతలు పేర్కొన్నారు. కొందరు నేతలు మాత్రం అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేసేలా ముఖ్యమంత్రి మాట్లాడిన నేపథ్యంలో చంద్రబాబు నివాసం ఉన్న ఇంటిని కూడా కూల్చివేసే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు అక్రమంగా నివాసం ఉంటున్న ఇంటి విషయంలో విజ్ఞతతో వ్యవహరించాలని పలువురు మంత్రులు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు సూచించడంపైనా చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై రాద్ధాంతం చేయకుండా గౌరవప్రదంగా వేరే ఇంటికి మారిపోతే బాగుంటుందని కొందరు నాయకులు అభిప్రాయపడగా అలా చేస్తే చంద్రబాబు తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లవుతుందని మరికొందరు అన్నట్లు తెలిసింది.

చివరికి చంద్రబాబు ఇల్లు మారిపోతేనే మంచిదనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేశారు. ప్రజావేదికను ప్రభుత్వం కక్షపూరితంగానే కూల్చివేసిందని ప్రచారం చేయాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. అయితే అదే సమయంలో దీనిపై ఎక్కువగా స్పందించరాదని, లేదంటే అక్రమ కట్టడాల కూల్చివేతను వ్యతిరేకించినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది.

Image copyright Google

పోలవరం నుంచి శ్రీశైలం - ఏపీ-తెలంగాణ ఉమ్మడి సారథ్యంలో భారీ ఎత్తిపోతల పథకం?

తెలంగాణ రాష్ట్రం చేపట్టిన కాళేశ్వరం బహుళదశ ఎత్తిపోతల పథకం తరహాలో ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణల ఉమ్మడి సారథ్యంలో మరో భారీ ఎత్తిపోతల పథకం రూపు దిద్దుకుంటోందని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. పోలవరం నుంచి కృష్ణా నదిని చేరుకునే గోదావరి జలాలను పలు దశల్లో ఎగువకు ఎత్తిపోయడం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టును నింపాలన్నది ఈ పథకం ఉద్దేశం. నదిని ఆధారం చేసుకుని రివర్స్‌ పంపింగ్‌లో నీటిని మళ్లించడానికి వీలైన పద్ధతులను పరిశీలిస్తున్నారు.

ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయంతో పాటు భూ సేకరణ వంటి సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా కొత్తగా కేవలం రెండు పంపింగ్‌ కేంద్రాలను నిర్మించి పోలవరం నుంచి గోదావరి నీటిని పులిచింతల, నాగార్జునసాగర్‌ల మీదుగా శ్రీశైలం వరకూ తీసుకెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు.

కృష్ణా బేసిన్‌లో నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని గోదావరి నీటిని మళ్లించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ భావిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 28న ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించే విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకోసం గతంలో ఉన్న పలు ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు. వాటితో పాటు కొత్త ప్రతిపాదనలను కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఇద్దరు సీఎంల సమావేశంలో వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో అమలుచేస్తున్న ''నదిలోనే దిగువ నుంచి ఎగువకు నీటి పంపింగ్‌'' విధానాన్ని ఇటు కృష్ణాలోనూ చేపడితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనపై అధికారులు కసరత్తును మొదలు పెట్టినట్టు సమాచారం. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం పోలవరం నుంచి గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌లోని దిగువ ప్రాంతానికి తరలించి, అక్కడి నుంచి లిప్టుల ద్వారా శ్రీశైలంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణాలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన ఇప్పటికే ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పోలవరం కుడికాలువను నిర్మించారు. ప్రస్తుతం ఈ కాల్వను ఆధారం చేసుకుని ఏపీ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా నీటిని కృష్ణా డెల్టాకు తీసుకువస్తున్నది.

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే, ఇదే కాల్వ ద్వారా నీటిని గ్రావిటీ ఆధారంగానే కృష్ణాలోకి తీసుకురావచ్చు. ఇలా దిగువ కృష్ణలోకి వచ్చిన గోదావరి నీటిని ఎగువన శ్రీశైలం వరకూ తరలించవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకోసం మధ్యలో రెండు లిప్టులను ఏర్పాటు చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు.

ఇందుకోసం ప్రకాశం బరాజ్‌కు ఎగువన కృష్ణా నదిపై వైకుంఠాపురం వద్ద బరాజ్‌ను నిర్మించి, గోదావరి జలాలు అందులోకి చేరుకునేట్లు ఏర్పాటు చేస్తారు. రెండు లిఫ్ట్‌లతో గోదావరి నీటిని పులిచింతల ప్రాజెక్టులోకి తీసుకెళ్లవచ్చని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. పులిచింతలకు చేరిన గోదావరి నీటిని నాగార్జున సాగర్‌ దిగువన టెయిల్‌పాండ్‌ దగ్గర ఇప్పటికే ఉన్న రివర్స్‌ పంపింగ్‌ లిఫ్ట్‌ ద్వారా నేరుగా నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌లోకి పంపింగ్‌ చేయవచ్చని చెబుతున్నారు.

సాగర్‌లోకి వచ్చిన నీటిని కొంత మట్టం మేర నిల్వ చేస్తే శ్రీశైలం దిగువన రివర్స్‌ పంపింగ్‌ యూనిట్‌ వరకూ నీరు వస్తుంది. అక్కడి నుంచి ఏకంగా శ్రీశైలంలోకి రివర్స్‌ పంపింగ్‌ చేయొచ్చు. సాగర్‌, శ్రీశైలంల వద్ద కొత్తగా ఎలాంటి పంప్‌హౌజ్‌లను నిర్మించకుండానే ప్రస్తుతం ఉన్న పంపుల ద్వారా నీటిని ఎగువకు తీసుకెళ్లడానికి వీలుంది.

మొత్తం ప్రాజెక్టులో కొత్తగా రెండు పంప్‌హౌజ్‌లు మాత్రమే అవసరం అవుతాయి. ఈ ప్రతిపాదనలను ఆచరణలోకి తీసుకువస్తే భూ సేకరణ సమస్యను అధిగమించడమే కాకుండా, తక్కువ ఖర్చుతో గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌లోకి తీసుకురావడానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్రం మీదుగా సాగర్‌లోకి లేదా శ్రీశైలంలోకి తీసుకెళ్లాలన్న ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉన్నాయి. ఇదే నిజమైతే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన దుమ్ముగూడెం-సాగర్‌ టెయిల్‌ పాండ్‌ ప్రాజెక్టుకు కొంత అటూ ఇటూగా కొత్త ప్రాజెక్టు రూపుదిద్దుకొనే అవకాశం ఉంది.

Image copyright Siasat

ఎర్రమంజిల్‌ను కూల్చొద్దు: ‘సేవ్ ఎర్రమంజిల్’ ప్రతినిధుల వినతి

హైదరాబాద్‌ నగరంలోని ప్రతిష్టాత్మక ఎర్రమంజిల్‌ను కూల్చివేసి.. దాని స్థానంలో నూతన అసెంబ్లీని నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించటం పట్ల సేవ్‌ ఎర్రమంజిల్‌ సంస్థ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారని ‘నవ తెలంగాణ’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు ఎర్రమంజిల్ ఒక చిహ్నంలాంటిదనీ, ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అనీ వారు పేర్కొన్నారు. కేసీఆర్‌ తన నిర్ణయాన్ని పున:పరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎర్రమంజిల్‌ను నిర్మించిన నవాబ్‌ ఫక్రుల్‌ ముల్క్‌ వారసులు బుధవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బేగం ఫాతిమా సెనాజ్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరంలోని అనేక చారిత్రాత్మక, ప్రతిష్టాత్మక కట్టడాల్లో ఎర్రమంజిల్‌ ఒకటని తెలిపారు. అది ఇక్కడి ప్రజల సంపదని చెప్పారు.

ప్రస్తుతమున్న సచివాలయం, అసెంబ్లీ భవనాలకు దాదాపు 50 ఏళ్లపాటు ఢోకా ఉండబోదంటూ ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నప్పటికీ పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు. ప్రజల పన్నుల ద్వారా వచ్చిన డబ్బుతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టటమేంటని ప్రశ్నించారు.

సోషలిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ లుబ్నా షుర్వాత్‌ మాట్లాడుతూ.. దేశంలోని వారసత్వ కట్టడాలను పరిరక్షించాలంటూ రాజ్యాంగం చెబుతుండగా, అందుకు విరుద్ధంగా కేసీఆర్‌ వ్యవహరించటం దారుణమన్నారు. ఏ ప్రాతిపదికన ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీని కూల్చబోతున్నారని ప్రశ్నించారు.

వీటిని నూతనంగా నిర్మించేందుకు వీలుగా ఫైనాన్స్‌ ఎస్టిమేషన్స్‌, (నిధుల వివరాలు, ప్రతిపాదనలు), కాస్ట్‌ బెనిఫిట్‌ రిపోర్టు (నిర్మాణాల వల్ల ఒనగూరే ప్రయోజనాలు)లను తయారు చేశారా..? అని నిలదీశారు. వీటిని ప్రజల ముందు ఉంచకుండానే కూల్చివేతలు, శంకుస్థాపనలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు.

వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో 2010లో ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చారని ఆమె తెలిపారు. అయితే 2017లో తెలంగాణ సర్కారు ఆ జీవోను సవరించిందన్నారు. అయిప్పటికీ హెచ్‌ఎమ్‌డీఏ, జీహెచ్‌ఎమ్‌సీ, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుమతులు లేనిదే వారసత్వ కట్టడాలు కూల్చటానికి లేదని వివరించారు.

ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి.. దాని ప్రకారమే కూల్చివేయాలా? వద్దా...? అనే అంశాలను తేల్చాల్సి ఉంటుందని వివరించారు. ఇలాంటివేవీ లేకుండానే ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నదని విమర్శించారు.

కేసీఆర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేపడతారని అడగ్గా... 'మేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేయబోం, కోర్టులకు వెళ్లబోం, వ్యతిరేకంగా మాట్లాడబోం.. కానీ కేసీఆర్‌కు గౌరవప్రదంగా అప్పీల్‌ చేస్తున్నాం...' అని వారు సమాధానమివ్వటం గమనార్హం.

విలేకరుల సమావేశంలో నవాబ్‌ ఫక్రుల్‌ ముల్క్‌ వారసులు నవాబ్‌ సయ్యద్‌ అలీ షాహేయర్‌, నవాబ్‌ నూరి ముజ్ఫర్‌ హుస్సేన్‌, షెహఫత్‌ అలీఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగాలు Image copyright Getty Images

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.84 లక్షల ఖాళీలు

ఓ వైపు ఉద్యోగాలు కల్పించడం లేదంటూ విపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.84 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించిందని 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది. త్వరలోనే వీటిని భర్తీ చేస్తామని తెలిపినట్లూ చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. ''అన్ని విభాగాల్లో కలిపి 38.02 లక్షల ఉద్యోగాలు ఉండగా.. వీటిల్లో మార్చి 1, 2018 నాటికి 31.18 లక్షల పోస్టులను భర్తీ చేశాం. ఇంకా 6.84 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఉద్యోగుల పదవీ విరమణ, మరణాలు, ప్రమోషన్లు తదితర కారణాలతో ఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. సంబంధిత శాఖలు, విభాగాల నియామక నిబంధనలకు అనుగుణంగా ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తాం'' అని సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

అంతేగాక.. 2019-21 నాటికి 1,03,266 పోస్టులను భర్తీ చేయాలనే లక్ష్యంతో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

అటు రైల్వే శాఖ కూడా ఇప్పటికే పలు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు జితేంద్ర సింగ్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. వచ్చే రెండేళ్లలో మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)