చంద్రయాన్ 2: చందమామపై ఎందుకింత మక్కువ

  • 14 జూలై 2019
చంద్రయాన్ 2 శాస్త్రవేత్త వనిత Image copyright Getty Images

చంద్రయాన్ 1తో కీలక మైలురాయిని దాటిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్ 2 మిషన్‌తో మరోసారి చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. చంద్రుడిపై పరిశోధనకు ఉద్దేశించిన ఈ మిషన్‌ను జులై 15 రాత్రి 2.15 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభించాల్సి ఉండగా.. సరిగ్గా 56 నిమిషాల ముందు సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగాన్ని తిరిగి ఎప్పుడు చేపడతామో త్వరలోనే తెలియజేస్తామని పేర్కొంది.

ఇంతవరకూ ఏ దేశమూ చేరుకోని ప్రదేశమైన చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతానికి ఇది చేరుకుంటుంది. ఇక్కడున్న ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇంతవరకూ ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన రోవర్ కూడా ఇక్కడకు చేరుకోలేదు. ఇంతవరకూ ప్రయోగించిన మిషన్లన్నీ చంద్రుడి మధ్య ప్రాంతానికే పరిమితమయ్యాయి. ఇదంతా సమతలంగా ఉంటుంది. కానీ దక్షిణ ధృవం మొత్తం అగ్నిపర్వతాలు, ఎత్తుపల్లాలుగా ఉండే ఉపరితలంతో ఉంటుంది.

సమస్యలు ఎదురయ్యేందుకు ఇక్కడ అవకాశాలు చాలా ఎక్కువ.

Image copyright Getty Images

చంద్రయాన్ 2 లక్ష్యమేంటి?

చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ లాండింగ్ చేయగల సామర్థ్యాన్ని (ఏదైనా గ్రహం లేదా అంతరిక్షంలోని గ్రహ శకలం ఉపరితలం మీద వాహక నౌకకు ఎలాంటి నష్టం జరగకుండా దిగడం) నిరూపించుకోవడం, ఉపరితలంపై ఓ రోబోటిక్ రోవర్‌ను నడపడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశాలు. చంద్రుడి నైసర్గిక స్వరూపం, ఖనిజాలు, ఇతర వాయువులు, చంద్రుడి ఉపరితల వాతావరణం, నీటి లభ్యత వంటి అంశాలపై అధ్యయనం చేయడం కూడా శాస్త్రవేత్తల లక్ష్యం.

దీంతో, ఒకప్పటి సోవియట్ యూనియన్, అమెరికా, చైనాల తర్వాత చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్, రోవర్‌ను దింపడం వంటివి చేయగల నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. చంద్రుడి కక్ష్యలో, ఉపరితలంపై, వాతావరణంలో, చంద్రుడి ఉపరితలం కింద రకరకాల ప్రయోగాల నిర్వహణ సామర్థ్యం భారత్ సొంతమవుతుంది. చంద్రుడి గురించి మరింత తెలుసుకోవడానికి, మానవాళికి అవసరమైన సమాచారాన్ని వెలికితీయడానికి ఈ పరిశోధనతో ప్రయత్నం జరుగుతోంది.

Image copyright Getty Images

చంద్రయాన్ 2 ప్రయోగం చంద్రయాన్ 1 కి కొనసాగింపు. చంద్రయాన్ 1 చంద్రుడిపై నీటిజాడలను గుర్తించింది. దీనిపై మరింత లోతైన అధ్యయనం అవసరం. చంద్రుడి ఉపరితలంపై ఎంత పరిమాణంలో నీటి లభ్యత ఉందో, ఉపరితలం కింద, ఉపరితల వాతావరణంలోనూ పరిస్థితేంటో లోతుగా పరిశీలించాల్సి ఉంది. అప్పుడే చంద్రుడిపై నీటి గురించి మాట్లాడే వీలు చిక్కుతుంది.

ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో మూడు భాగాలుంటాయి. ఒక ఆర్బిటాల్, ఒక ల్యాండర్ (దీనికి భారత అంతరిక్ష కార్యక్రమానికి ఆద్యుడుగా భావించే డాక్టర్ విక్రమ్ సారాభాయ్‌కి గుర్తుగా విక్రమ్ అని పేరు పెట్టారు), ఆరు చక్రాలున్న రోవర్ (దీని పేరు ప్రజ్ఞాన్). వీటన్నింటినీ ఇస్రోనే రూపొందించింది.

ఈ మిషన్ ద్వారా ముందుగా ఆర్బిటార్‌ను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుంది. అప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై దిగి అటూ ఇటూ తిరుగుతూ తన ప్రయోగాలను ప్రారంభిస్తుంది. దక్షిణ ధృవ ప్రాంతంలోని మాంజినస్-సీ, సింపెలియస్-ఎన్ అనే రెండు అగ్ని పర్వతాల మధ్యలోనున్న ఎత్తైన ప్రాంతంలో 2019 సెప్టెంబర్ 6న ల్యాండర్ చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడి ఉపరితలంపైన, లోపల ఒక రోజు (ఇది భూమిపై 14 రోజులకు సమానం) పాటు రోవర్ తన పరిశోధనలు, ప్రయోగాలను నిర్వహిస్తుంది. ఆర్బిటార్ మిషన్ మరో సంవత్సరం పాటు కొనసాగుతుంది.

Image copyright Getty Images

640 టన్నుల బరువున్న భారత భారీ వాహక నౌక జీఎస్ఎల్వీ ఎంకే 3 ద్వారా 3890 కేజీల బరువున్న చంద్రయాన్ 2ను ప్రయోగించబోతున్నారు. ఈ వాహక నౌక ద్వారా భారత్‌కు చెందిన మరో 13 శాస్త్రీయ పరిశోధన సాధనాలు (ఆర్బిటార్‌లో 8, ల్యాండర్‌లో 3, రోవర్‌లో 2)తో పాటు నాసాకు చెందిన ఓ సాధనాన్ని కూడా చంద్రుడిపైకి పంపించనున్నారు.

సైన్స్ సంగతిని కాసేపు పక్కన పెడితే, చంద్రయాన్ 2 ద్వారా అశోక చక్రం ముద్ర, ఇస్రో గుర్తులను చంద్రుడిపై లిఖించబోతోంది భారత్. "రోవర్‌ చక్రాలకు ఓ వైపు అశోక చక్రం, మరోవైపు ఇస్రో గుర్తు ఉన్నాయి. ఇవి చంద్రుడిపై రోవర్ అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు ఈ గుర్తులు అక్కడి నేలపై పడతాయి" అని ఇస్రో చైర్మన్ అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images

రోవర్ దక్షిణ ధృవం దగ్గరే ఎందుకు దిగుతోంది?

ఈ ప్రశ్న చాలామందికే వచ్చి ఉండొచ్చు. ఇక్కడ దిగడం క్లిష్టమైన ప్రక్రియ అని భావిస్తున్నప్పుడు చంద్రుడిపై పరిశోధనకు ఆ ప్రదేశాన్నే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది?

చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఇంతవరకూ ఎవరూ చేరుకోలేదు. దీనిపై ఎవరూ పరిశోధన చేయలేదు. అందుకే ఇది ప్రత్యేకం, ఇక్కడ దిగడం ద్వారా ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

దీనిలో చాలా భాగం ఎల్లప్పుడూ సూర్యుడి ఛాయలోనే ఉంటుంది. సూర్యకాంతి లేకపోవడం వల్ల ఇక్కడ అసాధారణ శీతల వాతావరణం ఉంటుంది. శాశ్వతంగా సూర్యుడి ఛాయ కింద ఉండే ఈ ప్రాంతాల్లో నీరు, ఖనిజాలు ఉండే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇటీవల చేపట్టిన కొన్ని ఆర్బిటింగ్ మిషన్ల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. నీరు లభించే అవకాశముండటంతో చందమామ దక్షిణ ధృవం భవిష్యత్‌లో మానవ మనుగడకు అనువైన ప్రాంతం కావచ్చని శాస్త్రవేత్తల ఆలోచన.

సౌరవ్యవస్థలోని ఐట్కెన్ బేసిన్ అంచుల్లో చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతం ఉంది. ఇక్కడి ఉపరితలభాగమంతా చంద్రుడి పైభాగం (క్రస్ట్), ఉపరితలం నుంచి లోపలి భాగం (మ్యాంటిల్)లో లభ్యమయ్యే పదార్థాలతో నిండి ఉంటుంది. ఈ పదార్థాలపై పరిశోధనలు నిర్వహిస్తే... అసలు చంద్రమామ ఎలా ఏర్పడిందో, భవిష్యత్‌ మిషన్లకు ఇది ఓ వనరుగా ఉపయోగపడేందుకు అవకాశం ఉందో లేదో వంటి విషయాలన్నీ స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Image copyright iSRO

చందమామపై ఎందుకింత మక్కువ?

ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఓసారి ఇలా అన్నారు... "మానవుడు అంతరిక్షంలోకి వెళ్లకపోతే మానవాళికి భవిష్యత్ ఉండదు."

ఖగోళ వస్తువులన్నింట్లో భూమికి అత్యంత దగ్గరగా ఉన్నది చందమామే. అందుకే మరిన్ని అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన సాంకేతికతను పరీక్షించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. చంద్రుడికి, భూమికీ ఎప్పటి నుంచో చారిత్రక సంబంధం కూడా ఉంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టీ చంద్రుడిపైనే.

(వ్యాసకర్త రమేశ్ శిశు కెమికల్ ఇంజనీరింగ్‌లో 1972లో యూనివర్సిటీ ఆఫ్ డెట్రాయిట్ నుంచి డాక్టరేట్ పొందారు. సైన్స్ సంబంధ విషయాలపై 42 ఏళ్ల అనుభవం ఉంది. రెండు డజన్లకుపైగా పరిశోధనా పత్రాలు, నివేదికలను ప్రచురించారు. 'ట్రావెల్ బియాండ్ ది ఎర్త్ - రీచింగ్ ది మూన్' పేరుతో ఓ పుస్తకం కూడా రాశారు. ఈ వ్యాసంలోని అభిప్రాయాలన్నీ ఆయన వ్యక్తిగతమైనవి, బీబీసీవి కాదు.)

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)