'ఓ బేబీ' సినిమా రివ్యూ: 70 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువతిగా మారితే...

  • 5 జూలై 2019
ఓ బేబీ Image copyright Samantha/Facebook

'ఓ బేబీ' తన వెటకారంతో నవ్విస్తుంది. చాదస్తంతో విసిగిస్తుంది. లోతైన మాటలతో మనసు మూలలను తడిమి ఏడిపిస్తుంది. అన్నింటిని మించి ఆలోచింపజేస్తుంది.

జీవితంలో ఏ క్షణాన్నీ మనస్ఫూర్తిగా అనుభూతి చెందకుండా, జీవితపు ప్రతి మలుపులో ఉండే ఆనందాలను పరిపూర్ణంగా అనుభవించకుండానే ఒంటిమీదకు 70 ఏళ్ళు వచ్చి చేరతాయి.

ఒంటరి జీవన ప్రయాణంలో ఒంటరి తల్లిగా ఎదుర్కొన్న కష్టాలతో నిరంతరం సంఘర్షించి, ఆమెలోని సున్నితత్వం పోయి రాటుదేలుతుంది.

కొడుకు మీద ఉన్న అమితమైన ప్రేమ.. అతనికి ఎలాంటి కష్టాలూ రాకుండా చూడాలనుకుంటుంది. చుట్టూ ఉన్నవారితో గొడవలు, కోడల్ని సాధించడం... ఇవన్నీ కొడుకు మీద తనకున్న ప్రేమే అనుకుంటుంది.

తను అమితంగా ప్రేమించే కుమారుడికి, కొడుకు పుట్టగానే ఆమె ప్రేమ మనవడి మీదకు మళ్లుతుంది.

జీవిత చరమాంకంలో ఏదో కోల్పోయానే అని, ఏదో తెలియని వెలితిగా ఉందంటూ బాధపడుతూ, చుట్టూ ఉన్న వారిని బాధపెడుతూ ఉండే ఓ మహిళకు ఆమె యవ్వనాన్ని తిరిగి ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఊహే 'ఓ బేబీ' సినిమా.

కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి రీమేక్ 'ఓ బేబీ'.

Image copyright Samantha/Facebook

కథ విషయానికి వస్తే బేబీ అనే 70 ఏళ్ల వృద్ధురాలు తన స్నేహితుడు చంటి సాయంతో ఓ క్యాంటీన్ నడుపుతుంటుంది. పెళ్లైన ఏడాదిలోపే భర్త మరణించడంతో కొడుకు శేఖరే లోకంగా బతుకుతూ ఉంటుంది.

కొడుకు మీద ఉన్న అతిప్రేమతో ప్రతి చిన్న విషయాన్నీ చాదస్తంగా పట్టించుకోవడం, అందరితో గొడవ పడటమే కాకుండా, చివరికి కోడల్ని కూడా బాధపెడుతుంటుంది. ఆ స్ట్రెస్ తట్టుకోలేక కోడలికి గుండెపోటు వస్తుంది.

అత్తాకోడళ్ళను దూరంగా ఉంచితే తప్ప భార్య ఆరోగ్యం కుదుటపడదని డాక్టర్ చెప్పిన విషయం తల్లితో ఎలా చెప్పాలో తెలియక నలిగిపోయే తండ్రి నిస్సహాయతను అతని కూతురు అర్థం చేసుకుంటుంది. నానమ్మకు ఈ విషయాన్ని ఎలా తెలియచెయ్యాలా అని ఆలోచించి, చివరికి ఘాటుగా నానమ్మ (బేబీ)ని దూషిస్తుంది.

మానసికంగా బాగా గాయపడిన బేబీ, అనూహ్యమైన పరిస్థితులలో 24 ఏళ్ల యువతిగా రూపాంతరం చెందుతుంది.

ఈ క్రమంలోనే ఒక యువకుడితో ప్రేమలో పడుతుంది.

శారీరకంగా 24 ఏళ్ల యువతిగా, మానసికంగా 70 ఏళ్ల వృద్ధురాలిగా ఉన్న బేబీ ఏం చేసింది? అనుకోకుండా ఎదురైన ప్రేమను ఎలా స్వీకరిస్తుంది? మనవడి జీవితాశయాన్ని ఎలా నెరవేర్చింది? ఇదే 'ఓ బేబీ' నేపథ్యం.

Image copyright Samantha/Facebook

70 ఏళ్ల వృద్ధురాలు బేబీ హఠాత్తుగా 24 ఏళ్ల యువతిగా మారే విధానం అంతా కన్విన్సింగ్‌గా లేకపోయినా కథాపరంగా చూస్తే అది పెద్ద లోపంలా అనిపించదు.

రావు రమేష్ తన సహజ శైలిలో చెప్పే డైలాగులు, క్లైమాక్స్‌లో సమంత, రావు రమేష్‌ల మధ్య జరిగే సంభాషణలు మనిషిలోని మానవత్వాన్ని మేల్కొల్పుతాయి.

బేబీ క్యారెక్టర్‌కు జీవం పోయడంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లక్ష్మి, ఇప్పటి స్టార్ హీరోయిన్ సమంత పోటీ పడ్డారు.

ఇక రాజేంద్ర ప్రసాద్ పాత్ర చక్కటి స్నేహానికి ప్రతిబింబంలా ఉంటుంది. ఆయన తనదైన శైలిలో కామెడీ పండిస్తూనే అవసరమైనప్పుడు హృదయానికి హత్తుకునే డైలాగులు చెప్పారు.

యువతిగా మారిన బేబీని ప్రేమించి, తనకు దూరంగా వెళ్లిపోయిన బేబీనే తలచుకుంటూ, పైకి మాత్రం సంతోషంగా కనిపించే వ్యక్తిగా నాగశౌర్య నటన హుందాగా ఉంటుంది.

బేబీ కుమారుడి పాత్రలో రావు రమేష్, మనవడిగా బాలనటుడు తేజ, కోడలిగా ప్రగతి, ప్రతి చిన్నదానికీ గిల్లికజ్జాలాడే పాత్రలో ఊర్వశి ఎవరికి వారే బాగా నటించారు.

మనిషి తన చుట్టూ జరిగే పరిణామాలకు అనుకూలంగా స్పందిస్తూ.. జీవితాన్ని వీలైనంత అందంగా మార్చుకుని, ఆనందంగా జీవించలేనప్పుడు... జీవితాన్ని ఎన్నిసార్లు మార్చి, మార్చి మొదలుపెట్టినా లాభముండదు అనేదే ఓ బేబి కథ సందేశం.

సమంత ఇంటర్వ్యూ చూడండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)