మోదీ-షాల కాలంలో కాంగ్రెస్: పునర్వైభవం కోసం కాదు, మనుగడ కోసం పోరాటం

  • 13 జూలై 2019
కాంగ్రెస్ Image copyright Getty Images

మోదీ-షా ఆధిపత్యం చలాయిస్తున్న ప్రస్తుత భారత రాజకీయాల్లో ప్రతిపక్షాల పాత్ర ముగిసినట్లేనా అనే అభిప్రాయం కలుగుతోంది.

దీనికి రెండు సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామాతో 40 రోజులుగా అపస్మారక స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక కారణమైతే, కర్నాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పతనం అంచున ఉండటం మరో సంకేతంగా కనిపిస్తోంది.

దీనికోసం పెద్ద మొత్తంలో, ఊహించని స్థాయిలో ఎమ్మెల్యేలకు ముడుపులు ఎరగా వేశారు. చార్టర్డ్ విమానాలను ఆటో రిక్షాల మాదిరిగా ఉపయోగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కుమారస్వామి కూడా కుటుంబంతో విహారయాత్రకు వెళ్లి అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చారు. కర్నాటకలో ప్రస్తుత ప్రభుత్వం ఇక చరిత్రే కావచ్చు, అలాగే బొటాబొటీ మెజారిటీతో ఉన్న మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేనట్లే ఉంది.

Image copyright Getty Images

"మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను అధికారం నుంచి తప్పించడం అనేది చాలా సింపుల్ పని. కానీ ఆ పనిని కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెయ్యాలనుకుంటున్నాం" అని బీజేపీ సీనియర్ నాయకుడొకరు నాతో వ్యాఖ్యానించారు.

అవును, భారత రాజకీయాల్లో బీజేపీ ఆత్మవిశ్వాసం ఇప్పుడు ఆ స్థాయిలో ఉంది.

బిహార్‌లో ప్రతిపక్షం ఆర్జేడీకి కొత్త నేత తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు. ఓటమి అంచుల నుంచి తృటిలో ఆయన బయటపడ్డారు. లాలూ శకానికి ఆయన జైలుకు వెళ్లడంతోనే ముగింపు పడింది. తన భాగస్వామి నితీశ్ కుమార్‌తో బీజేపీ పొత్తులో ఉన్నప్పటికీ... బీజేపీ కేంద్ర కేబినెట్‌లో ఒకే ఒక్క స్థానం ఇస్తామని చెప్పడం ద్వారా ఆయనకు తామిచ్చే ప్రాధాన్యాన్ని చెప్పకనే చెప్పింది.

ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రాంతీయపార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు చారిత్రక పొత్తుతో కూటమిగా ఏర్పడినా బీజేపీ ఆధిక్యాన్ని అడ్డుకోలేకపోయాయి. ఈ ఆధిపత్యాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకప్పుడు వెనకబడిన కులాలవారంతా ఆదరించిన ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ ప్రస్తుతం యాదవులకే పరిమితమైపోగా, బీఎస్పీ జాతవ్‌లకు పరిమితమైపోయింది.

Image copyright Getty Images

ఇక కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షం పరిస్థితేంటి? నాయకుడులేని నావలా బీజేపీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ప్రస్తుతం కాంగ్రెస్. మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌లలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాహుల్ గాంధీ రాజీనామాతో ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో కనీసం పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా ఆ పార్టీ లేదు. పాత కాపు, యువ నాయకత్వానికి మధ్య అంటే జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్ దేవ్‌రా, సచిన్ పైలట్‌ల మధ్య విభేదాలు పార్టీలో చీలిక తెచ్చినా తేవచ్చు.

పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌, ముంబయ్‌లలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సింధియా, దేవ్‌రా ఇప్పటికే రాహుల్ బాటలో రాజీనామాలు సమర్పించారు. రాజస్థాన్‌లోని 25 సీట్లలో ఒక్కటి కూడా గెల్చుకోనందుకు నిజానికి వీరి టార్గెట్ కమల్ నాథ్, అశోక్ గెహ్లాట్‌లు.

గాంధీ కుటుంబం మొత్తం ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో ఉంది. అధికారమే పరమావధిగా సీనియర్ నేతలు రాజకీయాలు చేస్తుంటే గాంధీ కుటుంబం దాన్ని చూస్తూ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటే, ఆ వ్యక్తి గాంధీ కుటుంబానికి కచ్చితంగా విధేయుడిగానే ఉంటారు. దీంతో మళ్లీ పార్టీలో ఆ కుటుంబమే అధికార కేంద్రంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ పదవిని ఆశిస్తున్నవారెవరూ లేరంటే ఆశ్చర్యం కాదు. రాహుల్ స్థానంలో వచ్చే వ్యక్తి యువకుడు, ఉత్సాహవంతుడై ఉండాలంటూ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఇప్పటికే ఓ అభిప్రాయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని అత్యంత సీనియర్లకు ఈ వ్యాఖ్య రుచించలేదు. అందుకే ప్రస్తుతానికి యథాతథ స్థితిని కొనసాగించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది.

Image copyright Getty Images

రాహుల్ పదవి నుంచి తప్పుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రియాంక గాంధీ కూడా ఒకవేళ తన తూర్పు యూపీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తే ఇక వర్కింగ్ కమిటీ కొనసాగడం కూడా ప్రశ్నార్థకమే అవుతుంది.

రాజస్థాన్‌లో ఐదేళ్ల పాటు క్షేత్రస్థాయిలో ఎంతో కష్టపడి, పార్టీని గెలిపించిన సచిన్ పైలట్ నిస్సందేహంగా ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. కానీ ఆ పదవి గెహ్లాట్‌ను వరించింది.

"గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలి. ఆయన దళిత నేత" అని కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ నాయకుడు అన్నారు. కానీ ఇప్పుడు గెహ్లాట్ రాజీనామా చెయ్యడం లేదు. రాహుల్ గాంధీ రాజీనామా లేఖ కాంగ్రెస్‌లో అందరికీ ఆదర్శం అని గెహ్లాట్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కానీ ఆయన రాజీనామా చేయడానికి మాత్రం అది ప్రభావితం చెయ్యలేకపోయింది.

ఓటమికి బాధ్యత వహిస్తూ మొత్తం వర్కింగ్ కమిటీ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. ఎలాంటి బాధ్యతనూ తీసుకోకుండా పదవుల్లో కొనసాగాలంటూ సీనియర్లు రాహుల్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

Image copyright Getty Images

కాంగ్రెస్‌లో చీలిక వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం కూలిపోయిన వెంటనే ఇది జరగొచ్చు. ఓ నేత, ఓ వ్యూహం లేకుండా ఆ పార్టీ పతనం దిశగా నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉంది అనేది ఎవరికీ తెలియదు, కేవలం గాంధీ కుటుంబం భజన చేయడానికి తప్ప. కాంగ్రెస్ పునర్వైభవం అనేది మర్చిపోండి, ఇప్పుడు మనుగడ కోసం పోరాటమిది. అంటే భారత దేశంలోని అత్యంత పురాతన పార్టీకి ఇది ముగింపు కూడా కావచ్చేమో.

గాంధీ కుటుంబంలోని ఐదో తరం అధికారం కోసం తహతహలాడుతున్నారని, అహంకారపూరితంగా ఉంటారని పదే పదే చెబుతూ మోదీ, షాలు తమ పని తాము చేసుకుపోయారు.

ప్రస్తుతం ప్రతిపక్షాలన్నీ అచేతనంగా తయారైపోయాయి. ఈ క్షణంలో భారత్‌కు బీజేపీని ఎదుర్కోగల నిజమైన, బలమైన ప్రతిపక్షం అవసరం. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

కుల్‌భూషణ్ జాధవ్: పాకిస్తాన్ అరెస్ట్ చేసిన భారత పౌరుడి కేసులో నేడు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు... ఇప్పటివరకూ ఏం జరిగింది

అనంతపురం హత్యలు: గురుపౌర్ణిమ రోజు గుప్తనిధుల కోసమే ఈ హత్యలు చేశారా

బిహార్ వరదల్లో మునగడానికి భారత్, నేపాల్ మధ్య గొడవలే కారణమా

ప్రెస్‌ రివ్యూ: ‘కాపులు బీసీలా.. ఓసీలా చంద్రబాబే చెప్పాలి’

ముంబయి: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం... 12 మంది మృతి

ధోనీ కూడా రిటైర్మెంట్ విషయంలో సచిన్, కపిల్ దేవ్‌ల దారిలోనే వెళ్తున్నాడా

"ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా" విశ్వభూషణ్ హరిచందన్

కేరళ వరదలు: ఈ వానాకాలాన్ని దాటేదెలా? గత ఏడాది విపత్తు నుంచి పాఠాలు నేర్చుకుందా...