ఆఫీస్‌లో టిక్‌టాక్ వీడియోలు తీసి పోస్ట్ చేసినందుకు 11 మంది ఉద్యోగులపై చర్యలు

  • 18 జూలై 2019
11 మంది ఖమ్మం ఉద్యోగులపై చర్యలు Image copyright UGC

సోషల్ మీడియా ‘టిక్ టాక్‌’లో వీడియోలు పెట్టినందుకు ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్‌లో పని చేస్తున్న 11 మంది ఉద్యోగులపై పురపాలక సంఘం ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

వారిలో కొంత మందిని డిపార్ట్‌మెంట్ బదిలీ చేయగా మిగితా వారిని ఆఫీస్ డ్యూటీ నుంచి ఫీల్డ్ వర్క్‌కి బదిలీ చేశారు. అంతేకాక పది రోజుల జీతం కూడా కట్ చేసినట్లు కమిషనర్ అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే ఈ వీడియోలు ఒక దాదాపు మూడు నెలల ముందువని చర్యలకు గురైన ఉద్యోగుల్లో ఒకరు తెలిపారు.

మళ్లీ ఆ వీడియోలు ప్రచారంలోకి రావటంతో ఉద్యోగులపై తీసుకున్న చర్యల గురించి మాత్రమే ఇప్పుడు మీడియాకు చెప్పామని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఖమ్మం టిక్ టాక్

జులై మొదటివారంలోనే చర్యలు

పదకొండు మంది ఉద్యోగులపై జులై మొదటి వారంలోనే చర్యలు తీసుకున్నారని ఉద్యోగుల్లో ఒకరు చెప్పారు.

పేరు వెల్లడించని ఒక ఉద్యోగిని "మేం మా కొత్త రోల్స్ కి ట్రాన్స్‌ఫర్ అయిపోయాం" అని ఒక చెప్పారు.

కానీ ఈ వీడియోలను ఉద్యోగులు లంచ్ టైంలో తీశారా లేక ఆఫీస్ సమయంలో తీశారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Image copyright UGC

నేరస్థుల్లా చిత్రీకరించారు

బీబీసీతో మాట్లాడిన మరో ఉద్యోగి "ఆఫీసులో అలా రికార్డు చేయటం తప్పే, కానీ పూర్తి విషయం తెలీకుండా ఇలా ఎదో నేరం చేసినట్లు ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ.. మీడియాలో మా వీడియోలు ప్రదర్శించడం సరికాదు" అన్నారు.

"నా ఆరోగ్యం సరిగా లేదు, స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావడం కోసం తోటి ఉద్యోగులతో కలిసి కొన్ని వీడియోలు చేసాను. అందులో ఏ వీడియోనూ ఆఫీస్ టైంలో చేయలేదు. లంచ్ అవర్‌లో చేశాం" అని చెప్పారు.

"ఇప్పుడు వైరల్ చేస్తున్న వీడియోలు అసలు ఆఫీసులో చేసినవి కూడా కావు. వాటిని ఇంటర్ ఎవాల్యూయేషన్ చేస్తున్నప్పుడు, ఆ పనైపోగానే అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు చేశాం. అయినా మేం ఆఫీస్ టైం లో వీడియోలు చేస్తుంటే మా డిపార్ట్‌మెంట్ హెడ్స్ ఊరుకుంటారా" అని ప్రశ్నించారు.

"ఇదంతా జరిగిన తర్వాత తలెత్తుకోలేకపోతున్నాం. ఎదో పెద్ద నేరం చేసినట్లు చిత్రీకరించారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

Image copyright UGC

సోషల్ మీడియాలో ఆగ్రహం

టిక్‌టాక్ వీడియోలు పెట్టారంటూ ఉద్యోగుల పై చర్యలు తీసుకోవటంపై ట్విటర్‌లో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది.

ఆఫీస్‌లో కాస్త సరదాగా చేసిన దానికి జీతం కూడా కట్ చేయటం ఎంత వరకు సబబు అని కొందరు ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమాధానంగా జిల్లా కలెక్టర్ "వారు ఆఫీస్ టైం లో రికార్డు చేసారా లంచ్ అవర్‌లో రికార్డు చేసారా? అనేది విషయం కాదు. పని పట్ల అశ్రద్ధ చూపినందుకే వారిపై చర్యలు తీసుకున్నాం. వాళ్లు కాంట్రాక్టు ఉద్యోగులు. వారికి కూడా ఎంప్లాయ్ కోడ్ అఫ్ కండక్ట్ వర్తిస్తుంది" అన్నారు.

Image copyright Getty Images

ఇంతకు ముందు కూడా చర్యలు

ఇలా సోషల్ మీడియా పోస్టులు చేసినందుకు ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకున్న సందర్భం ఇదే మొదటిది కాదు.

ఈ ఏడాది మే నెలలో సోషల్ మీడియాలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ఒక వీడియో పోస్ట్ చేసినందుకు ఒక ప్రభుత్వ ఉపాద్యాయుడిని సస్పెండ్ చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో ఈ వీడియో దానిని ఉల్లంఘిస్తున్నందున అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు నోటీసు ఇచ్చారు.

అలాగే 2017 నవంబర్‌లో సింగరేణి కాలరీస్ యూనియన్ ఎన్నికల విషయంపై ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టినందుకు నిజామాబాద్ డిపోలో బస్ కండెక్టర్‌గా పని చేస్తున్న సంజీవ్‌ మీద సస్పెన్షన్ వేటు వేశారు.

అయితే ఇప్పుడు ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్‌ ఉద్యోగుల ఉదంతం.. మిగతా సంఘటనల వంటిది కాకపోయినా.. ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై చర్యలు తీసుకోవటం సరైనదేనని కొందరు సమర్థిస్తున్నారు.

''మునిసిపల్ ఆఫీస్‌లో జనం ఎప్పుడూ నిరీక్షిస్తుంటారు. పనులు చేయాల్సిన వారు పని చేయకుండా ఇలా సరదాగా టైం పాస్ చేస్తే ఎలా? పని చేసేది ఎనిమిది గంటలు మాత్రమే'' అని ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)