గురు గోల్వల్కర్ : ఈ ఆరెస్సెస్ నేత 'విద్వేష' దూతా లేక 'హిందూ జాతీయవాద' ధ్వజస్తంభమా?

  • 3 జూలై 2019
గురు గోల్వర్కర్ Image copyright WWW.GOLWALKARGURUJI.ORG

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదటి సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ తాను చనిపోవడానికి ఒక్క రోజు ముందు మాధవరావ్ సదాశివరావ్ గోల్వల్కర్‌ చేతికి ఒక చీటీ ఇచ్చారు.

అందులో "నువ్వు నా శరీరాన్ని డాక్టర్లకు అప్పగించే ముందు నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇక నుంచి మొత్తం సంస్థను నడిపించాల్సిన పూర్తి బాధ్యత నీదే" అని రాసుంది.

13 రోజుల సంతాప దినాల తర్వాత 1940 జులై 3న నాగపూర్‌లో జరిగిన ఆరెస్సెస్ అగ్ర నేతల సమావేశంలో హెడ్గేవార్ చివరి కోరికను బహిరంగంగా ప్రకటించినపుడు అక్కడున్న నేతలందరూ ఆశ్చర్యపోయారు.

ఆరెస్సెస్‌ మీద చాలా ప్రామాణికంగా పుస్తకం రాసిన వాల్టర్ అండర్సన్, శ్రీధర్ దామ్లే 'ది బ్రదర్‌హుడ్ ఇన్ సఫ్రాన్‌'లో "హెడ్గేవార్ తన వారసుడిగా అనుభవజ్ఞుడైన ఒక సీనియర్ వ్యక్తిని ఎంచుకుంటారని ఆరెస్సెస్ నేతలు భావించారు" అని రాశారు.

ఆ కాలంలో అప్పాజీ జోషిని, హెడ్గేవార్ రైట్ హాండ్‌గా భావించేవారు. డాక్టర్ గారి వారసుడు ఆయనే అవుతారని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన అందరూ అనుకున్నది తప్పని నిరూపించారు.

తర్వాత గురు గోల్వర్కర్‌ను వారసుడిగా ఎంచుకోవడానికి మిగతా కారణాలతోపాటూ ఆయనకు ఇంగ్లిష్ భాషపై మంచి పట్టు ఉందనేది కూడా ఒక కారణం అని చాలా ప్రాంతాల్లో చెప్పుకున్నారు.

Image copyright WWW.GOLWALKARGURUJI.ORG

సంఘ్‌ను రాజకీయాలకు దూరంగా ఉంచాలనే సలహా

1906, ఫిబ్రవరి 19న రామ్‌టెక్‌లో జన్మించిన గోల్వల్కర్ వ్యక్తిగత జీవితం గురించి వివరాలు తెలుసుకోడానికి చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి.

1929లో గోల్వల్కర్ తన స్నేహితుడు బాబూ రావ్ తెలంగ్‌కు రాసిన ఒక లేఖలో తన వ్యక్తిగత జీవితం గురించి కాస్త చెప్పారు. "నేను ఒక భూతం లాంటి తండ్రికి కోపిష్టి కొడుకుని, నా ధమనుల్లో స్వచ్ఛమైన రక్తం ప్రవహిస్తోంది" అని రాశారు.

"జబ్బు పడ్డ సమయంలో తనకు సిగరెట్ తాగడం ఎలా అలవాటైందో, నాగపూర్ అల్లర్ల సమయంలో, తన చేతులు ఎలా ఉపయోగించానో" కూడా ఆయన తెలంగ్‌కు చెప్పారు.

దీనిపై 'ఎంఎస్ గోల్వల్కర్ ది ఆరెస్సెస్ అండ్ ఇండియా' అనే పుస్తకం రాసిన హైదరాబాద్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతిర్మయి శర్మ "నాగపూర్‌లో తమ చేతులను చాలా మంది ఉపయోగించారు. మీరు ఆయన ఐడియాలజీతో ఏకీభవిస్తే ఆయన్ను నాన్ గాంధియన్ విప్లవకారుడు అంటారు".

"దానిని ఒప్పుకోకుంటే, మీరు ఆయన్ను ఘర్షణలు సృష్టించినవాడుగా చెబుతారు. ఇలా సావర్కర్ కూడా 9 ఏళ్ల వయసులోనే మసీదులపై రాళ్లు విసిరారు. నా ఆలోచనల్లో వీటన్నిటికీ అంత ప్రాధాన్యం లేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన రాజకీయాలను నీచంగా భావించారు" అన్నారు.

"మహాభారతంలో ఒక శ్లోకాన్ని ఆయన తన తర్వాత వచ్చిన ఎంతోమంది సర్ సంఘ్ చాలక్‌లకు చెప్పేవారు. బహిరంగ ప్రసంగాల్లో రాజకీయం వైశ్యుల మతం అని, సంఘ్ సభ్యులు రాజకీయాలకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చేవారు. తర్వాత సర్ సంఘ్‌చాలక్‌లు దేశ రాజకీయాలను రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించడానికి ఏ అవకాశం వదులుకోలేదన్నది వేరే విషయం".

Image copyright WWW.GOLWALKARGURUJI.ORG

విషాదంలోనూ ప్రశాంతత

ఆరెస్సెస్‌లోని సర్ సంఘ్ చాలక్‌లందరిపై సదాశివ గోల్వర్కర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు.

సంఘ్ సర్కిళ్లలో ఆయన్ను ఇప్పటికీ స్వామీ వివేకానందుడి ఆధ్యాత్మిక వారసత్వానికి అతిపెద్ద చిహ్నంగా భావిస్తారు.

ఇందిరాగాంధీ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ చీఫ్, సీనియర్ జర్నలిస్ట్ రాంబహదూర్ రాయ్‌కు గోల్వల్కర్‌ను చాలాసార్లు కలిసే అవకాశం లభించింది.

రాంబహదూర్ రాయ్ దాన్ని గుర్తు చేసుకున్నారు. "ఒకసారి నేను ఆయనకు వ్యతిరేకంగా ఒక లేఖ రాశాను. గురూజీ లేఖలకు జవాబిచ్చేవారు. ఆయన పర్యటనల్లో ఉన్నప్పుడు, అంటే దాన్నే ఆరెస్సెస్ భాషలో ప్రవాస్ అంటారు. ఆయన ప్రధాన కార్యాలయం వచ్చాక ప్రతి లేఖకూ జవాబిచ్చేవారు".

"నాగపూర్‌లో సర్‌సంఘ్ చాలక్‌కు ఒక గది ఉండేది. డాక్టర్ ఆవాజీ థట్టే ఆయనకు సెక్రటరీగా ఉండేవారు. ఆయన వృత్తిరీత్యా డాక్టరు. మొదటిసారి నేను గురూజీని 1968లో చూశాను. అప్పుడు జనసంఘ్‌ అధ్యక్షుడు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ హత్య జరిగింది".

"గురూజీ అలహాబాద్‌లో ఉన్నారు. అక్కడ నుంచి ఆయన నేరుగా ముగల్‌సరాయ్‌లో దీనదయాళ్ ఉపాధ్యాయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉంచిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అందరూ ఏడుస్తున్నా. ఆయన మాత్రం ప్రశాంతంగా ఉండడం నేను చూశాను".

Image copyright WWW.GOLWALKARGURUJI.ORG

క్విట్ ఇండియా ఉద్యమానికి గోల్వల్కర్ దూరం

1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి సంఘ్‌ను పూర్తిగా దూరంగా ఉంచాలనేది గురు గోల్వర్కర్ తన పదవీకాలంలో తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయం. ఆ నిర్ణయం గురించి సంఘ్ ఇప్పటికీ ఆయన్ను విమర్శిస్తుంటుంది. కానీ, ఈ నిర్ణయం వెనుక ఆయనకు ఒక లాజిక్ ఉంది.

ప్రముఖ పుస్తకం 'ఆరెస్సెస్-ఐకాన్స్ ఆఫ్ ఇండియా రాయిట్' రాసిన నీలాంజన్ ముఖోపాధ్యాయ్ "నేను మీకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నా. 1930-31లో కూడా గాంధీ దండి యాత్ర తర్వాత సహాయనిరాకరణ ఉద్యమం చేశారు. అందులో పాల్గొనడానికి కూడా హెడ్గేవార్ ఆరెస్సెస్‌కు అనుమతి ఇవ్వలేదు" అని చెప్పారు.

"ఒకవేళ స్వయం సేవకులు కావాలనుకుంటే తమ వ్యక్తిగత స్థాయితో ఆ ఆందోళనల్లో పాల్గొనచ్చని ఆయన చెప్పారు. ఆయన కూడా అడవి సత్యాగ్రహంలో పాల్గొనే ముందు తన సర్ సంఘ్‌చాలక్ పదవిని వదిలేశారు. తన స్థానంలో పరాంజపేను కార్యనిర్వాహక సర్ సంఘ్‌చాలక్‌గా నియమించారు" అన్నారు.

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనకూడదని గోల్వల్కర్ తీసుకున్న నిర్ణయం కూడా అలాంటిదే. వలసరాజ్యాలను వ్యతిరేకించడం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన ఉద్దేశం కాదు. వాళ్లు హిందూ సమాజాన్ని బలోపేతం చేయాలనుకున్నారు. అలా చేస్తే ముస్లింలు హిందువులకు చేసిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవచ్చని భావించారు.

మనం ఆంగ్లేయులకు ఏదైనా చేసి కోపం తెప్పిస్తే, అది హిందువుల ఉనికికి విఘాతం అవుతుందని వారు భావించారు. అలా ఆంగ్లేయులకు వ్యతిరేకం అవుతామని, ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను నిలబెట్టాలనే ఉద్యమానికి అడ్డంకి వస్తుందని అనుకున్నారు.

Image copyright HULTON ARCHIVE

గాంధీ హత్య తర్వాత సంఘ్‌పై ఆంక్షలు

గాంధీజీ హత్య జరిగినపుడు ఆర్ఎస్ఎస్ అస్తిత్వానికి అతిపెద్ద దెబ్బ తగిలింది. తర్వాత ఆరెస్సెస్‌పై ఆంక్షలు అమలయ్యాయి.

గాంధీజీ హత్య సమాచారం ఆయనకు చేరిన సమయంలో గోల్వల్కర్చె మద్రాసు (ఇప్పుడు చెన్నై)లో ఉన్నారు.

గోల్వల్కర్ జీవితచరిత్ర రాసిన సీపీ భిషీకర్ "ఆ సమయంలో గోల్వల్కర్ చేతిలో టీ కప్పు ఉంది. అప్పుడే ఎవరో ఆయనకు గాంధీజీ హత్య గురించి చెప్పారు. టీ కప్పు పెట్టేసిన తర్వాత గోల్వల్కర్ చాలా సేపటి వరకూ ఏం మాట్లాడలేదు."

"తర్వాత ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చింది. "ఈ దేశానిది ఎంత దౌర్భాగ్యం" అన్నారు. తర్వాత ఆయన మిగతా పర్యటన రద్దు చేసుకున్నారు. పండిత్ నెహ్రూ, సర్దార్ పటేల్‌కు సంతాప సందేశం పంపించి నాగపూర్ వచ్చేశారు".

Image copyright WWW.GOLWALKARGURUJI.ORG

సంఘ్, సావర్కర్‌ను ఒకటి చేయాలని గాడ్సే భావించారు

1948 ఫిబ్రవరి 1న అర్థరాత్రి నాగపూర్ పోలీసులు గురు గోల్వల్కర్‌ను గాంధీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో అరెస్టు చేశారు.

పోలీసు జీపు వైపు నడుస్తున్న ఆయన తన మద్దతుదారులతో "సందేహాల మబ్బులు త్వరగా విడిపోతాయి. మనం ఎలాంటి మచ్చ లేకుండా బయటికొస్తాం" అన్నారు.

ఆ లోపే ఆయన సహచరుడు భయ్యాజీ దానీ "గురూజీ అరెస్ట్, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండాలి" అని ఆరెస్సెస్ అన్ని శాఖలకూ టెలిగ్రాం పంపించారు.

ఆరు నెలల తర్వాత ఆరెస్సెస్‌పై ఆంక్షలు ఎత్తేశారు. గోల్వల్కర్ విడుదలయ్యారు. కానీ, ఒకప్పుడు నాథూరాం గాడ్సే ఆరెస్సెస్ సభ్యుడుగా ఉండేవారనే వాస్తవం మాత్రం ఆరెస్సెస్‌కు చాలా నష్టం తెచ్చిపెట్టింది.

"గాడ్సే ఆరెస్సెస్ నుంచి బయటికొచ్చేశారు. ఆయన సావర్కర్, గోల్వల్కర్ మధ్య ఒకలాంటి సామరస్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడో చిక్కొచ్చింది. 1930ల తర్వాత హిందువుల నేత కావడానికి సావర్కర్ సిద్ధంగా ఉన్నారు" అని జ్యోతిర్మయ్ శర్మ చెప్పారు.

"మొత్తం దేశమంతా హిందువులే ఉన్నప్పుడు మీరు హిందువులకు ఎలా ప్రాతినిథ్యం వహిస్తారు అనేది గోల్వల్కర్ అభిప్రాయం. రాజకీయాలు లేకుండా ఏదీ సాధ్యం కాదని సావర్కర్ అభిప్రాయపడేవారు. అటు గోల్వల్కర్ మాత్రం సంఘ్‌లో ఉన్నంతవరకూ దానిలోని వారి చేతులకు రాజకీయ మకిలి అంటకూడదనే భావించారు".

Image copyright WWW.GOLWALKARGURUJI.ORG

ఆంక్షల సమయంలో సంఘ్‌కు నేతృత్వం

జైలు నుంచి బయటికొచ్చాక సంఘ్ సంస్థ మూలాలను విస్తరించాలని గోల్వల్కర్ నడుం కట్టారు.

"ఆంక్షల సమయం నిజంగా సంఘ్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. ఆ సమయంలో వాతావరణం సంఘ్‌కు వ్యతిరేకంగా ఉంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, కమ్యూనిస్టుల్లో చాలా మంది గాంధీజీ హత్య సంఘ్ వల్లే జరిగిందని భావించేవారు" అని రాం బహదూర్ రాయ్ అన్నారు.

"అందుకే సంఘ్ కార్యాలయాలపై చాలా దాడులు జరిగాయి. ఒక ఘటనకు గురూజీతో కూడా సంబంధం ఉంది. ఆయన అరెస్టుకు ముందు ఆయన ఉంటున్నచోట పెద్ద దాడి జరుగుతుందని భయపడ్డారు. జనం మీరు దీన్ని వదిలివెళ్లండి, వేరే ఎక్కడికైనా వెళ్లి దాక్కోండి అని చెప్పారు".

"కానీ ఆయన తను పారిపోనని చెప్పారు. కానీ దాడికి ముందే ఆయన్ను అరెస్టు చేశారు. విచారణ తర్వాత గాంధీజీ హత్యలో సంఘ్ హస్తం లేదని సర్దార్ పటేల్‌కు కూడా అర్థమైంది. ఆయన నెహ్రూకు నచ్చజెప్పారు. 1949లో ఆంక్షలు ఎత్తివేశారు. ఈమధ్యలో గురూజీ సంఘ్‌కు నేతృత్వం వహించే సాహసం చేసారు".

ముస్లింలకు బలమైన విరోధి

"ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించడంతో గోల్వల్కర్‌పై చాలా విమర్శలు వచ్చాయి. అయినా, గోల్వల్కర్‌ ముస్లిం వ్యతిరేకతకు అసలు కారణం ఏమయ్యుంటుంది".

ఈ ప్రశ్నకు సమాధానంగా జ్యోతిర్మయ్ శర్మ "ఒకటి వారు మనకంటే భిన్నం, ఇస్లాం భారతదేశంలో పుట్టలేదు. ఈ భూమి మాది మాత్రమే అనేవారు. సావర్కర్ మాతృభూమి, పితృభూమి, పుణ్యభూమి అనే సిద్ధాంతాన్ని గోల్వల్కర్ కూడా అంగీకరించేవారు" అని చెప్పారు..

"హిందూ నాగరికతే తమకు మూలం అని ముస్లింలు ఒప్పుకుంటే వారు శుక్రవారం ప్రార్థనలు చేసినా, మసీదులు నిర్మించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గోల్వల్కర్ చెప్పారు కూడా. ఆయన మీ మొదటి పేరు ముస్లిందే పెట్టుకోండి. కానీ మీ ఇంటిపేరు హిందూ ఉండేలా చూసుకోండి అని కూడా అన్నారు".

Image copyright WWW.GOLWALKARGURUJI.ORG

మతోన్మాదం రగిలించడంలో పాత్ర

స్వతంత్రానికి ముందు పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో గోల్వల్కర్ భారీ స్థాయిలో మత హింసకు ప్రణాళికలు వేశారని, జనాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారనడానికి సాక్ష్యాలు లభించాయి.

భారత హోం కార్యదర్శిగా పనిచేసి తర్వాత యుగొస్లేవియాలో భారత రాయబారిగా ఉన్న రాజేశ్వర్ దయాళ్ తన ఆత్మకథ 'ది లైఫ్ ఆఫ్ అవర్ టైం'లో "మత ఉద్రిక్తతలు తీవ్రమైనప్పుడు పశ్చిమ రేంజ్‌లో బీబీఎల్ జేట్‌లీ అనే అనుభవజ్ఞుడైన, సమర్థుడైన డీఐజీ ఉండేవారు. ఆయన చాలా రహస్యంగా నా దగ్గరకు రెండు పెద్ద ట్రంకు పెట్టెలు తీసుకొచ్చారు".

"వాటిలో రాష్ట్ర పశ్చిమ జిల్లాల్లో మత ఘర్షణలు సృష్టించారని కొట్టిపారేయలేని సాక్ష్యాలున్నాయి. ఆ ట్రంకు పెట్టెల్లో ఆ ప్రాంతంలోని ప్రతి పట్టణం, గ్రామాలకు సంబంధించిన బ్లూ ప్రింట్స్ ఉన్నాయి. వాటిలో ముస్లిం బస్తీలు, వాటి వరకూ చేరుకునే దారులు గుర్తించి ఉన్నాయి"

"అప్పటికీ ఆ ప్రాంతంలోనే ఉన్న ప్రధాన నిందితుడు గోల్వల్కర్‌ను తాత్కాలిక అరెస్టు చేయాలని నేను ఒత్తిడి తెచ్చాను. కానీ,ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ ఈ కేసును క్యాబినెట్ ముందు ఉంచాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈలోపు గోల్వల్కర్‌కు ఆ విషయం తెలిసిపోయింది. దాంతో ఆయన ఆ ప్రాంతం నుంచి మాయమైపోయారు" అన్నారు.

Image copyright WWW.GOLWALKARGURUJI.ORG

హరి సింగ్‌ను కలిసిన గోల్వల్కర్

కానీ, ఇదే గోల్వల్కర్ కశ్మీర్‌ భారత్‌లో విలీనం కావడంలో కీలక పాత్ర పోషించారు. సర్దార్ పటేల్ చెప్పడంతో మహారాజా హరిసింగ్‌ను కలవడానికి ఆయన శ్రీనగర్ వెళ్లారు.

ప్రముఖ జర్నలిస్ట్ సందీప్ బొమజాయీ తన 'డిసీక్వలిబ్రియం: వెన్ గోల్వల్కర్ రెస్క్యూడ్ హరి సింగ్‌' అనే వ్యాసంలో "సర్దార్ పటేల్ చెప్పాక, ఆ రాష్ట్ర ప్రధానమంత్రి మెహర్ చంద్ మహాజన్ జోక్యం తర్వాత గోల్వల్కర్ శ్రీనగర్ వెళ్లారు. 1947 అక్టోబర్ 18న ఆన మహారాజా హరి సింగ్‌తో సమావేశం అయ్యారు" అని చెప్పారు.

పంజాబ్ ప్రాంత ప్రచారక్ మాధవరావ్ మూలే దాని గురించి రాశారు. "గోల్వల్కర్‌తో రాజా హరిసింగ్ 'నా రాజ్యం పూర్తిగా పాకిస్తాన్‌పై ఆధారపడింది. కశ్మీర్ నుంచి బయటకు వెళ్లే అన్ని దారులూ రావల్పిండి, సియాల్‌కోట్‌ నుంచి వెళ్తాయి. నా విమాన స్థావరం లాహోర్‌లో ఉంది. నేను భారత్‌తో ఎలా సంబంధాలు పెట్టుకోగలనుట అని అన్నారు."

"గోల్వల్కర్ ఆయనతో మీరు హిందూ రాజు. పాకిస్తాన్‌తో విలీనం తర్వాత మీ హిందూ ప్రజలకు కష్టాలు తప్పవు. మీకు భారత్‌తో రైలు, విమాన సంబంధాలు లాంటివి లేవనేది నిజమే. కానీ వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. భారత్‌లో రాజ్యాన్ని విలీనం చేయడం మీకు, మీ జమ్ముకశ్మీర్ రాజ్య ప్రయోజనాలకు మంచిది" అన్నారు.

Image copyright WWW.GOLWALKARGURUJI.ORG

లాల్‌బహదూర్ శాస్త్రి ప్రశంసలు

చైనాతో జరిగిన యుద్ధంలో ఆరెస్సెస్ ఎంత కీలక పాత్ర పోషించిందంటే, అది చూసిన నెహ్రూ చాలా ప్రభావితం అయ్యారు. ఆరెస్సెస్‌లోని ఒక దళం పూర్తి యూనిఫాం, బ్యాండ్‌తో 1963 గణతంత్ర దినోత్సవం పెరేడ్‌లో పాల్గొనేందుకు ఆహ్వానించారు.

1965 యుద్ధం తర్వాత కూడా అప్పటి ప్రధాన మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి ప్రశంసలు అందుకున్న కొద్ది మందిలో గోల్వల్కర్ కూడా ఒకరు.

అటల్ బిహారీ వాజ్‌పేయి ఆయన నుంచి ఎంత ప్రభావితం అయ్యారంటే, గోల్వల్కర్ ఉన్నప్పుడు ఎప్పుడూ కుర్చీలో కూచోకుండా, నేలపైనే కూర్చునేవారు.

మరోవైపు గోల్వల్కర్‌ విమర్శకులు ఎక్కువమంది ఆయనను విభజనకర్త పాత్రలో చూస్తారు. రచయిత, చరిత్రకారుడు రామచంద్ర గుహ ఆయన్ను 'విద్వేష దూత'గా చెప్పేవారు.

Image copyright WWW.GOLWALKARGURUJI.ORG

ఖుష్వంత్ సింగ్‌తో సమావేశం

ప్రముఖ జర్నలిస్ట్ ఖుష్వంత్ సింగ్‌ తన ఒక ఆర్టికల్‌లో గురు గోల్వల్కర్‌ను ఒకసారి కలిశానని చెప్పారు. "నేను గురు గోల్వల్కర్ ఇంటికి చేరుకున్నప్పుడు, ఇంట్లో ఏదో పూజ జరుగుతున్నట్టు అనిపించింది. తలుపు బయట చక్కటి చెప్పులు కనిపించాయి".

"లోపల నుంచి అగరుబత్తి సువాసన వస్తోంది. వంటింట్లో పాత్రలు చప్పుడు వస్తోంది. ఒక చిన్న గదిలో సుమారు డజను మంది తెల్లటి కుర్తాలు, ధోవతితో కూర్చునున్నారు. వారిలో సన్నగా, బక్కగా ఉన్న గురు గోల్వల్కర్ ఒకరు. ఆయన వయసు సుమారు 65 ఏళ్లు".

పొడవుగా ఉన్న తెల్లటి గడ్డం, భుజాలవరకూ ఉన్న నల్లటి వెంట్రుకలు, మొదటి చూపులోనే ఆయన నాకు భారత హోచిమిన్‌లాగా అనిపించారు. నేను ఆయన పాదాల తాకాలని వంగగానే, ఆయన బలహీనమైన చేతులు నా రెండు చేతుల్ని పట్టేసుకున్నాయి".

"టీ తాగిన తర్వాత నేను ఆయన్ను మీకు ముస్లింలంటే ఇంత వ్యతిరేకత ఎందుకు?" అన్నాను. సమాధానంగా గోల్వల్కర్, "ముస్లింలు మొదట తాము భారత దేశాన్ని ఒకప్పుడు పాలించామనే విషయం మర్చిపోవాలి. రెండోది వారు వేరే ముస్లిం దేశాలను తమ జన్మభూమిగా భావించడం మానాలి. మూడోది వారు భారత దేశంలోని ప్రధాన స్రవంతిలో కలవాలి" అన్నారు.

గోల్వల్కర్ వార్తాపత్రిక చదవరు

గోల్వల్కర్‌ను చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. కానీ, ఆయన వార్తాపత్రిక కూడా చదవరని చాలా మంది చెప్పుకుంటారు.

సంఘ్ సైద్ధాంతికతకు మూలం సావర్కర్ అయితే, ఆ సిద్ధాంతాలను విస్తరించింది గోల్వల్కర్ అని చెబుతారు.

నీలాంజన్ ముఖోపాధ్యాయ "గోల్వల్కర్‌ది ఒక లాంటి మూసిన మనస్తత్వం. ఆయన జీవితం ప్రారంభంలోనే ఆయన ఆలోచనల్లో ఒకలాంటి పరిపూర్ణత వచ్చేసింది. తర్వాత ఆయనకు నేను ఏదీ చదవాల్సిన అవసరమే లేదని అనిపించేది" అన్నారు.

Image copyright WWW.GOLWALKARGURUJI.ORG

కొనసాగేలా చేయడమే ఆయన పెద్ద విజయం

సంఘ్‌ను అన్ని వివాదాల నుంచి బయటపడేస్తూ, దానిని కొనసాగేలా చేయడం గురు గోల్వల్కర్ అత్యంత పెద్ద భాగస్వామ్యం

దాని గురించ చెప్పిన రాంబహదూర్ రాయ్ "ఆ రోజుల్లో సంఘ్ ఎన్ని తుపానుల నుంచి ప్రయాణించిందో, అప్పుడు గురూజీ లేకుంటే, సంఘ్ ముక్కలైపోయేది. 1947లో దేశ విభజన సమయంలో గురూజీ ఎక్కువగా రక్షణ, సహాయ కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. సంఘ్ జీవితంలో ఒకే ఒక కష్టం వచ్చింది. దానిని చాలా తక్కువ మంది నోటీస్ చేశారు".

"అది 1952. సంఘ్‌లోని చాలా మంది జనసంఘ్ దిల్లీ లేదా పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవిస్తుందని అనుకున్నారు. కానీ ఫలితాలు వచ్చాక, పార్లమెంటుకు గెలిచి వెళ్లింది కేవలం ఇద్దరే. జనసంఘ్‌లో భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భావించిన వారందరికీ అది చాలా పెద్ద షాక్ ఇచ్చింది".

ఆ కాలంలో చాలా మంది నిరాశతో సంఘ్ వదిలారు. ఆ సమయంలో అంకితభావంతో సంఘ్‌ను ముందుకు నడిపింది గురూజీనే. 1973 వరకూ సంఘ్‌ను అలాగే కొనసాగిస్తూ ఉండడం అనేది గురూజీ సాధించిన అతిపెద్ద విజయం.

ఇందిరాగాంధీ గోల్వల్కర్ ఎప్పుడూ కలవలేదు. తన తండ్రిలాగే ఆమె కూడా ఆయనను ఎప్పుడూ వ్యతిరేకిస్తూవచ్చారు.

అయితే, గోల్వల్కర్ చనిపోయినపుడు ఆయనకు నివాళులు అర్పించిన ఇందిరాగాంధీ, "ఆ వ్యక్తిత్వం, ఆలోచనల తీవ్రత వల్ల జాతీయ రాజకీయాల్లో ఆయనకొక ప్రత్యేక స్థానం లభించింది. అవును, మనలో చాలా మంది ఆయనతో ఏకీభవించం" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం