అనంతపురం కాలేజీ వైరల్‌ వీడియో: ప్రేమించిన అమ్మాయి భర్త చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్న యువకుడు

  • 30 జూన్ 2019
అనంతపురం ఘటన Image copyright UGC

రెండుమూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన వారంతా ఏమిటీ ఘోరం అనుకుంటూ ఆవేదనకు లోనయ్యారు.

ఎంతోమందిని కలచివేసిన ఆ వీడియోలో... కాలేజీ మైదానంలో బోర్లా పడి ఉన్న ఓ విద్యార్థి చుట్టూ మరికొందరు యువకులు గుమిగూడి బెల్టులు, రాళ్లతో కొట్టడం... కాళ్లతో తన్నడం.. ఎగిరి మెడపైన దుమకడం కనిపించింది.

అత్యంత పాశవికమైన ఆ ఘటన ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలో పట్టపగలు చోటుచేసుకున్న ఘటన అది.

అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జూన్ 25 మధ్యాహ్నం 2.30 జరిగిన ఈ సంఘటన శుక్రవారం వరకు బయటకు రాలేదు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు శుక్రవారం రాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. శనివారం మధ్యాహ్నం ఈ కేసుకు సంబంధించి అయిదుగురిని అరెస్ట్ చేశారు.

చిత్రం శీర్షిక గాయపడిన శివ

ఎందుకిలా కొట్టారు.. వీరంతా ఎవరు?

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోతో పాటు రకరకాల కథనాలూ ప్రచారమయ్యాయి. అనంతపురం డిగ్రీ కాలేజీ విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ అని.. విద్యార్థుల మధ్య కులాల గొడవలంటూ భిన్న కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు 'బీబీసీ' అనంతపురం వెళ్లింది. బాధిత విద్యార్థి, కాలేజీ ప్రిన్సిపల్, పోలీసులు అందరితో మాట్లాడింది. ఆ విద్యార్థి ఎవరు.. ఎందుకు ఆయన్ను కొట్టారు వంటి వివరాలన్నీ తెలుసుకుంది.

చిత్రం శీర్షిక అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్

అమ్మాయి కోసమే ఈ గొడవ: పోలీసులు

సంచలనంగా మారిన ఈ వీడియోలో దాడికి గురైన యువకుడి పేరు ఉప్పుటూర్ల శివ అలియాస్ శివయ్య అని పోలీసులు తెలిపారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

భరత్ కృష్ణ అలియాస్ భార్గవ్ అనే ఓ యువకుడు, ఆయన స్నేహితులు అనిల్, కుమార్, పవన్‌ కలిసి శివపై దాడి చేశారని చెప్పారు.

పోలీసుల కథనం ప్రకారం... ''ప్రేమించిన అమ్మాయి తనని కాదని మరొకరిని పెళ్లి చేసుకోవడంతో ఆ అమ్మాయిపై పగ సాధించేందుకు శివ ఆమెకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. దీంతో ఆమె భర్త భరత్ తన స్నేహితులు అనిల్, కుమార్, పవన్‌లతో కలిసి దాడి చేశాడు. ఇందుకోసం తనకు, శివకు ఇద్దరికీ స్నేహితుడైన రాజేశ్‌ను ఉపయోగించుకున్నాడు భరత్. ఆర్ట్స్ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్న రాజేశ్ ద్వారా ఆ కాలేజీ మైదానానికి శివను పిలిపించి అక్కడ ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా కొట్టారు''.

చిత్రం శీర్షిక ప్రిన్సిపల్ రంగస్వామి

మా విద్యార్థులెవరూ లేరు: ప్రిన్సిపల్ రంగస్వామి

అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో సుమారు 7 వేల మంది చదువుతున్నారు. అలాంటి చోట మిట్టమధ్యాహ్నం ఇంత గొడవ జరిగితే కాలేజీ యాజమాన్యానికి, సిబ్బందికి తెలియలేదా అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.

ఇదే విషయాన్ని కాలేజీ ప్రిన్సిపల్ రంగస్వామి వద్ద ప్రస్తావించగా ఆయన..''ఆ సంఘటనకు మా కాలేజికి ఎలాంటి సంబంధం లేదు. ఆ గొడవలో ఉన్నవారెవ్వరూ మా కాలేజీ విద్యార్థులు కారు. సెక్యూరిటీ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి, సీసీ కెమేరాలూ లేవు. అందుకే మా దృష్టికి ఈ విషయం రాలేద''న్నారు. సాధారణంగా యూనిఫాం, ఐడెంటిటీ కార్డు లేకుండా ఎవరినీ లోనికి రానివ్వరని.. అడ్మిషన్ల సీజన్ కావడంతో బయటివారు వస్తుంటారని.. ఈ గొడవకు కారణమైనవారూ అలాగే రాగలిగారని ఆయన చెప్పారు.

కాగా.. ఈ కాలేజీలో గొడవలు కొత్తేమీ కాదని, గతంలో చాలాసార్లు విద్యార్థుల మధ్య తీవ్రమైన కొట్లాటలు జరిగాయని సతీశ్ అనే విద్యార్థి తెలిపాడు.

చిత్రం శీర్షిక శివ

ఆ అమ్మాయితో మాట్లాడి ఏడాది దాటింది: ఉప్పుటూర్ల శివ

కొట్లాటలో తీవ్రంగా దెబ్బలు తిన్న శివ 'బీబీసీ'తో మాట్లాడుతూ... తనను ఎందుకు కొట్టారో అర్థం కావడం లేదన్నాడు. స్నేహితుడు పిలిచాడని అక్కడకు వెళ్తే భరత్, మరికొందరు కలిసి దాడి చేసి కొట్టారని చెప్పాడు.

భరత్ భార్యతో తాను మాట్లాడి ఏడాది దాటిందని... ఇటీవల కాలంలో ఆ అమ్మాయితో మాట్లాడలేదని చెప్పాడు. చేయని నేరానికి తనపై దాడి చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

చిత్రం శీర్షిక దాడికి పాల్పడిన అయిదుగురిని శనివారం మధ్యాహ్నం అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు

ఇలాంటివి సహించం: ఎస్పీ

సంచలనంగా మారిన ఈ ఘటనపై అనంతపురం ఎస్పీ సత్యఏసుబాబు 'బీబీసీ'తో మాట్లాడుతూ.. శివ తనను గతంలో ప్రేమించిన యువతికి పెళ్లియినప్పటికీ ఆమెను వేధిస్తున్నాడని.. దీంతో ఆమె భర్త పథకం ప్రకారం శివను రప్పించి కొట్టాడని చెప్పారు. ఒక ప్రభుత్వ కళాశాలలో ఇలాంటి ఘటన జరగడం సరికాదని.. మున్ముందు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)