తెలుగు విద్యార్థికి ఏడాదికి కోటి రూపాయల జీతం - ప్రెస్ రివ్యూ

  • 30 జూన్ 2019
Image copyright Mani Kumar Adari/Facebook

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో 2008-14 సంవత్సరాల మధ్య చదివిన మొదటి బ్యాచ్‌ విద్యార్థి ఆడారి మణికుమార్‌ అమెరికాలోని అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజనీర్‌గా ఏడాదికి రూ. కోటికి పైగా వేతనంతో ఉద్యోగాన్ని సాధించారని 'సాక్షి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. విశాఖ జిల్లా చింతలగ్రహారం గ్రామానికి చెందిన ఆడారి రాము, మీనాక్షి దంపతుల ఏకైక కుమారుడు మణికుమార్‌. ఇతనికి ఇద్దరు తోబుట్టువులు. అదే గ్రామంలోని హైస్కూల్‌లో 2008లో పదో తరగతిలో 600కు గాను 548 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీటు దక్కించుకున్నారు.

చదువుకుంటున్న రోజుల్లోనే ప్రముఖ ప్రోగ్రామింగ్‌ వెబ్‌సైట్లను అనుసరిస్తూ అల్గారిథమ్‌ సమస్యలకు పరిష్కారాలు కనుగొనే నైపుణ్యాన్ని సంపాదించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై పట్టు సాధించారు.

మణికుమార్‌ బీటెక్‌ మూడో సంవత్సరంలో ఉండగానే అమెజాన్‌ మిషన్‌ లెర్నింగ్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మీద ఆసక్తి ఏర్పడటంతో మణికుమార్‌ అదే రంగంలో ఉద్యోగం చేయాలనుకున్నారు.

క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కు వచ్చిన కంపెనీల్లో ఉద్యోగం నచ్చకపోవడంతో ఇంటర్వ్యూలకు హాజరు కాలేదు. బీటెక్‌ పూర్తయిన తర్వాత ఒక స్టార్టప్‌ కంపెనీలో ఏడాదికి రూ. 8 లక్షల వేతనానికి చేరారు. దాన్ని స్నాప్‌డీల్‌ సంస్థ కొనుగోలు చేసింది. కొద్దికాలం అందులో పనిచేసిన అతనికి 2015లో అమెజాన్‌ సంస్థలో అవకాశం వచ్చింది.

అమెజాన్‌కు ఇండియాలో రెండేళ్లు పనిచేశారు. అప్పట్లో ఏడాదికి రూ.18 లక్షల వేతనం అందుకునేవారు. తర్వాత ప్రమోషన్‌తోపాటు అదే కంపెనీకి అమెరికాలో పనిచేసే అవకాశం వచ్చింది. అమెరికాలో ఏడాదికి రూ. 40 లక్షల వేతనంతో ఉద్యోగంలో చేరారు. రెండేళ్లు పనిచేశాక.. ప్రస్తుత వేతనం రూ. కోటి దాటింది.

ఉప్పు Image copyright Getty Images

మన ఉప్పులో 'సైనేడ్‌' ముప్పు!

భారతదేశంలో విక్రయిస్తున్న ఉప్పులో 'సైనేడ్‌' ఉందని అమెరికా నిపుణులు హెచ్చరించినట్లు 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. అన్ని బ్రాండ్‌ల అయోడైజ్డ్‌ ఉప్పులో 'పొటాషియం ఫెర్రోసైనేడ్‌' అనే విషపూరిత రసాయనాన్ని ప్రమాణాలకు మించి కలుపుతున్నట్లు అమెరికన్‌ వెస్ట్‌ అనలిటికల్‌ లాబొరేటరీస్‌ నివేదిక స్పష్టం చేసింది.

దీనిపై గోధుమ్‌ గ్రెయిన్స్‌ అండ్‌ ఫామ్స్‌ ప్రొడక్ట్స్‌ చైర్మన్‌, వినియోగదారుల హక్కుల కార్యకర్త శివ శంకర్‌గుప్తా పెద్ద పోరాటమే మొదలుపెట్టారు.

రసాయనం కలుపుతున్న ఉప్పు నుంచి సామాన్యులను కాపాడటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా తినడానికి ఉపయోగించని ఉప్పును.. దేశ ప్రజలకు అంటగడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

''సాధారణ ఉప్పును బ్లీచ్‌ చేసేందుకు ప్రముఖ కంపెనీలన్నీ పారిశ్రామిక వ్యర్థాల్లో వచ్చే అయోడిన్‌, సైనేడ్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. కేన్సర్‌తోపాటు హై బీపీ, హైపర్‌ థైరాయిడిజం, కిడ్నీ వైఫల్యం, ఊబకాయంతోపాటు లైంగిక సామర్థ్యం తగ్గటం వంటి సమస్యలకు ఈ ఉప్పు దారితీస్తుంది'' అని గుప్తా వివరించారు.

దీని వెనుక భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్‌ ఉందని ఆయన ఆరోపించారు.

అయితే.. గుప్తా ఆరోపణలను టాటా సంస్థ ఖండించింది. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.

''అయోడైజ్డ్‌ ఉప్పులో పొటాషియం ఫెర్రోసైనేడ్‌ కలపడం నిజమే. భారత్‌తోపాటు అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలోనూ ఉప్పులో దీనిని అనుమతిస్తున్నారు. భారత ఆహార, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) నిబంధనల ప్రకారం కిలోగ్రాము ఉప్పులో 10 మిల్లీగ్రాముల (ఎంజీ/కేజీ) పొటాషియం ఫెర్రోసైనేడ్‌ను కలపవచ్చు.

గరిష్ఠంగా 14 ఎంజీ/కేజీ కలిపినా ఎలాంటి ప్రమాదం ఉండదు. బ్రాండెడ్‌ సాల్ట్‌ వినియోగంలో పరిమితులకు లోబడే ఈ రసాయనాన్ని కలుపుతారు. ఈ ఉప్పు సురక్షితమైనది'' అని ఆ ప్రకటనలో పేర్కొంది.

Image copyright Telangana Government

ఆగస్టు 15 నుంచి ఎక్కడైనా రేషన్‌!

వచ్చే ఆగస్టు 15నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, మహారాష్ట్రల్లోని వినియోగదారులు ఎక్కడైనా రేషన్‌ తీసుకొనే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్ర ఆహారం, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ తెలిపారని ‘ఈనాడు’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. మిగిలిన రాష్ట్రాల్లో 2020 జూన్‌ 30కల్లా దేశవ్యాప్తంగా 'ఒకే దేశం.. ఒకే కార్డు' విధానాన్ని సంపూర్ణంగా అమల్లోకి తెస్తామని వెల్లడించారు. దేశంలోని అన్ని రేషన్‌కార్డులను ఆధార్‌ కార్డులతో అనుసంధానించి ఆహారధాన్యాల సరఫరాను పూర్తిగా పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ యంత్రాల ద్వారా విక్రయించే విధానం తుది దశకు వచ్చిందన్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, హరియాణ, ఝార్ఖండ్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌, త్రిపురల్లో 100% పీఓఎస్‌ మిషన్ల ద్వారా ఆహారధాన్యాలు పంపిణీచేస్తున్నట్లు చెప్పారు.

అక్కడి చౌకధరల దుకాణాలు ఇంటర్‌నెట్‌తో అనుసంధానమై ఉండటంతో ఆ రాష్ట్రాల్లోని వినియోగదారులు రాష్ట్రంలో ఎక్కడైనా తమ సరుకులు తీసుకోవచ్చని చెప్పారు.

దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరు వంటి మహానగరాల్లో ఉన్న వలస కార్మికులకు వచ్చే రెండునెలల్లో రేషన్‌ సరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తామన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)