కేరళ: ఈ వానా కాలాన్ని దాటేది ఎలా? గత ఏడాది వరదల నుంచి పాఠాలు నేర్చుకుందా?

  • 16 జూలై 2019
వరద బాధితులు Image copyright Reuters

గత ఏడాది పోటెత్తిన వరదలు కేరళను కన్నీటి సంద్రంగా మార్చాయి. దాదాపు 350 మంది చనిపోగా మరెందరో సర్వం పోగొట్టుకొని నిరాశ్రయులయ్యారు.

ఈ సమస్యకు కారణం రాష్ట్రంలోని 44 నదులపై కట్టిన డ్యాములేనని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ డ్యాములు ఏ క్షణంలోనైనా కూలొచ్చని వారు హెచ్చరిస్తున్నారు. మరి నాడు వరదల్లో అన్నీ పోగొట్టుకుని వీధిన పడిన వారి జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి కేరళ నుంచి అందిస్తున్న కథనం.

Image copyright AFP/Getty Images

నిరుడు ముంచెత్తిన భయానక వరదలు కేరళకు కీలకమైన పర్యాటక, వ్యవసాయ రంగాలను చిన్నాభిన్నం చేశాయి.

ప్రభుత్వం డ్యాములను, జలాశయాలను సరిగా నిర్వహించలేక పోవడమే ఈ భారీ వరదలకు ప్రధాన కారణమనే విమర్శలు ఉన్నాయి.

రాష్ట్రంలోని ఆనకట్టల నిర్వహణ పట్ల మరింత శ్రద్ధ వహించి సమయానుసార చర్యలు చేపట్టి ఉండాల్సిందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఇపుడు అంగీకరిస్తున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: వరదల ఉపద్రవం నుంచి కేరళ పాఠాలు నేర్చుకుందా, లేదా?

కేరళ ప్రభుత్వ ప్రతినిధి, శాసనకర్త సాజీ చెరియన్ బీబీసీతో మాట్లాడుతూ- "చెరోంతని, ముల్లపెరియార్ డ్యాములు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు. వాటి నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. ఈ విషయంలో కేరళ, తమిళనాడు ఒక ఒప్పందానికి రావాల్సి ఉంది" అని చెప్పారు.

డ్యాముల నిర్వహణలోని లోటుపాట్లను కనిపెట్టేందుకు జాకోబ్ అలెక్స్ నేతృత్వంలో కేరళ హైకోర్టు ఒక కమిటీని నియమించింది.

Image copyright Reuters

నదులు, డ్యాం నిర్వహణ అంశాల్లో నిపుణుడైన ఎస్‌పీ రవి బీబీసీతో మాట్లాడుతూ- "2018 ఆగస్టు 16 ఉదయం నాటికే రాష్ట్రంలోని డ్యాములను ఒకవైపు వరద ముంచెత్తగా మరోవైపు పరంబికుళం, షోలయార్ డ్యాముల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో పెరినగల్‌కుట్టి డ్యాం పూర్తిగా నిండిపోయింది. డ్యాంకు రెండు మీటర్ల ఎత్తులో నీళ్లు ప్రవహించాయి. అదృవశాత్తు నాడు అది కూలిపోలేదు. బాగా దెబ్బతినింది. నేటికీ ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతుల్లో దాని భద్రతను సమీక్షించి, తగిన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు'' అని తప్పుబట్టారు.

వరదల్లో ఇళ్లు పోగొట్టుకుని శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులు, ప్రభుత్వం నిర్మించే ఇళ్ల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు.

బాధితులకు పరిహారం ఇవ్వడంతోపాటు ఇళ్లను తిరిగి నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే నేటికీ అది జరగలేదని బీబీసీతో మాట్లాడిన బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.

Image copyright Reuters

"పరిహారం కోసం మాతో ఏవో కాగితాలు రాయించుకున్నారు. నేను మా నాన్నను పోగొట్టుకున్నా. మా ఇల్లు ధ్వంసమైంది. మొదట్లో మాకు రూ.10 వేలు ఇచ్చారు. మిగతా పరిహారం కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నాం'' అని అలెప్పీ జిల్లా చెంగనూర్ ప్రాంతానికి చెందిన వరద బాధితురాలు తంగమణి చెప్పారు.

2018 వరదలు సంభవించినప్పటి నుంచి కేరళ ప్రభుత్వ నీటి నిర్వహణ తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాటి వరదల నుంచి ప్రభుత్వం పెద్దగా పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. మరి ఈ వానా కాలాన్ని కేరళ ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)