కబడ్డీ: తొడ కొడుతున్న కబడ్డీ... హైదరాబాద్‌లో నేడే సీజన్ 7 ప్రారంభం

  • 20 జూలై 2019
2016 ఫిబ్రవరి 21న జైపూర్‌‌లో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన ప్రొకబడ్డీ మ్యాచ్ Image copyright Getty Images

భారత సంప్రదాయ క్రీడల్లో ఒకటైన కబడ్డీ ఆధునిక రూపంలో వాణిజ్య హంగులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-7 సమరానికి ఈ రోజు తెర లేస్తోంది.

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో శనివారం సాయంత్రం ఏడున్నరకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, యు ముంబా జట్లు తలపడతాయి.

ఇదే రోజు ఇదే వేదికలో సాయంత్రం ఎనిమిదిన్నరకు మొదలయ్యే రెండో మ్యాచ్‌లో- డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు బుల్స్ మూడుసార్లు విజేతగా నిలిచిన పట్నా పైరేట్స్ జట్టును ఢీకొంటుంది.

మొత్తం 12 జట్లు ఉన్నాయి. గతంలో 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి లీగ్ దశను నిర్వహించారు. ఈసారి గ్రూపులు లేవు.

డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ జరుగుతుంది. ప్రతి జట్టు మిగతా 11 జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది.

ఈ విధానంతో ప్లే ఆఫ్స్‌కు పోటీ మరింత ఆసక్తికరంగా ఉండే అవకాశముంది.

Image copyright twitter/@ProKabaddi

గ్రూపులు లేకపోవడం, డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతి వల్ల అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లే ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంటాయని గతంలో జాతీయ కబడ్డీ జట్టు కోచ్‌గా సేవలందించి ఇప్పుడు జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఎల్.శ్రీనివాస్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

ప్లే ఆఫ్స్‌ దశకు ఆరు జట్లు

జులై 20 నుంచి అక్టోబరు 19 వరకు మూడు నెలలపాటు ఈ లీగ్ సాగనుంది. అక్టోబరు 11 వరకు సాగే లీగ్ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు ఉంటాయి.

ఈ దశలో పాయింట్ల పట్టికలో మొదటి నుంచి ఆరో స్థానం వరకు నిలిచిన జట్లు 'ప్లే ఆఫ్స్' దశకు అర్హత సాధిస్తాయి.

అక్టోబరు 14న రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు, ఆనక 16న రెండు సెమీఫైనల్స్ ఉంటాయి.

Image copyright Getty Images

ఫైనల్ ఎప్పుడు?

ఎలిమినేటర్ 1లో- మూడో స్థానంలోని జట్టు ఆరో స్థానంలోని జట్టుతో తలపడుతుంది.

ఎలిమినేటర్ 2లో- నాలుగో స్థానంలోని జట్టు ఐదో స్థానంలోని జట్టుతో పోటీపడుతుంది.

సెమీఫైనల్ 1లో- మొదటి స్థానంలోని జట్టుతో ఎలిమినేటర్ 1 విజేత తలపడుతుంది.

సెమీఫైనల్ 2లో- రెండో స్థానంలోని జట్టుతో ఎలిమినేటర్ 2 విజేత పోటీపడుతుంది.

సెమీఫైనల్స్ విజేతలతో అక్టోబరు 19న ఫైనల్ జరుగుతుంది.

జట్టు కెప్టెన్
బెంగాల్ వారియర్స్ మణీందర్ సింగ్
బెంగళూరు బుల్స్ రోహిత్ కుమార్
దబాంగ్ దిల్లీ కేసీ జోగిందర్ సింగ్ నర్వాల్
గుజరాత్ ఫార్చూన్‌జయంట్స్ సునీల్ కుమార్
హరియాణా స్టీలర్స్ ధర్మరాజ్ చెర్లాథన్
జైపూర్ పింక్ పాంథర్స్ దీపక్ నివాస్ హుడా
పట్నా పైరేట్స్ పర్‌దీప్ నర్వాల్
పుణెరి పల్టన్ సుర్జీత్ సింగ్
తమిళ్ తలైవాస్ అజయ్ ఠాకూర్
తెలుగు టైటాన్స్ అబోజర్ మొహజెర్మిఘనీ
యు ముంబా ఫాజెల్ అట్రాచలీ
యూపీ యోధ నితీశ్ కుమార్

హైదరాబాద్, ముంబయి, పట్నా, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, పుణె, జైపూర్, పంచకుల, గ్రేటర్ నోయిడా వేదికలుగా లీగ్ సాగనుంది.

హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జులై 20 నుంచి 26 వరకు జరుగనున్నాయి.

వరుసగా మూడు సార్లు ఆ జట్టే

2014లో పీకేఎల్ మొదలైనప్పటి నుంచి ఆరు సీజన్లలో మూడు జట్లు విజేతలుగా నిలిచాయి.

అత్యధికంగా పట్నా పైరేట్స్ మూడుసార్లు, అదీ వరుసగా విజేతగా అవతరించింది.

ప్రొ కబడ్డీ లీగ్: సీజన్ల వారీగా విజేతలు
సీజన్ 1 జైపూర్ పింక్ పాంథర్స్
సీజన్ 2 యు ముంబా
సీజన్ 3 పట్నా పైరేట్స్
సీజన్ 4 పట్నా పైరేట్స్
సీజన్ 5 పట్నా పైరేట్స్
సీజన్ 6 బెంగళూరు బుల్స్

బలమైన జట్టు ఏది?

అన్ని జట్లూ బలంగానే ఉన్నాయని, సీనియర్ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటంతో పేపర్‌పై తమిళ్ తలైవాస్ ఎక్కువ బలంగా కనిపిస్తోందని శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

Image copyright Getty Images

ప్రొ కబడ్డీ లీగ్‌ బాగా ప్రాచుర్యం పొందుతోందని, ఆటగాళ్ల పారితోషికం పెరుగుతుండటమే దీనికి నిదర్శనమని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పీకేఎల్ ప్రభావంతో కబడ్డీకి ఆదరణ పెరుగుతోందని, మెట్రో నగరాల్లోనూ ఆటపై ఆసక్తి పెరుగుతోందని తెలిపారు. కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో కూడా కబడ్డీ ఆడిస్తున్నారని చెప్పారు.

పీకేఎల్ మ్యాచుల షెడ్యూలును ఈ లింక్‌లో చూడొచ్చు. ఎలిమినేటర్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచుల వేదికలు ఖరారు కావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

"తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి": ఆదివాసీ హక్కుల పోరాట సమితి

అత్యాచారం చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టం చేస్తాం: వైఎస్ జగన్

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

‘వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలి.. లేదంటే సీఎం ఇంటి ముందు కాల్చుకుంటా’

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 12 స్థానాల్లో గెలుపు

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి