దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ కన్నుమూత

  • 20 జూలై 2019
షీలా దీక్షిత్ Image copyright CITIZEN DELHI: MY TIMES, MY LIFE

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ కన్నుమూశారు. దిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్‌లో ఆమె చికిత్స పొందుతూ శనివారం మరణించారు. ఆమె వయసు 81 సంవత్సరాలు.

గత కొన్ని రోజులుగా గుండె సంబంధ సమస్యలతో ఆమె బాధపడుతున్నారు.

దిల్లీకి సుదీర్ఘకాలంపాటు పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆమె పేరుపొందారు. 1998 నుంచి 2013 మధ్యలో వరుసగా 15ఏళ్లపాటు (మూడు పర్యాయాలు) ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఆ తర్వాత కొన్ని నెలలపాటు కేరళ రాష్ట్ర గవర్నర్‌గా కూడా షీలా దీక్షిత్ పనిచేశారు.

2019 సాధారణ ఎన్నికల సమయంలో దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈశాన్య దిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీచేసి, బీజేపీ నేత మనోజ్ తివారీ చేతిలో ఓటమిపాలయ్యారు.

తన భర్త మరణం తర్వాత ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1984లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు.

"నేను మొదటిసారి ప్రసంగిస్తున్నప్పుడు నా కాళ్లూ, చేతులూ వణికాయి. నాకు చాలా భయం వేసింది" అని 2006లో బీబీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షీలా అన్నారు.

"కాంగ్రెస్ పార్టీ ప్రియనేత షీలా దీక్షిత్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె కుటుంబానికి నా సంతాపం తెలుపుతున్నా" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

"దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకురాలు షీలా దీక్షిత్ మరణ వార్త చాలా బాధాకరం. ఆమె పరిపాలనలో దిల్లీలో జరిగిన అభివృద్ధి ఆమెను ఎప్పటికీ గుర్తుచేస్తుంది" అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు.

"దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మరణంపై నా సానుభూతి వ్యక్తం చేస్తున్నా. ఆమె గొప్ప పాలనావేత్త" అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్లో తెలిపారు.

"షీలా దీక్షిత్ మరణం నన్ను ఎంతో బాధించింది. దిల్లీ అభివృద్ధికి షీలా దీక్షిత్ ఎంతో కృషిచేశారు. ఆమె కుటుంబానికి, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Image copyright CITIZEN DELHI: MY TIMES, MY LIFE

షీలా దీక్షిత్‌కు ఇద్దరు పిల్లలు. కుమారుడు సందీప్ దీక్షిత్, కుమార్తె లతిక.

"మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే అమ్మ మమ్మల్ని బాత్‌రూమ్‌లో పెట్టి గడియపెట్టేది. కానీ ఎప్పుడూ కొట్టలేదు" అని గతంలో ఓ సందర్భంలో లతిక చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)