ధోని: క్రికెట్‌కు రెండు నెలల విరామం.. సైన్యంలో సేవలందించాలని నిర్ణయం - ప్రెస్ రివ్యూ

  • 21 జూలై 2019
Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2012 జూన్ 3వ తేదీన బారాముల్లాలోని సైనిక శిబిరంలో ఎంఎస్ ధోనీ

వెస్టిండీస్‌తో భారత క్రికెట్ జట్టు ఆడే సిరీస్‌ నుంచి విరామం తీసుకుని, రెండు నెలలపాటు భారత సైన్యంలో సేవలందించాలని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్ణయం తీసుకున్నట్లు ఈనాడు దినపత్రిక వార్త రాసింది.

పారామిలటరీ రెజిమెంట్‌లో పని చేయాలని నిర్ణయించుకున్న ధోని ఆట నుంచి విరామం తీసుకున్నాడు.

ఎనిమిదేళ్ల నుంచి అతడు పారాచూట్‌ సైనిక విభాగంలో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్ హోదాలో ఉన్నాడు.

రెండు నెలలు సైనికుడిగా దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు రెండు రోజుల క్రితమే బీసీసీఐ ఉన్నతాధికారిని ధోని వ్యక్తిగతంగా కలిసి సమాచారం ఇచ్చాడని తెలిసింది. వెస్టిండీస్ సిరీస్ కోసం తన పేరును పరిగణనలోకి తీసుకోకూడదని అతడు కోరినట్లు సమాచారం.

తాజాగా అదే విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి.. సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లాడు.

''వరల్డ్‌కప్ ఆరంభానికి ముందే ధోని ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది కేవలం రెండు నెలల విరామం మాత్రమే. రిటైర్మెంట్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అతడి నిర్ణయాన్ని కెప్టెన్‌ కోహ్లి, సెలక్టర్లకు తెలియజేశాం'' అని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.

సైనిక విభాగంలో పనిచేయాలనే ధోని తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.

Image copyright APGOVERNMENT

‘నవరత్నాలకు ప్రపంచబ్యాంక్ చేయూత’

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం మంజూరు నుంచి తాము వైదొలిగినప్పటికీ ఇతర ఏ పట్టణ ప్రాజెక్టుకైనా సరే రుణం మంజూరు చేస్తామని ప్రపంచ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు సాక్షి దినపత్రిక కథనం రాసింది.

అమరావతి నిర్మాణం కాకుండా మరో ప్రాజెక్టును సూచిస్తే 300 మిలియన్‌ డాలర్ల రుణం ఇస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే సాయాన్ని మరింత పెంచుతామని పేర్కొన్నట్లు చెప్పాయి.

ప్రాధామ్యాల ఆధారంగా దీనిపై నిర్ణయించుకోవాలని ప్రపంచ బ్యాంకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. మరో ప్రాజెక్టును సూచిస్తే సాయాన్ని మరింత పెంచుతామని కూడా హామీ ఇచ్చింది.

ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పథకాలకు సాయం చేస్తామని, నవరత్నాల అమలుకు చేయూత అందిస్తామని ప్రపంచబ్యాంకు వర్గాలు పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Image copyright facebook/GHMCOnline

చెత్త వేసేవారిపై జీహెచ్ఎంసీ నిఘా

హైదరాబాద్‌లో రోడ్లపై ఇష్టారాజ్యంగా చెత్తను పారేసేవారిపై, నల్లా నీటిని వృథా చేసేవారిపై నిఘా పెట్టి, భారీ జరిమానాలు విధించే కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం రాసింది.

శనివారం జీహెచ్ఎంసీ ప్రత్యేక నిఘా బృందాలు రంగంలోకి దిగి, పలువురికి జరిమానాలు విధించాయి.

ఎస్సార్‌నగర్‌ ధరమ్‌కరమ్‌ రోడ్డుపై భవన నిర్మాణ వ్యర్థాలను వదిలేసినందుకు సమీపంలోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమానులకు అధికారులు రూ. 25 వేల జరిమానా విధించారు.

సర్కిల్‌-12 పరిధిలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలపై బస్తాల్లో చెత్తను తీసుకువచ్చి పారవేసేవారిని పట్టుకుని, రూ. 10వేల మేర జరిమానా విధించాయి. మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నాయి.

ఇకపై అన్ని సర్కిళ్లలో ఈ తరహా తనిఖీలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.

నగరంలో రోజుకు 5 కోట్ల గ్యాలన్ల మేర నీరు వృథా అవుతున్నట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌.. శనివారం జరిగిన ఓ సమీక్ష సమావేశంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసకోవాలని ఆదేశించారు.

జల మండలి నల్లాల్లో వచ్చే నీటితో వాహనాలు, ఇళ్లు, దుకాణాలను కడిగేవారికి భారీ జరిమానాలు విధిస్తారని అంచనా.

బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో మూత్ర విసర్జన, ఉమ్మివేయడం, ధూమపానం, ప్లాస్టిక్ పారవేయడం వంటి వాటికీ జరిమానాలు విధించనున్నారు.

రోడ్ల తవ్వకాలపైనా నిషేధం విధించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ప్రభుత్వ శాఖలైనా, ప్రైవేటు వ్యక్తులైనా ఇకపై రోడ్లను తవ్వడానికి వీల్లేదు.

వాట్సాప్ Image copyright Getty Images

వాట్సప్‌లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ

డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల ఆర్సీ కార్డులను ప్రింటింగ్‌కు పంపించడానికి ముందు, దరఖాస్తుదారులకు వాటి ప్రతులను వాట్సాప్, మెయిల్స్ ద్వారా పంపాలని రవాణాశాఖ అధికారులు నిర్ణయించినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్త ప్రచురించింది.

ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నట్టు రవాణాశాఖ జాయింట్ కమిషనర్, ఆన్‌లైన్ సర్వీసెస్ సిటిజన్స్ కమిటీ చైర్మన్ రమేశ్ తెలిపారు.

ప్రింటింగ్‌లో తప్పులు రాకుండా, ముందే సరిదిద్దుకునే వెసులుబాటు దీని ద్వారా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

శనివారం ట్రాన్స్‌పోర్టుభవన్‌లో రమేశ్ అధ్యక్షతన సమావేశమైన ఆన్‌లైన్ సర్వీసెస్ సిటిజెన్స్ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది.

ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటుచేశామని, రవాణాశాఖ అందించే సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటామని రమేశ్ చెప్పారు. పెండింగ్‌కార్డులను సోమవారం నుంచి పంపిణీచేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)