ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019: కేటాయింపులు ఘనం, మరి నిధుల మాటేంటి? :అభిప్రాయం

  • డి. పాపారావు
  • ఆర్థిక విశ్లేషకులు, బీబీసీ కోసం

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ను 2,27,974 కోట్ల రూపాయలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జులై 12న శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ స్థాయి, గత బడ్జెట్ కంటే 19 శాతం అధికం. తమ బడ్జెట్ తాలూకూ ఫోకస్ మొత్తం నవరత్నాల చుట్టూనే ఉంటుందని వైసీపీ నేతలు తొలి నుంచీ చెబుతూనే ఉన్నారు.

కాబట్టి, జగన్ పాదయాత్ర నేపథ్యంలో ముందుకు వచ్చిన, వైసీపీ ఎన్నికల ప్రణాళిక అయిన ఈ నవరత్నాలు ఏమిటీ అనేది సంక్షిప్తంగా చూద్దాం. వీటిలో ప్రధానాంశాలుగా పింఛన్లు, వైఎస్సార్ రైతు భరోసా, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, సాగు-తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఆరోగ్యశ్రీ, మూడుదశల్లో మద్యనిషేధం, ప్రతి పేదవాడికీ ఇళ్లు, వైఎస్సార్ ఆసరాతో డ్వాక్రా సంఘాల పునరుద్ధరణ - వడ్డీలేని రుణాలు... ఇవీ నవరత్నాలు.

ఈ వాగ్దానాలే జగన్‌కు ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిపెట్టాయి. కాబట్టి, రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వం నుంచి కోరుకునేది ఈ వాగ్దానాల అమలునే. అందువల్ల ప్రస్తుత బడ్జెట్‌ను ఈ నవరత్నాల కోణం నుంచే చూడాలి.

వీటిలోని ఓ ప్రధాన అంశం అయిన రైతు భరోసాకు ఈ బడ్జెట్‌లో భారీ కేటాయింపులే జరిగాయి. ఈ పథకం కింద అటు రైతులతో పాటు, ఇటు కౌలురైతులకు కూడా ఖరీఫ్ సీజన్‌కు ముందు మే నెలలో రూ.12,500 అందిస్తామని ఈ బడ్జెట్ చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తంగా రైతులు, కౌలురైతులు కలిపి 80 లక్షల మంది ఉన్నారు. అందువల్ల బడ్జెట్ కేటాయింపులు భారీగానే కనిపించినా నిధుల సమీకరణలో సమస్య ఎదురైతే మాత్రం లబ్దిదారుల సంఖ్యలో కోతలు పడే అవకాశం లేకపోలేదు. నేడు తెలంగాణలో 'రైతుబంధు' పథకం ప్రయోజనాలు వివిధ కారణాలతో కొందరు లబ్దిదారులకు అందకుండా పోవడమే దీనికి ఉదాహరణ.

కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి కిసాన్ యోజన, తెలంగాణలోని రైతుబంధులకు భిన్నంగా ఆంధ్ర ప్రదేశ్‌లో కౌలురైతులకు కూడా విస్తరించిన 'రైతు భరోసా'ను అమలు జరపడం అంత సులువేమీ కాదు. కౌలు రైతుకు 'రైతు భరోసా'తో, భూమి యజమానుల్లో అభద్రతకు పరిష్కారంగా ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే ఒక బిల్లును తెస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇది ఎంతవరకూ పరిష్కారం చూపుతుందో వేచి చూడాలి.

ఇక మరో అంశం.. పింఛన్ల పెంపు. దీనికి సంబంధించిన ఫైలుపై జగన్ పదవీ ప్రమాణం చేసిన వెంటనే తొలి సంతకం పెట్టారు. దీనికి ఇప్పుడు రూ.12,801 కోట్లు కేటాయించారు. ఇది విజయవంతమవుతుందనే అనిపిస్తోంది.

మూడో అంశం.. అమ్మ ఒడి. దీనికి రూ.6,455 కోట్లు కేటాయించారు. కాగా, ఇప్పటికే లబ్దిదారుల సంఖ్యకు సంబంధించి ప్రభుత్వం దోబూచులాడుతోందని, సంఖ్యను తగ్గించాలని చూస్తోందంటూ విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇది విజయవంతం కావడమనేది ప్రభుత్వ చిత్తశుద్ధి మీదే ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుందని గతంలో ప్రభుత్వం వివరణనిచ్చింది. ఆచరణలో ఇది ఎలా ఉంటుందనేది చూడాలి.

వైఎస్సార్ ఆసరా.. దీంతో డ్వాక్రా సంఘాలను పునరుద్ధరించాలని, వడ్డీలేని రుణాలివ్వాలనేది లక్ష్యం.

ఇక తరువాతది, గతంలో టీడీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైందన్న ఆరోపణలున్న ఆరోగ్యశ్రీ. ఈ పథకానికి దాని పాత స్థాయిని తెస్తామనేది నవరత్నాల వాగ్దానం. ప్రస్తుత బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ.11,399 కోట్లు కేటాయించడం, ఆరోగ్యశ్రీని మధ్యతరగతి వర్గాలకు విస్తరించడంలో ప్రభుత్వం మంచి చొరవ తీసుకుంది. దీంతో ఆరోగ్యశ్రీ పేదప్రజల వైద్య అవసరాలకు భరోసా ఇవ్వగలదని అనుకోవచ్చు.

మరో అంశం.. ఫీజు రీయింబర్స్‌మెంట్. ఈ బడ్జెట్ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యాన్నిచ్చిందని దానికి కేటాయించిన రూ.32168 కోట్లను బట్టి చెప్పవచ్చు. గత ప్రభుత్వ కాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు సరిగా జరగక కొందరు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని అప్పట్లో జరిగిన విద్యార్థి-యాజమాన్య ఘర్షణలే చెబుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకానికి ఇస్తున్న ప్రాధాన్యం కారణంగా.. భవిష్యత్‌లో ఈ పరిస్థితి రాదని అనుకోవచ్చు.

తరువాత యుద్ధ ప్రాతిపదికన సాగు, తాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో ఈ అంశానికి సంబంధించిన కేటాయింపుల బలహీనత కనబడుతూనే ఉంది. కాబట్టి ఈ అంశంలో ప్రతిపక్షం విమర్శ సరైనదే.

మూడు దశల్లో మద్యనిషేధం అనేది మరో వాగ్దానం. ఇందులో భాగంగా మొదట బెల్టుషాపుల మీద చర్యలను ఇప్పటికే చూస్తున్నాం.

నవరత్నాల పునాదిమీద ప్రజల ఆదరణను పొందిన ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో వాటికి చేసిన కేటాయింపులు ప్రజలకు న్యాయం చేస్తాయా లేదా అనేది వేచి చూడాలి.

కాగా, గత బడ్జెట్ స్థాయి కన్నా 19శాతం పెరిగిన ఈ బడ్జెట్‌కు నిధుల కొరత, గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన భారీ అప్పుల వంటివి గుదిబండలు. అలాగే నిధుల కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉండాలి. ఈ సమస్యలన్నీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి జీవన్మరణంగా మారాయి.

గతంలో లేని విధంగా ఈ బడ్జెట్‌కు నవరత్నాల రూపంలో ఒక లక్ష్యం, గమ్యం ఉన్నాయి. ప్రజాసంక్షేమ ఆకాంక్ష ఉంది. కానీ, రాష్ట్ర రుణభారం ఇప్పటికే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 28.18 శాతానికి చేరుకోవడం (తెలంగాణలో ఇది 21.4 శాతం మాత్రమే), గత ప్రభుత్వం పదేపదే ఓవర్ డ్రాఫ్టులకు పోవడం వల్ల మరిన్ని కొత్త అప్పులు పుట్టడం, వాటిపై వడ్డీ శృతిమించకుండా ఉండటం కూడా బడ్జెట్ కేటాయింపులు విజయవంతం కావడానికి అడ్డంకులుగానే ఉండగలవు.

అలాగే, ఈ బడ్జెట్‌లో సంక్షేమం ఉంది కానీ, భవిష్యత్ పట్ల సరైన దృష్టి లేదనే ప్రతిపక్షం ఆరోపణలను కూడా కొట్టిపారేయలేం.

తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల్లో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించారు. కానీ నేడు ఈ పథకాల అమలు రాష్ట్ర ప్రభుత్వానికి తలకు మించిన భారంగా ఉంది. పెంచిన ఆసరా పింఛన్లు, దివ్యాంగుల పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.1 ,500 కోట్లు వంటివి పెండింగ్‌లోనే ఉన్నాయి.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మానసపుత్రికలైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ నిలిచిపోయాయి. వీటి కింద లక్షా 50 వేల దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంచేశారు. అలాగే 1200 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా.

అంటే మిగులు రాష్ట్రమైన తెలంగాణలోనే ఈ సంక్షేమ పథకాల అమలు కష్టసాధ్యంగా ఉంది. మరి వేల కోట్ల రూపాయల ద్రవ్యలోటు ఉండి, లక్షల కోట్ల రూపాయల అప్పులున్న ఆంధ్రప్రదేశ్‌లో 'నవరత్నాల' అమలు ఎంతవరకు ఆచరణ సాధ్యమనే ప్రశ్న రాక మానదు!

టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018-19 ఏపీ బడ్జెట్‌ కేటాయింపులకు ఒక దార్శనికత, ఫోకస్ లేవు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వివిధ సామాజిక వర్గాలను సంతృప్తి పరచే ప్రయత్నంగానే నాటి బడ్జెట్ ఉంది. ఇక, తర్వాతి కాలంలోని ఎన్నికల ముందరి 2019-20 మధ్యంతర బడ్జెట్‌లోని కేటాయింపులన్నింటి స్థాయికీ, నేటి వైసీపీ ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల స్థాయీకి మధ్య ఉన్నది కేవలం రూ.1800 కోట్ల తేడానే. కాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ బడ్జెట్‌లో పెట్టిన పథకాల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించడం విచిత్రం.

ప్రస్తుతం దేశంలోనే పెద్ద ఎత్తున ఆర్థిక పతన సూచికలు కనిపిస్తున్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ దశలో మొన్నటి కేంద్ర బడ్జెట్‌లోనే ఒక ఉద్దీపనను ఆశించి, అది జరగక నిరాశ చెందాం. కాబట్టి ప్రస్తుత ఏపీ బడ్జెట్‌లోని సంక్షేమ కేటాయింపులు, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి కనీసం ఆ రాష్ట్ర పరిధిలోనైనా ఆర్థిక ఉద్దీపనగా ఉండగలవని ఆశించొచ్చు.

చివరిగా, ప్రత్యేక హోదా కల నెరవేరకుండా, ఏపీ రాష్ట్ర పారిశ్రామికీకరణ, స్థూలజాతీయోత్పత్తిలో కేవలం 22శాతంగా మాత్రమే ఉన్న పారిశ్రామిక రంగం, 44శాతంగా ఉన్న సేవారంగాల విస్తరణ సాధ్యం కాదు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో వ్యవసాయం పాత్ర 18శాతం మాత్రమే ఉండగా, ఏపీలో ఇది 34శాతం ఉంది. అంటే ఏపీ ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమే. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయం ఈ సంవత్సరం ఏమేరకు సంపద పెంచగలదనేది సందేహమే.

మరి ఈ నవరత్నాల బడ్జెట్ కథ కంచికి చేరుతుందా లేదా అనేది రానున్న సంవత్సర కాలంలో చోటుచేసుకునే అనేక రాజకీయ, ఆర్థిక పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. దీనిలో వైసీపీ-బీజేపీల మధ్య సంబంధాలు అతి పెద్ద అశంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)