ఏపీ అసెంబ్లీ: ‘చంద్రబాబు విదేశీ పర్యటనలపై విచారణ జరపాలి’ - ప్రెస్‌ రివ్యూ

  • 16 జూలై 2019
Image copyright chandrababu/fb

విదేశీ పర్యటనల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార పక్షం ఆరోపించింది. టీడీపీ దీనిని తిప్పికొట్టిందని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

2014 జూన్‌ నుంచి 2019 ఏప్రిల్‌ వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వివిధ దేశాలు చుట్టి వచ్చేందుకు 38 పర్యటనలు చేశారని సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా లేవనెత్తారు.

రాష్ట్ర ప్రజలపై రూ.39 కోట్ల భారం తప్ప రాష్ట్రానికి ఒరిగింది ఏమీలేదని, నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎక్కడికి వెళితే అక్కడి అంశాలను రాష్ట్రానికి ఆపాదించారని, 2014 నవంబర్‌లో సింగపూర్‌ వెళ్లి ఏపీని టూరిస్ట్‌ హబ్‌గా చేస్తానన్నారని.. జపాన్‌ వెళ్లి ఏపీ యూనివర్సిటీల్లో జపనీస్‌ నేర్పిస్తామని.. చైనా వెళ్లి షాంఘైలా అమరావతి నిర్మాణం.. లండన్‌ వెళ్లి అమరావతి నిధుల సమీకరణకు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ అంగీకరించినట్లు చెప్పారని.. చివరకు కజక్‌స్థాన్‌ వెళ్లి అక్కడి రాజధానిలా అమరావతి నిర్మిస్తామంటూ ఏ దేశానికి వెళితే అక్కడి విషయాలను వినిపించి కొరియాను సైతం వదలకుండా నిధులు నీళ్లలా ఖర్చు చేశారు తప్ప సాధించిందేమీ లేదన్నారు.

విదేశాలకు వెళ్లి చంద్రబాబు విజయ్‌ మాల్యాను కలిశారని ఆరోపించారు. పరిశ్రమల మంత్రి గౌతమ్‌రెడ్డి సమాధానమిస్తూ.. చంద్రబాబు గత ఐదేళ్లలో విదేశీ పర్యటన ఖర్చుల వివరాలు కేబినెట్‌ సబ్‌ కమిటీ వద్ద ఉన్నాయని చెప్పారు.

టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు దీనిపై తక్షణమే స్పందించారు. శాసనమండలిలో ఈ మంత్రే ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. గత ఐదేళ్లలో ఏర్పాటైన పరిశ్రమల వల్ల 5.13లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారని గుర్తుచేశారు.

ఆ సంఖ్య వాస్తవమే కానీ.. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ చాలా పెద్దదని గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 'వెరీగుడ్‌ ఒప్పుకొన్నందుకు.. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు ఎంత కష్టపడ్డామో సీఎం సెక్రటరీని అడిగితే చెబుతారు' అంటూ అచ్చెన్న సూచించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఈ ఘటనపై చివర్లో చంద్రబాబు మాట్లాడారని ఈనాడు తెలిపింది. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి ఉపాధి పెరగడానికి నిత్యం శ్రమించానని. ఇతర దేశాలకు వెళ్లి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించానని చంద్రబాబు తెలిపారు.

39వేల చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో 5.13 లక్షల మందికి ఉపాధి వచ్చిందన్నారు. రూ.16వేల కోట్ల ఒప్పందాలు కుదిరాయని, వీటిపై దృష్టిపెడితే ఇంకా ఉద్యోగాలు పెరుగుతాయని వివరించారు. కియా పరిశ్రమ తీసుకొచ్చి, దక్షిణ కొరియా టౌన్‌షిప్‌ ఏర్పాటు చేశామని చెప్పారని ఈనాడు తెలిపింది.

Image copyright kcr/fb

రైతు రుణమాఫీ గజిబిజి

రైతు రుణమాఫీపై తెలంగాణ సర్కారు కసరత్తు ప్రారంభించింది. మాఫీ అమలుకు సంబంధించి మార్గ దర్శకాలను ఖరారు చేసే ప్రక్రియ ను వ్యవసాయశాఖ మొదలు పెట్టిందని సాక్షి తెలిపింది.

రుణమాఫీని ఎలా, ఎప్పటినుంచి అమలు చేయాలి? అర్హులను ఎలా గుర్తించాలి? గత రుణమాఫీ సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తాయి? ఈసారి అటువంటి విమర్శలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తది తర అంశాలపై అధికారులు మేధోమథనం చేస్తున్నారు.

అందులో భాగంగా అసలు రుణమాఫీ ఎంత చేయాల్సి వస్తుందన్న దానిపై లెక్కలు తీస్తున్నారు. అయితే రుణమాఫీకి ఎంత సొమ్ము అవసరమన్న దానిపై గందరగోళం నెలకొంది. బ్యాంకు లెక్కలకు, వ్యవసాయశాఖ లెక్కలకు మధ్య పొంతన లేకుండా పోయింది.

రుణమాఫీ అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా ఈ గందరగోళం నెలకొంది. ఏది సరైన సమాచారమన్న అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బ్యాంకులు మాత్రం రూ.20 వేల కోట్లు రుణమాఫీకి సరిపోతాయని సర్కారుకు విన్నవించగా, వ్యవసాయ వర్గాలు రూ.26 వేల కోట్లు అవసరమని అంచనా వేశాయి. బ్యాంకులైతే తమ అంచనాను ఆర్థికశాఖకు కూడా అందజేసినట్లు సమాచారం.

అయితే ఈ లెక్కలు ఏమేరకు సరిగ్గా ఉన్నాయనే దానిపై అధికారుల్లో పలు సందేహాలున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుత రుణమాఫీకి కటాఫ్‌ తేదీని 2018 డిసెంబర్‌ 11గా ప్రకటించింది. కటాఫ్‌ తేదీని ప్రకటించిందేకానీ, ఎప్పటినుంచి అమలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.

బ్యాంకర్లు, వ్యవసాయశాఖ వర్గాలు మాత్రం గత రుణమాఫీ కింద చివరి విడత సొమ్ము చెల్లించిన నెల నుంచి పరిగణలోకి తీసుకుంటున్నాయి. 2017 సెప్టెంబర్‌ నాటికి గత రుణమాఫీ పూర్తిగా చెల్లించిన నెలగా వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి 2018 డిసెంబర్‌ 11 వరకు లెక్కలోకి తీసుకున్నట్లు వారంటున్నారు. ఆ ప్రకారమే తాము రుణమాఫీకి అర్హులను, సొమ్మును అంచనా వేశామని అంటున్నారు.

బ్యాంకర్లు చెరకు, పసుపు రైతులను పరిగణలోకి తీసుకోలేదని వ్యవసాయశాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దానివల్ల బ్యాంకర్లు తక్కువ సొమ్ము చూపారని వ్యవసాయాధికారులు అంటున్నారు. తాము ఆ రైతులను కూడా పరిగణలోకి తీసుకున్నామని, అందుకే రూ.26 వేల కోట్ల వరకు లెక్క తేలిందంటున్నారు. అయితే ఎప్పటినుంచి అమలు చేస్తారన్న తేదీ ఖరారు చేసి మార్గదర్శకాలు విడుదల చేశాకే రైతుల సంఖ్య, చెల్లించాల్సిన సొమ్ముపై స్పష్టత రానుందని సాక్షి వెల్లడించింది.

Image copyright Buggana/fb

వైఎస్‌ వల్లే ఏపీకి కియా: బుగ్గన

దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విజ్ఞప్తి మేరకే కియా పరిశ్రమ ఏపీకి వచ్చిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారని ఈనాడు తెలిపింది.

శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాజీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలపై ఎమ్మెల్యేలు గోవర్ధన్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి వేసిన ప్రశ్నలపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ విజ్ఞప్తి మేరకు కియా పరిశ్రమ వచ్చిందన్న విషయాన్ని సీఎం జగన్‌కు ఆ సంస్థ సీఈవో, అధ్యక్షుడు హన్‌-వూ పార్క్‌ రాసిన లేఖలో పేర్కొన్నారని తెలిపారు.

సభలో ఆయన ఆ లేఖను చదివి వినిపించారు. ''హ్యుందయ్‌ మోటార్స్‌, ఆర్‌అండ్‌డీ విభాగం సారథిగా హన్‌-వూ పార్క్‌ ఉన్న సమయంలో 2007లో అప్పటి సీఎం రాజశేఖరరెడ్డిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆటోమొబైల్‌ ఫ్యాక్టరీ రంగంలో పెట్టుబడి పెట్టాలని వైఎస్‌ఆర్‌ కోరగా భారత్‌లో తమ గ్రూపు అదనపు ప్రణాళికలు ఉంటే పెడతామని హన్‌-వూ పార్క్‌ చెప్పారు. హ్యుందయ్‌ మోటార్‌ గ్రూపులో మెంబర్‌గా కియా ఉంది. వైఎస్‌ఆర్‌కు ఇచ్చిన హామీలో భాగంగానే ఆ సంస్థ ఏపీకి వచ్చింది...'' అని మంత్రి బుగ్గన వివరించారు.

రాష్ట్రానికి కియా పరిశ్రమ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వల్ల వచ్చినట్టుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో వక్రభాష్యం చెప్పారని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు.

సోమవారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ గుజరాత్‌, కర్ణాటక వంటి రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడ్డా... చంద్రబాబు కియా సంస్థ యాజమాన్యంతో మాట్లాడి ఆ పరిశ్రమ ఇక్కడికి వచ్చేలా చేశారన్నారు.

కియా అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఎకరా రూ.6లక్షలు చొప్పున ఇవ్వాలని తెదేపా ప్రభుత్వం నిర్ణయించగా... ఇప్పుడు ఆ ధరను హఠాత్తుగా రూ.60 లక్షలకు పెంచేయడం వల్ల అవి కర్ణాటకకు వెళ్లేలా ఉన్నాయని చెప్పారని ఈనాడు పేర్కొంది.

పెద్దపులి Image copyright AP FOREST DEPARTMENT

ఒత్తిడిలో పెద్దపులులు

అస్థిరమైన వన్యప్రాణి పర్యాటకం పెద్దపులలపై ఒత్తిడిని పెంచుతున్నదని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) వెల్లడించిందని నమస్తే తెలంగాణ పేర్కొంది.

మధ్యప్రదేశ్‌లోని రెండు ప్రధాన టైగర్ రిజర్వుల్లో పులుల పర్యాటక ఒత్తిడికి గురవుతున్నట్టు గుర్తించినట్టు సీసీఎంబీ పేర్కొన్నది. పర్యాటకులు ఎక్కువగా వచ్చిన సమయాల్లో పెద్దపులులు ఆందోళనకు గురవుతున్నాయని, ఇది వాటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని అత్తాపూర్‌లోని ల్యాబోరేటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండెంజర్డ్ స్పీసీస్ (ల్యాకోన్స్), తార్నాకలోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైంది.

శాస్త్రవేత్త డాక్టర్ ఉమాపతి ఆధ్వర్యంలోని బృందం మధ్యప్రదేశ్‌లోని కన్హా, బందావ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌లలో పరిశోధనలు జరిపింది. ఇక్కడి పెద్దపులుల మలంలో ఒత్తిడికి గురిచేసే గ్లుకోకార్డికాయిడ్ మెటాబోలైట్ (ఎఫ్‌జీసీఎం) స్థాయిలను గుర్తించారు.

అధిక మొత్తంలో ఎఫ్‌జీసీఎం.. పులుల పెరుగుదల, పునరుత్పత్తి, కండరాల క్షీణతతోపాటు రోగనిరోధకశక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అధ్యయనం పేర్కొన్నది. పర్యాటకులు ఉన్నప్పుడు, లేని సమయాల్లో 341 పులుల నుంచి మలం నమూనాలు సేకరించి పరిశోధనలు చేశారు.

ఇలాంటి కారణాలతోనే రాజస్థాన్‌లోని సారిస్కా అభయారణ్యంలో పెద్దపులుల పునరుత్పత్తి నిలిచిపోయిందని ఈ బృందం తమ గత అధ్యయనంలో తేల్చింది. ఎకో-టూరిజం నిబంధనలను మరింత కట్టుదిట్టంచేసి క్రమపద్ధతిలో సందర్శకులను అనుమతించాలని, సందర్శకుల వాహనాల రాకపోకలను తగ్గించాలని, పులులు సంచరించే ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాలను మరో ప్రాంతానికి తరలించడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా పులులు ఒత్తిడికి గురవకుండా చూడవచ్చు అంటూ డాక్టర్ ఉమాపతి బృందం సిఫారసు చేసింది.

పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లోకి పెద్దపులుల వలస మళ్లీ మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకొని మూడువైపులా ఉన్న అభయారణ్యాల నుంచి పెద్దపులులు తెలంగాణ సరిహద్దుల్లోకి వస్తున్నాయి.

మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలోని తడోబా-అంథేరీ టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణలోని థాంసీ, కాగజ్‌నగర్, మంచిర్యాల, జన్నారం వైపు పులులు పరుగులు తీస్తున్నాయి. మెడకు రేడియో కాలర్ ఉన్న రెండు పులులు మహారాష్ట్ర తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుంచి ఆదిలాబాద్ అడవుల వైపు వచ్చిన విషయాన్ని కాలర్లు బిగించిన వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు.. రాష్ట్ర అటవీ అధికారులకు చేరవేసి అప్రమత్తం చేశారు.

దీంతో పులుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించి వాటికి ఎలాంటి హాని కలుగకుండా చూసేందుకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్‌కుమార్ పర్యవేక్షణలో 15 మందితో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటైంది. కొత్తగా వచ్చిన రెండింటితో కలిసి కవ్వాల్ అభయారణ్యం పరిధిలో పెద్దపులుల సంఖ్య ఎనిమిదికి చేరినట్టు అధికారులు చెప్తున్నారు.

మరోవైపు సందర్శకుల సంఖ్య పెరుగడంతో పులులు అలజడిలేని ప్రాంతాలను వెతుక్కొంటూ వలస వెళ్తున్నాయి. ఈ క్రమంలో వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో దాదాపు 25-30 పులుల మెడకు రేడియో కాలర్లను వేశారు. మొదటి దశలో రేడియో కాలర్ బిగించిన పులులు రెండు ప్రస్తుతం తిప్పేశ్వర్ నుంచి ఆదిలాబాద్ థాంసీ ప్రాంతానికి వచ్చినట్లు వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ గుర్తించిందని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)