ఏడీఆర్ నివేదిక: ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో 17మందిపై క్రిమినల్ కేసులు.. అత్యంత సంపన్నుడు ముఖ్యమంత్రి జగన్

  • 28 జూన్ 2019
ఏపీ సీఎం జగన్ Image copyright Facebook/YS Jagan Mohan Reddy
చిత్రం శీర్షిక అత్యధికంగా ముఖ్యమంత్రి జగన్‌కు రూ.510.38 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో 65 శాతం మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని 'అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)' నివేదిక తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సహా కేబినెట్‌లో 26 మంది ఉండగా, వీరిలో 17 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పింది.

ఈ లెక్క ప్రకారం దాదాపు మూడింట రెండొంతుల మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.

క్రిమినల్ కేసులున్న 17 మందిలో ముఖ్యమంత్రి జగన్ సహా తొమ్మిది మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని నివేదిక తెలిపింది. కేబినెట్‌లో 35 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పింది.

కేబినెట్‌లోని 26 మంది ఎన్నికల అఫిడవిట్లపై ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ వాచ్, ఏడీఆర్ విశ్లేషణ జరిపినట్లు ఏడీఆర్ చెప్పింది.

మంత్రివర్గంలో కోటీశ్వరులు ఎంత మంది ఉన్నారు? ఆస్తుల సగటు ఎంత? క్రిమినల్ కేసులు ఎంత మందిపై ఉన్నాయి? మంత్రుల్లో మహిళలు ఎంత మంది ఉన్నారు? మంత్రుల్లో ఎవరి విద్యార్హతలు ఏమిటనే వివరాలను ఏడీఆర్ తన నివేదికలో పొందుపరిచింది.

Image copyright Twitter/Andhra Pradesh CM
చిత్రం శీర్షిక జూన్ 11న మంత్రివర్గ సమావేశం

2014 నాటి కేబినెట్‌లో 18 మంది మంత్రుల అఫిడవిట్లను విశ్లేషించగా, 10 మందిపై అంటే 56 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఈ 10 మందిలో నలుగురిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పింది. (తర్వాత మంత్రివర్గ విస్తరణతో మంత్రుల సంఖ్య పెరిగింది.)

2014 కేబినెట్‌లో 22 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని నివేదిక వివరించింది.

2014 కేబినెట్‌తో పోలిస్తే 2019 కేబినెట్‌లో తీవ్రమైన క్రిమినల్ కేసులున్న మంత్రుల సంఖ్య 13 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక చెబుతోంది.

"భారత్‌లో నేరమయ రాజకీయాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూనే ఉన్నా, ఇవి పెరగడమేగాని తగ్గడం లేదు. క్రిమినల్ కేసులు ఉన్న వారి సంఖ్య చట్టసభల్లో ప్రతిసారి పెరుగుతూనే ఉంది. ఇది ఆందోళనకరమైన విషయం" అని సీనియర్ జర్నలిస్టు జింకా నాగరాజు బీబీసీతో అన్నారు.

"2014లో నేషనల్ ఎలక్షన్ వాచ్‌తోపాటు 1,200 స్వచ్ఛంద సంస్థలతో కలిసి అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి, మామూలు అభ్యర్థుల కంటే నేరచరితులకు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఏడీఆర్ గుర్తించింది" అని ఆయన చెప్పారు.

లాలూ ప్రసాద్ యాదవ్, ఓం ప్రకాశ్ చౌతాలా వంటి అతి కొద్ది మందిని మినహాయిస్తే కేసుల్లో శిక్షలు పడి, జైలుకు వెళ్లడం వల్ల ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోయిన నేతలు లేరని నాగరాజు చెప్పారు. రాజకీయాల్లో నేరచరితుల సంఖ్య తగ్గకపోవడానికి ఈ పరిస్థితి ఒక ప్రధాన కారణమన్నారు.

Image copyright Twitter/@peddireddyysrcp
చిత్రం శీర్షిక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అత్యధిక ఆస్తులు ఎవరికి ఉన్నాయి?

ప్రస్తుత కేబినెట్ సభ్యుల ఆర్థిక స్థితి విషయానికి వస్తే 26 మందిలో 23 మంది అంటే 88 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరందరి ఆస్తుల సగటు రూ.35.25 కోట్లుగా ఉంది.

ఏడీఆర్ నివేదిక ప్రకారం-

2014 మంత్రిమండలిలో కోటీశ్వరులు 89 శాతం మంది ఉన్నారు. వీరి ఆస్తుల సగటు రూ.22.4 కోట్లు.

ప్రస్తుత కేబినెట్‌లో అందరికన్నా ఎక్కువగా ముఖ్యమంత్రి జగన్‌కు రూ.510.38 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

ఆయన తర్వాతి స్థానంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ తర్వాతి స్థానంలో మేకపాటి గౌతమ్ రెడ్డి ఉన్నారు.

రామచంద్రారెడ్డికి రూ.130.97 కోట్లు, గౌతమ్ రెడ్డికి రూ.61.95 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

Image copyright Facebook/Avanthi Srinivasa Rao
చిత్రం శీర్షిక ముత్తంశెట్టి శ్రీనివాసరావు

అప్పుల విషయానికి వస్తే- మంత్రులు రామచంద్రారెడ్డి, చెరుకువడ శ్రీరంగనాథరాజు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్)లకు అత్యధికంగా అప్పులు ఉన్నాయి.

రామచంద్రారెడ్డికి రూ.20.38 కోట్లు, శ్రీరంగనాథరాజుకు రూ.12.24 కోట్లు, ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు రూ.5.04 కోట్ల అప్పులు ఉన్నాయి.

మహిళా ప్రాతినిధ్యం

ప్రస్తుత మంత్రిమండలిలో ముగ్గురు మహిళలు (12 శాతం మంది) ఉన్నారు.

2014 కేబినెట్‌లో 18 మంది కేబినెట్ సభ్యులకుగాను ముగ్గురు అంటే 17 శాతం మంది మహిళలు ఉన్నారని ఏడీఆర్ నివేదిక తెలిపింది.

దేశంలో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సి ఉందని, చాలా సందర్భాల్లో కేబినెట్‌లో మహిళలే ఉండటం లేదని నాగరాజు చెప్పారు. మహిళల ప్రాతినిధ్యం బాగా పెరగాలని, అప్పుడు రాజకీయాల్లో నేరచరితుల సంఖ్య కూడా తగ్గుతుందని తెలిపారు.

రాజకీయ ప్రక్షాళన జరిగితేనే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని ఆయన చెప్పారు.

విద్యార్హతలు

26 మంది మంత్రివర్గ సభ్యుల్లో ఎనిమిది మంది అంటే 31 శాతం మంది విద్యార్హత ఎనిమిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఉందని నివేదిక తెలిపింది.

18 మంది అంటే 69 శాతం మంది గ్రాడ్యుయేట్ లేదా అంతకన్నా ఎక్కువ చదివారు.

వయసు లెక్కల ప్రకారం చూస్తే- 12 మంది అంటే 46 శాతం మంది వయసు 31 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంది.

మిగతా 14 మంది అంటే 54 శాతం మంది వయసు 51 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం