హైదరాబాదీల్లో నిజాయితీ ఎంత?.. పర్సు దొరికితే తిరిగి ఇచ్చేది ఎందరు?

  • 21 జూలై 2019
చార్మినార్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇండియాలో నిర్వహించిన పరీక్షలో డబ్బులున్న పర్సులను తిరిగి ఇవ్వటంలో హైదరాబాద్‌ నగరం చివరి స్థానంలో (28 శాతం) నిలిచింది

కొన్నేళ్ల కిందట ఓ పరిశోధన బృందం సహాయకులకు.. భారతదేశంలోని ఎనిమిది నగరాల్లో బ్యాంకులు, థియేటర్లు, హోటళ్లు, పోలీస్ స్టేషన్లు, పోస్ట్ ఆఫీసులు, కోర్టులు వంటి ప్రభుత్వ భవనాల్లో 400 పర్సులు ''దొరికాయి''.

అవి తమకు దొరికాయని చెప్తూ.. ఆయా భవనాల్లోని సెక్యూరిటీ గార్డులు, రిసెప్షనిస్టులకు అందించి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.

కొన్ని పర్సుల్లో డబ్బులు లేవు. కొన్ని పర్సుల్లో ఒక్కో దానిలో 230 రూపాయలు ఉన్నాయి. ఒక్కో పర్సులో ఒకే తరహాలో కనిపించే బిజినెస్ కార్డులు మూడు ఉన్నాయి. యజమాని పేరు, ఈమెయిల్ అడ్రస్, సరుకుల జాబితా, ఒక తాళం కూడా ఉన్నాయి.

ఆ పర్సులకు యజమానులుగా నటిస్తూ పరిశోధకుల బృందం వేచి చూస్తోంది. ఆ సెక్యూరిటీ గార్డులు, రిసెప్షనిస్టుల నుంచి సమాచారం కోసం. వారి నిజాయితీని పరీక్షించటానికి చేపట్టిన ప్రయోగం అది.

హైదరాబాద్, దిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, కోయంబత్తూరుల్లో 314 మంది పరుషులు, 86 మంది మహిళలకు ఆ పర్సులు అందాయి.

డబ్బులు ఉన్న పర్సుల్లో 43 శాతం.. వాటి యజమానులకు అందాయి. అయితే.. డబ్బులు లేని పర్సుల్లో 22 శాతం మాత్రమే తిరిగి వచ్చాయి.

Image copyright AFP

ప్రయోగం ఫలితాలను తాజాగా సైన్స్ మేగజీన్‌లో ప్రచురించారు. జనం మనం అనుకున్న దానికన్నా నిజాయితీపరులని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి.

''ఇది మేం ఊహించలేదు'' అని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో ప్రవర్తనా ఆర్థికశాస్త్ర నిపుణుడు అలాన్ కొహన్ పేర్కొన్నారు. ఈ ఫలితాల నివేదిక రచయితల్లో ఆయన ఒకరు.

''నిజాయితీగా లేకపోతే ఇంకా ఎక్కువగా లాభం కలిగే పరిస్థితిలో ఉన్నపుడు.. మోసం చేయాలన్న కాంక్ష పెరుగుతుంది. అదే సమయంలో.. తమను తాము దొంగగా చూసుకోవటంలో మానసిక ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు.. మొదటి దానిని రెండోది అధిగమిస్తుంది'' అని ఈ అధ్యయన రచయితలు పేర్కొన్నారు.

ఈ ప్రయోగంలో.. భారతదేశంలో డబ్బులు ఉన్న పర్సులను తిరిగి ఇచ్చిన ఉదంతాల్లో అత్యధిక, అతి తక్కువ శాతాలు నమోదైంది దక్షిణాది నగరాల్లోనే.

డబ్బులున్న పర్సులను బెంగళూరులో అత్యధికంగా (66 శాతం) తిరిగి ఇచ్చారు. అతి తక్కువగా (28 శాతం) తిరిగి ఇచ్చింది హైదరాబాద్‌లో.

ఇక డబ్బులు లేని పర్సులను అత్యధికంగా తిరిగి ఇవ్వటంలో మరో దక్షిణాది నగరం కోయంబత్తూరు (58 శాతం) అగ్రస్థానంలో నిలిస్తే.. అటువంటి పర్సులు దేశ రాజధాని దిల్లీలో అత్యల్పంగా (12 శాతం) తిరిగివచ్చాయి.

మొత్తంగా చూస్తే.. డబ్బులు ఉన్నా, లేకున్నా పర్సులను తిరిగి అందించే ప్రయత్నం చేసిన వారిలో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఉన్నారు.

నిజాయితీ - స్వీయ ప్రయోజనాల మధ్య ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారనే అంశం మీద అంతర్జాతీయంగా చేపట్టిన విస్తృత అధ్యయనంలో భాగంగా భారతదేశంలో ఈ పర్సుల ప్రయోగం నిర్వహించారు.

2013 - 2016 సంవత్సరాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లోని 355 నగరాల్లో 17,000 పర్సులను పరిశోధకుల బృందం సహాయకులు ''జారవిడిచారు''.

ఆ పర్సులు కొన్నిటిలో.. ఆయా దేశ ప్రజల సగటు కొనుగోలు శక్తి ప్రాతిపదికగా 13.45 డాలర్ల వరకూ స్థానిక కరెన్సీలో డబ్బులు ఉంచారు.

మొత్తం 40 దేశాల్లో 38 దేశాల ప్రజలు.. డబ్బులు ఉన్న పర్సులను తిరిగి వాటి యజమానులకు అందించటానికి ఎక్కువ సంసిద్ధంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. పెరూ, మెక్సికో దేశాల్లో ఇది తక్కువగా ఉంది.

మూడు దేశాల్లో.. పర్సుల్లో ఉన్న మొత్తాన్ని ఏడు రెట్లు పెంచి వాటిని జారవిడిచినపుడు.. వాటిని తిరిగి ఇచ్చే సగటు 18 శాతం పెరిగినట్లు పరిశోధకులు తెలిపారు.

డబ్బులున్న పర్సులను తిరిగి ఇవ్వటంలో డెన్మార్క్ (82 శాతం) అగ్రస్థానంలో ఉంటే.. పెరూ (13 శాతం) అట్టగున ఉంది. డబ్బులు లేని పర్సులను తిరిగి ఇవ్వటంలో స్విట్జర్లాండ్ (73 శాతం) మొదటి స్థానంలో, చైనా (7 శాతం) చివరి స్థానంలో ఉన్నాయి. పర్సులో డబ్బులు ఎంత ఎక్కువగా ఉంటే.. జనంలో నిజాయితీ కూడా ఎక్కువగా కనిపించింది.

Image copyright Getty Images

నిజాయితీని కొలవటం కష్టతరమే...

అయితే.. బ్రిటన్ పరిశోధకులు 2015లో 15 దేశాల్లో 1,500 మంది పాల్గొన్న ప్రయోగంలో ఇండియా, చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో నిజాయితీ అతి తక్కువగా ఉందని రేటింగ్ ఇచ్చారు.

ఇక ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ రూపొందించిన 2018 అవినీతి సూచికలో - ప్రభుత్వ రంగంలో అవినీతి ఎంత ఉందన్న ప్రజాభిప్రాయంలో - 180 దేశాల జాబితాలో ఇండియాకు 78వ ర్యాంకు ఇచ్చింది. (అవినీతి అతి తక్కువగా ఉన్న దేశానికి మొదటి ర్యాంకు లభిస్తుంది.)

ఇక ఇండియాలో నిర్వహించిన పర్సుల ప్రయోగంలో కొన్ని విచిత్ర ఉదంతాలూ చోటు చేసుకున్నాయి. పరిశోధనలో పాలుపంచుకున్న సహాయకుడిని ఒక ప్రభుత్వ భవనంలోకి అనుమతించటానికి అక్కడి సెక్యూరిటీ గార్డు లంచం డిమాండ్ చేశాడు. సదరు సెక్యూరిటీ గార్డు ఆ తర్వాత పర్సును తిరిగి ఇవ్వలేదు కూడా.

మరొక చోట.. దొరికిందని ఇచ్చిన పర్సు యజమాని ఆచూకీ తెలియకపోతే.. అందులోని డబ్బును దానం చేస్తానని చెప్పాడు.

Image copyright AFP
చిత్రం శీర్షిక డబ్బులు ఉన్న పర్సులను తిరిగి ఇవ్వటంలో డెన్మార్క్ అగ్రస్థానంలో నిలిచింది

ఈ నిజాయితీకి కారణమేమిటి?

''డబ్బులకు సంబంధించిన ఉదంతాల్లో ప్రజల్లో నిజాయితీ ఎక్కువగా ఉండటం ప్రపంచమంతా కనిపించింది'' అని యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్ ఆర్థికవేత్త డాక్టర్ క్రిస్టియన్ లూకాస్ జుండ్ నాతో పేర్కొన్నారు.

మరో విశేషం ఏమిటంటే.. తాళంచెవి ఉన్న పర్సులను.. లేని పర్సులకన్నా ఎక్కువగా వాటి యజమానులకు అందజేశారు.

దీనికి ఒక కారణం.. పరహితతత్వం - అపరిచుతల హితం గురించి ఆలోచించటేతత్వం - అని చెప్పవచ్చు.

ఇక.. తనను తాను దొంగగా భావించటానికి సంబంధించి మానసిక ఒత్తిడి కూడా మరొక కారణం.

''డబ్బులు ఉన్న పర్సు కన్నా.. డబ్బులు లేని పర్సును ఉంచేసుకోవటం వల్ల నిజాయితీగా లేమన్న భావన చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ పర్సు వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు'' అంటారు డాక్టర్ జుండ్.

మరి.. పర్సులను తిరిగి ఇవ్వని వారి సంగతి ఏమిటి? వాళ్లలో నిజాయితీ లేకపోవచ్చునని ఆర్థికవేత్తలు అంటారు. అయితే.. అదే సమయంలో వారు నిజాయితీపరులు అయినా కూడా తీరిక లేకపోవటమో, మరచిపోవటమో కూడా జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు.

డ్యూక్ యూనివర్సిటీలో మనస్తత్వం, ప్రవర్తనా ఆర్థికశాస్త్రం ప్రొఫెసర్ డాన్ అరీలీ 'ద హానెస్ట్ - ట్రూత్ అబౌట్ డిజానెస్టీ' అనే పుస్తకంలో ఇటువంటి ప్రయోగం గురించి చెప్తారు.

ఆయన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లోని ఒక డార్మిటరీలోకి వెళ్లి.. అక్కడ ఉన్న రిఫ్రిజిరేటర్లలో సగం వాటిలో ఆరు కోకా-కోలా ప్యాకెట్లు పెట్టారు. మిగతా సగం రిఫ్రిజిరేటర్లలో ఒక్కో డాలరు నోట్లు ఉన్న పేపర్ ప్లేట్లు పెట్టారు.

మూడు రోజులు గడిచేసరికి.. కోకాకోలాలు అన్నీ ఐపోయాయి. కానీ డబ్బు నోట్లను ఎవరూ ముట్టుకోలేదు.

''నగదు విలువను విస్పష్టంగా సూచించని వస్తువులను దొంగిలించటానికి మన మనుషులం సిద్ధంగా ఉంటాం. కానీ.. నేరుగా డబ్బును దొంగిలించటానికి మాత్రం వెనుకాడతాం.. అది చాలా గర్వకారణంగా కూడా భావిస్తాం'' అని ఆయన వివరించారు.

ఏదేమైనా.. నిజాయితీ అనేది అత్యుత్తమ విధానమనేది సుస్పష్టం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం