బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్‌లోని ఫొటోల్లో నిజమెంత - BBC Fact Check

  • 18 జూలై 2019
రాహుల్ గాంధీ ట్వీట్ Image copyright SM VIRAL POST

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం అస్సాం, బిహార్ రాష్ట్రాల్లో చాలా జిల్లాలను ముంచెత్తిన వరదల గురించి ట్వీట్ చేశారు.

ఆయన తన ట్వీట్‌లో ఫొటోలతో పాటు పార్టీ కార్యకర్తలకు ఒక సందేశం కూడా ఇచ్చారు.

Image copyright TWITTER/RAHUL GANDHI

"అస్సాం, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాంలో వరదల వల్ల జనాలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. బాధితులకు ఇలాంటి సమయంలో సాయం చేయడం మన తక్షణ కర్తవ్యం" అని అన్నారు.

అయితే, ఆయన ట్వీట్ చేసిన ఫొటోలు ఇప్పటివి కావు అని మా పరిశోధనలో తెలిసింది.

గత కొన్ని రోజులగా భారీ వర్షాలతో బిహార్, అస్సాంలలోని చాలా జిల్లాల్లో వరద ప్రవాహం పెరిగింది. చాలా ఊళ్లు మునిగిపోయాయి. ఈ వరదలకు అస్సాంలోనే 42 లక్షలకు పైగా ప్రభావితమయ్యారు.

సోషల్ మీడియాలో చాలా మంది ఈ వరదల గురించి ఎన్నో పోస్టులు, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.

కానీ 2019లో వరదలకు సంబంధించినవిగా చెబుతూ పాత వరద బాధితుల ఫొటోలు షేర్ చేస్తోంది రాహుల్ గాంధీ మాత్రమే కాదు.

అస్సాం, బిహార్ వరదల పేరుతో ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌లో కొన్ని వందల సార్లు షేర్ చేస్తున్న చాలా ఫోటోలకు ప్రస్తుతం అక్కడి పరిస్థితులకు అసలు సంబంధమే లేదు.

Image copyright SM VIRAL PHOTO

మొదటి ఫొటో

ముక్కువరకు వరద నీటిలో మునిగి, ఒక చిన్నారిని తన భుజాలపై మోసుకెళ్తున్న ఒక వృద్ధుడి ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మేం ఈ ఫొటో సమాచారం సేకరించాం. ఈ ఫొటో 2013లో తీసిందని తేలింది. 2013 జూన్ 24న ఈ ఫొటోను మొదటిసారి ఒక తమిళ బ్లాగ్‌లో వాడారు.

అలాగే చెన్నైకి చెందిన 'రౌండ్ టేబుల్ ఇండియా ట్రస్ట్' అనే సంస్థ ఈ ఫొటోను ఉపయోగించి 2015లో అస్సాం వరదలకు విరాళాలు సేకరించింది.

Image copyright Getty Images

రెండో ఫొటో

కింద ఇళ్లను కూడా ముంచేసిన వరద ప్రవాహం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక గుడిసెపైన కూర్చున్న నలుగురు కుర్రాళ్ల ఫొటో కూడా వైరల్ అవుతోంది.

అయితే ఈ ఫొటోను 2016లో కులేందు కలిత అనే ఒక జర్నలిస్ట్ తన కెమెరాలో బంధించారు. అస్సాం లోని దక్షిణ కామరూప్ ప్రాంతంలో ఆయన ఈ ఫోటోను తీసినట్లు గెట్టి ఫొటో ఏజెన్సీ ద్వారా తెలుస్తోంది.

ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్న వరదలకు 2016లో ఉప్పొంగిన బ్రహ్మపుత్ర నది కారణం.

Image copyright INDIAN EXPRESS

మూడో ఫొటో

వరదనీటిలో చనిపోయిన పులి పక్కనే ఒక పడవలో అటవీశాఖ అధికారులు కూర్చుని ఉన్న ఒక ఫొటో కూడా ప్రస్తుత అస్సాం వరదల పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఈ ఫొటో రెండేళ్ల క్రితం తీసినది. ఏపీ ఫొటో ఏజెన్సీ వివరాల ప్రకారం ఈ ఫొటోను 2017 ఆగస్టు 18న అస్సాంలోని కాజిరంగా వన్యప్రాణి అభయారణ్యంలో ఉత్తమ్ సైకియా తీశారు.

2017లో ఈ ఫొటోను చాలా వార్తాపత్రికల్లో ప్రచురించారు. అస్సాంలో వచ్చిన వరదల్లో కాజిరంగా నేషనల్ పార్క్‌లో 225కు పైగా జంతువులు మృతి చెందాయని రాశారు.

2012లో 793, 2016లో 503 జంతువులు వరదల వల్ల చనిపోయాయని పార్కు అధికారులు గత ఏడాది చెప్పారు.

Image copyright SM VIRAL PHOTO

నాలుగో ఫొటో

నీళ్లలో మునిగిపోయిన ఓ గ్రామం ఫొటో కూడా వైరల్ అవుతోంది.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా పరిశోధించగా ఇది 2008లో బిహార్‌లో వరదలు వచ్చినపుడు తీసిన ఫొటో అని తెలిసింది. 2014లో 2015లో ప్రచురితమైన చాలా కథనాల్లో ఈ ఫొటోను ప్రచురించారు.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం