ముగ్గురు అక్కాచెల్లెళ్లు... ముగ్గురూ చీఫ్ సెక్రటరీలు అయ్యారు

  • 4 జూలై 2019
మహిళ

కేష్నీ ఆనంద్ సివిల్స్‌లో ఎంపికై ఐఏఎస్‌గా శిక్షణ పొందుతున్న సమయంలో డిప్యూటీ కమిషనర్ విధుల గురించి నేర్చుకుంటుండగా, ఒక సీనియర్ అధికారి వచ్చి ఎగతాళిగా... "ఈ పని ఎందుకు చేస్తున్నావు? నీకెవరూ డిప్యూటీ కమిషనర్ పోస్ట్ ఇవ్వరులే" అని అన్నారు. అందుకు ఆమె స్పందిస్తూ... "మీరేమీ ఆందోళన చెందకండి. ఏదో ఒకరోజు నేను డిప్యూటీ కమిషనర్ అవుతాను" అని బదులిచ్చారు.

కేష్నీ 1983 బ్యాచ్ ఐఏఎస్. హరియాణా రాష్ట్రంలో తొలి మహిళా డిప్యూటీ కమిషనర్‌గా ఆమె పేరు రికార్డుల్లోకెక్కింది. హరియాణా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత 25 ఏళ్లకు ఒక మహిళ డిప్యూటీ కమిషనర్ అయ్యారు.

తాజాగా ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా బాధ్యతలు చేపట్టారు. మరో విశేషం ఏమిటంటే, కేష్నీ కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు చీఫ్ సెక్రటరీలు అయ్యారు. ముగ్గురిలో ఈమె అందరికంటే చిన్న. తన అక్కలు మీనాక్షి ఆనంద్ చౌదరీ (1969 బ్యాచ్), ఊర్వశి గులాటీ (1975 బ్యాచ్) ఇద్దరూ ఈ పోస్టులో పనిచేశారు.

"ఈ విజయానికి తమ తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రి ప్రొఫెసర్ జీసీ ఆనంద్ కారణమని ఆమె అంటున్నారు. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదగాలన్నది మా అమ్మానాన్నల ఆశయం. అది ఇప్పుడు నెరవేరింది. అమ్మానాన్నలు మేము బాగా చదువుకునేందుకు, మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. మా ఇంట్లోనే బోలెడు పుస్తకాలు ఉండేవి. అదొక లైబ్రరీలా ఉండేది" అని కేష్నీ అరోరా గుర్తు చేసుకున్నారు.

"ఆ కాలంలో అన్ని వసతులు సమకూర్చడం అంత సులువైన పనికాదు. మా పెద్ద అక్క పదోతరగతి పూర్తి చేయగానే, ఆమెకు పెళ్లి చేయాలంటూ బంధువులు ఒత్తిడి చేశారు. కానీ, మా అమ్మ ఒప్పుకోలేదు. తను బాగా చదువుకుని మంచి స్థాయికి వచ్చిన తర్వాతే పెళ్లి చేస్తామని తేల్చిచెప్పింది. చదువే మనిషిని సమస్యల నుంచి బయటపడేస్తుందని మా అమ్మ బాగా చెబుతుండేది. బాగా చదువుకోవడం వల్లే మీ నాన్న యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించారు. మీరు కూడా బాగా చదువుకోవాలి అని చెబుతుండేది" అని ఆమె తన చిన్ననాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.

వీరి కుటుంబ స్వస్థలం పాకిస్తాన్‌లోని రావల్పిండి. 1947 దేశ విభజన సమయంలో ఆ కుటుంబం ఆస్తులన్నింటినీ అక్కడే వదిలేసి భారత్ వచ్చేసింది.

లింగ నిష్పత్తిలో అసమానత్వం అనగానే గుర్తొచ్చే రాష్ట్రం హరియాణా. అలాంటి రాష్ట్రంలో ముగ్గురు సోదరీమణులు సివిల్స్ సాధించి, ప్రధాన కార్యదర్శి స్థాయికి వెళ్లడం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

గత కొన్నేళ్లుగా ఈ రాష్ట్రంలో బాలికల సంఖ్య కాస్త మెరుగుపడినా, ఇప్పటికీ పురుషుల సంఖ్యతో పోల్చితే బాలికల సంఖ్య చాలా తక్కువగానే ఉంది.

"గతంలో మహిళలను ఉన్నత పదవుల్లో చూసేవారు కాదు. నేను డిప్యూటీ కమిషనర్ అని చాలామంది నమ్మేవారు కాదు. నేను ఏదైనా ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లినప్పుడు డిప్యూటీ కమిషర్ భార్య వచ్చింది అనుకునేవారు. నా ముందే గ్రామ పట్వారీ (వీఆర్వో)ను మీ కూతురిని తీసుకొచ్చారా అని గ్రామస్థులు అడుగుతుండేవారు" అని అరోరా గుర్తుచేసుకున్నారు.

"పాలనాయంత్రాంగంలోనూ మహిళలకు కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉండేది. నేను తొలుత డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు, నేను ఈ పోస్టులో బాగా పనిచేకపోతే తర్వాత మరే మహిళ ఆ పోస్టు పొందే వీలుండదు అని అన్నారు. కానీ, ఆ తర్వాత ఏడాదికి అధికారుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను చూస్తే ఇద్దరు మహిళలకు డిప్యూటీ కమిషనర్‌గా ప్రమోషన్ వచ్చింది. దాంతో ఆనందంగా అనిపించింది."

"ఒక మహిళగా తమ హక్కుల కోసం నిత్యం పోరాడాల్సి వచ్చేది. మమ్మల్ని మహిళలు, పురుషుల్లా కాకుండా అధికారుల్లాగే చూడాలని సీనియర్ అధికారులకు చెప్పాల్సి వస్తుండేది" అని ఆమె వివరించారు.

"ఒకప్పటితో పోల్చితే, ప్రస్తుతం పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి. అయినా, ఇప్పటికీ సమాజం ఆలోచన మారాల్సిన అవసరం ఉంది. మహిళలు తమ హక్కులను వినియోగించుకునే వాతావరణం కల్పిస్తే వాళ్లు ఏదైనా సాధించగలరు అన్న విషయాన్ని అందరూ గ్రహించాలి" అని ఆమె అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?

కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా

కేరళ వరదలు: 'మా వాళ్ళు ఏడుగురు చనిపోయారు.. నేను ఎక్కడికి పోవాలి...'

నడి సంద్రంలో తిండీ నీరూ లేక 14 మంది చనిపోయారు... ఒకే ఒక్కడు బతికాడు

అనంతపురం వైరల్ వీడియో: గ్రామ పెద్ద బాలికను కొట్టిన ఘటనలో ఏం జరిగింది

"డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు

శాండ్‌విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు