కాంగ్రెస్‌: తీవ్ర ఆర్థిక కష్టాల్లో జాతీయ పార్టీ.. సిబ్బంది జీతాలు చెల్లించటానికీ ఇబ్బందులు - ప్రెస్ రివ్యూ

  • 14 జూలై 2019
Image copyright Getty Images

వందేళ్ల పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి నడి సంద్రంలో చుక్కాని లేని నావలా మారిందని.. ఒకవైపు నాయకత్వ సంక్షోభం ఇప్పట్లో పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించకపోగా.. మరోవైపు ఆర్థిక సమస్యలూ ఆ పార్టీని చుట్టుముట్టాయని 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. రెండు నెలలుగా జీతాలు అందకపోవటంతో పార్టీలో వివిధ స్థాయుల్లో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు క్రమక్రమంగా దూరమవుతున్నారు. పార్టీ అనుబంధ విభాగాలకు నెలవారీ ఖర్చులను తగ్గించుకోవాలనే సూచనలు కోశాధికారి అహ్మద్‌ పటేల్‌ నుంచి వెళ్తున్నాయి.

దిల్లీలోని అక్బర్‌ రోడ్‌లో ఉన్న కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో పనిచేసే కార్యదర్శివర్గ సభ్యులు, కార్యకర్తలు రెండు నెలలుగా జీతాలు అందుకోలేదని సమాచారం. సేవాదళ్‌ నెలవారీ బడ్జెట్‌ను రూ. 2.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు కుదించారు. మహిళా విభాగం, ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లకూ ఖర్చులు తగ్గించుకోవాలని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి.

పార్టీల సామాజిక మాధ్యమ విభాగ సభ్యుల సంఖ్య 55 నుంచి 35కి పడిపోయిందని పేరు వెల్లడించటానికి ఇష్టపడని కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు. అయితే, రాహుల్‌కు మద్దతుగా తామూ రాజీనామా చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారని, ఇలాంటి వారిలో అత్యధికులు జీతాల్లో జాప్యంవల్లే ఆ నిర్ణయం తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ తదుపరి అధ్యక్షుడు తన కుటుంబంలో వ్యక్తి (సోనియా, రాహుల్‌, ప్రియాంక) కాకూడదని సీడబ్ల్యూసీకి మే 25వ తేదీనే రాహుల్‌ స్పష్టం చేశారు. నూతన అధ్యక్షుడి ఎంపికలోనూ తన కుటుంబ పాత్ర ఉండదని విస్పష్టం చేశారు. కొత్త నేతను ఎంచుకొనే పూర్తి బాధ్యతను సీడబ్ల్యూసీకే వదిలిపెట్టారు.

ఇందుకు రాహుల్‌ ఇచ్చిన నెల రోజుల వ్యవధి ఎప్పుడో గడచిపోయింది. నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనంత కాలం రాహులే ఆ పదవిలో కొనసాగుతారన్న సీడబ్ల్యూసీ సభ్యుల అంచనాలను తన రాజీనామాపై రాహుల్‌ రాసిన బహిరంగ లేఖ తలకిందులు చేసింది. ఈ లేఖ విడుదల చేసి పది రోజులు గడిచిపోయింది.

ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే.. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ కొనసాగటం లేదు. సీడబ్ల్యూసీ మరొకరిని ఆ స్థానంలో ఎన్నుకోనూ లేదు. సీడబ్ల్యూసీ భేటీ అయ్యే అవకాశం కూడా కనుచూపు మేర కనిపించటం లేదు.

Image copyright Getty Images

బీజేపీలోకి 107 మంది ఎమ్మెల్యేలు: బెంగాల్‌ బీజేపీ నేత ముకుల్‌ రాయ్‌ సంచలన వ్యాఖ్య

పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), కాంగ్రెస్, సీపీఎంలకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేత ముకుల్‌ రాయ్‌ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లోని పలువురు టీఎంసీ నేతలు మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీపై నమ్మకాన్ని కోల్పోయారని, ఆ పార్టీ విధానాలతో వారు విసుగుచెందారని శనివారం ఆయన విలేకరులతో పేర్కొన్నారు.

పలువురు టీఎంసీ కౌన్సిలర్లు బీజేపీలోకి వచ్చి, వెంటనే తిరిగి టీఎంసీలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో ముకుల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు చొప్పున బీజేపీలో చేరారు.

Image copyright Rimmanaguda/Facebook

వంద వెరైటీల్లో బతుకమ్మ చీరెలు

తెలంగాణలో ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా అందించే చీరెల తయారీ వేగవంతమైందని.. బతుకమ్మ చీరెలను పది డిజైన్లలో, ఒక్కో డిజైన్ పది రంగుల్లో తయారుచేస్తున్నారని.. దీంతో వంద వెరైటీల్లో చీరెలు తయారు కానున్నాయని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. తెల్లరేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరెను కానుకగా అందజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటి మంది అర్హులు ఉంటారనే అంచనాతో చీరెల తయారీ ప్రారంభించారు.

ఒక చీరె 5.5 మీటర్లు, జాకెట్ 80 సెంటిమీటర్ల చొప్పున కోటి మందికి మొత్తం 6.3 కోట్ల మీటర్ల చీరె అవసరం. ఇప్పటివరకు రెండు కోట్ల మీటర్ల చీరెలు తయారుచేసినట్టు సమాచారం. చీరెలను సిరిసిల్లలోని మరమగ్గాలపై తయారుచేసేలా ఆర్డర్లు ఇచ్చారు.

వీటి కోసం ప్రభుత్వం రూ. 320 కోట్లు వెచ్చించనుంది. తయారైన చీరెలను ఆగస్టు 15 తర్వాత జిల్లాలకు తరలించనున్నారు. సెప్టెంబర్ 28 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభంకానున్న నేపథ్యంలో.. చీరెల పంపిణీని ఆ నెల15 కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. 17 వేల మరమగ్గాల మీద బతుకమ్మ చీరెలు తయారవుతున్నాయి.

వచ్చేవారం నాటికి మగ్గాల సంఖ్యను 20 వేలకు పెంచి చీరెల తయారీని వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. చీరెల తయారీతో సిరిసిల్లలో కార్మికులకు ఆరునెలలు చేతినిండా పనిదొరుకుతోంది. కార్మికులకు ప్రతినెలా కనీసం రూ.20 వేలు వేతనంగా అందేలా అధికారులు చర్యలు చేపట్టారు.

తెలంగాణలో కొంత మంది మహిళలు ఎనిమిది గజాల చీరెలను ధరించేందుకు ఇష్టపడతారు. ఈ డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుతం ఎనిమిది గజాల చీరెలను నేయిస్తున్నారు. ఎనిమిది గజాల చీరెలను 8.2 మీటర్లతో, 80 సెంటీమీటర్లతో జాకెట్‌ను అందిస్తారు. వీరికోసం ప్రత్యేకంగా 10 లక్షల చీరెలను తయారుచేయిస్తున్నారు.

మీటూ కార్టూన్

నన్ను లైంగికంగా వేధించారు.. బాస్‌ని 'ఇంప్రెస్‌' చేయాలన్నారు: యాంకర్‌ శ్వేతారెడ్డి ఫిర్యాదు

బిగ్‌బాస్‌-3 నిర్వాహకులపై యాంకర్‌ శ్వేతారెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నలుగురిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. బిగ్‌బాస్‌-3 ఆడిషన్స్‌కు హాజరైన తనను నిర్వాహకులు ఎంపిక చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను ఎంపిక చేసినట్టుగా అగ్రిమెంట్‌ పత్రం ఇవ్వకుండా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.

నిర్వాహకులు రవికాంత్‌, రఘు, అభిషేక్‌, శ్యాం తనను శ్రీనగర్‌ కాలనీలోని ఓ రెస్టారెంట్‌కు పిలిచి... బిగ్‌బాస్‌ కాంటె‌స్ట్‌లో చేయాలంటే బాస్‌ను 'ఇంప్రెస్‌' చేయాలంటూ షరతులు విధించారన్నారు. తనను మోసం చేయడమే కాకుండా, లైంగిక వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు.

ఉత్తరాదిన ఉన్న 'గలీజు సంస్కృతి'ని తెలుగువారిపై రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.

రవికాంత్‌, రఘు, అభిషేక్‌, శ్యాంపై ఐపీసీ సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని బంజారాహిల్స్‌ సీఐ కళింగరావు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)