కర్ణాటక సంక్షోభం: కుమార స్వామి ప్రభుత్వం కూలుతుందా.. కొనసాగుతుందా

  • 22 జూలై 2019
కర్ణాటక గవర్నర్ వాజుభాయి వాలాతో సీఎం కుమారస్వామి Image copyright facebook/hdkumaraswamy
చిత్రం శీర్షిక కర్ణాటక గవర్నర్ వాజుభాయి వాలాతో సీఎం కుమార స్వామి

కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం చేస్తున్న మనుగడ పోరాటం రాజకీయ సంక్షోభం నుంచి రాజ్యాంగ సంక్షోభంగా రూపు మార్చుకుంటోంది. శాసనసభలో బలం నిరూపించుకోవాలంటూ ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నరు వాజూభాయి వాలా అందుకు రెండుసార్లు అవకావం ఇవ్వడం.. దాన్ని కుమారస్వామి వాయిదా వేస్తుండడంతో పరిస్థితి జటిలమైంది.

ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షకు సిద్ధమైనా సభలో ఓటింగ్ నిర్వహించకుండా సాగదీత ధోరణితో వ్యవహరిస్తున్నారు. అయితే, సీఎం విశ్వాస పరీక్షకు సిద్ధమైన తరువాత శాసనసభా వ్యవహారాలలో జోక్యం చేసుకునే అధికారం గవర్నరుకు ఉంటుందా ఉండదా అన్నది న్యాయ, రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది. ఈ అంశం సోమ, మంగళవారాల్లో సుప్రీంకోర్టు ముందుకు వచ్చే సూచనలున్నాయి.

భిన్న న్యాయ అభిప్రాయాలు

ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నరు పాత్రపై న్యాయ నిపుణుల నుంచీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో రాజ్యాంగ వ్యవస్థ స్తంభించిపోయిందని గవర్నరు భావించి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా లేదంటే అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచొచ్చని భావిస్తున్నారు.

'బలం నిరూపించుకోవడానికి గవర్నరు ఇచ్చిన రెండు గడువులనూ ముఖ్యమంత్రి కుమారస్వామి పట్టించుకోలేదు. సంకీర్ణ ప్రభుత్వం తన మెజారిటీని కోల్పోయిందని గవర్నరు వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని గవర్నరు కేంద్రానికి పంపించారు. సోమవారం విశ్వాస పరీక్షపై ఓటింగ్ చేపట్టకపోతే గవర్నరు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంద'ని కర్నాటక మాజీ అడ్వకేట్ జనరల్ అశోక్ హర్నహళ్లి చెప్పారు.

'విశ్వాస పరీక్షకు సంబంధించిన ప్రక్రియను సభలో ముఖ్యమంత్రి ప్రారంభించిన తరువాత అందులో గవర్నరు జోక్యం చేసుకునే వీలు లేదు. ఆయన కేంద్రం నామినేట్ చేసిన సభ్యుడు మాత్రమే. గవర్నరు సొంతంగా ఒక అభిప్రాయానికి రాలేరు. కేంద్రం రాష్ట్రపతి పాలననైనా విధించొచ్చు లేదంటే శాసనసభను సుప్తచేతనావస్థలోకి నెట్టొచ్చు. కానీ, ఒక ముఖ్యమంత్రికి సభ్యుల మద్దతు ఉందా లేదా అని తేలేది విశ్వాస పరీక్షలో మాత్రమే. రాష్ట్రపతి పాలన విధించమనో, సభను సుప్తచేతనావస్థలో ఉంచమనో కేంద్రానికి ఎవరైనా తప్పుడు సలహా ఇవ్వొచ్చు. కానీ, ఒక విషయం గుర్తుంచుకోవాలి.. గతంలో బిహార్‌లో నితీశ్ ప్రభుత్వం విషయంలో అప్పటి గవర్నరు బూటాసింగ్ వ్యవహరించిన తీరు అనంతరం ఆయన్ను పదవిని కోల్పోయేలా చేసింద'ని మరో మాజీ అడ్వకేట్ జనరల్ రవికుమార్ వర్మ అన్నారు.

ఎందుకీ సంక్షోభం?

పాలక సంకీర్ణ పక్షం కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. ఒక స్వతంత్ర సభ్యుడూ రాజీనామా చేశారు. తన కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ(కేపీజేపీ)ని కాంగ్రెస్‌లో విలీనం చేసి మంత్రి పదవి చేపట్టిన మరో సభ్యుడూ రాజీనామా సమర్పించారు. వీరిలో స్వతంత్ర ఎమ్మెల్యే, కేపీజేపీ నేత ప్రస్తుతం బీజేపీకి అనుబంధంగా ఉన్నారు.

ఈ రాజీనామాలపై స్పీకర్ రమేశ్ కుమార్ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారి రాజీనామాలు ఆమోదించనూ లేదు, వారిపై అనర్హత వేటూ వేయలేదు.

ప్రస్తుత సమావేశాల తొలి రోజునే ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాస పరీక్షకు అనుమతించాలని స్పీకరును కోరారు. తన ప్రభుత్వానికి సభ్యుల మద్దతు లేదన్న వదంతులు వ్యాపిస్తున్నాయన్న కారణం చెబుతూ ఆయన విశ్వాస పరీక్షకు అనుమతించాలని కోరారు.

అనంతరం శుక్రవారం(19.07.2019) మధ్యాహ్నం 1.30 సరికి బలం నిరూపించుకోవాలని సీఎం కుమారస్వామిని గవర్నరు ఆదేశించారు.

దాన్ని పట్టించుకోకపోవడంతో ఆ రోజు ముగిసేలోగా బలం నిరూపించుకోవాలని మరో గడువు పెట్టారు. అయితే, ఆ గడువులోగా కూడా బల నిరూపణకు ఓటింగ్ చేపట్టలేదు.

శుక్రవారం సాయంత్రం స్పీకర్ రమేశ్ కుమార్ కాంగ్రెస్ విధాన సభాపక్ష నేత, మాజీ మంత్రి సిద్ధరామయ్యను 'ఇక ఓటింగ్ చేపట్టవచ్చా' అని ప్రశ్నించగా.. ఇంకా 20 మంది సభ్యులు విశ్వాస పరీక్షపై చర్చలో మాట్లాడాల్సి ఉందని, ఓటింగ్ సోమవారం చేపడితే మంచిదని ఆయన సూచించారు. ఆ వెంటనే స్పీకరు కుమారస్వామిని 'మీదీ అదే అభిప్రాయమా' అనగానే ఆయన అవునన్నట్లుగా తలూపారు.

Image copyright Pti

ఎందుకీ సాగదీత?

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పాలక కాంగ్రెస్, జేడీఎ‌స్‌లు పిటిషన్ వేయడంతో వారిలో అయిదారుగురు మళ్లీ పాలక కూటమి గూటికి చేరుతారని భావించారు కానీ, రామలింగారెడ్డి ఒక్కరే అలా పాత గూటికి వచ్చి సభకు హాజరయ్యారు.

గత రెండు రోజుల్లో సభకు వచ్చినవారిలో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు 98 మంది ఉండగా.. బీజేపీ సభ్యులు 107 మంది ఉన్నారు.

మరోవైపు పాలక కూటమి సుప్రీంకోర్టు గత ఆదేశాలపై స్పష్టత కోసం వేచిచూస్తోంది. అసంతృప్త ఎమ్మెల్యేలను సభకు హాజరుకావాలని ఎవరూ బలవంతం చేయలేరన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలపై జేడీఎస్, కాంగ్రెస్‌లు ఇప్పటికే స్పష్టత కోరుతూ పిటిషన్లు వేశాయి.

అయితే, 'సుప్రీం కోర్టు దీనిపై స్పష్టత ఇస్తూ ఏం చెప్పినా కూడా కర్నాటకలో పరిస్థితులేమీ మారిపోవు'' అని బీజేపీకి చెందిన న్యాయశాఖ మాజీ మంత్రి సురేశ్ కుమార్ అంటున్నారు.

Image copyright Getty Images

అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచితే అసంతృప్త ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి?

గవర్నరు అసెంబ్లీని సుప్త చేతనావస్థలోకి నెడితే అసంతృప్త ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటనే విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో 'వారిపై స్పీకరు అనర్హత వేటు వేయొచ్చు, లేదంటే రాజీనామాలు ఆమోదించొచ్చు' అని రవి వర్మ కుమార్ చెప్పారు.

'వారి రాజీనామాలను స్పీకరు ఆమోదించనంత వరకు వారంతా ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు. ప్రభుత్వం కూలిపోయి యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నరు కనుక ఆహ్వానిస్తే, ఆయన ప్రభుత్వాన్నేర్పాటు చేశాక కొత్త స్పీకరు వస్తారు. ఆ స్పీకర్ వీరి రాజీనామాలు ఆమోదించే అవకాశం ఉంటుంది'' అని అశోక్ హర్నహళ్లి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)