'నందాదేవి' పర్వతారోహణలో చనిపోయిన వారు తీసుకున్న చివరి వీడియో
'నందాదేవి' అధిరోహణలో చనిపోయిన పర్వతారోహకుల చివరి వీడియో
భారత్లోని రెండో అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతం నందాదేవిని అధిరోహించేందుకు వెళ్లి చనిపోయిన పర్వాతారోహకుల బృందం తీసుకున్న చివరి వీడియో ఒకటి లభించింది.
ఇందులో ఒక భారతీయ గైడ్, నలుగురు బ్రిటన్ వాసులు, ఇద్దరు అమెరికన్లు, ఒక ఆస్ట్రేలియన్ హిమాలయాల్లోని ఒక శిఖరాన్ని తాడు సాయంతో అధిరోహిస్తున్నారు.
ఈ పర్వతారోహకులు మే 13న నందాదేవి అధిరోహణను మొదలుపెట్టారు. వీరికి మే 26న బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
ఫొటో సోర్స్, Reuters
నందాదేవి పర్వతారోహణకు ముందు బృందం దిగిన ఫొటో
బృందంలో ఏడుగురి మృతదేహాలు ఇటీవల కనిపించాయి. అనుభవజ్ఞుడైన బ్రిటన్ పర్వతారోహక గైడ్ మార్టిన్ మోరాన్ ఆచూకీ ఇంకా తెలియడం లేదు.
ఏడుగురి మృతదేహాలను వెలికితీసిన ప్రదేశానికి సమీపంలోనే ఈ వీడియో ఉన్న 'గోప్రో' కెమెరా లభించింది. ఇది మంచులో కప్పుకొనిపోయి ఉంది.
ఒక నిమిషం 55 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) అధికారులు సోమవారం విడుదల చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
నందాదేవి పర్వతం
ఈ పర్వాతారోహకుల బరువు కారణంగా వీరు నిలబడిన మంచుకొండ అంచు భాగం విరిగిపోయి ఉండొచ్చని, ఫలితంగా మంచుచరియలు విరిగిపడి ఉండొచ్చని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ కుమార్ పాండే చెప్పారు.
వీరి పర్వతారోహణలో తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించేందుకు ఈ వీడియోపై విశ్లేషణ జరుపుతున్నారు.
ఏదైనా విమానం ప్రమాదానికి గురైతే దాని గురించి విశ్లేషించేందుకు అందులోని బ్లాక్ బాక్స్ ఉపయోగపడినట్లు ఈ పర్వతారోహకుల చివరి క్షణాలను తెలుసుకొనేందుకు ఈ 'గోప్రో' కెమెరా ఉపయోగపడుతోందని ఐటీబీపీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఏపీఎస్ నంబాడియా మీడియాతో చెప్పారు.
ఫొటో సోర్స్, Facebook
మార్టిన్ మోరాన్
స్కాట్లాండ్ కేంద్రంగా పనిచేసే మార్టిన్ మోరాన్ సంస్థ 'మోరాన్ మౌంటెయిన్' భారత్ పరిధిలోని హిమాలయాల్లో అనేక పర్వతారోహణ యాత్రలు చేపట్టింది.
మార్టిన్ మోరాన్ నాయకత్వంలో నందాదేవి యాత్ర చేపట్టిన బృందంలో భారత గైడ్ చేతన్ పాండే, జాన్ మెక్లారెన్, రూపర్ట్ వీవెల్, బ్రిటన్లోని యార్క్ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు రిచర్డ్ పేన్, అమెరికా జాతీయులు ఆంథోనీ సుడేకమ్, రోనాల్డ్ బీమెల్, ఆస్ట్రేలియా వాసి రూత్ మెకాన్సే ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)