అనంతపురం: ఆలయంలో అడుగుపెట్టారని దళిత కుటుంబానికి జరిమానా

  • 4 జూలై 2019
అనంతపురం జిల్లా

ఆలయాల్లోకి దళితులకు ప్రవేశం లేదు. మంగలి షాపుల్లో దళితులకు క్షవరం చెయ్యరు... అనంతపురం జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఓ ఘటనతో వెలుగుచూసిన నిజాలు ఇవి.

గ్రామంలో కొత్తగా ధ్వజస్తంభం నిలబెడుతున్నాం. 41 రోజులపాటు గుడిలోకి రాకూడదు అని చాటింపు కూడా వేయించాం. అయినా ఎందుకు వచ్చారు? ఇదీ గ్రామపెద్దలు పెద్దన్నకు వేసిన ప్రశ్న.

గ్రామ కట్టుబాట్లను అతిక్రమించారంటూ పెద్దన్నకు 5,000 రూపాయల జరిమానా విధించారు గ్రామపెద్దలు. దాన్ని ఆలయ హుండీలో వేయాలని ఆదేశించారు. వాళ్లు చెప్పినట్లే పెద్దన్న చేశారు.

కానీ, ఈ వ్యవహారంపై పెద్దన్న పోలీసులను ఆశ్రయించారు.

అనంతపురం జిల్లా గుత్తిలోని బ్రాహ్మణపల్లిలో జూన్ 27వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేసింది బీబీసీ.

బతుకుతెరువు కోసం బ్రాహ్మణపల్లి నుంచి బెంగళూరుకు వెళ్లిన పెద్దన్న కుమారుడికి ఈమధ్యే వివాహం జరిగింది. పెళ్లి కోసం సొంత ఊరికి వచ్చి, కుటుంబంతో కలసి ఆలయానికెళ్లారు. దళితవాడలోని గుడితోపాటు గ్రామంలోని ఆంజనేయస్వామి గుడికి కూడా వెళ్లారు.

ఇదే వివాదానికి కారణమైంది.

దళితులు ఆలయంలోకి వెళ్లారంటూ ఊరంతా వీరిని నిలదీసింది. ఎప్పుడూ లేనిది ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతున్న ఈ సమయంలో ఇలా ఎలా చేస్తారా? అంటూ వారిని గ్రామ పెద్దలు ప్రశ్నించారు. జరిమానా కింద 5వేల రూపాయలు కట్టమన్నారు. పెద్దన్న వారు చెప్పినట్లే చేశారు.

ఆ తర్వాత జూన్ 30న గుత్తి పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై ఆయన ఫిర్యాదు చేశారు. తమను దళితులమని అవమానించి, 5 వేలు జరిమానా కట్టించుకున్నారని ఫిర్యాదులో తెలిపారు.

"గ్రామ కట్టుబాట్లను అతిక్రమించినందుకు వారికి రూ.5,000 జరిమానా వేశారు. గుళ్లో పూజారి మూగవారు. ఆలయంలోకి రావద్దని ఆయన చేసిన సైగలు అర్థం కాకపోవడంతో పెద్దన్న కుటుంబ సభ్యులు లోపలకి వెళ్లారు. దీంతో అపరాధం జరిగిందని బ్రాహ్మణులు, గ్రామపెద్దలు చెప్పడంతో జరిమానా కట్టారు. దీనికి కారకులుగా భావిస్తున్న వారిపై కేసులు నమోదు చేశాం. ఎలాంటి ఘర్షణలూ జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం" అని డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి బీబీసీకి తెలిపారు.

"దళితులను ఆలయాల్లోకి రానివ్వకపోవడం గుత్తి మండలంలోని చాలా గ్రామాల్లో ఉంది. ఎన్నో గ్రామాల్లో ఇప్పటికీ దళితులకు మంగలి షాపుల్లో ప్రవేశం లేదు. రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతోంది. జరిమానా కట్టించుకుంటే దోషం పోయినట్లేనా?" అని సామాజిక కార్యకర్త సునీత అన్నారు.

ఈ ఘటనపై బాధితుడిగా భావిస్తున్న పెద్దన్నతో బీబీసీ మాట్లాడింది.

"ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీని మేం గౌరవిస్తున్నాం. సమాజంలో మార్పు వచ్చి మమ్మల్ని ఆలయాల్లోకి అనుమతించే వరకూ వేచి చూస్తాం" అని పెద్దన్న తెలిపారు.

కట్టుబాట్లను గౌరవించాలనుకుంటే కేసు ఎందుకు పెట్టినట్లు? అని ప్రశ్నిస్తే పెద్దన్న దగ్గర సమాధానం లేదు.

అయితే, అనంతపురం జిల్లాలో దళితుల పట్ల వివక్షకు సంబంధించి పోలీస్ స్టేషన్లలో చాలా కేసులు నమోదయ్యాయి.

జిల్లాలోని లేపాక్షి మండలం కల్లూరులో 2018 సెప్టెంబరు 9న ఓ కేసు నమోదైంది. తన అన్న కూతురు వివాహం తరువాత గ్రామంలోని చెన్నకేశవ ఆలయంలోకి ఊరేగింపుగా వెళ్లి టెంకాయ కొట్టడానికి గ్రామస్తులు అభ్యతరం చెప్పారని, పోలీసుల సాయంతో గుళ్లోకి వెళ్లినందుకు తమ పొలం, గానుగ సామగ్రిని తగలబెట్టారని నాగరాజు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు.

వివాహం తరువాత ఊరేగింపు తమ వీధుల్లో నుంచి వెళ్లకూడదంటూ బీసీ కాలనీ వాళ్ళు అడ్డుకుని గుడిలోకి వెళ్లనీయకుండా రాళ్లతో దాడి చేశారంటూ ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో మరో కేసు నమోదైంది.

దళితులు ఆంజనేయ స్వామి గుడికి వచ్చారని మిగతా గ్రామస్తులు ఆ గుడికి వెళ్లడం మానేసి, మరో ఆలయం కట్టుకున్న ఘటన చిలమత్తూరు మండలం కుర్లాకుంటలో జరిగింది.

రాజ్యాంగం అందరికీ సమానత్వపు హక్కును ప్రసాదించినా ఇప్పటికీ ఇలాంటి వివక్ష కొనసాగడం దురదృష్టమని, పరిస్థితుల్లో మార్పులు ఎప్పటికి వస్తాయో వేచి చూడాలని సామాజిక కార్యకర్త సునీత వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)