ప్రెస్ రివ్యూ: ‘రోడ్డు మీద పడుకుంటా’ - చంద్రబాబు.. ‘40 ఏళ్ల ఇండస్ట్రీ అంటే ఇదేనా?’ - వైఎస్ జగన్

  • 19 జూలై 2019
Image copyright facebook/AndhraPradeshCM/tdp.ncbn.official

'అక్రమ' కట్టడాలు, కూల్చివేతలపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ముఖ్యమంత్రి జగన్‌, విపక్ష నేత చంద్రబాబు కోర్టు తీర్పులు, అధికారిక ఉత్తర్వులను చూపిస్తూ తమ వాదనలు వినిపించారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

గురువారం ప్రశ్నోత్తరాల సమయంలోనే ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. నదులు, కాల్వల గట్ల వద్ద ఉన్న అక్రమ కట్టడాలపై ప్రభుత్వం తన విధానం తెలపాలని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కోరారు. దీనికి మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కట్టడాలు 72వేలు ఉన్నట్లు గుర్తించామని... వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

దీంతో సభలో దుమారం రేగింది. జగన్‌ సర్కారు కూల్చివేసిన 'ప్రజావేదిక'తోపాటు, చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి ప్రస్తావన కూడా వచ్చింది.

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడుతూ.. ''కేవలం మాకు కేటాయించాలని అడిగినందుకే ప్రజావేదికను కూల్చేశారు. ఇలాగే తమ ఇళ్లను కూడా కూల్చేస్తారని 72 వేల గృహాలలో ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి'' అని సూచించారు. తాను ప్రస్తుతం ఉంటున్న ఇల్లు తనది కాదని... లింగమనేని రమేశ్‌ అనే వ్యక్తి దగ్గర అద్దెకు తీసుకున్నానని చెప్పారు. ప్రజావేదిక కూడా తన నివాసం కాదని, ప్రభుత్వానిదని గుర్తుచేశారు. ''భవనాల కూల్చివేత పట్ల రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. దౌర్జన్యాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దు. అవసరమైతే రోడ్డుపై పడుకుంటా తప్ప ఎవరి బెదిరింపులకూ లొంగను'' అని తెలిపారు. ప్రజా వేదికకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని చెప్పారు. అక్రమ కట్టడాలైనప్పటికీ... వాటిని ప్రభుత్వ అవసరాలకోసం వాడుకోవచ్చునని 2015లో మార్చి 7వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కట్టిన భవనాలను కూడా రెగ్యులరైజ్‌ చేసే అధికారం ఉంటుందని కూడా సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ''నన్ను తిట్టినా, అవమానించినా పడతాను. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నిపాట్లు పడడానికైనా నేను సిద్ధం. రోడ్డు మీద పడుకోవడానికైనా వెనుకాడబోను'' అని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ.. 'చంద్రబాబు పదే పదే 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు. 40 ఏళ్ల అనుభవం అంటారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఆంటారు. ఏంటి అధ్యక్షా ఆయన రాజకీయ చర్రిత? అంత అనుభవం ఉంటే నలుగురికి మార్గదర్శకంగా ఉండాలి. ఆ రాజకీయ చరిత్ర నలుగురు చూసి, అలాంటి నాయకుడు మా నాయకుడు అనుకునేలా ఉండాలి. అధికారంలో ఉన్న వ్యక్తులే మాకు నియమాలు వర్తించవు.. సామాన్యుడికి ఒక రూలు, అధికారంలో ఉన్న మాకు వేరే రూల్‌.. అనే సందేశం పంపేలా ఉండరాదు. ఇలాగైతే ఈ వ్యవస్థ బతకదు. అందుకే ఆక్కడ ప్రజావేదిక నుంచే మొట్టమొదటగా అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలు పెట్టాలని కలెక్టర్ల సదస్సు తొలిరోజే ఆదేశించాను.

ఆ రోడ్డులో ఉన్న అన్ని అక్రమ భవనాలను వెంటనే భాళీ చేయాలని, అలా చేయకపోతే వాటిని కూడా పడగొడతామని నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించగా వారు ఆ పని చేశారు. రాష్ట్ర స్థాయిలో దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని జిల్లాల్లో కూడా ఇదే విధంగా పని చేయాలని కలెక్టర్లందరికీ చెప్పాం. ఎక్కడైనా కూడా సామాన్యుడికి, అధికారంలో ఉన్న వారికి, పెద్ద వారికి, చిన్నవారికీ ఒకే రూల్‌ ఉండాలి. చట్ట విరుద్ధంగా ఎక్కడ నిర్మాణం చేపట్టినా కూల్చి వేయాల్సిందే. అలాంటి ఆదేశాలు ఇచ్చి ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు చేయాలని ముందుకు అడుగులు వేస్తుంటే, దాన్ని కూడా వక్రీకరించి తప్పులు పట్టే ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు అధ్యక్షా' అని జగన్ అన్నారని సాక్షి ఒక కథనంలో పేర్కొంది.

Image copyright iSro

చంద్రయాన్‌-2 ప్రయోగం 22న

వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఈనెల 22న చంద్రయాన్‌-2 ఉప్రగహాన్ని రోదసిలోకి పంపుతామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గురువారం ప్రకటించిందని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఈ మేరకు శాస్త్రవేత్తలు ప్రయోగ సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 15న చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని మోసుకెళ్లాల్సిన జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక క్రయోజనిక్‌ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన సంగతి తెలిసిందే.

క్రయోజనిక్‌ ఇంజిన్‌లోని హీలియం బాటిల్‌ జాయింట్‌ వద్ద లీకేజీని గుర్తించిన శాస్త్రవేత్తలు దాన్ని సరిచేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. శనివారం రాకెట్‌ సన్నద్ధత, లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశాలు నిర్వహించనున్నారు.

ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఆవు Image copyright Getty Images

బక్రీద్‌కు ఆవులను వధించొద్దు -ముస్లిం సంఘాల పిలుపు

బక్రీద్ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో ముస్లింలెవరూ ఆవులను వధించకుండా గొర్రెలు, ఇతర జంతువులను త్యాగం చేయాలని యునైటెడ్ ముస్లిం ఫోరం (యూఎంఎఫ్) తోపాటు పలు ముస్లిం సంఘాలు పిలుపునిచ్చాయని నమస్తే తెలంగాణ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

బక్రీద్ సందర్భంగా ఎలాంటి మత ఘర్షణలూ జరుగకుండా పటిష్ఠ భద్రతాచర్యలు చేపట్టాలని కోరాయి. ఆవులను హిందూవులు దైవంలా భావిస్తారని, వాటిని వధించకుండా ఇతర మతాల ఆచారాలను గౌరవించాలని ముస్లిం సంఘాల నేతలు సూచించారు. గొర్రెలు, మేకల వంటి జంతువుల వధకు భారతచట్టంలోనూ అవకాశం ఉన్నందున, వాటిని ఉపయోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో మతపరమైన చారిత్రక కట్టడాలను రక్షించాలని సూచించారు. ముఖ్యంగా మక్కామసీదు, రాయల్ మాస్క్ ఆఫ్ పబ్లిక్ గార్డెన్స్ వంటి వాటితోపాటు వక్ఫ్ ఆస్తులను కాపాడాలని కోరారు.

Image copyright facebook/TelanganaCMO

మేం పిలువలే.. వాళ్లే వచ్చిన్రు - కాంగ్రెస్​ ఎమ్మెల్యేల చేరికపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్

రాజ్యాంగ నిబంధనలకు లోబడే టీఆర్​ఎస్​ ఎల్పీలో సీఎల్పీ విలీనం జరిగిందని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారని వెలుగు దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది. రెండోసారి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు టీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరుతామని వచ్చారని తెలిపారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిందిపోయి తమ మీద పడి ఏడవటం ఏమిటని ప్రశ్నించారు. రెండురోజుల అసెంబ్లీ సమా వేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభలో సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య ఫిరాయింపుల అంశంపై మాటలు నడిచాయి. ''12 మంది కాంగ్రెస్‌‌ సభ్యుల్ని టీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీలో చేర్చుకున్నారు. దురదృష్టవశాత్తు ఎవరు ఏ పార్టీలో నుంచి గెలిచొచ్చినా, టీఆర్‌‌‌‌ఎస్‌‌లో కలుపుకునే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి" అని భట్టి అన్నారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం దేశానికి రోల్‌‌ మోడల్‌‌గా ఉండాలి కానీ.. ఇదేందని ప్రశ్నించారు. తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా భట్టి ఇదే అంశాన్ని లేవనెత్తారు.

దీనికి సీఎం కేసీఆర్​ బదులిస్తూ.. ''మీకు జరిగింది అన్యాయమే. దానికి మేమేం జేయాలండి'' అని ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా తాము ఎవరినీ పార్టీలో చేర్చుకోలేదని, నిబంధనల ప్రకారమే జరిగిపోయిందన్నారు. ''భట్టి విక్రమార్క వారి ఆక్రోశాన్ని చెప్తావున్నారు. కచ్చితంగా దేశానికి తెలంగాణ రోల్‌‌ మోడల్‌‌గా ఉంటది. ఎవరికీ సందేహం అక్కర్లేదు" అని సీఎం పేర్కొన్నారు. సభ్యులు పార్టీ మారడంపై వారికి వారే జవాబు చెప్పుకోవాలని, రాజ్యాంగ నిబంధనలకు లోబడి వాళ్లు టీఆర్​ఎస్​లోకి వచ్చారని తెలిపారు. ''వాస్తవానికి రెండోసారి మేం గెలిచినాక టీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరతామని కొంతమంది సభ్యులు వచ్చారు. మాకు మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది.. ఇప్పుడంత అవసరం లేదని వాళ్లకు స్పష్టంజేసినం. కానీ, రాజ్యాంగ నిబంధన ప్రకారం మూడింట రెండొంతుల మంది చీలిపోయి, విలీనం అయ్యారు. స్పీకర్‌‌‌‌ బులెటిన్ విడుదల చేశారు" అని వివరించారు. ''ఏపీలో టీడీపీ రాజ్య సభ సభ్యులు, గోవాలో కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనమయ్యారు. ఇలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ వాళ్ల మీద సొంత నాయకుల ఆకర్షణ తగ్గిపోయింది. వాళ్ల సభ్యులను వాళ్లు కాపాడు కోకుండా, మా మీద పడి ఏడుస్తారేంది. ఏదో పెద్ద క్రైమ్ జరిగినట్టు" అని అన్నారు.

''ఈ దేశంలో ఎవరైనా టు థర్డ్ మెంబర్స్‌‌ స్ప్లిట్ అయి వస్తే జాయిన్ చేసుకోరా? విలీనం చేసుకోరా?" అని కేసీఆర్​ ప్రశ్నించారు. దీనికి ప్రతిగా భట్టి మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్​ మైక్​ ఇవ్వలేదు. దీంతో ''సభ మీరే నడుపుకోండి" అంటూ భట్టి సహా, కాంగ్రెస్‌‌ సభ్యులు వాకౌట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)