‘అమరావతికి రుణం వద్దని కేంద్రమే చెప్పింది’ - ప్రెస్ రివ్యూ

  • 22 జూలై 2019
Image copyright YSJaganMohanReddy

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ప్రతిపాదనను భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే తాము ఉపసంహరించుకున్నట్టు ప్రపంచ బ్యాంకు ఆదివారం స్పష్టంచేసిందని 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ప్రతిపాదిత 'అమరావతి సుస్థిర మౌలిక వసతులు - సంస్థాగత అభివృద్ధి' ప్రాజెక్టుకు రుణం కోసం గతంలో చేసిన విజ్ఞప్తిని ఉపసంహరించుకుంటున్నట్టుగా ఈ నెల 15న భారత ప్రభుత్వం తమకు లేఖ రాసినట్టు ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

భారత ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు రుణం ప్రతిపాదనను తాము రద్దు చేసుకున్నట్టు వెల్లడించింది.

ఈ ప్రాజెక్టు నుంచి తాము వైదొలగినప్పటికీ... ఆంధ్రప్రదేశ్‌కు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తన అభివృద్ధి ప్రాధామ్యాలను నిర్ణయించుకుని, కేంద్ర ప్రభుత్వం ద్వారా తమను సంప్రదిస్తే అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, విపత్తు నిర్వహణ రంగాల్లో వివిధ ప్రాజెక్టులకు బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నామని, అది కొనసాగుతుందని స్పష్టం చేసింది. వీటిలో ఆరోగ్యరంగంలో 328 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహకారం అందించే ఒప్పందంపై గత నెల 27నే సంతకాలు జరిగినట్టు తెలిపింది.

''ఆంధ్రప్రదేశ్‌తో ప్రపంచబ్యాంకుకు దీర్ఘకాలిక, ఫలప్రదమైన భాగస్వామ్యం ఉంది. మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు వంటి వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒక మార్గదర్శిగా నిలిచింది. ఇలాంటి వినూత్న కార్యక్రమాల్ని ఆంధ్రప్రదేశ్‌ నుంచి మిగతా దేశాలూ నేర్చుకున్నాయి. అలాంటి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామిగా ఉండి, వాటిని మిగతా ప్రపంచానికి ఒక మంచి నమూనాలుగా చూపించగలిగినందుకు గర్వపడుతున్నాం'' అని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

Image copyright @kesineni nani

ప్రత్యేక హోదాపై వైసీపీని బోనులో నిలబెట్టాల్సిందే: చంద్రబాబు

‘‘పాతిక మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పదేపదే చెప్పారు. ప్రజలు ఆయన పార్టీకి 22 మంది ఎంపీలను గెలిపించి ఇచ్చారు. హోదాను సాధించాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉంది’’ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పార్టీ ఎంపీలతో చెప్పినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ‘‘ప్రత్యేక హోదా సాధించేవరకూ ఆ పార్టీని వదిలిపెట్టొద్దు. బోనులో నిలబెట్టండి’’ అని చంద్రబాబు పార్టీ ఎంపీలకు నిర్దేశించారు.

లోక్‌సభలో టీడీపీ తరపున గెలిచిన ముగ్గురు ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, రామ్మోహన్‌నాయుడు ఆయన్ను ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో కలిశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయి.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి పనిపైనా అవినీతి ముద్ర వేసి టీడీపీని రాజకీయంగా దెబ్బ తీయడంపైనే వైసీపీ ప్రభుత్వానికి ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

టీడీపీ సంస్థాగత అంశాలపైనా ఎంపీలతో చంద్రబాబు చర్చించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ బృందాన్ని కూడా బలోపేతం చేయాలని, కొత్త నీరు తేవాలని వారు కోరారు. ఈ దిశగా కసరత్తు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

కేసీఆర్ Image copyright KCR/facebook

చింతమడకలో కేసీఆర్ సహపంక్తి భోజనాలు నేడు

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సొంతూరు చింతమడకలో పర్యటించనున్నారని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. మాజీమంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ పీ వెంకట్రామ్‌రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ ఆదివారం గ్రామంలో పర్యటించి ఏర్పాట్లపై సమీక్షించి గ్రామస్థులతో సమావేశమయ్యారు.

కేసీఆర్ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయడంతోపాటు డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ఆత్మీయ సమావేశం, సహపంక్తి భోజనాలకు ఏర్పాట్లుచేశారు. మొత్తం 3200 మంది గ్రామస్థులకు ప్రత్యేకంగా తయారుచేయించిన పింక్ కలర్ ఐడీ కార్డులను అందించారు. వీరంతా ఐడీ కార్డులతో సభాస్థలికి చేరుకుంటారు.

ప్రతి 30 కుటుంబాలకు ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. ఐకేపీ గోదాము వద్ద రెయిన్‌ప్రూఫ్ టెంట్‌ను నెలకొల్పారు. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా గ్యాలరీలను ఏర్పాటుచేశారు. అధికారులు, మీడియాకు ప్రత్యేకంగా గ్యాలరీ ఉంటుంది.

సమావేశం అనంతరం భోజనాలకోసం మహిళలకు, పురుషులకు ప్ర త్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ఆత్మీయులతో కలిసి భోజనం చేయడానికి పెద్దమ్మ గుడి పక్కనే రెయిన్‌ప్రూఫ్ టెంట్ వేశారు. పెద్దమ్మ గుడి ముందు చింతచెట్టు వద్ద గద్దెను కూడా నిర్మించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)