కార్గిల్ యుద్ధాన్ని 20 ఏళ్ల కిందట బీబీసీ ప్రపంచానికి ఎలా అందించింది?

  • 20 జూలై 2019
కార్గిల్ యుద్ధానికి 20 ఏళ్లు
చిత్రం శీర్షిక యుద్ధంలో విజయం సాధించిన తర్వాత భారతీయ జెండాతో సైనికులు

కార్గిల్ యుద్ధం. రెండు దశాబ్దాల క్రితం భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన ఈ యుద్ధంలో సుమారు 600 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్‌కు జరిగిన ప్రాణ నష్టంపై కచ్చితమైన లెక్కలు లేవు.

హిమాలయ పర్వతసానువుల్లో ఎల్వోసీ సమీపంలో జరిగిన ఆ యుద్ధ సమయంలో ఇటు భారత్ లోనూ, అటు పాకిస్తాన్‌లోనూ యుద్ధ కథనాల్ని ప్రపంచానికి చూపించేందుకు అనుమతి పొందిన ఏకైక మీడియా బీబీసీ మాత్రమే.

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కార్గిల్ యుద్ధాన్ని బీబీసీ ఎలా ప్రపంచానికి అందించింది..? నాటి యుద్ధానికి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం.

1999 మే నెలలో కాశ్మీర్ నియంత్రణ రేఖ గుండా ముజాహిదీన్ల నేతృత్వంలో భారత భూభాగంలోకి భారీగా చొరబాట్లు జరుగుతున్నాయన్న సమాచారం ప్రభుత్వానికి అందింది.

అయితే నియంత్రణ రేఖ వద్ద భారత భూభాగంలోని 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో, సుమారు 8 నుంచి 10 కిలోమీటర్ల మేర వారు చొచ్చుకొచ్చారన్న విషయాన్ని భారత్ ఆలస్యంగా గుర్తించింది.

ఆ చొరబాట్లను తిప్పికొట్టేందుకు గతంలో ఏ యుద్ధాల్లోనూ చూడని రీతిలో భారీ ఎత్తున సైనిక సమీకరణ చేసింది భారత్.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: 20 ఏళ్ల కిందట కార్గిల్ యుద్ధాన్ని బీబీసీ ప్రపంచానికి ఎలా అందించింది?

యుద్ధ దళాలు భారీ ఫిరంగులతో పాటు వైమానిక దళాలతో దాడులు ప్రారంభించాయి.

మరీ ముఖ్యంగా.. ఇక్కడ అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతం టైగర్ హిల్‌పై నియంత్రణను కాపాడుకునేందుకు భారత్ చర్యలు తీసుకుంది.

పదాతి దళాలు, భారీ శతఘ్నులతో పాటు వైమానిక దళాన్ని కూడా రంగంలోకి దించింది.

‘‘ఇది (ఈ యుద్ధం) నన్ను చాలా భాధిస్తోంది. కానీ ఇది తప్పనిసరి అయ్యింది’’ అని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ వీపీ మాలిక్ బీబీసీతో అన్నారు.

మరోవైపు మిగిలిన మీడియా వెలికితీయని ఎన్నో విషయాలను బీబీసీ వెలుగులోకి తెచ్చింది.

‘‘యుద్ధాన్ని కొనసాగించడమే మా విధి. కాబట్టి, మాకు సహకరించడం పాకిస్తాన్ విధి అవుతుంది’’ అని పాకిస్తాన్‌లోని మిలిటెంట్ నాయకుడొకరు బీబీసీతో అన్నారు.

‘‘మా పరిధిలో ఉన్న నియంత్రణ రేఖ వెంబడి మా దళాలు విస్తృతంగా తనిఖీలు చేశాయి. ఎల్ఓసీ వెంబడి ఎలాంటి చర్యలు తీసుకున్నా మేం సిద్ధంగా ఉన్నాం’’ అని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ బీబీసీతో చెప్పారు.

ఈ యుద్ధం కారణంగా సరిహద్దులకు రెండువైపులా ఉన్న స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాము అన్నీ వదులుకుని, పిల్లల్ని తీసుకుని పారిపోతామని ద్రాస్ ప్రాంతానికి చెందిన వారు బీబీసీకి చెప్పారు.

‘‘మేం హిందుస్థాన్ (భారత్)వైపున హాయిగా ఉంటున్నాం. పాకిస్తాన్ మమ్మల్ని సర్వనాశనం చేసింది. మా పశువులు చనిపోయాయి’’ అని మరొక స్థానికుడు బీబీసీకి చెప్పారు.

59 రోజుల పాటు సాగిన యుద్ధం జూలై 26వ తేదీన ముగిసింది.

భారత్ తాను కోల్పోయిన భూభాగాన్ని తిరిగి దక్కించుకుంది. కానీ ఈ క్రమంలో 610 మంది అసువులు బాశారు.

చిత్రం శీర్షిక కార్గిల్ యుద్ధ సమయంలో బీబీసీతో మాట్లాడుతున్న ఆనాటి పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్

ఇందులో తమ పాత్ర ఉన్నట్టు పాకిస్తాన్ అంగీకరించలేదు.

మరణించిన తమ సైనికుల మృతదేహాలను సైతం అది స్వీకరించలేదు.

చివరికి వారిని భారత్ లోనే ఖననం చేసారు.

యుద్ధం కారణంగా తీవ్రమైన హింసను చవి చూసిన సరిహద్దు ప్రాంతంలోని భారతీయులు యుద్ధం నిలిచిపోవటంతో సంబరాలు చేసుకున్నారు.

ఆ యుద్ధం ముగిసింది .. కానీ అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు పొరుగు దేశాల మధ్య హింస మాత్రం ఇంకా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు