విశాఖ: ఉత్తరాంధ్రలో ఆంత్రాక్స్ భయం.. ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది? దీని లక్షణాలు ఏంటి?

  • 11 జూలై 2019
కేజీహెచ్

విశాఖ మన్యంలో మరోసారి ఆంత్రాక్స్ వ్యాధి కలకలం రేపింది. అరకు మండలం మాడగడ గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనులు ఆంత్రాక్స్ లక్షణాలతో విశాఖలోని కేజీహెచ్‌లో చేరారు.

ఒకరు వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చేరగా, మరొకరు రెండురోజుల క్రితం చేరారు. వీరికి కేజీహెచ్‌లోని డెర్మటాలజీ విభాగంలో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.

గత ఏడాది కూడా మన్యంలో అంత్రాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఆ వ్యాధి లక్షణాలు వెలుగు చూడటంతో గిరిజనుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

అనారోగ్యంతో మృతి చెందిన పశువు మాంసాన్ని తినడం వల్లే వారికి ఈ వ్యాధి సోకినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే వారి వద్ద నుంచి శాంపిళ్లను తీసుకొని పరీక్షలకు పంపించామని కేజీహెచ్ సూపరెండెంట్ డాక్టర్ అర్జున తెలిపారు. "ప్రస్తుతానికి ఆ ఇద్దరిని వారం రోజుల పాటు పరిశీలనలో ఉంచుతున్నాం" అని ఆయన చెప్పారు.

చిత్రం శీర్షిక కేజీహెచ్ సూపరెండెంట్ డాక్టర్ అర్జున

ఆంత్రాక్స్ వ్యాధి ఏమిటి? ఎలా సంక్రమిస్తుంది?

'బాసిల్లస్ ఆంత్రాసిస్' అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికా, తూర్పు యూరప్ దేశాల్లో ఈ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు మూడు రోజుల్లోనే బయటపడతాయి. కానీ, కొన్ని కేసుల్లో రెండు నెలల వరకూ లక్షణాలు బయటకు కనిపించవు.

ఈ వ్యాధిని యాంటీబయాటిక్స్‌తో నయం చేయొచ్చు. కానీ, వ్యాధి లక్షణాలు కనిపించగానే ఎంత తొందరగా చికిత్స ప్రారంభిస్తే అంత మంచిది. ఆలస్యం చేస్తే, ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది.

ముఖ్యమైన లక్షణాలు:

చర్మంపై పుండ్లు, జలుబు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించడం, అకస్మాత్తుగా శ్వాస ఆగిపోవడం, నీరసం, ఆకలి మందగించడం, వాంతులు, జ్వరం, రక్తపు విరేచనాలు అవ్వడం.

చర్మ సంబంధిత ఆంత్రాక్స్:

ఎక్కువగా గాయాలు, పుండ్ల ద్వారా శరీరంలోకి ఆంత్రాక్స్ బ్యాక్టీరియా వెళ్తుంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 2,000కు పైగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి.

చర్మంలోకి బ్యాక్టీరియా ప్రవేశించిన తర్వాత ఆ భాగంలో పురుగు కుట్టిందేమో అన్నట్లుగా వాపు వస్తుంది. ఒకట్రెండు రోజుల్లో ఆ ప్రాంతం ఉబ్బి పుండుగా మారుతుంది. నల్లటి మచ్చలా ఏర్పడుతుంది.

చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి కేసుల్లో 20 శాతం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది.

Image copyright SCIENCE PHOTO LIBRARY

శ్వాస కోశ సంబంధిత ఆంత్రాక్స్

గాలిలో ఉన్న ఆంత్రాక్స్ స్పోర్స్‌ను పీల్చడం ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది.

ఇలా బ్యాక్టీరియా సోకిన తర్వాత 36 గంటల్లోగా ఛాతి భాగంలో నొప్పి, జలుబు, తుమ్ములు రావడం, శ్వాస తీసుకోవాడంలో ఇబ్బందులు, అసక్మాత్తుగా శ్వాస ఆగిపోడటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి కేసులు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ, దీనిని నిర్లక్ష్యం చేస్తే రెండు రోజుల తర్వాత మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది.

ఇలాంటి ఆంత్రాక్స్ సోకిన వారిలో 89 శాతం మంది మరణించే ప్రమాదం ఉంటుంది.

జీర్ణకోశ సంబంధిత ఆంత్రాక్స్

ఆంత్రాక్స్ బ్యాక్టీరియా సోకిన జంతువుల మాంసాన్ని తినడం వల్ల ఇది సంక్రమిస్తుంది. ఇది సోకిన తర్వాత నీరసం, ఆకలి మందగించడం, వాంతుల్లో రక్తం పడటం, తీవ్రమైన వీరేచనాలు, జ్వరం, గొంతునొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇలాంటి ఆంత్రాక్స్ వ్యాధిని యాంటీబయాటిక్ మందులతో నయం చేయవచ్చు. కానీ, చికిత్స తీసుకోకపోతే, 25 శాతం నుంచి 60 శాతం వరకు మరణాలు సంభవిస్తాయి.

Image copyright Getty Images

ఎలా వ్యాప్తి చెందుతుంది?

పశువుల ద్వారా లేదా వాటి ఉత్పత్తుల ద్వారా ఆంత్రాక్స్ వ్యాధి మనుషులకు సోకుతుంది. ఈ వ్యాధి బారిన పడి చనిపోయిన జంతువుల కళేబరాలను ఎత్తుకెళ్లేవారికి, వాటి చర్మాలను తొలిచేవారికి, తోళ్ళ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు, చనిపోయిన జంతువుల మాంసాన్ని సరిగా ఉడికించకుండా తినేవారికి ఈ వ్యాధి ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది.

ఈ వ్యాధి వల్ల చనిపోయిన జంతువుల కళేబరాలను భూమిలో పూడ్చిపెడితే, ఆ మట్టిలో దాదాపు 50 ఏళ్ల వరకూ ఆంత్రాక్స్ బ్యాక్టీరియా స్పోర్స్ (గుడ్లు) అలాగే ఉంటాయి. ఆ ప్రదేశంలో ఏదైనా పనిచేసినప్పుడు ఆ స్పోర్స్ మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తాయి.

ఆంత్రాక్స్ బ్యాక్టీరియా స్పోర్స్‌ (సూక్ష్మమైన గుడ్లు)లను పీల్చడం ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

ఈ వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకదు.

Image copyright CBS

నివారణ ఏంటి?

ఈ వ్యాధి పశువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది కాబట్టి, ఈ వ్యాధి సోకిన జంతువుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.

  • పశువు ఉన్నట్టుండి అకస్మాత్తుగా చనిపోతే, దానికి ఆంత్రాక్స్ వ్యాధి సోకి ఉంటుందని అనుమానించాలి.
  • ఈ వ్యాధి సోకిన పశువు ముక్కు, ఆసనం నుంచి నల్లటి రక్తం కారుతుంది. రక్తం గడ్డకట్టదు, కడుపు బాగా ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే, ఆ పశువుకు ఆంత్రాక్స్ సోకినట్లు భావించాలి. అప్పుడు వెంటనే పశువైద్యులను సంప్రదించి దానికి వ్యాధి నివారణ చికిత్స చేయించాలి.
  • ఒకవేళ ఆ పశువు చనిపోతే, దాని చర్మాన్ని తీయవద్దు. వాటి మాంసం తినకూడదు. లేదంటే దాని నుంచి బ్యాక్టీరియా మనుషులకు సోకే ప్రమాదం ఉంటుంది.
  • ఈ వ్యాధితో చనిపోయిన పశువు దగ్గర మిగిలిపోయిన గడ్డిని, పేడను వెంటనే కాల్చివేయాలి. ఆ పరిసరాలలో బ్లీచింగ్ పౌడర్ లేదా సున్నం చల్లాలి. ఆ జంతువు కళేబరాన్ని కాల్చివేయాలి. లేదంటే బాగా లోతు గుంట తవ్వి అందులో సున్నం వేసి పూడ్చిపెట్టాలి.
  • పశువైద్యులు, జంతు సంబంధ ఉత్పత్తుల పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, జీవాయుధాల (బయోలాజికల్ వెపన్స్) ప్రమాదం పొంచి ఉన్న ప్రదేశాల్లో విధులు నిర్వహించే రక్షణ సిబ్బంది ఆంత్రాక్స్ టీకాలు తప్పకుండా వేయించుకోవాలి.

అవగాహన పెంచాలి

"వర్షాకాలంలో అంత్రాక్స్ అనుమానాస్పద కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. కాబట్టి చనిపోయిన పశువుల మాంసం తినొద్దని గిరిజన ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది" అని అర్జున అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీరీలను ఆగ్రా జైలులో పెట్టిన ప్రభుత్వం.. తమవారిని కలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న బంధువులు

పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు

ప్రెస్‌ రివ్యూ: గోదావరిలో 315 అడుగుల లోతులో బోటు

హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి

సెప్టెంబర్ 17: విలీనమా.. విమోచనా... 1948లో జరిగిన హైదరాబాద్ విలీనాన్ని ఎలా చూడాలి

డాక్టర్ కోడెల శివప్రసాద్: ప్రేమాస్పదుడు - వివాదాస్పదుడు

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులతో పెరిగిన ఆయిల్ ధరలు

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు