రెండు వందల రూపాయల అప్పు తీర్చడానికి 30 ఏళ్ళ తరువాత ఇండియాకు వచ్చిన కెన్యా ఎంపీ

  • 14 జూలై 2019
రిచర్డ్, కాశీనాథ్ Image copyright RICHARD TONGI/RAVIKANT GAVLI
చిత్రం శీర్షిక రిచర్డ్, కాశీనాథ్

కాశీనాథ్ మార్తాండరావ్ గవాలి వయసు 75 సంవత్సరాలు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నగరంలో వాంఖడే నగర్ నివాసి.

అతడి ఇంట్లో కింది భాగంలో కిరాణ దుకాణం ఉంది. పైన నాలుగు అంతస్తుల్లో నివాసం ఉంటున్నారు.

ఆదివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో కాశీనాథ్ ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నారు. అంతలో కింద దుకాణం నుంచి అతడి కొడుకు నందకుమార్ ఫోన్ చేసి, ''నిన్ను కలవటానికి ఎవరో వచ్చారు'' అని చెప్పారు.

భోజనం ముగించుకుని ఓ 15 నిమిషాల తర్వాత కిందికి వెళ్లారు కాశీనాథ్.

షాపులో ఒక మధ్యవయస్కుడు వేచివున్నాడు. అతడు విదేశీయుడు. అతడితో పాటు ఒక మహిళ కూడా ఉంది.

వాళ్లెవరో కాశీనాథ్‌కు అర్థంకాలేదు. కానీ, కాశీనాథ్‌ను చూడగానే వాళ్లిద్దరి కళ్లలో నీళ్లు తిరిగాయి. వాళ్లు అయిదారు నిమిషాలు ఏమీ మాట్లాడలేకపోయారు. కాశీనాథ్‌ను చూస్తూ కన్నీళ్లు కార్చారు.

ఏం జరుగుతోందో తెలియక కాశీనాథ్ అయోమయానికి గురయ్యారు. ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు.

అప్పుడు ఆ మధ్యవయస్కుడైన విదేశీయుడు తనను పరిచయం చేసుకున్నాడు. అంతే, కాశీనాథ్‌కు ఒక్కసారిగా అంతా గుర్తొచ్చింది.

Image copyright RAVIKANT GAVALI

ఈ కథ 1985లో మొదలైంది. ఔరంగాబాద్‌లోని మౌలానా ఆజాద్ కాలేజీ దగ్గర వాంఖడేనగర్ పరిసరాల్లో కొత్త కాలనీ ఏర్పడింది. అక్కడ నిర్మించిన ఇళ్లలో చాలా మంది యజమానులు.. పక్కనే ఉన్న కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులకు అద్దెకు ఇచ్చారు. ఆ విద్యార్థుల్లో చాలా మంది విదేశీయులూ ఉన్నారు.

రిచర్డ్ న్యాగ్కా టోంగీ కూడా అటువంటి ఒక విద్యార్థి. 1985లో ఔరంగాబాద్‌లో చదువు కోవటం కోసం కెన్యా నుంచి వచ్చాడాయన. కాశీనాథ్ దుకాణం సమీపంలో అద్దెకు ఉండేవారు.

అయితే, అతడి ఖర్చులకు అవసరమైన డబ్బులు కెన్యాలో ఉన్న తన కుటుంబం నుంచి అతడికి చాలాసార్లు సమయానికి అందేవి కాదు. దీంతో, కొన్నిసార్లు కాశీనాథ్ దుకాణం నుంచి తనకు అవసరమైన వస్తువులు అప్పు తీసుకోవాల్సి వచ్చేది. పాలు, రొట్టె, గుడ్లు, రవ్వ, నెయ్యి వంటి సరకులను కాశీనాథ్ సంశయించకుండా ఇచ్చేవారు.

రిచర్డ్ తన చదువు పూర్తిచేసుకుని 1989లో కెన్యా తిరిగివెళ్లిపోయారు. అక్కడికి వెళ్లాక తన ఖర్చులు లెక్కవేసుకుంటున్నపుడు, కాశీనాథ్‌కు తాను రూ. 200 బాకీ చెల్లించాల్సి ఉందని గుర్తించారు. అప్పటి నుంచీ ఆ అప్పు తిరిగి చెల్లించాలని అనుకుంటూ ఉండేవారు.

కాలక్రమంలో పరిస్థితులు మారాయి. రిచర్డ్ రాజకీయాల్లోకి వెళ్లారు. కెన్యా పార్లమెంటు సభ్యుడయ్యారు. అయినప్పటికీ, కాశీనాథ్‌కు చెల్లించాల్సిన బాకీ గురించి మరచిపోలేదు.

Image copyright RAVIKANT GAVALI

''ఆ అప్పు తిరిగి చెల్లించకపోతే నేను దేవుడి ముందు ఎలా నిల్చోగలను?'' అని అతడు తన భార్యతో చెబుతుండేవారు. భారతదేశానికి వెళ్లే అవకాశం కల్పించాలని దేవుడిని ప్రార్థించేవారు.

చివరికి, ముప్పై సంవత్సరాల తర్వాత గత వారంలో రిచర్డ్‌కి ఆ అవకాశం లభించింది. ఆయన ప్రస్తుతం కెన్యా పార్లమెంటులో రక్షణ, విదేశీ వ్యవహారాల కమిటీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. భారత పర్యటనకు వచ్చిన కెన్యా ప్రతినిధి బృందంలో ఆయన కూడా వచ్చారు.

దిల్లీలో తన పని పూర్తిచేసుకున్న తర్వాత ఆయన ఆదివారం నాడు ఔరంగాబాద్ వచ్చారు. డాక్టర్‌గా పనిచేస్తున్న ఆయన భార్య కూడా ఆయన వెంట వచ్చారు.

వాంఖడేనగర్‌లో కాశీనాథ్ ఇంటికోసం వెదికారు. ఆ ప్రాంతమంతా పూర్తిగా మారిపోవటంతో ఇల్లు కనుక్కోలేకపోయారు. అయితే 'గవాలి' అనే ఇంటిపేరు ఆయనకు గుర్తుంది. అదికూడా 'గవాయా' అని పలుకుతారు. దీంతో అక్కడి జనానికి కూడా ఆయన ఎవరి కోసం వెదుకుతున్నారో అర్థంకాలేదు.

అయితే, గవాలి బనియన్ తొడుక్కుని దుకాణంలో ఎలా కూర్చుంటాడో రిచర్డ్ వివరించి చెప్పేటప్పటికి అందరికీ అర్థమైంది. రిచర్డ్ కొంతమందితో మాట్లాడుతుండగా, వారిలో అదృష్టవశాత్తూ కాశీనాథ్ బంధువు ఒకరు ఉన్నారు. ఆయన రిచర్డ్‌ను కాశీనాథ్ ఇంటికి తీసుకెళ్లారు.

అలా కలిసిన రిచర్డ్, కాశీనాథ్ ఇద్దరూ చాలా సంతోషించారు. రిచర్డ్‌ను ఇంటికి తీసుకెళ్లారు కాశీనాథ్. ఆయన పార్లమెంటు సభ్యుడయ్యారని తెలిసి ఆనందం వ్యక్తంచేశారు. రిచర్డ్‌ను సత్కరించి ఆతిథ్యమిచ్చారు. కాశీనాథ్ ఇంట్లో రిచర్డ్ మూడు గంటల పాటు ఉన్నారు. మాట్లాడుతుండగా కాశీనాథ్‌కు తాను రూ. 200 బాకీ ఉన్న విషయం చెప్పారు.

Image copyright RAVIKANT GAVALI

బాకీ తీర్చటానికి 250 యూరోలు ఇవ్వబోయారు. కాశీనాథ్ ఆ డబ్బులు తీసుకోవటానికి నిరాకరించారు. రిచర్డ్ అంత దూరం నుంచి తనను కలవటానికి రావటమే పట్టలేనంత సంతోషాన్నిచ్చిందని చెప్పారు. కానీ రిచర్డ్ పట్టుపట్టారు.

''నా కష్ట కాలంలో మీరు నాకు సాయం చేశారు. దానిని ఎన్నడూ మరచిపోను. నేను ఒక రైతు బిడ్డను. అప్పు తిరిగి చెల్లించకుండా నేను ప్రశాంతంగా జీవించలేను. మీ అప్పు తీర్చకపోతే నేను దేవుడి ముందు ఎలా నిలబడగలను?'' అని చెప్పారు.

ఈ మాటలు విన్నతర్వాత కాశీనాథ్ కూడా కన్నీళ్లపర్యంతమయ్యారు. సంతోషంగా ఆ డబ్బులు తీసుకున్నారు. కాశీనాథ్ కుటుంబ సభ్యులందరినీ కెన్యాలో తమ ఇంటికి రావాలని రిచర్డ్ ఆహ్వానించారు. అక్కడి నుంచి సెలవు తీసుకున్నారు.

కాశీనాథ్ చాలా మంది పేద విద్యార్థులకు సాయం చేశారు. ఆ విద్యార్థులు తమ కుటుంబం నుంచి తమకు డబ్బులు అందిన వెంటనే అప్పులు తిరిగి చెల్లించేవాళ్లు. కాశీనాథ్‌కు, అక్కడ చదువుకున్న విద్యార్థులు చాలా మందికి మధ్య మంచి సంబంధాలు ఏర్పడేవి. ఆ విద్యార్థుల్లో చాలా మంది ఇప్పటికీ కాశీనాథ్ దగ్గరకు వస్తుంటారు.

''అతిథి దేవోభవ అని మన సంస్కృతి నేర్పుతుంది. ఆ సిద్ధాంతాన్ని నేను పాటిస్తాను. నాకు చేతనైన రీతిలో విద్యార్థులకు సాయం చేశాను. ఈ విద్యార్థుల వల్ల మేం కూడా అభివృద్ధి చెందాం. మా ఇల్లు కట్టుకున్నాం. ఒక హోటల్ ప్రారంభించాం. విద్యార్థులకు సాయం చేయటం వల్ల లభించిన పుణ్యం వల్లే మాకు మంచి రోజులు వచ్చాయని మేం భావిస్తాం'' అంటారు కాశీనాథ్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు