కర్ణాటక సంక్షోభం: కాంగ్రెస్, బీజేపీల వ్యూహాలేంటి? ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం?

  • 8 జూలై 2019
సర్కారును గట్టెక్కించే ఫార్ములా ఏంటి Image copyright @RAHULGANDHI

కర్ణాటకలో డజనుకు పైగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది.

జేడీఎస్ మాజీ అధ్యక్షుడు హెచ్ విశ్వనాథ్ ఎమ్మెల్యేలను తీసుకుని స్పీకర్ రమేష్ కుమార్ చాంబర్ దగ్గరకు చేరుకున్నప్పుడు ఇదంతా మొదలైంది. అయితే స్పీకర్ అప్పటికే అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఈ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని అక్కడికి చేరుకున్నారు. స్పీకర్ వారిని కలవకపోయినా, వారు తమ రాజీనామాలను స్పీకర్ ఆఫీసులోని కార్యదర్శికి అందించారు.

కర్ణాటకలో కూటమి సర్కారును కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కానీ జేడీఎస్ నేత హెచ్ విశ్వనాథ్ మాత్రం ఎమ్మెల్యేలు స్వతంత్రంగా రాజీనామా చేశారని, వారు ఏ 'ఆపరేషన్ కమల్‌'కూ ప్రభావితం కాలేదన్నారు.

"కర్ణాటకలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైంది" అని ఆయన చెబుతున్నారు.

Image copyright Getty Images

అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు

ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి దేశానికి తిరిగి వచ్చాక వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి. తర్వాత ఎలాంటి అడుగు వేయాలా అని కాంగ్రెస్, జేడీఎస్ ఆలోచిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కుమార స్వామి నివాసంలో మంత్రులందరితో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ కూడా ఆ మీటింగ్‌లో పాల్గొన్నారు.

కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న 22 మంది రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. తద్వారా అసంతృప్తితో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం సీఎం కుమార స్వామికి లభించనుంది.

''మంత్రులంతా తమంత తాముగా రాజీనామాలు చేశారు. మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు'' అని వేణుగోపాల్ చెప్పారు.

''జేడీఎస్ మంత్రులు కూడా రాజీనామాలు చేస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వెళ్లి గవర్నర్ వాజు భాయ్ వాలాను కలుస్తారు. మంత్రుల రాజీనామాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తారు'' అని తాజా పరిణామాల్లో భాగమైన సీనియర్ మంత్రి ఒకరు బీబీసీకి చెప్పారు.

ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర్ తన రాజీనామాను తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని ఆదివారం చెప్పారు.

కానీ మునిగిపోయే పడవలా ఉన్న కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం తీరం చేరేందుకు ఇప్పటికీ ఏదైనా ఫార్ములా ఉందా? అది తెలుసుకోడానికి బీబీసీ ప్రతినిధి గురుప్రీత్ సైనీ సీనియర్ జర్నలిస్ట్ వినోద్ శర్మతో మాట్లాడారు.

Image copyright FACEBOOK/H D KUMARASWAMY

ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..

కర్ణాటకలో ఎప్పుడూ ఏదో ఒక ఫార్ములా ఉంటుంది. ప్రభుత్వం పడిపోతే మళ్లీ ఎన్నికలు జరుగుతాయేమోనని ఎమ్మెల్యేలకు భయం పుడితే అదే ప్రభుత్వాన్ని కాపాడే ఫార్ములా అవుతుంది.

కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఎమ్మెల్యేలెవరూ మళ్లీ ఎన్నికలు జరగాలని కోరుకోరు. ఇది కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది.

ఇప్పుడు వీళ్లు ప్రభుత్వాన్ని కాపాడుకోగలరా లేదా అనేది వారి నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది.

కాంగ్రెస్‌లో చాలా మందికి, ముఖ్యంగా సిద్ధరామయ్య లాంటి వారికి హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం అస్సలు ఇష్టం లేదనేది కూడా ఒక వాస్తవం.

ఎందుకంటే జనతాదళ్ సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు, కుమారస్వామి బీజేపీ మద్దతుతో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి ఆ పదవికి సిద్ధరామయ్య పోటీదారుగా ఉన్నారు. కానీ దేవెగౌడ తన కొడుకును ముఖ్యమంత్రిని చేశారు.

Image copyright JAGADEESH NV/EPA

ఇప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా పనిచేస్తారా లేక పడగొట్టాలని చూస్తారా అనేది చూడాలి. కానీ ప్రభుత్వాన్ని కూల్చడం వల్ల ఆయనకు ప్రయోజనం ఉంటుందని నాకనిపించడం లేదు.

ప్రభుత్వం పడిపోతే, మళ్లీ ఎన్నికలు జరిగితే, అప్పుడు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది.

కానీ భారతీయ జనతా పార్టీలో కూడా యడ్యూరప్ప కోసం ఎలాంటి ప్రత్యేక సెంటిమెంట్ లేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ తన నాయకత్వాన్ని మార్చాలని అనుకుంటోంది. యడ్యూరప్ప స్థానంలో వేరే ఎవరినైనా తీసుకురావాలని భావిస్తోంది.

మరి, ఎమ్మెల్యేల రాజీనామా స్వీకరించకపోవడం వెనుక మతలబు ఏంటి?

ఎమ్మెల్యేల రాజీనామా ఎవరు స్వీకరించాలి అనేది స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వాళ్లు రాజీనామా ఇచ్చారు, వేరే వైపు వెళ్లారు అని చెబుతూ స్పీకర్ వాటిని ఆమోదిస్తారు.

ఈ విషయంలో ఫలితం ఏదైనా అది స్పీకర్‌పైన ఆధారపడి ఉంటుంది.

Image copyright Getty Images

పరస్పర అభిప్రాయ బేధాలు

కాంగ్రెస్ లోపల అభిప్రాయబేధాలు ఉన్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ మధ్య తేడాలు ఉన్నాయి. బీజేపీ లోపల కూడా లుకలుకలు ఉన్నాయి.

అంటే ఇప్పడున్న అసెంబ్లీ ఎన్ని భాగాలుగా విడిపోయి ఉందంటే, మీరు దాన్ని అసలు ఊహించలేరు.

బహుశా, అందుకేనేమో అమిత్ షా కొన్ని నెలల ముందు "మేం అక్కడ మళ్లీ ఎన్నికలు కోరుకుంటున్నాం" అన్నారు. ఆ మాటతో అక్కడ ఎమ్మెల్యేల్లో ఒక భయం ఏర్పడింది. "ప్రభుత్వం మారినా ఫర్వాలేదు, కొత్తగా ఎన్నికలు మాత్రం వద్దు" అని వాళ్లనుకుంటున్నారు.

ఈ పరిస్థితి వెనుక మా చేయి లేదని బీజేపీ అదేపనిగా చెప్పుకుంటోంది. మనం ఎవరిమీదా ఆరోపణలు చేయలేం. కానీ ప్రభుత్వాలు కుప్పకూలినపుడు దాని వెనుక చాలామంది చేతులుంటాయి. అన్ని వైపుల నుంచీ దానికి ప్రయత్నం జరుగుతుంది.

Image copyright HD KUMARASWAMY

అంతర్గత అభిప్రాయ బేధాలతో ప్రభుత్వం పడిపోతుంది, బయటి నుంచి వచ్చే ప్రోత్సాహం వల్ల కూడా ప్రభుత్వాలు కుప్పకూలుతాయి.

అందుకే, ప్రభుత్వం ఉంటుందా.. కూలుతుందా తెలియాలంటే మనం వేచిచూడాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేం.

ప్రభుత్వానికి స్పీకర్ అనుకూలంగా ఉన్నంతవరకూ, ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నాలు జరుగుతాయి. అందుకే ప్రభుత్వం ధీమాగా ఉండొచ్చు.

కానీ అక్కడ గవర్నర్ కూడా తనవంతు పాత్ర పోషిస్తారు, ఆయన బీజేపీకి అనుకూలంగా ఉంటారు. అందుకే ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు