అస్సాం వరదలు: ఇంట్లో ప్రవేశించి మంచమెక్కి పడుకున్న పులి

మంచమెక్కి పడుకున్న పులి

ఫొటో సోర్స్, WTI

ఫొటో క్యాప్షన్,

మంచమెక్కి పడుకున్న పులి

అస్సాంలో సంభవించిన భారీ వరదలకు అభయారణ్యంలో ఉండాల్సిన ఓ ఆడపులి సమీపంలోని ఓ గ్రామంలోని ఇంట్లోకి ప్రవేశించి హాయిగా మంచంపై పడుకుని విశ్రాంతి తీసుకుంది.

ఈ పులి కజిరంగా జాతీయ పార్క్ నుంచి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇటీవలి భారీ వరదలకు కజిరంగా పార్క్‌లో 92 జంతువులు మరణించాయి.

జంతుసంరక్షణ విభాగాధికారులు పులి విశ్రాంతి తీసుకుంటున్న ఇంటికి వచ్చి, అది సురక్షితంగా తిరిగి అడవిలోకి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశారు.

ముందుగా ఈ పులి గురువారం ఉదయం పార్కుకు 200 మీటర్ల దూరంలో ఓ హైవే పక్కన కనిపించిందని వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూటీఐ) తెలిపింది. రోడ్లపై వాహనాల రద్దీకి భయపడి సమీపంలోని గ్రామంలో ఇంట్లోకి ప్రవేశించి ఉండొచ్చని డబ్ల్యూటీఐ తెలిపింది.

"ఓ షాపు పక్కన ఉన్న ఇంట్లోకి ఉదయం 7.30 గంటల సమయంలో ఈ పులి ప్రవేశించింది. ఆ తర్వాత అది రోజంతా అక్కడే నిద్రించింది. అది బాగా అలసిపోయింది. అందుకే అంతసేపు పడుకుంది. అదృష్టమేంటంటే, దాన్ని ఎవరూ ఇబ్బంది పెట్టకుండా విశ్రాంతి తీసుకోనిచ్చారు. ఈ ప్రాంత ప్రజలకు వన్యప్రాణులంటే చాలా దయ ఉంది" అని ఈ పులిని రక్షించే ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన రతీన్ బర్మన్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, WTI

ఫొటో క్యాప్షన్,

పులి ఇంట్లోకి వెళ్లడంతో ఇంటి యజమాని కుటుంబంతో సహా బయటకు వచ్చేశారు.

ఇంటిలోకి పులి రావడం చూసిన ఆ ఇంటి యజమాని మోతీలాల్ కుటుంబంతో సహా బయటకు వచ్చి, అటవీ అధికారులకు సమాచారం అందించారు.

"పులి పడుకున్న ఆ బెడ్‌షీట్‌ను, తలగడను ఎప్పటికీ దాచుకుంటా" అని మోతీలాల్ తెలిపారు.

మోతీలాల్ ఇంటికి చేరుకున్న అటవీ అధికారులు ముందుగా హైవేపై గంటపాటు వాహనాలను నిలిపివేశారు. బాణాసంచా కాలుస్తూ పులిని నిద్రలేపారు. దీంతో సాయంత్రం 5.30 గంటల సమయంలో అది ఇంట్లోనుంచి బయటకొచ్చి, హైవేను దాటి, అడవివైపు వెళ్లిపోయింది.

అది అడవిలోకి వెళ్లిపోయిందా, లేక మరేదైనా సమీప ప్రాంతంలో ప్రవేశించిందా అనేదానిపై స్పష్టత లేదని బర్మన్ తెలిపారు.

కజిరంగా నేషనల్ పార్క్‌లో 110 పులులున్నాయి. కానీ వరదల కారణంగా ఈ పులులేవీ మరణించలేదు.

54 జింకలు, 7 రైనోలు, 6 అడవి పందులు, ఒక ఏనుగు వరదల్లో మరణించాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)