అనంతపురం హత్యలు: శివాలయంలో గుప్తనిధుల కోసమే ఈ హత్యలు చేశారా? - Ground Report

  • 17 జూలై 2019
మృతులు శివరామిరెడ్డి, కమలమ్మ, సత్యలక్ష్మి
చిత్రం శీర్షిక హత్యకు గురైన శివరామిరెడ్డి, కమలమ్మ, సత్యలక్ష్మి

అనంతపురం జిల్లాలో ఓ ఆలయం బయట నిద్రిస్తున్న ముగ్గురు వృద్ధులు హత్యకు గురయ్యారు.

తనకల్లు మండలం కొర్టికోట గ్రామంలోని పురాతన శివాలయంలో ఆదివారం అర్ధరాత్రి శివరామిరెడ్డి(70), కమలమ్మ(75), సత్యలక్ష్మి(70)లను హత్య చేశారు.

అక్కడున్న శివలింగం, పుట్టపై రక్తం ఆనవాళ్లు ఉండడంతో గుప్త నిధుల కోసం ఈ హత్యలు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిత్రం శీర్షిక నిర్మాణంలో ఉన్న ఆలయం

బెంగళూరు నుంచి వచ్చి హత్యకు గురైంది

కొర్టికోటలో 150 ఏళ్ల నాటి శివాలయం ఉంది. ఇక్కడ ఎల్లమ్మ అనే మహిళ పూజలు చేస్తుండేవారు. కొన్నేళ్ల కిందట ఆమె మరణించారు.

ప్రస్తుత ఘటనలో హతులైనవారిలో ఒకరైన శివరామిరెడ్డి ఆమె సోదరుడే. ఐటీఐ కాలేజీలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసి రిటైరైన శివరామిరెడ్డి నాలుగేళ్ల కిందట ఈ ఆలయానికి వచ్చి తన సోదరి పూజలు చేసిన శివాలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యతలు తీసుకున్నారు.

స్థానికంగా విరాళాలు పోగేసి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆయన మరో సోదరి కమలమ్మ కూడా అదే ఆలయంలో ఉంటున్నారు. వారు అక్కడే వంట చేసుకుంటూ అక్కడే నివసిస్తున్నారు.

కొర్టికోటకే చెందిన సత్యలక్ష్మి అనే వృద్ధురాలు బెంగళూరులో పిల్లల వద్ద ఉంటూ అప్పుడప్పుడూ సొంత ఊరు వస్తుంటారు. అలా వచ్చిన ఆమె స్థానికంగా ఇల్లు లేకపోవడంతో ఆలయంలోనే ఆదివారం ఉండిపోయారు.

చిత్రం శీర్షిక శివలింగంపై రక్తం ఆనవాళ్లు

సోమవారం ఆలయానికి దర్శనం కోసం వెళ్లిన ఓ యువకుడికి అక్కడ ఈ ముగ్గురు వృద్ధుల మృతదేహాలు కనిపించాయి.

ఆయన ఊళ్లోకి వచ్చి విషయం చెప్పడంతో మాజీ ఎంపీటీసీ మంజునాథ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

''ఈ హత్యలు ఎవరు చేశారు.. ఎందుకు చేశారనేది అంతుచిక్కడం లేదు'' అని మంజునాథ బీబీసీతో చెప్పారు.

''ఈ ప్రాచీన ఆలయంలోని శివలింగానికి మహత్మ్యం ఉందని అంతా చెప్తుంటారని.. ఈ హత్యల వార్త తెలియగానే శివలింగం ఎత్తుకెళ్లడం కోసం ఎవరైనా వీరిని చంపి ఉంటారని అనుమానించాను. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అక్కడ శివలింగం అలాగే ఉంది. చనిపోయిన శివారెడ్డికి శత్రువులు కూడా ఎవరూ లేరు. గుడికి సంబంధించి నిర్వహణ వివాదాలు, ఆస్తి వివాదాలు కూడా లేవు'' అన్నారు మంజునాథ.

''ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు కొక్కంటి నాయుళ్లు పాలించారు. కాబట్టి ఇక్కడ గుప్త నిధులున్నాయనే నమ్మకం చాలామందిలో ఉంది. అలాంటి నమ్మకాలున్నవారెవరైనా వాటి కోసం నరబలి ఇచ్చారేమో'' అని మంజునాథ అనుమానం వ్యక్తంచేశారు.

పోలీసులు ఏమంటున్నారు?

గుప్త నిధుల కోసం ఈ హత్యలు చేసుంటారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కదిరి డీఎస్పీ శ్రీనివాసులు చెప్పారు. గుడిలో పూజరిగా ఉన్న శివరామిరెడ్డికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా.. గుడి కారణంగా గ్రామంలో వివాదాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. శివరామిరెడ్డిని హత్య చేయడానికి వచ్చి సాక్ష్యం లేకుండా చేయడానికి అక్కడున్న ఇద్దరు వృద్ధురాళ్లను కూడా హతమార్చి ఉంటారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

మృతుడి భార్య తన ఫిర్యాదులో ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయలేదని.. తన భర్త గత నాలుగేళ్లుగా సొంతూరిలో ఉంటూ ఆలయాన్ని నిర్మిస్తున్నారని చెప్పారన్నారు.

కారణం ఏమై ఉంటుంది?

మృతుల్లో ఒకరైన కమలమ్మ(శివరామిరెడ్డి సోదరి) రెండో కుమారుడు జయరామిరెడ్డి దీనిపై 'బీబీసీ'తో మాట్లాడుతూ.. గుప్త నిధుల కోసం జరిగిన హత్యల్లా అనిపించడం లేదని.. తమ మామని చంపడానికి వచ్చి సాక్ష్యం లేకుండా అక్కడున్న ఇద్దరు వృద్ధురాళ్లనూ చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తమకు ఎవరూ శత్రువులు లేరని చెప్పారు.

శివరామిరెడ్డి కుమారు శ్రీకర్ రెడ్డి కూడా తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని.. పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలని కోరారు.

'కరవు ప్రాంతం కావడంతో గుప్త నిధుల వేట ఎక్కువే'

అనంతపురం జిల్లాలో గుప్త నిధుల వేట చాలాకాలంగా ఉందని.. పొరుగు రాష్ట్రం కర్నాటకలోని కొందరితో కలిసి స్థానికులు ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఉదంతాలు ఉన్నాయని జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షుడు బి.నరసారెడ్డి బీబీసీకి చెప్పారు.

కరవు ప్రాంతం కావడం, నిరక్షరాస్యత అధికంగా ఉండడం వల్ల ఇలా గుప్త నిధుల కోసం నిత్యం వెతికేవారున్నారన్నారాయన. గురుపూర్ణిమ సందర్భంగా గుప్త నిధులను వేటాడేవారు వీరిని హత్య చేసుండొచ్చని నరసారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కర్నాటక, మహారాష్ట్రల మాదిరిగా ఏపీలోనూ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం తేవాలన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)