రిచా భారతి: ఖురాన్ ప్రతులు పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమేనంటున్న ఝార్ఖండ్ యువతి

  • 17 జూలై 2019
రిచా పటేల్ Image copyright Ravi Prakash/BBC
చిత్రం శీర్షిక రిచా పటేల్

''ఫేస్‌బుక్ పోస్టు కోసం ఇతర మత (ఇస్లాం) కేంద్రానికి వెళ్లి ఖురాన్ పంపిణీ చేయాలన్న ఆదేశం నాకు అసహజంగా ఉంది. నాకు చాలా బాధగా ఉంది. నేను కోర్టు తీర్పును పాటిస్తాను. కానీ, పై కోర్టుకు వెళ్లి నా వాదన వినిపించుకునేందుకు కూడా నాకు అధికారం ఉంది. నా ప్రాథమిక హక్కుల ఎవ్వరైనా సరే ఎలా కాలరాయగలరు? ఫేస్‌బుక్‌లో తమ మతం గురించి రాయడం తప్పు ఎలా అవుతుంది? నన్ను ఉన్నట్టుండి అరెస్ట్ చేసేశారు, బహుశా నేనొక స్టూడెంట్‌ని కాబట్టి అలా చేయగలిగి ఉండొచ్చు.''

రాంచీ ఉమెన్స్ కాలేజీ స్టూడెంట్ రిచా భారతి అలియాస్ రిచా పటేల్ బీబీసీతో అన్న మాటలివి.

''ఏ పోస్టు చేశానని ఝార్ఖండ్ పోలీసులు నన్ను అరెస్ట్ చేశారో దాన్ని నేను 'నరేంద్ర మోదీ ఫ్యాన్స్ క్లబ్' అనే గ్రూప్ నుంచి కాపీ చేసి నా ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాను. ఇందులో ఇస్లాంకు వ్యతిరేకంగా ఎలాంటి విషయమూ లేదు. నాకు ఇప్పటి వరకూ కోర్టు తీర్పు ప్రతి అందలేదు. ఖురాన్ పంపిణీ చేయాలా లేక ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేయాలా.. ఏ నిర్ణయం తీసుకోవాలనేది కోర్టు తీర్పు నాకు అందిన తర్వాతే నిర్ణయిస్తాను'' అని ఆమె చెప్పారు.

Image copyright Ravi Prakash/BBC

రిచా పటేల్ ఎవరు?

డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న స్టూడెంట్ రిచా పటేల్. రాంచీ నగరానికి సమీపంలోని పిటోరియాలో తన కుటుంబంతో కలసి ఆమె జీవిస్తున్నారు. ఈమెకు వ్యతిరేకంగా ముస్లిం సమాజానికి చెందిన అంజుమన్ ఇస్లామియా ప్రముఖుడు మన్సూర్ ఖాలిఫా పిటోరియా పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు.

రిచా పటేల్ తన ఫేస్‌బుక్, వాట్సాప్ పోస్టుల ద్వారా ఇస్లాం మతాన్ని ఆచరించే వారి మనోభావాలను కించపరుస్తున్నారని ఖాలిఫా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తద్వారా సమాజంలో విద్వేషాలు తలెత్తవచ్చునని తెలిపారు. ఈ ఫిర్యాదుతో జూలై 12వ తేదీ సాయంత్రం పోలీసులు రిచా పటేల్‌ను అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు.

ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ హిందూ సంస్థలకు చెందిన వందలాది మంది పిటోరియా పోలీసు స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. రిచా పటేల్‌ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 13వ తేదీన రాంచీ నగరంలో సైతం ప్రదర్శనలు, ఆందోళనలు జరిగాయి. ఆల్బర్ట్ ఎక్కా చౌక్‌లో హనుమాన్ చాలీసాను పఠిస్తూ కొందరు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు 'జై శ్రీరామ్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొందరు.. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించారని ఆరోపణలు చేశారు. రిచా పటేల్‌ను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కోరారు.

Image copyright Ravi Prakash/BBC

ఖురాన్‌ను పంపిణీ చేయాలనే షరతు

ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య రాజీ చర్చలు నడిచాయి. సోమవారం రాంచీ సివిల్ కోర్టులో రిచా పటేల్ జామీను కోసం దరఖాస్తు చేశారు. ఈ జామీనుపై వాదనలు వింటున్న రాంచీ సివిల్ కోర్టు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మనీష్ కుమార్ సింగ్ ఒక షరతుతో రిచా పటేల్‌కు జామీను ఇచ్చారు. ఆ షరతు ఏంటంటే.. ఆమె ఐదు ఖురాన్ గ్రంథ ప్రతుల్ని కొనుగోలు చేసి వాటిని అంజుమన్ కమిటీ, గ్రంథాలయాలకు పంపిణీ చేయాలి.

వాటిని పంపిణీ చేసినట్లుగా రసీదుల్ని కూడా ఆమె జమ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా న్యాయస్థానం.. రిచా పటేల్‌కు తగిన భద్రత సమకూర్చాలని పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చింది.

లభించని ఖురాన్ ప్రతులు

ఈ నేపథ్యంలో.. రిచా పటేల్‌పై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన మన్సూన్ ఖలీఫా బీబీసీతో మాట్లాడుతూ.. జామీను షరతులో భాగంగా రిచా పటేల్ తనకు ఇప్పటికీ ఖురాన్ ప్రతులను అందచేయలేదని చెప్పారు. తనకు ఖురాన్ ప్రతులు ఇవ్వాలని రిచాను కోర్టు ఆదేశించిందని ఆయన అన్నారు.

తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు, ఆమె మతానికి చెందిన వాళ్లు కొందరు రిచా పటేల్ వయసు (19 ఏళ్లు), ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజీ ప్రస్తావన తీసుకొచ్చారని, దానికి తాను కూడా అంగీకరించానని తెలిపారు. తాను రాజీకి సిద్ధపడటంతోనే ఆమెకు జామీను లభించిందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం