భారత క్రికెట్: బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు?

  • 1 జూలై 2019
1911 లో మొట్టమొదటి భారత క్రికెట్ జట్టు
చిత్రం శీర్షిక మొట్టమొదటి భారత క్రికెట్ జట్టు 1911 మేలో లండన్ బయలుదేరి వెళ్లింది

క్రికెట్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్న ఈ క్రీడ బ్రిటిష్ వాళ్లు యాధృచ్ఛికంగా కనిపెట్టిన భారతీయ క్రీడ.

చారిత్రక వైచిత్రి ఏమిటంటే.. నాడు వలసపాలకుల కులీనులకు మాత్రమే విశిష్టమైనదిగా దాచుకున్న ఈ క్రీడ ఇప్పుడు నాటి వలస దేశ ప్రజలకు ఓ జాతీయ గర్వంగా మారటం.

అంతకన్నా అసాధారణమైన విషయం ఏమిటంటే.. ప్రపంచ క్రికెట్ ఏకైక సూపర్‌పవర్‌గా నేడు భారతదేశం నిలవటం.

నేటి భారతీయులు ఎంతో ఆస్వాదిస్తున్న హోదా ఇది. వీరికి వీరి క్రికెట్ జట్టే దేశం. వీరు 'టీమ్ ఇండియా'ను జాతీయ సమైక్యతకు ఒక చిహ్నంగా పరిగణిస్తారు. ఆ జట్టు క్రీడాకారులను దేశంలో భిన్నత్వానికి ప్రతిబింబంగా భావిస్తారు.

క్రికెట్ దేశం

''ఈ చివరి దశాబ్దంలో భారత జట్టు మునుపటికన్నా ఎంతో ఎక్కువగా మన దేశానికి, విస్తారమైన విభిన్న సంస్కృతుల ప్రజలకు, విభిన్న భాషలు మాట్లాడే వారికి, విభిన్న మతాలు ఆచరించే వారికి, విభిన్న వర్గాల వారికి ప్రాతినిధ్యం వహిస్తోంది'' మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ 2011లో అభివర్ణించారు.

కానీ.. క్రికెట్ క్రీడకు - జాతికి మధ్య సంబంధం సహజంగా పుట్టిందీ కాదు, అనివార్యంగా వచ్చిందీ కాదు.

మొదటి సంపూర్ణ భారత జట్టు 1911 వేసవిలో క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టటానికి.. ఓ పుష్కర కాలం - అంటే పన్నెండేళ్లు శ్రమించాల్సి వచ్చింది. ఆ మధ్యలో మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి కూడా.

ఈ జట్టు తయారైంది ప్రజాబాహుళ్యం భావిస్తున్నట్లు - భారీ హిట్ అయిన హిందీ సినిమా 'లగాన్' ఆ అభిప్రాయాన్ని బలోపేతం చేసినట్లు - బ్రిటిష్ సామ్రాజ్యానికి పోటీగా కాదు. నిజానికి బ్రిటిష్ పాలకులే భారత జట్టును రూపొందించారు.

బ్రిటన్ పత్రికలో మొదటి భారత క్రికెట్ జట్టు వార్త
చిత్రం శీర్షిక మొదటి భారత క్రికెట్ జట్టు.. బ్రిటన్ మీడియాలో చాలా ఆసక్తి రేకెత్తించింది

బ్రిటిష్ గవర్నర్లతో కలిసి పనిచేస్తూ భారత వ్యాపారవేత్తలు, రాచ ప్రభువులు, ప్రచురణకర్తలు, సివిల్ సర్వెంట్లు, పాత్రికేయులు, సైనికులు, ప్రొఫెషనల్ కోచ్‌లతో కూడిన నానావిధ సంకీర్ణం.. క్రికెట్ మైదానంలో భారత జట్టు అనే ఆలోచనకు వాస్తవ రూపం ఇచ్చింది.

ఇప్పుడు 2019 ఐసీసీ ప్రపంచ కప్ పోటీలో విరాట్ కోహ్లీ, అతడి జట్టు బరిలోకి దిగటానికి వందేళ్ల ముందు.. నాటి బ్రిటిష్ సామ్రాజ్యపు బ్రిటన్‌లో ఒక జట్టుకు భారతదేశం ప్రాతినిధ్యం వహించటానికి కారణం.. వలస రాజ్యం, స్థానిక కులీనుల సంకీర్ణమే.

సమ్మోహన రంజీ

ఒక 'భారత' జట్టును రూపొందించే ప్రాజెక్టుకు చాలా సుదీర్ఘమైన, ఒడిదుడుకులతో కూడిన చరిత్ర ఉంది. మొదట 1898లోనే ఈ ఆలోచన ముందుకు వచ్చింది. బ్రిటన్‌ను, విస్తృత బ్రిటష్ ప్రపంచాన్ని తన అద్భుత బ్యాటింగ్‌తో సమ్మోహపరచిన భారత యువరాజు కుమార్ శ్రీ రంజిత్‌సింహ్‌జీ - క్లుప్తంగా 'రంజీ' అద్భుత రాణింపుతో ఈ ఆలోచన వచ్చింది.

భారత క్రికెట్ ప్రొమోటర్లు ఒక టీమ్‌ను తయారు చేయటానికి రంజీకి లభించిన పేరుప్రతిష్టలను ఉపయోగించుకోవాలని భావించారు.

కానీ.. తన క్రికెట్ ప్రతిష్టను నవానగర్ పాలకుడినయ్యేందుకు ఉపయోగించుకున్న రంజీ.. ఈ ప్రాజెక్టు వల్ల తన జాతీయత మీద, ముఖ్యంగా క్రికెట్ మైదానంలో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు గల తన హక్కు మీద ప్రశ్నలు తలెత్తుతాయని ఆందోళన చెందారు.

బ్రిటన్ ప్రభుత్వంలో కొందరు.. ముఖ్యంగా నాటి బాంబే మాజీ గవర్నర్ లార్డ్ హ్యారిస్ వంటి వారు - క్రికెట్ క్రీడలో రంజీ అద్భుత విజయాన్ని అంగీకరించలేకపోయారు. ఆయనను వలస పక్షిగానే పరిగణిస్తూ ఉండేవారు.

నాలుగేళ్ల తర్వాత.. ఓ భిన్నమైన పరిస్థితి నెలకొంది. బ్రిటిష్ ఇండియాలోని యూరోపియన్లు.. క్రికెట్ క్రీడా కేంద్రంగా భారతదేశానికి గల సామర్థ్యాన్ని చాటగల ఒక భారత జట్టును తయారు చేయటానికి స్థానికంగా శక్తివంతులైన కులీనులతో చేయి కలిపారు.

మొదటి భారత క్రికెట్ జట్టు
చిత్రం శీర్షిక మొదటి భారత క్రికెట్ జట్టు 1911లో ససెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్‌‌తో తలపడింది

కానీ, ప్రతిపాదిత జట్టులో తమ ప్రాతినిధ్యానికి సంబంధించి హిందువులు, పార్సీలు, ముస్లింల మధ్య తీవ్ర విభేదాలు నెలకొనటంతో ఆ ప్రయత్నం విఫలమైంది.

అదే తరహాలో 1906లో మళ్లీ ప్రయత్నం చేసినా సఫలం కాలేదు.

1907 - 1909 సంవత్సరాల మధ్య బ్రిటిష్ ఇండియాలో ''విప్లవ'' హింస చెలరేగింది. భారత యువకులు బ్రిటిష్ అధికారులు, వారి స్థానిక భాగస్వాముల మీద దాడులు చేశారు. భారతీయులు తమ దేశంలోకి స్వేచ్ఛగా ప్రవేశించటాన్ని నిరోధించాలంటూ బ్రిటన్‌లో డిమాండ్లు బలపడ్డాయి.

ఆసక్తికర పాత్రలు

ఈ చర్యలతో పుట్టిన ప్రతికూల ప్రచారంతో నిస్పృహ చెందిన నాటి అగ్రస్థాయి వ్యాపారవేత్తలు, ప్రముఖులు, ముఖ్యమైన భారతీయ యువరాజులు.. భారత క్రికెట్ జట్టును లండన్‌కు పంపించాలన్న ప్రాజెక్టును పునరుద్ధరించారు. ఈ చారిత్రక నేపథ్యంలోనే మొదటి ''అఖిల భారత'' క్రికెట్ జట్టు రూపం తీసుకుంది.

సామ్రాజ్య వేదిక మీద భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించటానికి ఎంపికైన వ్యక్తులను చూస్తే.. నమ్మశక్యం కాదు.

ఆ జట్టు కెప్టెన్ పటియాలాకు చెందిన భూపీందర్ సింగ్. నాటి భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సిక్కు రాజ్యానికి మహారాజాగా కొత్తగా పట్టాభిషిక్తుడైన 19 ఏళ్ల యువకుడు.

జట్టులోని మిగతా సభ్యులను మతం ప్రాతిపదికగా ఎంపిక చేశారు. వారిలో ఆరుగురు పార్సీలు, ఐదుగురు హిందువులు, ముగ్గురు ముస్లింలు ఉన్నారు.

పాల్వాంకర్ బాలూ
చిత్రం శీర్షిక మొట్టమొదటి గొప్ప ఇండియన్ క్రికెటర్.. దళితుడైన బౌలర్ పాల్వాంకర్ బాలూ

అయితే, మొట్టమొదటి భారత క్రికెట్ జట్టులో అత్యంత ముఖ్యమైన అంశం.. నాటి బాంబే ప్రెసిడెన్సీ నుంచి ఎంపికైన ఇద్దరు దళితులు. వారే పాల్వాంకర్ సోదరులు - బాలూ - శివరామ్. అగ్ర కుల హిందువుల ప్రతిఘటనను అధిగమించిన వీరిద్దరూ తమ కాలపు టాప్ క్రికెటర్లుగా నిలిచారు.

ఈ జట్టు కూర్పును చూస్తే.. ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలో బ్రిటిష్ ఇండియాలోపల క్రికెట్ ఎన్ని రకాల సాంస్కృతిక, రాజకీయ అర్థాలు ఉన్నాయన్నది తెలుస్తుంది.

పార్సీలకు.. తమ సమాజం క్షీణిస్తుందన్న ఆందోళనలు తీవ్రమవుతున్న దశలో క్రికెట్ మైదానం కొత్త ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. హిందువులు, ముస్లింలు మైదానంలోనూ ఇతర ప్రాంతాల్లోనూ పోటీ పడటం పెరుగుతోంటే.. పార్సీలు తమ స్వీయ పతనం గురించి చింతిస్తుండేవారు.

ఉత్తర భారతదేశపు ముస్లింలకు కూడా.. ఉపఖండంలో బ్రిటిష్ పాలన ప్రతిష్టించిన రాజకీయ శ్రేణితో నూతన సంబంధాలకు క్రికెట్ ఒక రూపం ఇచ్చింది.

మొదటి భారత క్రికెట్ జట్టు సభ్యుల ఆటోగ్రాఫ్‌లు
చిత్రం శీర్షిక 1911 నాటి మొదటి భారత క్రికెట్ జట్టు సభ్యుల ఆటోగ్రాఫ్‌లు

వలస భారతదేశంలో చాలా ముఖ్యమైన విద్యా కార్యక్రమాల్లో క్రికెట్ క్రీడ ఒక ముఖ్యమైన లక్షణం. ముఖ్యంగా సరికొత్త ముస్లిం రాజకీయ అస్తిత్వాన్ని నిర్మించటంలో ఈ క్రీడ పాత్ర చాలా ఉంది. మొదటి భారత జట్టులో చోటు లభించిన నలుగురు ముస్లిం క్రీడాకారుల్లో ముగ్గురు అలీగఢ్ నుంచి వచ్చారు. అక్కడ చాలా ప్రఖ్యాతి గాంచిన ముహమ్మదన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజీని.. తమ సమాజంలో పాశ్చాత్య విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించటానికి సామాజిక సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నెలకొల్పారు.

ఈ చర్చల్లో కేంద్ర బిందువుగా ఒక అసాధారణ దళిత కుటుంబం ఉంది. వారి క్రికెట్ క్రీడా సామర్థ్యం, సాధించిన విజయాలు.. అగ్ర కుల హిందువులు ఆచరించే అసమానత, బహిష్కరణల దుష్ట వ్యవస్థను ప్రశ్నించాయి.

ఆత్మగౌరవం కోసం, న్యాయం కోసం వివక్షకు వ్యతిరేకంగా పాల్వాంకర్లు పోరాటాన్ని క్రికెట్ సాధ్యం చేసింది.

ముఖ్యంగా బాలూ.. అణగారిన వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన తమ వాళ్లలో చాలా ప్రముఖ వ్యక్తిగా నిలిచారు. భారత రాజ్యాంగ నిర్మాత, దళిత మహానాయకుడు బి.ఆర్.అంబేడ్కర్‌కు కూడా ఆయన ఒక హీరో అయ్యారు.

మరోవైపు.. మహారాజా భూపీందర్ సింగ్‌ తన రాజకీయ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లటానికి ఈ సామ్రాజ్య క్రీడ ఒక ముఖ్యమైన సాధనమయ్యింది. ఒడిదుడుకుల్లో ఉన్న ఈ మహారాజా.. పాలకుడిగా తన సామర్థ్యాలపై బ్రిటిష్ పాలకులకు ఉన్న సందేహాలను తొలగించటానికి మొదటి అఖిల భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా తన హోదాను ఉపయోగించుకోవటానికి ప్రయత్నించారు.

మొదటి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ భూపీందర్ సింగ్
చిత్రం శీర్షిక మొదటి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ భూపీందర్ సింగ్ మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ ఫొటోగ్రాఫర్లకు ఆకర్షణగా నిలిచాడు

సామ్రాజ్యానికి విధేయత

ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చి, నిర్వహించిన బ్రిటిష్ సామ్రాజ్య విధేయులకు.. భారతదేశం పట్ల సానుకూల చిత్రాన్ని ప్రచారం చేయటానికి.. బ్రిటిష్ సామ్రాజ్యానికి దేశం విధేయంగానే ఉండిపోతుందని అధికార వర్గానికి భరోసా ఇవ్వటానికి క్రికెట్ ఒక మార్గంగా మారింది.

మొట్టమొదటి అఖిల భారత క్రికెట్ జట్టు గ్రేట్ బ్రిటన్, నార్తరన్ ఐర్లండ్ పర్యటన ప్రధాన లక్ష్యం అదే. ఆ పర్యటన సందర్భం యాధృచ్ఛికం కాదు. ఐదో జార్జ్ చక్రవర్తిగా లాంఛనంగా పట్టాభిషిక్తుడై, దిల్లీ దర్బార్ కోసం భారతదేశంలో పర్యటించిన సంవత్సరం అది.

ఉపఖండంలో క్రీడను ''కాల్పులు లేని యుద్ధం''గా పరిగణిస్తున్న సమయంలో రోమాంచిత అతిజాతీయవాదానికి క్రికెట్ ఒక వాహికగా మారిపోయిన ఈ సమయంలో.. ఎప్పుడో మరచిపోయిన ఈ చరిత్రను గుర్తుచేసుకోవాల్సిన అవసరముంది.

డాక్టర్ ప్రశాంత్ కిడాంబి.. యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్‌లో కలోనియల్ అర్బన్ హిస్టరీ అసోసియేట్ ప్రొఫెసర్. 'క్రికెట్ కంట్రీ: ది అన్‌టోల్డ్ హిస్టరీ ఆఫ్ ద ఫస్ట్ ఆల్ ఇండియా టీమ్' (పెంగ్విన్ వైకింగ్) పుస్తక రచయిత.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)