కర్ణాటక సంక్షోభం: క్లైమాక్స్‌‌లో ఎవరి పాత్ర ఏమిటి?

  • 22 జూలై 2019
కర్ణాటక సంక్షోభం Image copyright Getty Images

కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై ఉత్కంఠ క్లైమాక్స్‌కు చేరుకుంది. కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోవటానికి గవర్నర్ ఇచ్చిన గడువు సోమవారంతో ముగియనుంది.

విశ్వాస పరీక్ష మీద చర్చ శాసనసభలో జరపాలని ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి కోరటంతో మొదలైన చర్చ సుదీర్ఘంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా 20 మంది సభ్యులు మాట్లాడాల్సి ఉండటంతో చర్చ మరింతగా కొనసాగే అవకాశముంది. ఇక జనతాదళ్ సెక్యులర్ నుంచి ఎంత మంది సభ్యులు చర్చలో పాల్గొంటారన్నది తెలియదు.

వీలైనంత త్వరగా విశ్వాస పరీక్ష జరగటానికే తమ పార్టీ అభిమతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు బి.ఎస్.యడ్యూరప్ప స్పష్టంచేశారు. ''మా పక్షం మాట్లాడటానికి కొన్ని నిమిషాలైనా చాలు. కానీ విశ్వాస పరీక్షను సత్వరం నిర్వహించాల్సిన అవసరముంది'' అని ఆయన శుక్రవారం నాడు శాసనసభలో పేర్కొన్నారు.

అయితే.. కాంగ్రెస్, జేడీఎస్‌ల రాష్ట్ర అధ్యక్షులు దాఖలు చేసిన పిటిషన్ల మీద సుప్రీంకోర్టు ఆ పార్టీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే.. విశ్వాస పరీక్షను ఆలస్యం చేసే వీలు ఉండొచ్చు.

Image copyright Getty Images

తిరుగుబాటు ఎమ్మెల్యేలను శాసనసభకు తప్పనిసరిగా హాజరయ్యేలా కానీ, విశ్వాస పరీక్ష మీద శాసనసభ చర్చలో పాల్గొనేలా కానీ బలవంతం చేయటానికి వీలుండదని చెప్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆ రెండు పార్టీలూ స్పష్టత కోరాయి.

సభ కార్యకలాపాలకు గైర్హాజరు కావటానికి సదరు సభ్యులకు అనుమతి ఇవ్వటం ద్వారా సుప్రీంకోర్టు గత వారం ఇచ్చిన ఉత్తర్వు.. రాజకీయ పార్టీల హక్కులను ఉల్లంఘించినట్లయిందని కాంగ్రెస్, జేడీఎస్‌లు భావిస్తున్నాయి.

ఫిరాయింపుల నిరోధక చట్టంలో అత్యంత కీలక అంశమైన పార్టీ విప్‌.. ఈ ఉత్తర్వుతో నిరుపయోగంగా మారుతుంది.

అయితే.. ఇప్పటివరకూ 15 మంది ఎంఎల్‌ఏలు శాసనసభ కార్యకలాపాలకు గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. వారు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 224 నుంచి 204కు పడిపోతుంది.

అంటే.. బీజేపీ బలం 107 సభ్యులకు పెరుగుతుంది. కాంగ్రెస్-జేడీఎస్ శాసనసభ్యుల సంఖ్య 98కి తగ్గిపోతుంది.

మరో ఇద్దరు స్వతంత్ర సభ్యులు బీజేపీకి అనుబంధంగా చేరారు. వీరిలో ఒక ఎమ్మెల్యే కేపీజేపీకి చెందిన వారు. ఆ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్‌లో విలీనమైంది.

కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్యే విషయమై ఫిర్యాదు చేయటంతో.. స్పీకర్ సదరు ఎమ్మెల్యేపై చర్య చేపట్టవచ్చు.

మొత్తంగా చూస్తే.. 224 మంది సభ్యులున్న శాసనసభలో బీజేపీ బలం ఇద్దరు స్వతంత్ర సభ్యులతో కలిపి 107కు పెరుగుతుంది.

మరోవైపు.. బీఎస్‌పీ నుంచి ఎన్నికైన ఒకే ఒక శాసనసభ్యుడు ఎం.ముకేశ్ కూడా శాసనసభ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఆయనను సభకు హాజరై బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఎస్‌పీ అధ్యక్షుడు నిర్దేశించారు.

Image copyright Pti
చిత్రం శీర్షిక స్పీకర్ రమేశ్ కుమార్

స్పీకర్ రమేశ్ కుమార్ ఈ రోజు ఏం చేయొచ్చు?

విశ్వాస పరీక్ష తీర్మానం మీద చర్చ సోమవారం పూర్తయ్యేలా సభా కార్యక్రమాలను నిర్వహించవచ్చు.

సోమవారం ఓటింగ్ జరపవచ్చునని కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు సిద్ధరామయ్య స్పీకర్‌కు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కూడా ఇదే వైఖరితో ఉన్నారా అని కుమారస్వామిని గవర్నర్ ప్రశ్నించినపుడు.. ఆయన అవునని అంగీకరించారు.

ఒకసారి చర్చ పూర్తయిన తర్వాత.. చర్చకు సమాధానం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రిని స్పీకర్ కోరుతారు.

ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చిన తర్వాత.. గంట మోగించాల్సిందిగా శాసనసభ సిబ్బందికి స్పీకర్ నిర్దేశిస్తారు. లాబీలలో ఎవరూ లేకుండా ఖాళీ చేయిస్తారు.

శాసనసభ్యులందరూ తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులవ్వాల్సి ఉంటుంది.

ఆ తర్వాత శాసనసభ తలుపులను సిబ్బంది మూసివేస్తారు.

అనంతరం.. ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని మంత్రివర్గం మీద ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఓటింగ్‌కు పెడతారు. మూజువాణి ఓటింగ్ నిర్వహిస్తారు. అధికార పక్ష సభ్యులు 'ఏస్' అని, ప్రతిపక్ష సభ్యులు 'నోస్' అని చెప్తారు.

అనంతరం సభ్యులను లెక్కించటానికి నిలుచోవాలని స్పీకర్ అడుగుతారు.

ఇటు అధికార పక్షంవైపు, అటు ప్రతిపక్షం వైపు ఒక్కో వరుసలో ఉన్న సభ్యులను శాసనసభ కార్యదర్శి లెక్కిస్తారు.

ఈ గణన పూర్తయిన తర్వాత.. తీర్మానానికి అనుకూలంగా ఎంతమంది ఓటు వేశారు, వ్యతిరేకంగా ఎంతమంది ఓటు వేశారు అనేది స్పీకర్ సభకు తెలియజేస్తారు.

ముఖ్యమంత్రి ఏం చేయవచ్చు?

విశ్వాస పరీక్ష జరిగి, తాను ఓడిపోయినట్లయితే.. ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా సమర్పించవచ్చు.

ఒకవేళ రాజీనామా చేకపోతే.. గవర్నర్ ఆయనను పదవి నుంచి తొలగించవచ్చు.

Image copyright FACEBOOK/HDKUMARASWAMY
చిత్రం శీర్షిక కర్ణాటక గవర్నర్ వాజుభాయి వాలాతో సీఎం కుమార స్వామి

గవర్నర్ ఏం చేయవచ్చు?

ఆదివారం రాత్రి వరకూ ఉన్న సంకేతాలను బట్టి.. విశ్వాస పరీక్ష జరిగే వరకూ గవర్నర్ వాజూభాయ్ వాలా ఏమీ చేయబోరని భావిస్తున్నారు. విశ్వాస పరీక్ష ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రికి ఆయన శుక్రవారం నాడు రెండుసార్లు నిర్దేశాలు పంపించారు.

ముఖ్యమంత్రి వాటిని పట్టించుకోలేదు. ప్రత్యేకించి విశ్వాస పరీక్షకు తాను ఇప్పటికే తీర్మానం ప్రవేశపెట్టినందున.. గవర్నర్ ఇటువంటి నిర్దేశాలు చేయవచ్చా అనే అంశంపై ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సీఎం కుమారస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

ఒకవేళ శాసనసభలో విశ్వాస తీర్మానం ఓడిపోయి, ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే.. ఆయనను సీఎం పదవి నుంచి గవర్నర్ తొలగించవచ్చు.

ప్రతిపక్ష నాయకుడు యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానింవచ్చు. అనంతరం ఆయనను బలనిరూపణ చేసుకోవాల్సిందిగా నిర్దేశించి, అందుకు గడువు ఇచ్చే అవకాశమూ ఉంది.

Image copyright Getty Images

సుప్రీంకోర్టు ఏం చేయవచ్చు?

కర్ణాటక రాజకీయాలకు సంబంధించి సుప్రీంకోర్టు ముందు ప్రస్తుతం రెండు పిటిషన్లు ఉన్నాయి. సభా కార్యక్రమాలకు గైర్హాజరు కావటం ద్వారా.. రాజకీయ పార్టీలు ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం జారీ చేసే విప్‌లను ధిక్కరించిన శాసనసభ్యుల విషయంలో పార్టీల హక్కులను ఉల్లంఘించటం మీద స్పష్టత కోరుతూ కాంగ్రెస్, జేడీఎస్‌లు వేసిన పిటిషన్ అందులో మొదటిది.

విప్ అంశం మీద సుప్రీంకోర్టు నిర్ణయం ఆధారంగా.. సదరు ఎమ్మెల్యేలు లోనావాలా, ముంబైల నుంచి సభా కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తగిన సమయం ఇవ్వటం కోసం విశ్వాస పరీక్ష ఇంకా ఆలస్యమయ్యే అవకాశముంది. దీనివల్ల విశ్వాస పరీక్ష మంగళవారం వరకూ వాయిదా పడవచ్చు. ఈ పరిస్థితి తలెత్తే అవకాశాన్ని పూర్తిగా కొట్టివేయలేం.

అలాగే.. విశ్వాస పరీక్ష తీర్మనాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టిన తర్వాత ఓటింగ్ ప్రక్రియను పూర్తిచేయటానికి ముఖ్యమంత్రికి గవర్నర్ కాల పరిమితి నిర్దేశించగలరా అనే అంశం మీద కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశముంది.

తిరుగుబాటు ఎంఎల్‌ఏల భవిష్యత్తు ఏమిటి?

విప్ అంశం మీద సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బట్టి.. సదరు సభ్యులు తమ ఓటు వేయటానికి బెంగళూరు రావచ్చు. ఒకవేళ అనర్హతు సిద్ధమైన పక్షంలో సభకు హాజరై.. ఓట్ల లెక్కింపు సమయంలో లేచి నిలుచోవటానికి తిరస్కరించవచ్చు కూడా.

పార్టీల విప్‌ను కొందరు సభ్యులు ఉల్లంఘించారన్న విషయాన్ని స్పీకర్ పరిగణనలోకి తీసుకోవచ్చు. అటువంటి వారిని అనర్హులుగా ప్రకటించాలని రెండు పార్టీలూ స్పీకర్‌ను కోరవచ్చు.

కుమారస్వామి ప్రభుత్వం ఓడిపోయినట్లయితే.. ప్రస్తుత స్పీకర్‌ను మార్చి, ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రి సూచించే సభ్యుడికి స్పీకర్‌గా బాధ్యతలు అప్పగించవచ్చు.

అలా జరిగినట్లయితే.. కొత్త స్పీకర్ ఈ ఎంఎల్‌ఏల రాజీనామాలను ఆమోదించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం