వాటర్‌మ్యాన్: ఆయన నల్లా తీసుకోరు... నీళ్ళు కొనుక్కోరు

  • 7 జూలై 2019
చెన్నై నీటి సమస్య
చిత్రం శీర్షిక ఇంద్ర కుమార్

మహానగరాల్లో అత్యధికులు నీటి కోసం ఆధారపడేది ప్రభుత్వ నల్లాల మీదనే. ఓ నాలుగు రోజులు నీళ్లు రాలేదంటే జీవితాలు తలకిందులైనంత పనవుతుంది. కానీ, చెన్నైలోని ఓ వ్యక్తి మాత్రం తనకు అసలు ప్రభుత్వ నల్లానే వద్దంటున్నారు.

చెన్నై నగరమంతా చుక్క నీరు దొరక్క ప్రజలంతా ఇక్కట్లు పడుతుంటే, ఈయన మాత్రం బిందాస్‌గా ఉన్నారు. ప్రభుత్వ నల్లా తీసుకోరు... ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుక్కోరు... మరి ఆయన ఎలా జీవిస్తున్నారు?

'ఇటీవల చెన్నైలో వానలు పడినప్పుడు దాదాపు 18 వేల లీటర్ల నీటిని ఒడిసి పట్టాను. నేను అలా చేయకపోయి ఉంటే, వాన నీళ్లన్నీ మురికి కాలువల ద్వారా సముద్రంలో కలిసి, వృథా అయ్యేవి' అని అంటున్నారు ఇంద్రా కుమార్.

చిత్రం శీర్షిక ఈ ట్యాంకులో వర్షపు నీటిని నిల్వ చేస్తారు

'మేము వాన నీరు భూమిలో ఇంకేలా చేస్తున్నాం. తద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది. ఇప్పుడు నిల్వ చేసిన నీటితో ఒక కుటుంబానికి నెల రోజులు సరిపోతాయి. వర్షపు నీటిని ఒడిసిపడుతున్నాం కాబట్టి మాకు నీటి ఇబ్బందులు ఎప్పుడూ రాలేదు' అని ఆయన వివరించారు.

చెన్నై మెట్రో వాటర్ బోర్డు ఇచ్చే నీటి కనెక్షన్‌ను కూడా ఇంద్రకుమార్ తీసుకోలేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక చెన్నై నగరంలో నీళ్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

'మా ఇంటి మీద పడే వర్షపు నీరు నేరుగా ఫిల్టర్లలోకి చేరతాయి. ఫిల్టర్‌లో నాలుగు పొరలుంటాయి. పైపు ద్వారా ఒకటో ఫిల్టర్ నుంచి రెండో ఫిల్టర్‌కు నీళ్లు చేరతాయి. రెండో ఫిల్టర్ నుంచి బావిలోకి పోతాయి' అని వర్షపు నీటిని ఎలా శుద్ధి చేస్తోరో ఆయన వివరించారు.

ఇంద్ర కుమార్ 1986 నుంచి ఇలా వాన నీటిని నిల్వ చేస్తున్నారు.

చిత్రం శీర్షిక ఇంద్రకుమార్ తన ఇంటి పరిసరాల్లో వర్షపు నీరు ఇంకిపోయేలా ఏర్పాటు చేశారు.

వాన నీటిని నిల్వ చేసుకోవడంపై కుమార్ పాఠశాలల్లో విద్యార్థులకు ఈయన అవగాహన తరగతులు కూడా నిర్వహిస్తారు.

'సాయంత్రం నేను ఇంటికొచ్చేసరికి నా కోసం ఇద్దరు టీచర్లు ఎదురు చూస్తున్నారు. బావి, ట్యాంకులలోని నీటిపై తెల్లగా తెట్టు తేలుతోందని వారు చెప్పారు. నేను చూడటానికి వెళ్లాను. ఆ రోజు నుంచి రోజుకు కనీసం ఇద్దరికైనా నీటి సంరక్షణకు సంబంధించి సాయం చేయాలని నిర్ణయించుకున్నా' అని ఇంద్రకుమార్ చెప్పారు.

'దీన్ని మనం ఖర్చు అనుకోకూడదు. పెట్టుబడిలా చూడాలి. భవిష్యత్తు కోసం డబ్బులు ఎలా మదుపు చేస్తామో ఇదీ అంతే. నేడు నిల్వ చేసిన నీరే రేపు కష్టాల్లో ఆదుకుంటుంది" అంటున్నారు ఆయన.

ఆక్సిజన్ కోసం మేడ మీద అంతా ఆయన మొక్కలు పెంచుతున్నారు.

వాన చుక్కలను ఒడిసి పట్టి, నీటి ఎద్దడిని అధిగమించడంలో విజయం సాధించిన ఇంద్ర కుమార్, చెన్నై నీటి కష్టాలకు ఒక పరిష్కారంగా కనిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)