ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్

  • 12 జూలై 2019
మోజో టీవీ మాజీ సీఈవో రేవతి Image copyright Revathi/youtube
చిత్రం శీర్షిక మోజో టీవీ మాజీ సీఈవో రేవతి

తెలుగు న్యూస్ చానెల్ మోజో టీవీ మాజీ సీఈవో రేవతిని హైదరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నాంపల్లి మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో జడ్జీ ముందు ఆమెను హాజరుపరిచారు.

రేవతితో పాటు మరో ముగ్గురిపై జనవరిలో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ చట్టం కింద నమోదైన కేసును విచారించేందుకు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాస్ రావు బీబీసీ తెలుగుతో చెప్పారు.

''నన్ను అరెస్టు చేయడమే పనిగా ఉన్నట్టుంది''

ఈ ఏడాది జనవరి 23న మోజో టీవీలో నిర్వహించిన ఒక చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఎన్. వరప్రసాద్ (హమారా ప్రసాద్).. తనను అవమానించారంటూ అప్పుడు మోజో టీవీ సీఈవోగా ఉన్న రేవతి, యాంకర్ రఘులతో పాటు ఆ చర్చా వేదికలో పాల్గొన్న ఇద్దరు మహిళా సామాజిక కార్యకర్తలపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

దీనిపై రేవతి ట్విటర్లో స్పందించారు. ''నన్ను అరెస్ట్ చేయటమే ప్రభుత్వానికి ముఖ్యమైన పనిగా ఉన్నట్టుంది. పోలీసులు వారెంట్ లేకుండా అరెస్ట్ చేసేందుకు మా ఇంటికి వచ్చారు. బంజారాహిల్స్ పోలీసులు, ఏసీపీ కేఎస్ రావు ఆదేశాల మేరకు వారు వచ్చారు. నా ఫోన్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు" అని ట్వీట్ చేశారు.

Image copyright MOJO TV/YOUTUBE
చిత్రం శీర్షిక జనవరిలో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై వచ్చిన సుప్రీం కోర్ట్ తీర్పుపై మోజో టీవీలో నిర్వహించిన చర్చలో హమారా ప్రసాద్‌కు యాంకర్లకు మధ్య వివాదం జరిగింది.

''ఇప్పటికే రెండు నోటీసులు ఇచ్చాం''

అయితే, రేవతి వాదనతో పోలీసులు విభేదిస్తున్నారు. "ఇప్పటికే రెండు నోటీసులు ఇచ్చాం. ఫిబ్రవరి 23, మే 25న నోటీసులు పంపాం. మా నోటీసులకు ఆమె స్పందించలేదు. మా విచారణకు సహకరించట్లేదు. నిన్న కూడా కాల్ చేసి పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా కోరాం. కానీ, ఆమె రాకపోవటంతో ఈరోజు మహిళా పోలీసులను ఆమె నివాసానికి పంపాం" అని ఏసీపీ కె. శ్రీనివాసరావు బీబీసీకి తెలిపారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరిపి రేవతి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నట్టు తెలిపారు.

కాగా, రేవతితో పాటు మిగిలిన ముగ్గురిని అరెస్టు చేశారా, వారికి కూడా నోటీసులు ఇచ్చారా అని బీబీసీ ప్రశ్నించగా విచారణలో ఆ విషయం తెలుస్తుందని ఆయన సమాధానం ఇచ్చారు.

రేవతి తరఫు న్యాయవాది ఉమేశ్ చంద్ర బీబీసీతో మాట్లాడుతూ "పోలీసులు అడిగిన ప్రశ్నలకు రేవతి సహకరించి సమాధానం చెప్పారు. తన స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నప్పుడు నేను ఉన్నాను. ఈరోజు పోలీసులు వ్యవహరించిన తీరుపై మేం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ప్రాథమిక హక్కులను హరించారు. న్యాయపరంగా కేసును ఎదుర్కొంటాం. రేవతి పై పెట్టిన కేసులో సాక్ష్యాలు లేవు. కక్షపూరితంగా పెట్టారు. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది" అని తెలిపారు.

Image copyright MOJO TV/YOUTUBE
చిత్రం శీర్షిక జనవరిలో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై వచ్చిన సుప్రీం కోర్ట్ తీర్పుపై మోజో టీవీలో నిర్వహించిన చర్చలో హమారా ప్రసాద్ పాల్గొన్నారు.

అసలేమిటీ కేసు

జనవరిలో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై వచ్చిన సుప్రీం కోర్ట్ తీర్పుపై మోజో టీవీలో ఒక చర్చ కార్యక్రమం నిర్వహించారు. రేవతి, రఘు అనే యాంకర్‌తో కలిసి ఈ చర్చ చేపట్టారు. ఈ చర్చలో వరప్రసాద్ పాల్గొన్నారు.

చర్చ జరుగుతుండగా, వరప్రసాద్ ''మోజో టీవీకి పచ్చకామెర్లు వచ్చాయి కాబట్టి అంతా పచ్చగా కనిపిస్తుంది'' అని అన్నారు. దీనిపై స్పందించిన యాంకర్ రఘు ''ఒక దళితుడుగా ఉండి దేశంలో దళితుల పట్ల జరిగే వివక్ష గురించి మాట్లాడరు. కానీ, ఇవాళ మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం విషయంలో ధర్మం, మతం అని మాట్లాడుతున్నారు. మీకే పచ్చకామెర్లు వచ్చాయి" అని వరప్రసాద్‌ను ఉద్దేశించి అన్నారు. అవమానకరంగా మాట్లాడాలి అనుకుంటే వరప్రసాద్ వెళ్లిపోవచ్చని చెప్పారు. దీనికి వరప్రసాద్ ''మర్యాదగా పిలిచినందుకు వచ్చాం. అంతే మర్యాదగా పంపాలి. అవమానం చేయటం సరికాదు. గెటౌట్ అన్నందుకు క్షమాపణ చెప్పాలి'' అని డిమాండ్ చేశారు. అప్పుడు రేవతి జోక్యం చేసుకొని, ఇక్కడ కేవలం గొడవ పెట్టుకునేందుకు వచ్చారు కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చర్చ దళితుల గురించి కాదు, హిందూ మతం పేరిట జరుగుతున్న దాడిని ఖండించేందుకు అంటూ చర్చ ముగించారు.

Image copyright Hamara prasad/fb
చిత్రం శీర్షిక హమారా ప్రసాద్

''ఏడు నెలల కిందట కేసు పెట్టా''

అయితే, ఈ చర్చలో తనను రేవతి, రఘు అలాగే మహిళా సామజిక కార్యకర్తలు అవమానించారని వరప్రసాద్ కేసు పెట్టారు.

ఆయన ఈ ఘటనపై బీబీసీతో మాట్లాడుతూ, "నేను కేసు పెట్టి ఏడు నెలలైంది. పోలీసులు నోటీసులు ఇచ్చామని తెలిపారు. కానీ, కేసులో పురోగతి కనిపించకపోవడంతో సమాచార హక్కు చట్టం కింద కేసు పురోగతిపై జూన్ 24 న దరఖాస్తు దాఖలు చేశాను. నా కేసును రాజకీయంగా ఎవరైనా ఉపయోగించుకుంటున్నారా? అన్నది తెలియదు." అని చెప్పారు.

రేవతి కుటుంబ సభ్యులు పోలీసుల తీరును తప్పు పడుతున్నారు. "రేవతికి ఒక్క నోటీసు మాత్రమే వచ్చింది. ఆ నోటీసు వచ్చిన రోజు ఆమె ఛానల్‌లో ముఖ్యమైన పనుల్లో ఉండడంతో స్పందించలేదు. కానీ, రెండు రోజుల తరువాత పోలీసులకు ఫోన్ చేసి విచారణకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది. అప్పుడు ఏసీపీ విచారణ తేదీ తరువాత చెప్తామని తెలిపారు. కానీ, ఎటువంటి సమాచారం ఇవ్వలేదు" అని రేవతి భర్త చైతన్య బీబీసీకి చెప్పారు.

''రేవతిని జడ్జి ముందు హాజరుపరిచారు. తరువాత, డాక్టర్ చెక్ అప్‌కు తీసుకెళ్లారు. ఆమె బీపీ అదుపులో లేదు. అయిన్పటికీ డాక్టర్ సరైన స్టేట్మెంట్ ఇవ్వకపోవటంతో అనారోగ్యంతో ఉన్న పట్టించుకోకుండా రేవతిని అదుపులోకి తీసుకున్నారు" అని చైతన్య ఆరోపించారు.

రేవతిని అరెస్టు చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు ఐజేయూ, టీయూడబ్ల్యుజే ఖండించాయి. మూడు నెలల కిందట అందిన ఫిర్యాదుపై పోలీసులు ఇప్పుడు స్పందించడం వెనక మతలబు ఏంటని ప్రశ్నించాయి. మహిళ అనే గౌరవం లేకుండా ఆమె ఇంటిపై దాడి చేసి అరెస్టు చేయడం సహించారని చర్య అని పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అఫ్గానిస్థాన్ రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో రక్తసిక్త వాస్తవాలు

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల ప్రభావం భారత్ మీద పడుతుందా?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి... పోలీసుల నివేదికను తప్పుపట్టిన బాధితురాలి కుటుంబం

యూట్యూబ్: నకిలీ క్యాన్సర్ చికిత్స వీడియోలతో యూట్యూబ్ సొమ్ము చేసుకుంటోందా?

టీవీ చానల్స్ నిలిపివేత ఎమ్మెస్వోల ఇష్టమా.. ట్రాయ్ పాత్ర ఏంటి

‘POK భారత్‌లో భాగమే. ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటాం’ - భారత విదేశాంగ మంత్రి

బెంజమిన్ నెతన్యాహు: ఇజ్రాయెల్ ఆర్మీ కమాండో నుంచి.. ఐదోసారి దేశ ప్రధాని కాగలరా

తెలంగాణలో యూరియా కొరత ఎందుకొచ్చింది.. ప్రత్యామ్నాయాలు ఏమిటి