జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు ప్రస్తావించారు?

  • శంకర్
  • బీబీసీ కోసం
వ్యవసాయం

ఫొటో సోర్స్, Getty Images

"దేశంలో వ్యవసాయభివృద్ధి కోసం మళ్ళీ మూలాల్లోకి వెళదాం" అంటూ కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. 2019-2020 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ని ప్రవేశపెడుతూ ఆమె ఇలా అన్నారు.

అంతేగాకుండా జీరో బడ్జెట్ వ్యవసాయం వైపు దృష్టి సారించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఆ వ్యవసాయ విధాపం అమలులో ఉందన్నారు. దాంతో అందరి దృష్టి ఏపీలో ఈ తరహా వ్యవసాయంపై పడింది.

జీరో బడ్జెట్ లేదా ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి?

పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేయడం అని కొందరు భావిస్తుంటారు. కానీ, జీరో బేస్డ్ వ్యవసాయం అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి సాధించడం.

దానికోసం సంప్రదాయ పద్ధతులు ఆచరించడం. రసాయనాలు, పురుగుమందులు లేకుండా సాగు చేయడం.

ఏదైనా ఒక పంట సాగు చేయాలనుకున్నప్పుడు అంతర పంటలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రధాన పంట పెట్టుబడి, అంతర పంట ద్వారా సంపాదించి, ప్రధాన పంట నుంచి అత్యధిక ప్రయోజనాలు పొందడం.

అంతేగాకుండా, దిగుబడిలో వృధా తగ్గించడం. వ్యర్ధాలను కూడా ఉపయోగించుకుని వీలైనంత మేరకు ప్రయోజనం సాధించడం.

సంప్రదాయ పద్దతిలో పశువుల పెంట, ఇతర సహజ పద్ధతులు వినియోగిస్తూ పంటలు పండించడం ఈ విధానంలో ముఖ్యమైనవి.

దేశంలో అనేక చోట్ల ఈ తరహా వ్యవసాయం సాగుతోంది. అలా పండించిన ఉత్పత్తులను మార్కెట్‌లో 'సేంద్రీయ ఉత్పత్తుల' పేరుతో అమ్ముతున్నారు.

దీనికోసం చాలా మంది ప్రచారం చేస్తున్నారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఇలాంటి వ్యవసాయం మేలుచేస్తుందని చెబుతూ సుభాష్ పాలేకర్ వంటి వారు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ గురించే ఎందుకు మాట్లాడారు..?

ఈ జీరో బడ్జెట్ వ్యవసాయ విధానంపై ఏపీ ప్రభుత్వం శ్రద్ధ చూపింది. చంద్రబాబు హయాంలో సుభాష్ పాలేకర్‌ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేశారు.

వ్యవసాయ శాఖ పరిధిలో జడ్‌బిఎన్‌ఎఫ్‌ (జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్) పేరుతో ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో కొందరు అధికారులను కేటాయించారు.

మండల, క్షేత్ర స్థాయిలో సిబ్బందిని నియమించారు. కొత్త తరహా వ్యవసాయానికి మొగ్గు చూపిన రైతులను ప్రోత్సహించారు. దాంతో ఏపీ అంతటా జీరో బేస్డ్ వ్యవసాయం ఓ పెద్ద ప్రయత్నంగా సాగింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫలితాలు ఎలా ఉన్నాయి?

ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తూర్పు గోదావరి జిల్లా సింగంపల్లి గ్రామానికి చెందిన రైతు బి.ఎస్ ప్రసాద్‌తో బీబీసీ మాట్లాడింది.

"నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అంతకుముందు రసాయనాలు వినియోగించే వాడిని. కానీ, ఇప్పుడు పూర్తిగా మానేశాను. ఆరు ఎకరాల్లో పామాయిల్ తోట వేశాను. రెండకరాలు చేపల చెరువు కూడా ఉంది. పామాయిల్ తోటలో అంతర పంటలు వేశాను. మంచి రాబడి వచ్చింది. కాస్త శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ... ఆదాయ పరంగా, ఆరోగ్యపరంగా ప్రయోజనం కనిపిస్తోంది. చెరువులో చేపలు దిగుబడి కూడా లాభదాయకంగా ఉంది" అని ప్రసాద్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సేంద్రీయ పద్ధతిలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది.

అవగాహన పెరగాలి

కొన్నేళ్లుగా రైతుల్లో జీరో బేస్డ్ వ్యవసాయం గురించి ప్రచారం చేస్తున్నాం. కానీ, ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని జడ్‌బిఎన్‌ఎఫ్‌ ప్రోగ్రాం మేనేజర్ పార్థసారథి చెప్పారు.

"ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంతో రైతులకు ఈ వ్యవసాయం గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అవగాహనా తరగతులు, క్షేత్ర సందర్శన, వీడియో ప్రదర్శనలు వంటివి ఏర్పాటు చేశాం. కొంత ఫలితం కనిపిస్తోంది. ఇంకా చైతన్యం పెరగాలి. పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే ఎంత ప్రమాదమో చూస్తున్నాం. సహజ పద్ధతిలో సాగుకి అలవాటు పడకపోతే ఆహారం పూర్తిగా కలుషితం అయిపోయి ప్రజారోగ్యం దెబ్బతింటుందనే విషయం అందరూ గ్రహించాలి" అని పార్థసారథి అన్నారు.

ప్రభుత్వం ప్రోత్సాహం

కేంద్ర బడ్జెట్‌లో ప్రకృతి వ్యవసాయం గురించి ప్రస్తావించడం శుభసూచికం అంటున్నారు ఈ వ్యవసాయ పద్ధతి గురించి ప్రచారం నిర్వహిస్తున్న వినుకొండకి చెందిన న్యాయవాది కమలాకర రావు.

"ఇప్పటికే హరియాణా, పంజాబ్ రాష్ట్రాలలో గోధుమ రైతులు తమ పొలాల్లో గడ్డిని తగులపెడుతున్న కారణంగా ఏర్పడుతున్న దుష్ప్రభావాలను చూస్తున్నాం. ఆహారంలో క్రిమిసంహారక మందులు కలిసిపోతున్న కారణంగా కలుగుతున్న నష్టం అనుభవిస్తున్నాం. అటు పర్యావరణానికి, ఇటు ప్రజారోగ్యానికి హాని చేస్తున్న వ్యవసాయ పద్ధతులను విడనాడాలి. మేము చాలాకాలంగా జీరో బేస్డ్ వ్యవసాయం గురించి ప్రచారం చేస్తున్నాం. గత ప్రభుత్వం కాకినాడలో రాష్ట్ర స్థాయి అవగాహనా సదస్సు నిర్వహించింది. కొంత ఫలితం వచ్చింది. కేంద్రం శ్రద్ధ పెడితే మెరుగ్గా ఉంటుందని" ఆయన అభిప్రాయపడ్డారు.

బ‌డ్జెట్ కేటాయింపులు లేవు...

ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్టుగా స‌హ‌జ‌ప‌ద్ధ‌తుల్లో వ్య‌వ‌సాయం సాగాలంటే రైతుల‌కు మ‌రింత ప్రోత్సాహం అవ‌స‌ర‌మ‌ని సెంట‌ర్ ఫ‌ర్ సస్ట‌యిన‌బుల్ అగ్రిక‌ల్చ‌ర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ జీవీ రామాంజ‌నేయులు అభిప్రాయ‌ప‌డ్డారు. జీరో బడ్జెట్ వ్య‌వ‌సాయం గురించి ఆయ‌న త‌న అభిప్రాయం బీబీసీతో పంచుకున్నారు. కెమిక‌ల్స్, ఫెర్టిలైజ‌ర్స్ రాయితీల కోసం 72 వేల కోట్లు బ‌డ్జెట్ కేటాయించిన ప్ర‌భుత్వం నేచుర‌ల్ ఫార్మింగ్ గురించి మాట్లాడ‌డ‌మే త‌ప్ప ఒక్క పైసా కూడా కేటాయించిన దాఖ‌లాలు లేవు. ప్ర‌స్తుతం దేశీయ వ్య‌వ‌సాయంలో సంక్షోభం తీవ్రం కావ‌డానికి పెట్టుబ‌డులు పెర‌గ‌డం, ఆదాయం త‌గ్గ‌డ‌మే కార‌ణ‌మ‌ని, దాని కార‌ణంగానే ఆత్మ‌హ‌త్య‌ల వ‌ర‌కూ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం అవుతోంది. దానికి ప్ర‌త్యామ్నాయ విధానం అవ‌స‌రం. దానికి అనుగుణంగా ప్ర‌భుత్వాలు నేచుర‌ల్ ఫార్మింగ్ కి ప్రోత్స‌హ‌కాలు అందించాలి. దేశంలోనే ఎరువుల వినియోగంలో మొద‌టి స్థానంలో ఉన్న ఏపీలో చేస్తున్న ప్ర‌య‌త్నం కార‌ణంగా కొన్ని సానుకూల ఫ‌లితాలు వ‌స్తున్నాయి. సెంట‌ర్ ఫ‌ర్ ఎక‌నామిక్ అండ్ సోష‌ల్ స్ట‌డీస్(సెస్) జ‌రిపిన స‌ర్వేలో కూడా ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా ఉన్న‌ట్టు తేలింది. వ్య‌వ‌సాయ విధానంలో మార్పు అవ‌స‌రం అని అర్థ‌మ‌వుతోంది. దానికి అనుగుణంగా ప‌లు ప్ర‌య‌త్నాలు సాగాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు.

మెట్ట పంట‌ల‌కే మేలు, దిగుబ‌డి త‌గ్గుతోంది..!

జీరో బ‌డ్జెట్ వ్య‌వ‌సాయం పై భిన్నాబిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ విష‌యంపై వ్య‌వ‌సాయ శాఖ రిటైర్డ్ జేడీ పీఎం ప్ర‌కాష్ త‌న అభిప్రాయం వెల్ల‌డిస్తూ నేచుర‌ల్ వ్య‌వ‌సాయం గురించి అనేక మంది ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. చాలాకాలంగా ఇవి సాగుతున్నాయి.కానీ ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డంతో ప‌లువురు మ‌ళ్లీ కెమిక‌ల్స్ వినియోగిస్తున్న అనుభ‌వాలు కూడా ఉన్నాయి. ఈ ప‌ద్ధ‌తిలో వ్య‌వ‌సాయం మెట్ట పంట‌ల‌కే మేలు క‌లిగిస్తోంది. డెల్టాలో వ‌రి సాగు చాలా క‌ష్టం. రైతులకు కూడా భారం అవుతుంది. అంతేగాకుండా ఈ విధానం కార‌ణంగా దిగుబ‌డి కూడా త‌గ్గుతున్న‌ట్టు అనుభ‌వాలు చెబుతున్నాయి. ప్ర‌కృతికి ప్ర‌యోజ‌నం క‌లిగిస్తున్న‌ప్ప‌టికీ రైతుల‌కు మేలు చేయ‌క‌పోవ‌డంతోనే ఎంత‌గా ప్ర‌చారం చేసినా రైతులు ఆస‌క్తి చూప‌డం లేద‌ని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)