అమరావతికి రుణంపై 'ఆసియా' బ్యాంకు నిర్ణయం వచ్చే వారం

  • 20 జూలై 2019
అమరావతి ప్రాజెక్ట్ Image copyright APCRDA

ప్రపంచ బ్యాంకు రుణం నిరాకరించడంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం సమస్యల్లో పడింది. రుణ నిరాకరణపై ప్రపంచ బ్యాంకు మాట ఏమిటి? మరో బ్యాంకు 'ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు(ఏఐఐబీ)' స్పందన ఏమిటి? నిధులను ఎలా సమీకరిస్తారనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏంచెబుతోంది? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏమంటున్నారు?

అమరావతి నిర్మాణ ప్రాజెక్టుకు రుణం కోసం చంద్రబాబునాయుడి హయాంలో ఏపీ ప్రభుత్వం తరపున రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) ప్రపంచ బ్యాంకుకు దరఖాస్తు పంపింది.

మొత్తం ప్రాజెక్టు వ్యయం 715 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.4,923 కోట్లు). ఇందులో 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,065 కోట్లు) రుణంగా ఇవ్వాలని ప్రపంచ బ్యాంకును ఏపీ ప్రబుత్వం కోరింది. మిగతా నిధులు ఏఐఐబీ నుంచి వస్తాయని ప్రభుత్వం ఆశించింది.

అయితే అమరావతి సుస్థిర మౌలిక, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టుగా పిలిచే ఈ ప్రాజెక్టును విరమించుకుంటున్నట్టు ప్రపంచబ్యాంకు తాజాగా తన వెబ్‌సైట్లో తెలిపింది. రుణం ఇచ్చేందుకు నిరాకరించింది.

కేంద్రమే విజ్ఞప్తిని వెనక్కు తీసుకుంది: ప్రపంచ బ్యాంకు

అమరావతికి రుణం విషయంలో భారత ప్రభుత్వమే తన విజ్ఞప్తిని వెనక్కు తీసుకుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి సుదీప్ ముజుందార్ బీబీసీతో చెప్పారు. "ప్రభుత్వ (భారత) నిర్ణయంతో దీన్ని పక్కన పెట్టాలని ప్రపంచ బ్యాంకు బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకున్నారు" అన్నారు.

Image copyright crda.ap.gov.in

మా పాత్రపై చర్చిస్తాం: ఏఐఐబీ

తాజా పరిణామం నేపథ్యంలో ఏఐఐబీతోనూ బీబీసీ మాట్లాడింది.

ఈ ప్రాజెక్టులో తమ పాత్ర ఏంటనేదానిపై వచ్చే వారం చర్చిస్తామని బ్యాంకు ప్రతినిధి లారెల్ ఆస్ట్ ఫీల్డ్ చెప్పారు. "ప్రపంచ బ్యాంకు నిర్ణయం ఏఐఐబీకి తెలుసు. మా పెట్టుబడుల కమిటీ దీనిపై వచ్చే వారం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది" అన్నారు.

ప్రపంచ బ్యాంకు నుంచి తమకు ఇంకా అధికారిక సమాచారం అందలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పారు.

Image copyright Getty Images

తాజా పరిణామం ఆహ్వానించదగ్గది కాకపోయినా, ప్రపంచ బ్యాంకే దిక్కు కాదని, చాలా అవకాశాలున్నాయని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. "అప్పు ఇవ్వక ముందే విచారణ జరపాలని ప్రపంచ బ్యాంకు కోరడం చెడు సంప్రదాయం. భూసమీకరణ చట్టం గురించి కొన్ని ఫిర్యాదులు ప్రపంచ బ్యాంకుకు వెళ్లాయి. ఒక విదేశీ సంస్థ దేశంలో విచారణ చేయడమేంటనే విషయంపై భారత ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉండి ఉండొచ్చు" అని అభిప్రాయపడ్డారు.

"ప్రపంచ బ్యాంకు చికాకులు కలిగిస్తోందనే దరఖాస్తు వెనక్కు"

భారత ప్రభుత్వ చర్యను భారత ఆర్థిక వ్యవహారాల శాఖలోని ఒక ఉన్నతాధికారి ధృవీకరించారు. "ప్రపంచ బ్యాంకు లేనిపోని చికాకులు కలిగిస్తోందనే భారత ప్రభుత్వం రుణ దరఖాస్తును వెనక్కు తీసుకుంది" అని ఆ అధికారి స్పష్టం చేశారు. పూర్తి వివరాలు జులై 23న విడుదలవుతాయన్నారు.

అమరావతి రుణ దరఖాస్తుపై విచారణ కోసం 2017 జూన్‌లో ఒక విజ్ఞప్తి వచ్చినట్టుగా ప్రపంచ బ్యాంకు వెబ్‌సైట్‌లోని పత్రాల్లో ఉంది. ఆ సంస్థ ఇన్‌స్పెక్షన్ ప్యానెల్ (విచారణ కమిటీ) అధ్యక్షులు గొంజెలో కాస్ట్రో దె లా మాటా పేరుతో ఈ పత్రాలు ఉన్నాయి.

Image copyright Ravisankar Lingutla

కమిటీకి రెండు ఫిర్యాదులు

ఈ కమిటీకి రెండు ఫిర్యాదులు అందాయి. ఒకటి రైతుల నుంచి కాగా, మరొకటి భూయజమానుల నుంచి.

భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) పథకం వల్ల చెడు జరుగుతుందన్న కోణంలో ఆ ఫిర్యాదులు ఉన్నాయి.

2017లో ఒక విచారణ బృందం రాష్ట్రానికి వచ్చి విచారణ జరిపింది. ఈ విచారణ బృందం నివేదిక ఆధారంగా విచారణ జరపడానికి ప్రపంచ బ్యాంకు అనుమతి కోరిందని ప్రభుత్వ అధికారులు నిర్ధరించారు.

"ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు ఆలోచించాలి"

ప్రపంచ బ్యాంకు నిర్ణయంపై రాజధాని ప్రాంత రైతుల సమాఖ్యకు చెందిన మల్లెల శేషగిరిరావు సంతోషం వ్యక్తంచేశారు.

"మా భూములు, మా బతుకులు అయోమయంలో పడి భయంతో, బాధతో నిద్రలేని రాత్రులు గడిపాం. మేం జీవితంలో మర్చిపోలేని పోరాటం ఇది. ప్రపంచ బ్యాంకు చర్యతోనైనా రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ఆర్థిక సంస్థలు నిజాయతీతో ప్రజలు లేవనెత్తుతున్న విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి" అని ఆయన కోరారు.

రాజధాని నగరం సుమారు 54 వేల ఎకరాల్లో విస్తరించి ఉంటుందని ప్రపంచ బ్యాంకుకు పంపిన రుణ దరఖాస్తులో ప్రభుత్వం చెప్పింది. సమీకరించిన భూమిలో 90 శాతం భూమిని యజమానులు, రైతుల సమ్మతితోనే తీసుకున్నామని తెలిపింది.

2018 జులై 15 నాటికి 21,374 కుటుంబాలపై భూసమీకరణ ప్రభావం పడినట్లు భావిస్తున్నారు. ఈ కుటుంబాల జీవనోపాధి రాజధానికి సమీకరించిన భూములపై ఆధారపడి ఉంది.

శ్వేతపత్రంలో ప్రభుత్వం ఏం చెప్పింది?

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రాల్లో రాజధాని గురించి వ్యాఖ్యానిస్తూ- "రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం రాజధానికి రెండు లక్షల కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేసింది. కానీ ఐదేళ్లలో రాజధాని కోసం ఖర్చు పెట్టింది పిసరంతే" అని చెప్పింది.

10.32 శాతం వడ్డీతో సీఆర్‌డీఏ విడుదల చేసిన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల గురించి కూడా ప్రభుత్వం శ్వేతపత్రాల్లో ప్రస్తావించింది. ఈ డిబెంచర్లు విడుదల చేసినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఏడు శాతంకంటే తక్కువే ఉన్నాయని చెప్పింది. ఈ డిబెంచర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చినప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే వచ్చిందని వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు నమ్మకం లేదని ఇది సూచిస్తోందని చెప్పింది.

ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రాజధాని కోసం రూ.1,500 కోట్లు ఇచ్చినట్లు సీఆర్‌డీఏ కమిషనర్ పి.లక్ష్మీనరసింహం తెలిపారు.

కొత్త రాష్ట్రానికి రాజధాని కట్టిచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

Image copyright ANDHRAPRADESHCM/FACEBOOK

గత ప్రభుత్వం సరిగా కసరత్తు చేయలేదు: బుగ్గన

రాజధాని భూసమీకరణపై సమీక్ష కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

"ఈ ప్రపంచ బ్యాంకు ఎపిసోడ్ అంతా 2014-19కి సంబంధించినదే. భూసమీకరణలో అవకతవకలపై ఎంతో మంది రైతులు ప్రపంచ బ్యాంకును ఆశ్రయించారు. ఒక ఇన్‌స్పెక్షన్ ప్యానెల్ నివేదిక ఆధారంగా రుణం ఇవ్వడానికంటే ముందే విచారణ జరపాలనుకుంటోంది ప్రపంచ బ్యాంకు. కేంద్ర ఆర్థికశాఖ బహుశా దీనిని భారత ప్రభుత్వ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశంగా చూసి అభ్యంతరం చెప్పింది. ఏపీలో గత ప్రభుత్వం సరిగా కసరత్తు చేయకుండా ప్రతిపాదనలు పంపింది" అని ఆయన విమర్శించారు.

"త్వరలోనే ప్రణాళికతో ముందుకొస్తాం"

ఇప్పుడు రాజధానికి నిధులు ఎలా సమీకరిస్తారన్న ప్రశ్నకు బుగ్గన బదులిస్తూ- "రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. దానికి అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు రప్పించే ప్రణాళిక చేయాలి. ఇంత పెద్ద మొత్తాలు అలా తెచ్చుకోవడం అంత తేలిక కాదు. మనం తిరిగి ఎలా చెల్లిస్తాం? గత ప్రభుత్వానికి ఈ విషయంలో ఏదో ఆసక్తి ఉన్నట్టు కనిపిస్తోంది. భూసమీకరణపై వచ్చిన ఆరోపణలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. అందుకే రాష్ట్ర అభివృద్ధిని పణంగా పెట్టి అప్పు తేవడానికి వారు వెనుకాడలేదు. భూసమీకరణలో చాలా లోపాలున్నాయి. వాటిని విచారిస్తున్నాం. త్వరలోనే ఒక ప్రణాళికతో ముందుకు వస్తాం" అని చెప్పారు.

Image copyright FACEBOOK/YSJAGAN

వైసీపీ నిర్లక్ష్యం వల్లే: చంద్రబాబు

ప్రపంచ బ్యాంకు నిర్ణయంపై చంద్రబాబు స్పందిస్తూ- వైసీపీ నాయకుల అవగాహనలేమి, నిర్లక్ష్యం కారణంగానే అమరావతి నిధుల మంజూరుకు ప్రపంచబ్యాంకు వెనుకంజ వేసిందన్నారు. వారు అమరావతి నిర్మాణం ఆగిపోయే స్థితికి తెచ్చారని ఆయన ట్విటర్‌లో విమర్శించారు.

రాజధాని ఏర్పాటైతే తమ భూముల ధరలు పెరుగుతాయని ఆశించి రైతులు 34 వేల ఎకరాల భూమి ఇచ్చారని, ఇప్పుడు రాజధానిలో మిగులుగా ఉన్న 25 వేల ఎకరాలకు ఎకరానికి రూ.7-8 కోట్లు విలువ కట్టినా రూ.రెండు లక్షల కోట్ల ఆస్తి ప్రభుత్వం చేతిలో ఉన్నట్లు కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వల్ల ఇప్పుడక్కడ భూమి విలువ పడిపోయిందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)