కర్ణాటక: బలపరీక్ష జరపకుండానే అసెంబ్లీ సోమవారానికి వాయిదా

  • 19 జూలై 2019
కుమారస్వామి, సిద్ధ రామయ్య Image copyright Getty Images

ఒకపక్క గవర్నర్ వాజుభాయ్ వాలాతో, మరోపక్క సుప్రీం కోర్టుతో తేల్చుకునేందుకు కర్ణాటక అసెంబ్లీ ఈరోజు మళ్లీ భేటీ అయ్యింది. కానీ బలపరీక్ష జరగకుండానే సోమవారానికి వాయిదా పడింది.

మధ్యాహ్నం 1.30 గంటలకల్లా అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వ బల నిరూపణ జరిగేలా చూడాలని స్పీకర్ రమేశ్ కుమార్‌కు గవర్నర్ లేఖ రాశారు. కానీ, ఈ గడువు ముగిసినా బల పరీక్ష పూర్తికాలేదు. దీంతో గవర్నర్ మరోసారి డెడ్‌లైన్‌ పొడిగించారు. సాయంత్రం 6 గంటలలోపు బలపరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు.

గవర్నర్ ఆదేశాలపై సీఎం కుమారస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సభ జరుగుతున్న సమయంలో గవర్నర్ ఇలాంటి గడువులు విధించడం సరికాదంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు.

కాగా, గవర్నర్ అంతకు ముందు జారీచేసిన ఆదేశాలను కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ పట్టించుకోలేదు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 దాటినా ఓటింగ్‌ జరపలేదు. వాస్తవంగా ఓటింగ్‌పై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

విశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా ఓటింగ్ జరపలేమని ఆయన స్పష్టం చేశారు.

రాజీనామాలు చేసిన 15 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొనేలా (విప్ జారీ చేసి) బలవంతం చేయకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని ఎదుర్కోవడం రెండో సవాలు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవటంతో కాంగ్రెస్, జేడీఎస్‌లు కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు 15 మంది తమ శాసనసభ్యత్వాలకు రాజీనామాలు చేశారు.

ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వ బల నిరూపణ కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ పాత్ర, సుప్రీం కోర్టు జోక్యం, విప్ జారీ వంటి పలు విధానపరమైన అంశాలపై చర్చకు తెరలేపింది.

కాగా, గురువారం భేటీ అయిన అసెంబ్లీలో బల పరీక్షపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్, జేడీఎస్‌ సభ్యులు సుప్రీం కోర్టు తీర్పుపై కూడా మాట్లాడారు. విప్ జారీ అంశంపై చర్చ జరుగుతుండగానే ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ నాలుగుసార్లు వాయిదా పడి, చివరకు శుక్రవారానికి వాయిదా పడింది.

దీంతో బీజేపీ బృందం గవర్నర్‌ను కలిసింది. ఆయన రాత్రి స్పీకర్‌కు లేఖ రాస్తూ.. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకల్లా విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగేలా చూడాలని ఆదేశించారు.

Image copyright RAJ BHAVAN KARNATAKA
చిత్రం శీర్షిక కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా

గవర్నర్ విధించిన గడువులోపు ఓటింగ్ సాధ్యమేనా?

గవర్నర్ వాజుభాయ్ వాలా రాసిన లేఖను స్పీకర్ రమేశ్ కుమార్ అసెంబ్లీలో చదివి వినిపించారు. దీనికి కాంగ్రెస్ మంత్రులు ఆర్వీ దేశ్‌పాండే, బైరె గౌడలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘‘బల పరీక్షపై ఓటింగ్ అంశాన్ని అసెంబ్లీ ఇప్పటికే చేపట్టింది. సభ్యులు దీనిపై తమ వాదనలు, అభ్యంతరాలను వినిపించారు. ఈ సమయంలో ఓటింగ్‌ జరపాలంటూ గవర్నర్ తొందరపెట్టడం సరికాదు’’ అని బైరె గౌడ అన్నారు.

కాంగ్రెస్ నాయకుడు వీఎస్ ఉగ్రప్ప బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘గవర్నర్ విధించిన గడువును కూటమి ప్రభుత్వం అందుకుంటుందని నాకు అనిపించటం లేదు. విశ్వాస తీర్మానంపై సభలో చర్చ జరుగుతుంది. బల పరీక్షపై చర్చ రోజుల కొద్దీ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి’’ అని అన్నారు.

ఈ నేపథ్యంలో అందరి కళ్లూ గవర్నర్‌పైనే ఉన్నాయి. ఎస్‌ఆర్ బొమ్మై కేసులో సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి సభలో విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగేలా వాజుభాయ్ వాలా రంగంలోకి దిగుతారా? అని అంతా చూస్తున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి మెజార్టీ ఉందా? లేదా? అన్నది నిర్ణయించే అధికారం రాజ్‌భవన్, గవర్నర్‌కు మాత్రమే పరిమితం కాకుండా చేసిన ఈ కేసు కర్ణాటక మూలాలు ఉన్నదే కావడం విశేషం.

Image copyright Getty Images

శాసన వ్యవస్థలో సుప్రీం జోక్యం చేసుకుందా?

సుప్రీం కోర్టు తన పరిధిని దాటి శాసన వ్యవస్థ అధికారాల్లో జోక్యం చేసుకుందా? అన్న ప్రశ్న ఇప్పుడు న్యాయవాద వర్గాల్లో చర్చకు దారి తీసింది.

‘‘రాజ్యాంగం చాలా జాగ్రత్తగా అధికారాలను విభజించింది. శాసన వ్యవస్థలు, పార్లమెంటు తమతమ పరిధిలో పనిచేస్తుంటే.. న్యాయ వ్యవస్థ దాని పరిధిలో అది పనిచేస్తుంటుంది. ఇంగ్లీష్ పార్లమెంటు రోజుల నుంచి అమలులో ఉన్న అంగీకారం ఏంటంటే.. శాసన వ్యవస్థ పనితీరులో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోరాదు’’ అని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే బీబీసీతో చెప్పారు.

అయితే, అడ్వొకేట్ జనరల్‌గా పనిచేసిన బీవీ ఆచార్య ఈ వాదన పూర్తిగా హాస్యాస్పదమని కొట్టిపారేశారు. ‘‘రాజీనామా చేసిన ఎమ్మెల్యేల హక్కులే ఇప్పుడు ముఖ్యం. రాజకీయ పార్టీల హక్కులు, రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల హక్కులు అన్నీ సుప్రీం కోర్టుకు తెలుసు. స్పీకర్ కావాలనే అనవసరంగా ఈ రాజీనామాలపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. ఎమ్మెల్యే అంటే రాజకీయ పార్టీకి కార్మికుడు కాదు’’ అని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ తీసుకునే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా రాజ్యాంగ పరమైన ఎన్నో అంశాలకు అన్వయించేంతటి విశిష్టత ఉండొచ్చని హెగ్డే అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)