టిక్‌టాక్ యాప్‌పై వివాదం ఏంటి? ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?

 • 23 జూలై 2019
టిక్‌టాక్ యాప్ Image copyright Getty Images

చిన్న చిన్న వీడియోలు రూపొందించే టిక్‌టాక్ యాప్ ద్వారా భారత్‌లో చాలా మంది యాక్టర్లు, డాన్సర్లు, కమెడియన్ల అవతారం ఎత్తుతున్నారు.

చైనాకు చెందిన ఈ వీడియో స్ట్రీమింగ్ యాప్ భారత్‌లోని టీనేజర్ల నుంచి అన్నివయసులవారినీ ఆకట్టుకుంటోంది.

గ్రామాల నుంచీ పెద్ద పెద్ద నగరాల వరకూ ఈ యాప్‌ ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతోంది. టిక్‌టాక్ వివరాల ప్రకారం భారత్‌లో దానికి 20 కోట్ల మందికి పైగా యూజర్లున్నారు.

2018లో ప్రపంచంలో ఎక్కువగా డౌన్లోడ్ చేసిన యాప్స్‌లో టిక్‌టాక్ నంబర్ వన్‌గా నిలిచింది. కానీ పాపులారిటీ పెరగడంతోపాటూ భారత్‌లో ఈ యాప్‌ను వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి.

టిక్‌టాక్, హలో యాప్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌ను దేశవ్యతిరేక, అక్రమ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసింది.

దాంతో ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వశాఖ టిక్‌టాక్, హలో యాప్‌కు నోటీసులు జారీ చేసింది.

జూలై 22 అంటే సోమవారంలోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ సంస్థలను మంత్రిత్వశాఖ 24 ప్రశ్నలు కూడా అడిగింది.

Image copyright iStock

ఆ ప్రశ్నల్లో కొన్ని

 • "ఈ ప్లాట్‌ఫాం దేశవ్యతిరేక కార్యకలాపాలకు హబ్‌గా మారింది" అనే ఆరోపణలకు మీరేం సమాధానం చెబుతారు.
 • భారత యూజర్ల డేటా ట్రాన్స్‌ఫర్ చేయడం లేదని, భవిష్యత్తులో ఏ విదేశీ ప్రభుత్వాలకు, ఏ థర్డ్ పార్టీ ప్రైవేటు సంస్థలకు దీనిని ట్రాన్స్‌ఫర్ చేయమని భరోసా ఇవ్వగలరా.
 • ఫేక్‌న్యూస్, భారత చట్టాల ప్రకారం వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
 • ఇతర సోషల్ మీడియా సైట్స్‌పై 11 వేల నకిలీ ప్రకటనలు పెట్టడానికి భారీ మొత్తం చెల్లించిందని హలో కంపెనీపై వచ్చిన ఆరోపణల్లో నిజమేంటి.
 • ఈ ప్లాట్‌ఫాంలు గోప్యతా ప్రమాణాలను ఉల్లంఘించాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. 18 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిని పిల్లలుగా భావిస్తున్నప్పుడు ఇక్కడ కనిష్ట వయసు 13 ఏళ్లుగా ఎందుకు పెట్టారు.

అంతకు ముందు ఇదే ఏడాది ఏప్రిల్లో తమిళనాడులోని ఒక కోర్టు టిక్‌టాక్‌ను యాప్ స్టోర్స్ నుంచి తొలగించాలని ఆదేశించింది.

ఈ యాప్ ద్వారా పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలను అందించవచ్చని కోర్టు అప్పుడు చెప్పింది. అయితే కొన్ని వారాల్లోనే ఆ నిషేధం ఎత్తేశారు.

Image copyright Tiktok

ఈ కేసులో సుప్రీంకోర్టు వకీల్ విరాజ్ గుప్తా:

మొదటి అంశం - మీరు 13 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలు యాప్ ఉపయోగించడానికి ఎందుకు అనుమతించారు అనే ప్రశ్నను మేం గూగుల్, ఫేస్‌బుక్‌కు వ్యతిరేకంగా 2012 జూన్‌లో దిల్లీ హైకోర్టులో లేవనెత్తాం.

సోషల్ మీడియాలో పిల్లలు జాయిన్ కావడానికి కనీస వయసు 13 ఏళ్లు, 13 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో మాత్రమే వీటిలో జాయిన్ కావచ్చు.

ఇప్పుడు టిక్‌టాక్‌ను మాత్రమే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు అని మేం ప్రభుత్వాన్ని అడిగాం. ఫేస్‌బుక్, సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫామ్స్‌కు ఒకే విధానం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించాం. సైబర్ వరల్డ్ నుంచి పిల్లలను కాపాడేందుకు ప్రభుత్వం సమగ్ర విధానం ఎందుకు రూపొందించడం లేదని అడిగాం.

ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు సంబంధించి ఒక చట్టం లేకపోతే, మనం ఏ యాప్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోలేం. ఆ చట్టాలను అందరూ ఉల్లంఘిస్తూనే ఉంటారు.

Image copyright Tiktok

రెండో అంశం- ఈ యాప్స్ డేటా విదేశాలకు వెళ్తోంది. భారత్‌లో ఎన్ని యాప్స్ పనిచేస్తున్నాయో, వాటి డేటా అంతా విదేశాలకు వెళ్తోంది.

ఈ డేటా భారత్‌లోనే ఉండాలని మేం 2012 జూన్‌లో కూడా డిమాండ్ చేశాం. ఎందుకంటే భారత్ నుంచి బయటకు తీసుకెళ్లిన డేటాను వారు అమ్మేస్తారు. దానిని దుర్వినియోగం చేస్తారు.

మూడో అంశం - ఇది చైనా కంపెనీ. మద్రాస్ హైకోర్టు దీన్ని బ్యాన్ చేసినపుడు, కేసు సుప్రీంకోర్టు వరకూ వచ్చినపుడు కూడా ప్రభుత్వం దీనిపై ఎందుకు సరిగా వాదనలు వినిపించలేకపోయింది.

ఆ తర్వాత విధి విధానాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు అడుగుతున్న ఈ ప్రశ్నలను ఏ సెక్షన్ల ప్రకారం అడుగుతున్నారు.

నాలుగో అంశం - డేటా ప్రొటెక్షన్ గురించి సుప్రీంకోర్టులోని 9 మంది జడ్జిలు 2017లో జడ్జిమెంట్ ఇచ్చారు. అంతకు ముందు కూడా 2012లో జస్టిస్ ఏపీ షా కమిటీ తమ రిపోర్ట్ ఇచ్చింది.

Image copyright Tiktok

అలాంటప్పుడు ప్రభుత్వం డేటా ప్రొటెక్షన్ కోసం చట్టం ఎందుకు చేయడం లేదు.

ఈ అంశాలనే చూస్తే ప్రభుత్వం చట్ట వ్యవస్థను ఎందుకు బలోపేతం చేయలేదు. అలా చేసుంటే మనం ఏ కంపెనీ యాప్‌ను అయినా అడ్డుకోవడానికి వీలుంటుంది.

ఇప్పుడు ప్రభుత్వం 'సెలక్టివ్ క్వశ్చనీర్' ఇష్యూ చేస్తోంది. అంతకు ముందు కూడా 'బ్లూ వేల్' లాంటి గేమ్స్ కోసం క్వశ్చనీర్ జారీ చేశారు. నోటీసులు ఇచ్చారు. కానీ చివరికేమైంది?

అందుకే ఇప్పుడు టిక్‌టాక్‌తో దేశంలో 'సైబర్ భద్రత', 'డేటా భద్రత', 'పిల్లల భద్రత' అనే ముఖ్యమైన ప్రశ్నలు ముందుకు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం ఒక స్థిరమైన విధానం ఏర్పాటు చేయాల్సుంటుంది.

చాలా చట్టాలున్నాయి. కానీ అన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. చట్టం అస్పష్టంగా ఉంది. దానివల్ల ఈ కంపెనీలకు ప్రయోజనం లభించింది.

Image copyright Getty Images

దీనిపై వకీల్, సైబర్ విషయాల నిపుణులు పవన్ దుగ్గల్ ఏమన్నారు:

టిక్‌టాక్ ప్లాట్‌ఫాం దేశవ్యతిరేకత లాంటివి పెరగడానికి సాయం చేస్తుంది. హైపర్ టెర్రరిజం లాంటి వాటిని కూడా ప్రమోట్ చేస్తుంది.

టిక్‌టాక్ మాత్రం భారత్ నుంచి లాభం పొందాలనుకుంటుంది. కానీ భారత సమాచార సాంకేతిక పరిజ్ఞానం చట్టం పరిధిలోకి రావడం దానికి ఇష్టం లేదు.

అందుకే ఈ యాప్‌పై నియంత్రణ చాలా అవసరం. ప్రభుత్వం ఇప్పుడు సోషల్ మీడియా అప్లికేషన్లు, మీడియా ప్లాట్‌ఫామ్స్ కోసం కొత్త గైడ్‌లైన్స్ తీసుకురావడం చాలా అవసరం.

పాత గైడ్‌లైన్స్ 2011 నాటివి. 2011కు 2019కు మధ్య భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఈరోజు రియాలిటీని దృష్టిలో పెట్టుకుని వీటిని షపుల్ చేయాల్సిన అవసరం ఉంది.

Image copyright Tiktok

కంపెనీ ఏం చెబుతోంది

చైనాలో ఒక పెద్ద టెక్నాలజీ కంపెనీ బైట్‌డాన్స్‌కు చెందినదే టిక్‌టాక్. ప్రతి అంశంలో ప్రభుత్వానికి సహకరిస్తున్నామని ఆ కంపెనీ చెబుతోంది.

భారత్ తమ అతిపెద్ద మార్కెట్ అని కంపెనీ ఒక ప్రకటనలో చెప్పింది. మరో మూడేళ్లలో అది ఇక్కడ బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలనుకుంటోంది.

స్థానిక సమాజాల సహకారం లేకుండా భారత్‌లో మేం విజయం సాధించలేం. మేం వారి పట్ల మా బాధ్యత గురించి సీరియస్‌గా ఉన్నాం. ప్రభుత్వానికి పూర్తిగా సహకరించడానికి మేం సిద్ధం.

టిక్‌టాక్ కొన్ని మార్గదర్శకాలు కూడా రూపొందించింది. వాటిని తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. వీటిలో ఏది ఉల్లంఘించినా ఆ ఖాతాను, ఖాతాలోని అంశాలను తొలగిస్తామని చెప్పింది.

Image copyright Getty Images

వెబ్‌సైట్ ఏం చెబుతోంది

 • మిలిటెంట్ సంస్థలు, వేరే ఏదైనా నేర సంస్థలు టిక్‌టాక్ ఉపయోగించడంపై నిషేధం ఉంది.
 • ప్రమాదకరమైన పనులు, తమకు తాము నష్టం కలిగించుకునేవి, ఆత్మహత్యను చూపించే వీడియోలు పోస్ట్ చేయకండి. వేరేవారు చేసేలా రెచ్చగొట్టే ఎలాంటి కార్యకలాపాలూ పెట్టకండి.
 • తినడం, తాగడానికి సంబంధించి అసహ్యంగా కనిపించేలా ఉండే, లేదా వాటి గురించి సూచించే ఏ వీడియోలు పోస్ట్ చేయకండి.
 • వేరేవారిని భయపెట్టేవి, బెదిరించేవి, ఎవరైనా ఒక వ్యక్తిని బెదిరించడం లేదా వారికి నష్టం కలిగించడం లాంటివి వద్దు.
 • ఆయుధాలు, బాంబులు, డ్రగ్స్ స్థానిక చట్టాలు నిషేదించిన వాటిని ఉపయోగించడాన్ని ప్రోత్సహించేవి, లేదా వాటిని అమ్మడం కోసం టిక్‌టాక్‌ను ఉపయోగించే వీడియోలు వద్దు.
 • ఆన్‌లైన్ జూదం, లేదా ఇతర ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి టిక్‌టాక్ ఉపయోగించడం వద్దు
Image copyright Tiktok
 • చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేయడం, వాటిని షేర్ చేయడం వద్దు
 • ఏవైనా హింసాత్మకంగా, గ్రాఫిక్ కంటెంట్, దిగ్భ్రాంతి కలిగించే సంచలన వీడియోలను పోస్ట్ చేయడం, షేర్ చేయడం, ఇతరులను హింసకు రెచ్చగొట్టేలా వీడియోలు పోస్ట్ చేయడం వద్దు.
 • జాతి-మతం, జాతీయత, సంస్కృతి, వైకల్యం, లైంగికాభిరుచి, లింగ గుర్తింపు, వయసు లేదా ఏదైనా వ్యత్యాసాలు చూపించేలా, వారికి వ్యతిరేకంగా, ద్వేషపూరితంగా, రెచ్చగొట్టే ఎలాంటి వీడియోలూ పోస్ట్ చేయకూడదు
 • ఇరుకునపెట్టే లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో శత్రుత్వాలను రెచ్చగొట్టే వీడియోలను పోస్ట్ చేయకూడదు
 • బాలల రక్షణ ఉల్లంఘనను టిక్ టాక్ చాలా తీవ్రంగా భావిస్తోంది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించినవి, వారిని ప్రమాదంలో పడేసేవి ఏవైనా ఉంటే వాటిపై చర్యలు తీసుకోవచ్చు. అలాంటి అంశాలపై రిపోర్ట్ కూడా చేయచ్చు

టిక్‌టాక్‌కు బీజింగ్, బెర్లిన్, జకార్తా, లండన్, లాస్ ఏంజిల్స్, మాస్కో, ముంబయి, సావోపోలో, సియోల్, షాంఘై, సింగపూర్, టోక్యోలో కార్యాలయాలు ఉన్నాయి.

విరాగ్ గుప్తా తన టాక్సింగ్ ఇంటర్నెట్ జెయింట్స్ అనే పుస్తకంలో టిక్‌టాక్ గురించి చెప్పారు. యూజర్స్ సంఖ్య ఆధారంగా ఈ కంపెనీల్లో భారత్ అత్యంత ఎక్కువ బిజినెస్ చేస్తోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)