కర్ణాటక సంక్షోభం: 21 మంది మంత్రుల రాజీనామా.. అసంతృప్త ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇచ్చే అవకాశం

  • 8 జూలై 2019
సర్కారును గట్టెక్కించే ఫార్ములా ఏంటి Image copyright FACEBOOK/H D KUMARASWAMY

కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న 21 మంది రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. తద్వారా అసంతృప్తితో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం సీఎం కుమార స్వామికి లభించనుంది.

ఆపరేషన్ కమల 4.0గా భావిస్తున్న ప్రస్తుత సంక్షోభంలో ఎమ్మెల్యేలు ఎవ్వరూ బీజేపీ వైపు వెళ్లకుండా చూడాలని కుమార స్వామి భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముంబయిలో మకాం వేసిన అసంతృప్త ఎమ్మెల్యేలంతా తిరిగి బెంగళూరు రానున్నారు.

‘‘మంత్రులంతా తమంత తాముగా రాజీనామాలు చేశారు. మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు.

అంతకు ముందు ముఖ్యమంత్రి కుమార స్వామి నివాసంలో మంత్రులందరితో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. వేణు గోపాల్ కూడా ఆ మీటింగ్‌లో పాల్గొన్నారు.

‘‘జేడీఎస్ మంత్రులు కూడా రాజీనామాలు చేస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వెళ్లి గవర్నర్ వాజు భాయ్ వాలాను కలుస్తారు. మంత్రుల రాజీనామాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తారు’’ అని తాజా పరిణామాల్లో భాగమైన సీనియర్ మంత్రి ఒకరు బీబీసీకి చెప్పారు.

21 రోజుల కిందట మంత్రివర్గంలో చేరిన హెచ్ నగేశ్ సైతం తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయిన నగేశ్.. బీజేపీకి మద్దతు ఇవ్వకుండా ఆయన్ను మంత్రివర్గంలో చేర్చుకున్నారు.

అంతకు ముందు ఏం జరిగింది?

కర్ణాటకలోని జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ రెండు పార్టీలకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేస్తూ స్పీకర్ కార్యాలయానికి లేఖలు ఇవ్వడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది.

ఎమ్మెల్యేల రాజీనామాలపై మంగళవారం నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ రమేశ్ కుమార్ వెల్లడించారు.

కాగా, రాజీనామాలు చేసిన పదకొండు మందిలో ముగ్గురు కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్యకు అత్యంత విధేయులు. వారం కిందట ఆనంద్ సింగ్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేశారు. దీంతో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినట్లయింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కాంగ్రెస్ నేత శివకుమార్, సీఎం కుమారస్వామి

కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉన్నాయి. స్పీకరును మినహాయించగా బీజేపీకి 105 మంది, కాంగ్రెస్ 78, జేడీఎస్ 37, ముగ్గురు ఇతరులు ఉన్నారు.

ఇప్పుడు 12 మంది రాజీనామాలు ఆమోదిస్తే లెక్కలు తారుమారవుతాయి. 224 మంది సభ్యులున్న అసెంబ్లీ ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది మద్దతు అవసరం. ఆ లెక్క ప్రకారమే జేడీఎస్, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, ఇప్పుడు 12 మంది రాజీనామా ఆమోదిస్తే సభ్యుల సంఖ్య 212కు తగ్గిపోతుంది.. అప్పుడు మేజిక్ ఫిగర్ 107 అవుతుంది. ఈ లెక్క ప్రకారం బీజేపీకి మేజిక్ ఫిగర్ అందుకోవడానికి మరో ఇద్దరు మాత్రమే అవసరమవుతారు.

కానీ, మరో ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల రాజీనామాలు ఇంకా స్పీకర్‌కు చేరాల్సి ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరికొందరు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలూ రాజీనామా బాటలో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

'జూలై 12న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కుమారస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పార్టీ నేత యడ్యూరప్ప అవిశ్వాస తీర్మానం పెడతార'ని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ బీజేపీ నేత 'బీబీసీ'కి తెలిపారు.

కాగా, రాజీనామాలు చేసిన కాంగ్రెస్ నేతల్లో ముగ్గురు సిద్ధరామయ్య విధేయులు ఉన్నారు. అలాగే మొన్నటివరకు జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఏహెచ్ విశ్వనాథ్ కూడా రాజీనామా చేయడం చర్చనీయంగా మారింది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)