అమర్‌నాథ్ యాత్ర: ఈ హిందూ తీర్థయాత్రకు ముస్లింలే వెన్నెముక

  • 20 జూలై 2019
అమర్‌నాథ్ యాత్ర Image copyright Getty Images

అత్యంత పవిత్రమైన హిందూ క్షేత్రాల్లో ఒకటైన అమర్‌నాథ్ గుహ తీర్థయాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది.

కానీ.. ఆ ప్రయాణం అంతే ప్రమాదకరమైనది కూడా. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఎంతో శ్రమకోర్చి పర్వతాలను అధిరోహించాలి.

చాలా మందికి పర్వతాలను అధిరోహించే శక్తి ఉండదు. అప్పుడు స్థానిక ముస్లింలు రంగంలోకి దిగుతారు. ఈ తీర్థయాత్రకు వెన్నెముకగా నిలుస్తారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఅమర్‌నాథ్ యాత్ర: ఈ హిందూ తీర్థయాత్రకు ముస్లింలే వెన్నెముక

‘‘ఈ ప్రయాణం చాలా కష్టం కనుక జనం మా సాయం తీసుకుంటారు. దారి చాలా ఇరుకుగా ఉంటుంది. వర్షంలో, మంచులో నడవటం చాలా కష్టం. వర్షం కురిస్తే కొండచరియలు విరిగిపడొచ్చు. కానీ.. ఈ తీర్థయాత్రికులను అమర్‌నాథ్ గుహకు తీసుకువెళ్లి, తీసుకువచ్చే బాధ్యతను మేం మా భుజాలకెత్తుకుంటాం’’ అని స్థానిక శ్రామికుడు ఖుర్షీద్ అహ్మద్ చెప్తున్నారు.

కశ్మీర్‌ నలుమూలల నుంచీ వచ్చే ముస్లిం శ్రామికులు ఇక్కడ నెల రోజులకు పైగా మకాం వేస్తారు. సంఘర్షణతో సంక్షుభితమైన ప్రాంతం కావడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఈ తీర్థయాత్ర చాలా అవసరం.

దాదాపు ఆరు గంటలపాటు కొండమార్గాల్లో ఎక్కిన తర్వాత పైకి చేరుకుంటారు. అమర్‌నాథ్ గుహ 3,888 మీటర్ల ఎత్తులో ఉంది. గాలి చాలా తక్కువ. శ్వాస తీసుకోవటానికీ శ్రమించాలి. కానీ ఇక్కడి వరకూ రాగలిగినందుకు ఈ యాత్రికులు సంతోషిస్తారు.

‘‘ఇక్కడ రెండు మతాలవారూ కలిసి పనిచేస్తారు. అది చాలా అందమైన విషయం. యాత్రికుల సంరక్షణను స్థానికులు చూసుకుంటారు. వారి అవసరాలను తీరుస్తారు. యాత్రికులు కూడా వీరితో చక్కగా కలిసిపోతారు. అన్నిచోట్లా ఇలాగే జరగాలి’’ అంటారు గౌరవ్ అనే తీర్థయాత్రికుడు.

Image copyright Getty Images

ఇటీవలి కాలంలో దేశంలో హిందువులు - ముస్లింల మధ్య మతపరమైన చీలికలు ఏర్పడ్డాయి. కానీ.. ఈ తీర్థయాత్ర ఈ రెండు మతాల వారినీ విభజించదు.. ఐక్యం చేస్తుంది.

‘‘హిందువులని, ముస్లింలని విభజించేది మన రాజకీయ నాయకులు. కానీ పేదవాళ్లం అలా ఆలోచించం. హిందువుల కోసం ముస్లింలు ఎందుకు పనిచేయాలని మేం ఎప్పుడూ ప్రశ్నించం. హిందువులను పవిత్ర గుహ దగ్గరకు తీసుకెళ్లేటపుడు వారిని మా సోదరులుగా భావిస్తాం. మనసులో మంచి ఉద్దేశంతో వెళితే.. అల్లా మన కోరికలను కూడా తీరుస్తాడు’’ అని మక్బూల్ హుసేన్ అనే శ్రామికుడు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం