కర్నాటక సంక్షోభం: బలపరీక్షకు సిద్ధమైన సీఎం కుమారస్వామి... రిసార్టుల్లో రెబల్ ఎమ్మెల్యేలు

  • 12 జూలై 2019
కుమారస్వామి Image copyright Getty Images

కర్నాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కాంగ్రెస్-జనతాదళ్ సెక్యులర్ కూటమి ఏర్పాటు చేసిన ప్రభుత్వం సంకట స్థితిలో కొనసాగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్‌కు మరోసారి రాజీనామా లేఖలు సమర్పించిన తరువాత శుక్రవారం ఉదంయ మళ్ళీ రినాయసాన్స్ - ముంబయ్ కన్వెన్షన్ సెంటర్ హోటల్‌కు బయలుదేరారు.

కాగా, ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తాను బల పరీక్షకు సిద్ధమేనని ప్రకటించారు. బలపరీక్షకు సమయం నిర్ణయించాలంటూ స్పీకర్ రమేశ్ కుమార్‌ను కోరారు.

ఎమ్మెల్యేల రాజీనామాలతో రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని.. ఇలాంటివేళ అధికారంలో ఉండలేనని.. కానీ, తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో దాన్ని రుజువు చేసుకునేందుకు బలపరీక్షకు అనుమతివ్వాలని కుమారస్వామి స్పీకరును కోరారు.

స్పీకరు అందుకు అంగీకరిస్తూ సీఎం ఎప్పుడు బలపరీక్ష కోరుకుంటే అప్పుడు చేపడతామన్నారు.

ఈ నేపథ్యంలో పాలక పక్షాలైన కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్, ప్రతిపక్షమైన బీజేపీ తమ ఎమ్మెల్యేలను 'లాక్కుపోకుండా' రిసార్టులకు తరలించారు.

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ, "మాకు అసెంబ్లీలో బలం ఉందన్న నమ్మకం ఉంది. అందుకే, విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతున్నాం. కానీ, బీజేపీ అందుకు భయపడుతోంది. కారణం, తమ పార్టీలో గోడ దూకేవాళ్ళు ఉన్నారని వారికి తెలుసు" అని అన్నారు.

అంతేకాకుండా, బీజేపీ నాయకులకు కనుక నమ్మకం ఉంటే వారు అవిశ్వాస తీర్మానాన్ని కోరి ఉండేవారని కూడా ఆయన ట్వీట్ చేశారు.

మంగళవారం మళ్లీ విచారణ

అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని సుప్రీకోర్టు తీర్చు ఇచ్చిన అనంతరం కుమారస్వామి ఈ బలపరీక్షకు సిద్ధమయ్యారు.

కర్నాటక ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత వేటుపై యథాతథస్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ వ్యవహారంలో పరిశీలించాల్సిన అంశాలు ఉన్నందున రాజీనామాల ఆమోదం, అనర్హత వేటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.

దీనిపై జులై 16న మంగళవారం తదుపరి విచారణ చేపడతామని తెలిపింది.

Image copyright Getty Images

రాహుల్ స్పందన

ఈ పరిణామాలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయటానికి బీజేపీ డబ్బు పంచుతోందని ఆరోపించారు. ఆ పార్టీ ఈశాన్య రాష్ట్రంలో కూడా ఇలాంటి పనులే చేసిందని విమర్శించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఏం జరగనుంది

శుక్రవారం నాటి విచారణలో తొలుత అసమ్మతి ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. స్పీకరు ఉద్దేశపూర్వకంగానే రాజీనామాలను ఆమోదించడం లేదని.. వారిపై అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని రోహత్గీ ఆరోపించారు.

రాజీనామాలపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్‌కు గడువు ఇస్తే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా చూడాలని రోహత్గీ న్యాయస్థానాన్ని కోరారు. అప్పటికీ రాజీనామాలను ఆమోదించకపోతే స్పీకరుకు కోర్టు ధిక్కరణ నోటీసులివ్వాలని కోరారు.

దీంతో ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయి.. స్పీకరు రమేశ్‌ కుమార్‌ తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీని ''కోర్టు తీర్పును సవాల్‌ చేసే అధికారం స్పీకర్‌కు ఉందా'' అని ప్రశ్నించారు. అలాంటి అధికారం లేదని సింఘ్వీ చెప్పారు.

Image copyright Getty Images

ఈ వాదనలన్నీ విన్న గొగోయి.. రాజీనామాలు, అనర్హత వేటుపై యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించారు.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలుండగా.. అందులో 16 మంది రాజీనామాలు చేశారు.

ఇప్పుడు కోర్టు ఆదేశాల నేపథ్యంలో తదుపరి విచారణ జరగాల్సిన జులై 16వరకు ఆమోదించే వీలులేదు కాబట్టి వారంతా ఇంకా ఎమ్మెల్యేలే.

దీంతో కుమారస్వామి బలపరీక్ష నేపథ్యంలో జులై 16 నాటి విచారణ కీలకం కానుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు