చంద్రయాన్ 2: పశువుల కొట్టం నుంచి అంతరిక్ష పరిశోధనల నాయకత్వం దాకా సాగిన మయిల్‌స్వామి అన్నాదురై ప్రయాణం

డాక్టర్ అన్నాదురై
ఫొటో క్యాప్షన్,

చంద్రయాన్-1 మాడ్యూల్ వద్ద డాక్టర్ అన్నాదురై

"నేను బడికెళ్లగానే తరగతి ప్రారంభానికి ముందు ఆవుల కొట్టంలో పేడ తీసేవాడిని. ఎంత కడుక్కున్నా కూడా చేతులకు ఆ పేడ వాసన పోయేది కాదు. ఎందుకంటే, ఆ పశువుల కొట్టమే మాకు బడి."

డాక్టర్ మయిల్‌స్వామి అన్నాదురై పెద్ద స్కూళ్లలో ఏమీ చదువుకోలేదు. కానీ, నేడు భారత ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్తల్లో ఆయన ఒకరు. విజయవంతమైన భారత చంద్రయాన్ 1, అంగారక మిషన్ల వెనకున్న కీలక వ్యక్తి.

ఆయన చిన్నప్పుడు మూడో తరగతి వరకూ వాళ్ల ఊరిలో బడి లేదు. చెట్టు కిందనో, ఆలయం వరండాలోనో, ఆవుల కొట్టంలోనో చదువుకునేవారు.

అలాంటి పరిస్థితుల నుంచి అత్యున్నత స్థాయి నిపుణుడిగా ఎలా ఎదిగారు?

అన్నాదురైది సాధారణ కుటుంబం. చిన్నప్పుడు చెప్పులు కూడా కొనిచ్చే స్తోమత ఉండేదికాదు. ఆయనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు వారి గ్రామంలో మొదటి విద్యుత్ బల్బు వెలిగింది.

ఫొటో క్యాప్షన్,

అన్నాదురై తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు

అప్పటికే ప్రపంచంలో అనేక సాంకేతిక పరిశోధనలు జరుగుతున్నాయి. 1960లలో అమెరికా, సోవియట్ యూనియన్లు అంతరిక్ష ప్రయోగాలను ముమ్మరం చేశాయి.

అదే సమయంలో భారత్ కూడా ముందడుగు వేయడం ప్రారంభించింది. 1963 నవంబర్ 21న భారత్ తన తొలి రాకెట్‌ను ప్రయోగించింది.

ఆ సమయంలో అన్నాదురై తమిళనాడులోని కోధవాడీ గ్రామంలో పెరుగుతున్నారు. ఆయనలాగే, అప్పుడు దేశంలో అనేక మందికి సరైన విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేవి కాదు.

ఆర్థిక ఇబ్బందులు ఆయన చదువుకు ఆటకంగా మారలేదు. సైన్స్, గణితం అంటే ఆయన ప్రాణం. చరిత్ర అంటే మాత్రం ఇష్టముండేది కాదు.

ఫొటో క్యాప్షన్,

సోదరులతో అన్నదురై (మధ్యలో)

"చరిత్ర చదవటం అంటే, చరిత్రను ఎలా తిరగరాయాలో నేర్చుకోవడం" అని తన తండ్రి చెబుతుండేవారని అన్నాదురై బీబీసీతో గుర్తుచేసుకున్నారు.

ఆయన తండ్రి స్కూలు టీచర్‌గా పనిచేసేవారు. అదనంగా మరికొంత డబ్బు వెనకేసుకునేందుకు ఆయన దర్జీ పని కూడా చేసేవారు. అలా సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ, కొంత పొదుపు చేసేవారు.

తాను ఉన్నత చదువులకు వెళ్తానని కూడా అన్నాదురై ఊహించలేదు. అయితే, అదృష్టం కొద్దీ, ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు... గ్రామీణ విద్యార్థుల కోసం ఉపకారవేతనాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడాన్ని రేడియోలో విన్నారు.

ఆ ఉపకారవేతనానికి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఆ స్కాలర్‌షిప్‌తో ఆయనకు ఆర్థికంగా ఇబ్బందులు తగ్గాయి. సమీపంలోని పట్టణంలో చదువుకునేందుకు అవకాశం లభించింది.

"అప్పుడు మా నాన్న నెలకు 120 రూపాయలు సంపాదించేవారు. నాకు ఏడాదికి 1,000 రూపాయల స్కాలర్‌షిప్ వచ్చేది" అని ఆయన గుర్తు చేసుకున్నారు.

అలా చదువుకుంటూనే పాఠశాల పరీక్షల్లో జిల్లా స్థాయిలో టాపర్‌గా నిలిచారు. రాష్ట్రంలో 39వ స్థానం సాధించారు. ఆ ఫలితాలు ఆయనకు మరింత ఆర్థిక సాయం అందేందుకు దోహదపడ్డాయి.

ఫొటో క్యాప్షన్,

1980లో అన్నాదురై

మొదట్లో ఇబ్బందులు

అన్నాదురై ఇంజనీరింగ్ కళాశాలలో చేరడానికి కొద్ది రోజుల ముందు, భారత అంతరిక్ష సంస్థ 1975లో రష్యా సహాయంతో తన మొదటి ఉపగ్రహం 'ఆర్యభట్ట'ను ప్రయోగించింది.

ఉపగ్రహం నుంచి సంకేతాలను స్వీకరించేందుకు బెంగళూరులోని కొన్ని మరుగుదొడ్లను హడావుడిగా డేటా సెంటర్‌గా మార్చారు. ఆరు నెలల పాటు పనిచేసేలా ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. కానీ, అది నాలుగు రోజులు మాత్రమే సరిగా పనిచేసింది.

నాలుగేళ్ల తరువాత, దేశీయంగా తయారుచేసిన రాకెట్‌ను ప్రయోగించేందుకు భారత్ చేసిన మొదటి ప్రయత్నం కూడా విఫలమైంది.

అన్నాదురై 1980 ప్రారంభంలో ఇస్రోలో చేరారు.

"మేం ఆస్బెస్టాస్ షీట్ల కింద పనిచేశాం. నాలుగేళ్లకో ఉపగ్రహాన్ని మాత్రమే ప్రయోగిస్తుండేవాళ్లం" అని ఆయన చెప్పారు.

తమిళ వ్యక్తి అయిన ఆయనకు ఇంగ్లిష్, హిందీ భాషలలో పట్టు లేకపోవడంతో సమాచారాన్ని చేరవేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. " కొంతమంది నా ఇంగ్లిష్ చూసి నవ్వేవారు" అని అన్నాదురై గుర్తు చేసుకున్నారు.

ఆయన పనిచేసిన మొదటి ఉపగ్రహాన్ని భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో చేరేలా రూపొందించారు. కానీ, అనుకున్నట్లుగా జరగలేదు. అది బంగాళాఖాతంలో పడిపోయింది.

ఫొటో క్యాప్షన్,

అన్నాదురై

చంద్రునికి గురి

ప్రారంభం నిరుత్సాహపరిచినా, ఆయన ఎనిమిది ఇన్‌శాట్ ఉపగ్రహాల ప్రయోగాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. భారత అంతరిక్ష సంస్థ ప్రయోగించిన అత్యంత ముఖ్యమైన ఉపగ్రహాల్లో ఇన్‌శాట్ ఒకటి. వాతావరణ సూచనల నుంచి, మ్యాపింగ్, మీడియా ప్రసారాల వరకు ప్రతిదానికీ అవి ఉపయోగపడుతున్నాయి.

భారత మొట్టమొదటి చంద్రయాన్ మిషన్‌కు నాయకత్వం వహించడానికి ముందు 2003లో, ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం కోసం ఇస్రో నుంచి బయటకెళ్లాలన్న ఆలోచన కూడా వచ్చిందని డాక్టర్ అన్నాదురై చెప్పారు.

"మా ప్రధాన లక్ష్యం మునుపటి మిషన్ల ద్వారా చూడని ప్రాంతాలను అన్వేషించడం. చంద్రునిపై ఎంత నీరు ఉంది? అది ఎలా ఏర్పడుతుంది? అన్నది కూడా తెలుసుకోవాలనుకున్నాం."

2008 అక్టోబర్‌లో బాగా మబ్బులు పట్టిన రోజున, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్-1 ప్రయాణం ప్రారంభమైంది. అది చంద్రునిపై భారత మువ్వన్నెల జెండాను నాటి, అక్కడి నీటి ఉనికిని నిర్ధారించింది.

భారతీయ మీడియా ఆ విజయాన్ని ఉత్సవంలా జరుపుకుంది. అయితే, ఒకవైపు ప్రాథమిక సదుపాయాలు లేక లక్షలాది మంది ఇబ్బందిపడుతుంటే, అలాంటి ప్రాజెక్టుల కోసం భారీగా డబ్బు ఖర్చు చేయడమేంటని కొందరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

డాక్టర్ అన్నాదురై స్పష్టంగా ఉన్నారు. "పారిశ్రామిక విప్లవంలో మన భాగస్వామ్యం లేకపోవడమే పేదరికానికి ప్రధాన కారణాలలో ఒకటి. దండిగా మానవ నవరులు కలిగిన దేశం భారత్. ఇతర దేశాలు సాంకేతికంగా ముందుకెళ్తుంటే మనం ప్రేక్షకుల్లా ఉండకూడదు. అంతరిక్ష పరిశోధన ద్వారా లభించే అవకాశాలను కోల్పోకూడదు" అని ఆయన అన్నారు.

ఫొటో క్యాప్షన్,

మార్స్ ఆర్బిటర్

అంగారకుడి మీదికి

కొన్ని సంవత్సరాల తరువాత, ఆయన నాయకత్వంలోనే, మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహం మీదికి ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపిన మొదటి దేశంగా భారత్ అవతరించింది.

"చంద్రుడిని చేరుకోవటానికి, మన ఉపగ్రహం సెకనుకు కిలోమీటర్ వేగంతో ప్రయాణించాల్సి ఉంది. అయితే, అంగారక గ్రహానికి చేరుకోవడానికి సెకనుకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి. అందుకు పక్కా ప్రణాళిక, లెక్కలు అవసరం."

భారత్ పంపిన మార్స్ ఆర్బిటర్ "అంగారక గ్రహం" చేరుకోవడానికి పదిన్నర నెలలు పట్టింది. ఆ మిషన్‌కు ఇస్రో 73 మిలియన్లు ఖర్చు చేసింది. ఇప్పటివరకు అత్యంత ఖర్చుతో కూడుకున్న అంగారక మిషన్ ఇదే.

"మీ ఆర్యభట్ట ఉపగ్రహ చిత్రాన్ని రెండు రూపాయల నోటుపై ముద్రించారు అని నా గురువు ప్రొఫెసర్ యు. ఆర్. రావుతో చెప్పాను. ఇప్పుడు నా మార్స్ ఆర్బిటర్ చిత్రం 2,000 రూపాయల నోటు మీద ఉంది. మేము 1,000 రెట్లు పెరిగాం."

భవిష్యత్ సవాళ్లు

కానీ, చంద్రయాన్ 1 మిషన్ అనంతరం 11 సంవత్సరాల తరువాత, అంతరిక్ష మార్కెట్ పూర్తిగా మారిపోయింది. భారీ పునర్వినియోగ రాకెట్లతో స్పేస్ ఎక్స్ భారీగా ఖర్చులను తగ్గిస్తోంది.

"మనం కూడా ముందుకెళ్లాలి. పునర్వినియోగ లాంచర్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం" అని ఆయన చెప్పారు.

చంద్రయాన్ 2 అత్యంత క్లిష్టమైనది

చంద్రయాన్ 1 తర్వాత 11 ఏళ్లకు భారత్ తన రెండో మిషన్ చంద్రయాన్ 2ను ఈ ఆదివారం ప్రారంభిస్తోంది. ఈ మిషన్ చంద్రుడి ఉపరితలంపై నీరు, ఖనిజాలు, రాళ్ల నిర్మాణంపై సమాచారాన్ని సేకరిస్తుంది.

ఈ మిషన్‌‌కు కూడా ఆరంభంలో డాక్టర్ అన్నాదురై నాయకత్వం వహించారు.

మనం చేస్తున్న ఈ ప్రయత్నం ఇప్పటి వరకూ మనం చేసిన అన్నింటికన్నా చాలా క్లిష్టమైనది అని ఆయన చెప్పేవారు.

ఇది విజయవంతమైతే, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ ఖ్యాతి పొందుతుంది. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి.

ఫొటో క్యాప్షన్,

అన్నాదురై

చంద్రయాన్ 2 కన్నా ముందే రిటైర్మెంట్

చంద్రుడి వద్దకు చేర్చే రెండో మిషన్‌ను కూడా డాక్టర్ అన్నాదురై చూడాలనుకున్నారు కానీ, ఆయన 2018 జులై 31న పదవీవిరమణ చేశారు.

బాహ్య విశ్వాన్ని శాంతియుతంగా ఉపయోగించాలని రెండేళ్ల కిందట ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన కమిటికీ ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. భారత ప్రభుత్వ మూడో అత్యున్నత పురస్కారంతో పద్మభూషణ్‌తో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆయనను వరించాయి.

''నేను పదేళ్లున్నప్పుడు ఈత నేర్చుకోవాలనుకున్నా. ఇందుకోసం నా స్నేహితులు నన్ను పెద్ద పొలంలోకి తీసుకెళ్లారు. అక్కడి బావిలో నన్ను తోసేశారు. మునిగిపోకుండా ఉండటానికి నేను కాళ్లుచేతులు ఆడించా. అప్పుడు చాలా భయం వేసింది. కానీ, వాళ్లు అలా తోసేయడం వల్లే నేను చాలా త్వరగా ఈత నేర్చుకున్నా. నాకున్న క్లిష్ట పరిస్థితుల మూలంగానే... పేదరికాన్ని రూపుమాపే ఏకైక దారి చదువేనని గ్రహించా'' అని అన్నాదురై పేర్కొన్నారు.

ఆయన తరచుగా తన ఊరికి వెళుతుంటారు. అక్కడ విరాళాలు సేకరించి పాడుబడిన పాఠశాల భవనానికి మరమ్మత్తులు చేస్తుంటారు.

ఫొటో క్యాప్షన్,

అన్నాదురై కుటుంబం

చరిత్ర పాఠాల్లో ఆయనకో పేజీ

డబ్బులు తనకు ఎప్పుడూ ప్రోత్సాహాన్ని ఇవ్వవని చెప్పే అన్నాదురై చాలా సాదాసీదాగా జీవిస్తుంటారు. చిన్న కారును స్వయంగా నడుపుకుంటూ వెళ్తారు.

చంద్రయాన్ -1పై పనిచేస్తున్నప్పుడు.. ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు. మనం చరిత్రను సృష్టిస్తున్నాం అని తన సహచరులకు తరచూ చెప్పేవారు.

చిన్నప్పుడు తరగతి గదిలో చరిత్ర పాఠాలు వినడమంటే అసహ్యించుకునే అన్నాదురై ఇప్పుడు చరిత్ర పాఠం అయ్యారు. ఆయన జీవిత చరిత్రను తమిళనాడు ప్రభుత్వం స్కూల్‌లో పాఠ్యాంశంగా చేర్చింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)