బుద్ధుడి చితాభస్మం: హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ మ్యూజియానికి - ప్రెస్ రివ్యూ

  • 5 జూలై 2019
Image copyright Telangana State Archaeology Museum

బౌద్దులు అత్యంత పవిత్రంగా భావించే బుద్ధుడి చితాభస్మం.. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తరలిపోతున్ననదని 'సాక్షి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ప్రస్తుతం నాంపల్లిలోని డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి స్టేట్‌ మ్యూజియంలో ఉన్న బుద్ధుడి ధాతువును ఆంధ్రప్రదేశ్‌లోని మ్యూజియంకు తరలించనున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిక్కుముడిగా ఉన్న ఉమ్మడి ఆస్తుల పంపకాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రశేఖరరావులు నిర్ణయించిన నేపథ్యంలో, చారిత్రక సంపద పంపకం కూడా జరగనుంది.

తెలంగాణ రాష్ట్రంలో పురావస్తు చారిత్రక వస్తువులు ఏమేం ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాల్సినవి జాబితా రూపొందిస్తున్నారు. చరిత్రకారులు డాక్టర్‌ రాజారెడ్డి చైర్మన్‌గా ఏర్పడ్డ కమిటీ దీన్ని పర్యవేక్షిస్తోంది. ఎక్కడ లభించిన వస్తువులు అక్కడే పద్ధతిలో చారిత్రక సంపదను బట్వాడా చేసే దిశగా ఈ కసరత్తు జరుగుతోంది.

విశాఖపట్నం శివారులోని బావికొండగుట్టపై 1980లలో జరిపిన తవ్వకాల్లో బౌద్ధస్తూపం వెలుగు చూసింది. చివరకు అది మహా చైత్యం, బౌద్ధ విహారంగా గుర్తించారు. స్తూపానికి నాలుగువైపులా ప్రత్యేక పాత్రలు వెలుగుచూశాయి. అందులో దక్షిణ దిక్కు చిన్నపాటి రాతి స్తూపం, దాని కింద లభించిన మట్టిపాత్రలో బుద్ధుడి ధాతువు ఉన్నాయి.

పాత్రలో బంగారు, వెండి, ఇతర విలువైన చిన్నచిన్న వస్తువులతోపాటు మరో పాత్రలో బూడిద, బొగ్గు ముక్కలు, చిన్న ఎముక ఉన్నాయి. అది బుద్ధుడి చితాభస్మం, ఆయన శరీరంలోని ఎముకగా పరిశోధకులు పేర్కొన్నారు. దానిని అత్యంత విలువైన సంపదగా గుర్తించి, వెంటనే హైదరాబాద్‌ మ్యూజియంలో భద్రపరిచారు.

2004 ప్రాంతంలో దలైలామా సమక్షంలో వాటిని సందర్శనకు ఉంచారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ తరహా గాజు ఫ్రేమ్‌లోపల వాటిని ఉంచారు. ఇప్పుడు బౌద్ధులకు అది పూజనీయ ప్రాంతం. బుద్ధుడి మహానిర్యాణం తర్వాత ఆయన ఆస్తికలు, చితా భస్మాన్ని ఎనిమిది భాగాలు చేసి వివిధ ప్రాంతాల్లో ఉంచి స్తూపాలు నిర్మించారు.

అనంతరం అశోక చక్రవర్తి అస్థికలు, చితాభస్మాన్ని వెలికి తీయించి 84 వేల భాగాలు చేసి తన సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయించారని చరిత్ర చెబుతోంది. అలా వచ్చిన ఓ భాగమే ఈ ధాతువు కావటం విశేషం.

జనసంక్షోభం Image copyright Getty Images

తెలుగింట జనాభా సంక్షోభం.. తగ్గనున్న యుక్తవయస్కులు

తెలుగు రాష్ట్రాలు భవిష్యత్తులో జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోనున్నాయని.. పని చేయగలిగే యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరగనుందని ఆర్థిక సర్వే చెప్తున్నట్లు ‘ఈనాడు’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంటులో 2018-19 ఏడాది ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు.

2041 కల్లా ఆంధ్రప్రదేశ్‌లో జనాభా వృద్ధి రేటు సున్నాకు చేరనునట్లు సదరు సర్వే వెల్లడించింది. వచ్చే 2 దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యుక్తవయస్కుల సంఖ్య 10 శాతం తగ్గిపోయి 60 ఏళ్ల పైబడిన వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుందని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో జనాభా వృద్ధిరేటు తగ్గనుందని చెబుతోంది.

దేశవ్యాప్తంగా 5- 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో బడికి వెళ్లేవారి సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌లలో 40% ప్రాథమిక పాఠశాలల్లో 50%కంటే తక్కువ పిల్లలున్నారు.

2015-16 నుంచి 2018-19 మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో లింగనిష్పత్తి పురోగమనంలో సాగింది. భేటీ బచావో- భేటీ పఢావో కార్యక్రమం పెద్ద రాష్ట్రాలపై మంచి ప్రభావాన్ని చూపింది. లింగనిష్పత్తి 980కి మించి ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ చేరాయి. 2015-16 నాటికి ఏపీలో ఈ నిష్పత్తి 873 లోపు ఉంది.

Image copyright Getty Images

ఇకపై తెలుగులోనూ బ్యాంకు పరీక్షలు

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు (స్కేల్‌-1), అసిస్టెంట్ల నియామకం నిమిత్తం జరిగే పోటీ పరీక్షలను ఇకమీదట తెలుగులోనూ నిర్వహిస్తారని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. హిందీ, ఇంగ్లిషులతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో కూడా ఆర్‌ఆర్‌బీ (రీజినల్‌ రూరల్‌ బ్యాంక్స్‌) పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో చెప్పారు.

అస్సామీ, బెంగాలీ, కన్నడ, గుజరాతీ, కొంకణి, మళయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో వీటిని నిర్వహిస్తామని ఆర్థికసర్వే ప్రవేశపెడుతూ నిర్మల తెలిపారు.

దేశంలో మద్యం ప్రియులు 16 కోట్ల మందికి పైనే

దేశంలో 16 కోట్లకు పైగా ప్రజలు మద్యాన్ని తాగుతున్నారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపిందని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. గురువారం బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ సమాధానమిచ్చారు.

దేశంలో గంజాయికి 3.1 కోట్ల మంది, డ్రగ్స్‌కు 77 లక్షల మంది అలవాటు పడ్డారని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు