వైఎస్ జగన్ సర్కారుపై చంద్రబాబు విమర్శలు: ‘వసూళ్ల కోసమే హల్‌చల్‌.. అభివృద్ధి వదిలేసి కక్ష సాధింపు’ - ప్రెస్ రివ్యూ

  • 28 జూన్ 2019
చంద్రబాబునాయుడు Image copyright TDP

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై (పీపీఏ) సమీక్ష పేరిట వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న హడావుడి వసూళ్ల కోసమేనని విపక్ష తెలుగుదేశం ఆరోపించినట్లు 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ కూడా అచ్చం ఇలాగే చేశారని... పీపీఏలు సమీక్షించి ధరలు తగ్గిస్తామంటూ టీడీపీపై బురద చల్లి వసూళ్లు చేసుకున్నారని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌ కూడా అదే బాటలో పయనిస్తున్నారని విమర్శించింది.

గురువారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ నేతల సమావేశం జరిగింది. జగన్‌ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేసి... రాజకీయ కక్ష సాధింపు పైనే దృష్టి పెట్టిందని చంద్రబాబు విమర్శించారు.

'గత ఐదేళ్లలో మనం పారదర్శక పాలన అందించాం. జాతీయంగా, అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్ఠ పెంచాం. కొత్త ప్రభుత్వం దానికి కొనసాగింపుగా పెట్టుబడులు తేవడం, పరిశ్రమలు స్థాపించడం, యువతకు ఉపాధిని కల్పించకపోవడంపై దృష్టి పెట్టకపోవడం బాధాకరం' అని పేర్కొన్నారు.

పీపీఏలపై సమీక్షలు వద్దని, అలాగైతే పెట్టుబడులు రావని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి లేఖ రాసినా జగన్‌ పట్టించుకోవడంలేదని.. తన హయాంలో కొత్త పెట్టుబడులు తెచ్చే పనిపై శ్రద్ధ పెట్టకుండా వచ్చిన పెట్టుబడులను కూడా పోగొడుతున్నారని ఆయన విమర్శించారు.

జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఉద్దేశపూర్వకంగా అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, ఇక్కడకు వచ్చిన సంస్ధల వల్ల రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరిగాయని.. కొత్త ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే వాటి ధరలు పడిపోయాయని వారు పేర్కొన్నారు.

తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసినందుకు రావాల్సిన రూ. ఐదు వేల కోట్ల బకాయిలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అనేకసార్లు కలుస్తున్న జగన్‌ ఈ బకాయిలు వసూలుపై శ్రద్ధ పెట్టడం లేదని సమావేశం విమర్శించింది.

Image copyright Getty Images

మరాఠా రిజ్వేషన్లకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌... కోటా తగ్గింపు

మరాఠా రిజర్వేషన్లకు బాంబే హైకోర్టు గురువారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని, కానీ రిజర్వేషన్‌ కోటా శాతాన్ని కొంతమేర తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని ‘సాక్షి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో , విద్యాసంస్థల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత ఏడాది నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ బిల్లుకు ఆమోదం తెలిపింది.

మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన పిటిషనర్లు.. ఇది రిజ్వరేషన్లు 50 శాతానికి మించి పెంచరాదనే సుప్రీం తీర్పుకు విరుద్ధమని హైకోర్టును ఆశ్రయించారు.

ఈ రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారించిన జస్టిస్‌ రంజిత్‌ మోర్‌, భారతి డాంగ్రేలతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది.

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినవారిని ప్రత్యేక వర్గంగా ఏర్పాటు చేయడానికి, వారికి రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం శాసన అధికారం కలిగి ఉందని ధర్మాసనం తెలిపింది. మరాఠాలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 16 శాతం రిజర్వేషన్లను, రాష్ట్ర బీసీ కమిషన్‌ సిఫార్సుల మేరకు 12 లేదా 13 శాతానికి తగ్గించాలని ఆదేశించింది.

Image copyright Getty Images

చెల్లింపుల సేవలకు వాట్సాప్‌ సిద్ధం!

ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌, డిజిటల్‌ చెల్లింపుల సేవలకు సిద్ధమైందని.. ఇందుకోసం ఇప్పటికే దేశీయంగా డేటా నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని ‘ఈనాడు’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

అంతర్జాతీయ చెల్లింపుల సంస్థలు, దేశీయ పౌరుల ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని భారత్‌లోనే నిల్వ చేయాలని రిజర్వు బ్యాంక్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో వాట్సాప్‌ కూడా స్థానికంగా డేటా నిల్వ కేంద్రం ఏర్పాటు చేయక తప్పలేదు. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ఆధారిత సేవలను వాట్సాప్‌ అందించనుంది.

అనంతరం యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐల ద్వారా సేవలు విస్తరించనుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. 'స్థానికంగా డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని వాట్సాప్‌ పూర్తిచేసింది. ఇప్పుడు ఆడిట్‌ ప్రక్రియ నడుస్తోంది. నియంత్రణ సంస్థకు ఆడిటర్లు నివేదిక సమర్పించగానే, కంపెనీ చెల్లింపుల సేవలను మొదలుపెడుతుంది' అని తెలిపారు.

భారత్‌లో డేటా నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ఆడిట్‌ నివేదిక అందజేయాలని ఆర్‌బీఐ పేమెంట్స్‌ కంపెనీలను ఆదేశించింది. ఈ ఆడిట్‌ను ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జన్సీ రెస్పాన్స్‌ టీమ్‌, సెర్ట్‌-ఇన్‌లతో కూడిన ఆడిటర్లు నిర్వహించాలి. దీనిపై స్పందించడానికి కొత్తగా ఏమీ లేదని వాట్సాప్‌ వెల్లడించింది. నేషనల్‌ పేమెంట్‌ కౌన్సిల్‌ కూడా స్పందించడానికి నిరాకరించింది.

ఏడాది క్రితమే వాట్సాప్‌ చెల్లింపు సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అయితే డేటా నిల్వపై ఆర్‌బీఐ ఆదేశాలు, వాట్సాప్‌ను వినియోగించుకుని తప్పుడు వార్తలు విస్తృతంగా ప్రచారం జరగడంపై ఆందోళనల వంటివి ప్రభావం చూపాయి.

Image copyright Thinkstock

స్విస్ బ్యాంకుల్లో క్షీణించిన భారతీయుల సంపద

పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలుగా విరాజిల్లుతున్న స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము గతేడాది రికార్డు స్థాయికి పడిపోయిందని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. భారతీయులు, భారతీయ సంస్థల నగదు నిల్వలు నిరుడు దాదాపు 6 శాతం దిగజారాయని గురువారం స్విస్ నేషనల్ బ్యాంక్ వెల్లడించిన వివరాలు చెబుతున్నాయి.

2018లో 954.71 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ (దాదాపు రూ. 6,757 కోట్లు)కు పరిమితమయ్యాయి. భారత్ ఆధారిత శాఖల ద్వారా వచ్చిన సొమ్ము కూడా ఉన్నా.. స్థూల సంపద క్షీణించడం విశేషం. గడిచిన రెండు దశాబ్దాలకుపైగా కాలంలో ఇది రెండో అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.

1995లో 723 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ ఉన్నట్లు తేలింది. మళ్లీ ఆ తర్వాత ఇదే కనిష్ఠం. 1987లో మాత్రం 675 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్‌గా నమోదైంది. ఇదే ఎప్పటికీ కనిష్ఠంగా ఉన్నది. నిజానికి 2017లో 50 శాతం పెరిగి రూ. 7,000 కోట్లను తాకింది. అంతకుముందు వరుసగా మూడేండ్లు తగ్గుతూనే రాగా, 2017లో మాత్రం పెరుగడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అయితే మళ్లీ 2018లో తగ్గినట్లు తాజా గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది.

2006లో స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల సంపద రూ. 23,000 కోట్లుగా నమోదైంది. ఇదే అత్యంత గరిష్ఠ స్థాయి.

స్విస్ బ్యాంకుల్లోకి అన్ని దేశాల నుంచి వచ్చే సొమ్ము కూడా తగ్గుముఖం పట్టింది. 2018లో 1.4 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్ (సుమారు రూ. 99 లక్షల కోట్లు)లుగానే ఉన్నది. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ దేశస్తుల సంపద నిరుడు 33 శాతం తగ్గగా, 744 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 5,300 కోట్లు)గా ఉన్నది.

నల్లధనంపై పోరును ప్రారంభించిన మోదీ సర్కారు స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో సమాచార మార్పిడి ఒప్పందాన్ని చేసుకున్నది. ఇది 2018 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చింది. ఇప్పటికే నల్లధనం కుబేరుల వివరాలను స్విట్జర్లాండ్ ప్రభుత్వం విడుతలవారీగా కేంద్రానికి అప్పజెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది భారతీయుల సంపద స్విస్ బ్యాంకుల్లో మరింతగా తగ్గవచ్చన్న అంచనాలున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)